6 ఎలిమెంట్స్ ప్రొడక్షన్స్ నాటక బృందం జూన్ 27వ తేదిన మసాలా శీర్షికన తెలుగు, తమిళ్, హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో లఘు నాటకాలు ప్రదర్శించారు.
కొన్ని వారాల క్రితమే 6 ఎలిమెంట్స్ ప్రొడక్షన్స్ నాటక బృందం గిరీష్ కర్నాడ్ గారి పుట్టిన రోజు సందర్భంగా యయాతి నాటకాన్ని లావణ్య ఇంగువ గారి దర్శకత్వంలో జూం మాధ్యమం ద్వారా ప్రదర్శించి మన అందరి మన్ననలు పొందారు. గత నెలలో శ్రీని ప్రభల గారి దర్శకత్వంలో చలం గారి నాటకం "ఏం జబ్బు" ని కూడా జూం మాధ్యమం ద్వారా ప్రదర్శించి మన అందరి మన్ననలు పొందారు. గతంలో లాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ జూం అనువర్తనం ద్వారా ఈ నాటకాన్ని యూ ట్యూబులో ప్రత్యక్ష ప్రసారం చేసారు.
ముందుగా రేణుకా రఘురామన్, నందిని కాంబి గారు తమిళంలో నాటకాన్ని ప్రదర్శించారు. నందిని కాంబి గారు ఈ నాటకంలో దీవి భక్తురాలిగా నటించారు. రేణుకా సుబ్రహ్మణ్యం గారు లలితా దేవి పాత్రలో నటించారు. నందిని గారు ఈ నాటకాన్ని రచించి దర్శకత్వం కూడా చేసారు. నిరంతరం లలిత సహస్రనామాలు పఠిస్తూ పిల్లల పెళ్ళి గురించి, చదువుల గురించి, భర్త ఉద్యోగం గురించి ఆందోళన పడుతున్న తన భక్తురాలిని నచ్చ చెప్తున్న లలితా దేవి నేపథ్యంలో ఈ నాటకం జరిగింది.
తరువాత తెలుగు భాషలో పక్కింటి చుట్టాలు నాటకాన్ని పవన్ నట్టువ, లక్ష్మి పొట్లపెల్లి ప్రదర్శించారు. శ్రీని ప్రభల గారు ఈ నాటకాన్ని రచించగా పవన్ నట్టువ ఈ నాటకానికి దర్శకత్వం చేసారు. భర్తకు వంట చెయ్యకుండా పక్కింటి చుట్టాలను కిటీకీలో చూస్తూ కాలక్షేపం చేస్తూ ఇంటిలో దొంగతనం జరుగుతున్నా తెలుసుకోలేని అమాయకపు జంటగా ఇద్దరూ చాలా బాగా చేసారు.
తమిళ్, తెలుగు భాషల తరువాత హిందీ భాషలో మున్షి ప్రేం చంద్ రచించిన ఇస్తీఫా నాటకాన్ని శివ కుమార్ జూటూరి,సంగీతా అగర్వాల్, దీపక్ అరోరా, ఆనంద్ మన్యాల, సుమీత్ రేఖి ప్రదర్శించారు. ఈ నాటకానికి శ్రీని ప్రభల గారు దర్శకత్వం వహించారు. తన ఆత్మ గౌరవం కాపాడుకున్న ఉద్యోగి పాత్రలో శివ కుమార్ జూటూరి, అతనికి భార్యగా సంగీత అగర్వాల్, బాస్ పాత్రలో దీపక్ అరోరా, ప్యూన్ పాత్రలో ఆనంద్ మన్యాల చక్కగా నటించారు. ఈ నాటకానికి సూత్రధారుడిగా సుమీత్ రేఖి వ్యవహరించారు.
చివరగా Shake the bottleఇంగ్లీష్ నాటకాన్ని లావణ్య ఇంగువ, శ్రీధర్ శ్రీరాం, శ్రీని ప్రభల గారు ప్రదర్శించారు. ఈ నాటకాన్ని ఆశాపూర్ణ దేబి రచించారు. జబ్బు పడిన తండ్రి గురించి పట్టించుకోకుండా వేరే ఊరు వెళ్తున్న అన్నను సముదాయించడానికి ప్రయత్నిస్తున్న చెల్లెలు పాత్రలో లావణ్య ఇంగువ, అన్న పాత్రలో శ్రీధర్ శ్రీరం, తండ్రి పాత్రలో శ్రీని ప్రభల గారు చక్కగా నటించారు.
ఈ కార్యక్రమానికి సూత్రధారుడిగా కృష్ణ చెన్నుపాటి వ్యవహరించి ప్రతి నాటకానికి ముందుమాట తెలిపారు. తన మాటలతో నాటకం గురించి వివరిస్తూ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తారు.
ఇప్పటికే “యయాతి”, "ఏం జబ్బు" నాటకాలను జూం ద్వార ప్రదర్శించిన అనుభవంతో 6 ఎలిమెంట్స్ ప్రొడక్షన్స్ బ్రందం ఈ నాటక ప్రదర్శనను మరింత అద్భుతంగా ప్రదర్శించారు. అమెరికా నుండే కాకుండా భారతదేశం నుండి కూడా ప్రేక్షకులు ఈ నాటకాన్ని చూసి ఆనందించారు. పలు విధాలుగా నాటక బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.