Sunday, May 31, 2026

మహా సంగ్రామం!

మహా సంగ్రామం!

నేను రాపూరులో తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులు. పరీక్షలు దగ్గరికి వచ్చాయి, లెక్కలు సిలబస్ ఇంకా పూర్తి అవలేదు. ఆదివారం ఉదయం extra class పెట్టారు. నేను క్లాసుకి కొంచెం ముందుగానే వెళ్లాను. క్లాసుకి ఇంకా సమయం ఉంది కదా అని స్కూలు పక్కనే ఉన్న పోస్ట్ ఆఫీస్ వెళ్లాను. పోస్ట్ మాస్టారు మూడవ కొడుకు శేఖర్ నాకు బెస్ట్ ఫ్రెండు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకుందామని వెళ్లాను. వాళ్ళ పెరడు ఆనుకుని ఇంకో్ ఫ్రెండు జమీల్ ఉంటాడు. వీళ్లిద్దరూ అప్పటికే ఇంటి బయట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఎవరు కదిపారో గుర్తు లేదు, ఆ రోజు ఉదయం వెంకటేశ్వర థియేటర్లో మహా సంగ్రామం morning show ఉంది. నేను సూపర్ స్టార్ కృష్ణకి భీబత్సమైన అభిమాని. క్లాసు ఎగొట్టి ముగ్గురం సినిమాకి వెళ్లిపోయాము. నా దగ్గర రూపాయి, ఇంకొంచెం చిల్లర ఉంది. అందరం బెంచి టిక్కెట్టు కొనుక్కుని ఎండాకాలంలో మార్నింగ్ షో చూసేసాము.

సినిమా అయిపోయింది. అసలు సినిమా అప్పుడు మొదలయింది. శేఖర్, జమీల్ ఇంట్లో పెద్ద ఇబ్బంది లేదు. మా ఇంట్లో పరిస్థితి వేరు. క్రమశిక్షణలో మా నాన్న కొండవీటి సింహం. అప్పటికే నేను క్లాసు ఎగొట్టి సినిమాకు వెళ్లాను అన్న విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. మా క్లాసులోని కొంతమంది మా ఇంటికి వెళ్లి "శీను, ఈరోజు క్లాసుకి రాలేదు" అని చెప్పేసారు.

మా స్నేహితులలో శేఖర్ మాకు లీడర్. ఇతని దగ్గర అన్నింటికీ ఒక ప్లాన్ ఉంటుంది. మేము సినిమాకి వెళ్లిన సమయంలో వేరే చోట ఉన్నట్లు సాక్ష్యం పుట్టించాలి. మా ఇంటికి ఎదురుగా ఖాజా సారు ఇల్లు ఉంది. అపుడపుడు మేము ఆయన ఇంటికి వెళ్లి పేపర్లు దిద్దే వాళ్ళం. ఈరోజు కూడా అలా చేద్దాము అని ఖాజా గారి ఇంటికి వెళ్ళాము. ఈరోజు రుద్దడానికి పేపర్లు ఏమీ లేవు. మేము అతితెలివిగా అలోచించి "సార్, ఈరోజు మీ ఇంట్లో మేము పేపర్లు దిద్దినట్టు ఒక లెటర్ ఇవ్వండి" అని బతిమాలాము. శేఖర్ ఒక లెటర్ రాసి "ఇదిగో, ఇక్కడ మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్ " అని తీసుకున్నాము. ఖాజా సారుకి విషయం అర్ధం కాక అయోమయంలో మాకు లెటర్ ఇచ్చేసారు.

నేను బెరుగ్గా మా ఇంటికి వెళ్లాను. ఇటువంటి
 పెతర పనులు చేసినపుడు ఇంటిలోకి నేను నేరుగా వెళ్లకుండా పక్క సందులోనుండి వెళ్తాను. విషయం తెలిసిపోయి మా అమ్మ అపుడే విసన కర్ర పట్టుకుని రెడీగా ఉంది. ఇటువంటి సమయాల్లో మా చెల్లెలు నాకు బాగా సహాయం చేస్తుంది. అమ్మ పొజిషన్ గురించి నాకు లైవ్ టెలి కాస్ట్ ఇచ్చింది. కానీ ఆరోజు మా అమ్మకి దొరికిపోయాను. లెటర్ కూడా ఇచ్చి ఏదో చెప్పబోయాను, కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. మా ఎదురింటిలో నూతలపాటి వెంకటేశ్వర్లు గారు ఉండేవారు. ఆయన కూడా మా టీచరే. ఆరు, ఏడు క్లాసు సారు దగ్గర సాయంత్రాలు ట్యూషన్ చదువుకున్నాను.

వారికి కూడా విషయం తెలిసి నాకు బాగా చీవాట్లు పెట్టారు. ఆరోజు మా నాన్న ఇంటిలో లేడు. పక్క రోజు ఇంటికి వచ్చిన నాన్నకు మా అమ్మ విషయం చెప్పింది. మా నాన్న నన్ను పిలిచి టిక్కెట్టు కి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? అని అడిగాడు. నా దగ్గర ఒక రూపాయి కొంత చిల్లర ఉందని చెప్పాను. డబ్బులు దగ్గర ఉంచుకో అని సలహా ఇచ్చాడు. నాకు మళ్ళీ పెళ్లి చేస్తారేమో అని భయపడుతున్న నాకు బాగా ఊరట లభించింది. మా నాన్న మీద మరింత ప్రేమ పెరిగింది. 

ఆరోజు నుండి నేను ఒక నెల రోజులు మా అమ్మతో మాట్లాడలేదు. మనం తప్పు చేసినా మనకి పడిన దెబ్బలకి అలా చిన్న ఉద్యమం మొదలుపెట్టాము. ఒక రోజు సాయంత్రం మా అమ్మ గులాబ్ జామూన్ చేసింది. ఇవంటే నాకు బాగా ఇష్టం. నేను వంట గదిలోకి వెళ్లి రెండు గుటకాయ స్వాహా చేసాను. ఆ బలహీన క్షణంలో "అబ్బా... గులాబ్ జామూన్ భలే ఉంది" అని మా అమ్మ వైపు చూసాను. అప్పటి వరకు ఉద్యమం చక్కగా సాగుతుంది. నన్ను చూసి మా అమ్మ నవ్వడం మొదలుపెట్టింది. మా అక్కలు, చెల్లెలు కూడా నవ్వడం మొదలుపెట్టారు.

Wednesday, July 1, 2020

మసాలా - లఘు నాటకాలు

ఎలిమెంట్స్ ప్రొడక్షన్స్ నాటక బృందం జూన్ 27వ తేదిన మసాలా శీర్షికన తెలుగుతమిళ్హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో లఘు నాటకాలు ప్రదర్శించారు.

కొన్ని వారాల క్రితమే ఎలిమెంట్స్ ప్రొడక్షన్స్ నాటక బృందం గిరీష్ కర్నాడ్ గారి పుట్టిన రోజు సందర్భంగా యయాతి నాటకాన్ని లావణ్య ఇంగువ గారి దర్శకత్వంలో జూం మాధ్యమం ద్వారా ప్రదర్శించి మన అందరి మన్ననలు పొందారుగత నెలలో శ్రీని ప్రభల గారి దర్శకత్వంలో చలం గారి నాటకం "ఏం జబ్బుని కూడా జూం మాధ్యమం ద్వారా ప్రదర్శించి మన అందరి మన్ననలు పొందారుగతంలో లాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ జూం అనువర్తనం ద్వారా ఈ నాటకాన్ని యూ ట్యూబులో ప్రత్యక్ష ప్రసారం చేసారు.








ముందుగా రేణుకా రఘురామన్నందిని కాంబి గారు తమిళంలో నాటకాన్ని ప్రదర్శించారునందిని కాంబి గారు ఈ నాటకంలో దీవి భక్తురాలిగా నటించారురేణుకా సుబ్రహ్మణ్యం గారు లలితా దేవి పాత్రలో నటించారునందిని గారు ఈ నాటకాన్ని రచించి దర్శకత్వం కూడా చేసారునిరంతరం లలిత సహస్రనామాలు పఠిస్తూ పిల్లల పెళ్ళి గురించిచదువుల గురించిభర్త ఉద్యోగం గురించి ఆందోళన పడుతున్న తన భక్తురాలిని నచ్చ చెప్తున్న లలితా దేవి నేపథ్యంలో ఈ నాటకం జరిగింది.


తరువాత తెలుగు భాషలో పక్కింటి చుట్టాలు నాటకాన్ని పవన్ నట్టువలక్ష్మి పొట్లపెల్లి ప్రదర్శించారుశ్రీని ప్రభల గారు ఈ నాటకాన్ని రచించగా పవన్ నట్టువ ఈ నాటకానికి దర్శకత్వం చేసారుభర్తకు వంట చెయ్యకుండా పక్కింటి చుట్టాలను కిటీకీలో చూస్తూ కాలక్షేపం చేస్తూ ఇంటిలో దొంగతనం జరుగుతున్నా తెలుసుకోలేని అమాయకపు జంటగా ఇద్దరూ చాలా బాగా చేసారు.

తమిళ్తెలుగు భాషల తరువాత హిందీ భాషలో మున్షి ప్రేం చంద్ రచించిన ఇస్తీఫా నాటకాన్ని శివ కుమార్ జూటూరి,సంగీతా అగర్వాల్దీపక్ అరోరాఆనంద్ మన్యాలసుమీత్ రేఖి ప్రదర్శించారుఈ నాటకానికి శ్రీని ప్రభల గారు దర్శకత్వం వహించారుతన ఆత్మ గౌరవం కాపాడుకున్న ఉద్యోగి పాత్రలో శివ కుమార్ జూటూరిఅతనికి భార్యగా సంగీత అగర్వాల్బాస్ పాత్రలో దీపక్ అరోరాప్యూన్ పాత్రలో ఆనంద్ మన్యాల చక్కగా నటించారుఈ నాటకానికి సూత్రధారుడిగా సుమీత్ రేఖి వ్యవహరించారు.

చివరగా Shake the bottleఇంగ్లీష్ నాటకాన్ని లావణ్య ఇంగువశ్రీధర్ శ్రీరాంశ్రీని ప్రభల గారు ప్రదర్శించారుఈ నాటకాన్ని ఆశాపూర్ణ దేబి రచించారుజబ్బు పడిన తండ్రి గురించి పట్టించుకోకుండా వేరే ఊరు వెళ్తున్న అన్నను సముదాయించడానికి ప్రయత్నిస్తున్న చెల్లెలు పాత్రలో లావణ్య ఇంగువఅన్న పాత్రలో శ్రీధర్ శ్రీరంతండ్రి పాత్రలో శ్రీని ప్రభల గారు చక్కగా నటించారు.

ఈ కార్యక్రమానికి సూత్రధారుడిగా కృష్ణ చెన్నుపాటి వ్యవహరించి ప్రతి నాటకానికి ముందుమాట తెలిపారుతన మాటలతో నాటకం గురించి వివరిస్తూ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తారు.

ఇప్పటికే “యయాతి”, "ఏం జబ్బునాటకాలను జూం ద్వార ప్రదర్శించిన అనుభవంతో ఎలిమెంట్స్ ప్రొడక్షన్స్ బ్రందం ఈ నాటక ప్రదర్శనను మరింత అద్భుతంగా ప్రదర్శించారుఅమెరికా నుండే కాకుండా భారతదేశం నుండి కూడా ప్రేక్షకులు ఈ నాటకాన్ని చూసి ఆనందించారుపలు విధాలుగా నాటక బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.

Friday, November 16, 2018



పొదలకూరులో నాకు ఒక కొత్త స్నేహితుడు పరిచయం అయిన రోజులవి. సాయంత్రం వరకు వాళ్ళ ఇంట్లో ఆడుకునేవాడిని. చీకటి పడుతుందనగా స్నేహితుడి నాన్న "డుగు డుగు డుగు డుగు" మంటూ శబ్దం చేస్తున్న మోటార్ సైకిలులో వచ్చేవాడు. "లబ్ డబ్ లబ్ డబ్" అంటూ కొట్టుకోవలసిన నా గుండె కాసేపు ఆగిపోయేది. ఆ మోటార్ సైకిలు మీద అభిమానమో, ఆశ్చర్యమో, అందోళనో నాకు అప్పటికి తెలియని వయస్సు. లగెత్తుకుంటూ మా ఇంటికి తుర్రుమనే వాడిని.

మళ్ళీ అదే మోటారుసైకిలుని నేను నెల్లూరులో చూసాను. ఈసారి ఆ బండిని మా పెదనాన్న అల్లుడు (అంటే మనకి బావ) తోలాడు. మా బావ మెకానిక్. గారేజులో వచ్చిన బండ్లని నడిపిస్తూ ఉండేవాడు. కామాటి వీధి నుండి సంత పేట మీదుగా వెళ్తూ ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఎడమ మలుపు తిప్పాడు. అప్పటికి నేను ఇంకా చదవని గురుత్వాకర్షణ శక్తి ఈ మలుపు దగ్గర మా బావకి లొంగి పోయింది. నేలని రాసుకుంటూ తిరిగిన ఆ మలుపు నాకు ఇంకా గుర్తు.

నాకు తరువాత తెలిసిన విషయం ఏమిటంటే ఇవి జావా మోటారుసైకిళ్ళు. జర్మనీకి చెందిన వాండరర్ అనే కంపెనీ సైకిళ్ళు, మోటారుసైకిళ్ళు, కార్లు, వాన్లు మరి ఇతర యంత్రాలు చేసేవారు. 1902 నుండి మోటారుసైకిళ్ళు, 1903 నుండి కార్లు తయారు చేసేవారు.  చెకొస్లొవేకియాకి చెందిన ఫ్రాంటిసెక్ జానెసెక్ జర్మనీలో ఇంజినీరింగ్ చేసి ప్రాగ్ లో తన మెకానికల్ వర్క్ షాపులో ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇతను హాండ్ గ్రెనేడ్ తయారీలో ఆరితేరి చెక్ మిలిటరీకి ఒక గ్రనేడ్ తయారు చేసి ఇస్తాడు. దాన్ని ఇతని పేరు మీదనే పిలిచేవారు. తరువాత మోటారూసైకిళ్ళు తయారుచేద్దామని నిర్ణయించుకున్నాడు. బీయెండబ్ల్యూ కంపెనీతో పోటీపడలేక వాండెరర్ తన మోటారుసైకిల్ కంపెనీని జానెసెక్ కి అమ్మేసాడు. వాండెరర్ కి చెందిన 500 సీసీ ఇంజిన్ తీసుకుని తన మోటారుసైకిల్లో కలిపి 1929 లో జావా పేరిట ప్రపంచానికి పరిచయం చేసాడు జేనెసెక్.

1930 లో ఆర్ధికమాంద్యం మూలంగా ఇంజిన్ సామర్ధ్యం తగ్గించి 175 సీసీ మోటారుసైకిళ్ళు తయారు చేసారు.  1950 నాటికి 250,350 సీసీ మోటారుసైకిళ్ళు బాగా పేరు తెచ్చుకున్నాయి. ఇంచుమించు 120 దేశాలకు ఈ మోటారుసైకిళ్ళు ఎగుమతి అయ్యాయి. అలా మన దేశానికి కూడా జావా మోటారుసైకిల్ చేరుకుంది. ఐడియల్ జావా పేరిట పూనే కి చెందిన రుస్తుం మరియు ఫరూఖ్ ఇరాని జావా మోటారుసైకిళ్ళని భారతదేశానికి దిగుమతి చేసారు. 1960 లో మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వొడెయార్ వీరికి ఆర్ధికసహాయం చేసి మైసూరులోనే వీటిని తయారుచేయడం మొదలుపెట్టారు. 1970 నుండి వీటినే కొంచెం మార్చి ఎజ్డి పేరిట తయారుచేసారు.


బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో జావా, ఎజ్డి మోటారుసైకిళ్ళు బాగా సందడి చేసింది.  హాలీవుడ్ మాడ్ మాక్స్ చిత్రం కాపీ చేసి తీసిన యమకింకరుడు సినిమాలో విలన్లందరూ జావా మోటారుసైకిళ్ళు వాడుతారు. చిరంజీవి కూడా చాలా సినిమాల్లో జావా మోటారుసైకిలు తోలుతాడు. చాలా సినిమాలలో హీరో కి ఇదే మోటారుసైకిల్! ముందు చక్రం దూరంగా ఉండి, హెడ్ లైట్స్ మీద ఇగ్నిషన్, ఇంజిన్ నుండి వయ్యారంగా కిందికి వచ్చి పొడవుగా కాళ్ళు జాపినట్టు ఉన్న ముఫ్లర్లు జావాకి హుందాతనం అద్దింది. గొంగళిపురుగు మారి సీతాకోకిల అయినట్టు కిక్ రాడ్ తిరిగి గేర్ రాడ్డుగా మారడం నిజంగా ఒక అద్భుతం!


1996లో ఈ మోటారుసైకిళ్ళ తయారీ ఆగిపోయింది. ముప్పై, నలభై ఏళ్ళుగా భారతదేశం రహదారుల మీద సవారీచేస్తూ అందరి గుండెల్లో మాత్రం నిలిచిపోయింది. ఇప్పటికీ జావా, ఎజ్డీ ప్రేమికులు ఆదివారం కలిసి తమ పాత బైకుల మీద సవారీ చేస్తూ ఉంటారు. ఇటువంటి క్లబ్బులు ఇప్పటికీ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, చంఢీగడ్, తిరువనంతపురం నగరాలలో లో ఉన్నాయి. కోఠీలో పాత బైకుల మార్కెట్లో ఈ బైకులకి మంచి గిరాకీ ఉంది. పెట్రోల్ లేకపోతే కిరోసిన్ పోసినా కూడా ఈ మోటారుసైకిళ్ళు నడుస్తాయి. ఈ జావా ముచ్చట నాకు 2000 సంవత్సరంలో తీరింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఒక మెకానిక్ షాపులో మూలగా పడిఉన్న ఎజ్డీని రెండు, మూడువేలకి బాగుచేసుకుని కొన్ని వారాలు పండగ చేసాను. ఎప్పటికైనా ఒక జావా మోటారుసైకిల్ సొంతం చేసుకోవాలన్న కల ఇపుడు నెరవేరబోతుంది.

మహీంద్రా కంపెనీ జావా మోటారుసైకిళ్ళని మళ్ళీ భారతీయ మార్కెట్ కి కొద్ది రోజుల క్రితం తీసుకువచ్చింది. గత సంవత్సరం భారతదేశంలో 2 కోట్ల మోటారుసైకిళ్ళు అమ్ముడయ్యాయి. బ్రిటన్ కి చెందిన రాయల్ ఎంఫీల్డ్, ట్రయంఫ్ మన మర్కెట్లో చాలా సందడి చేస్తుంది. అమెరికాకి చెందిన హార్లీ డేవిడ్సన్ కూడా మన మార్కెట్ పై ఆశ పడింది. బీఎండబ్ల్యూ కూడా 310 మోడల్ని హోసూరులో తయారుచెయ్యడం మొదలుపెట్టింది. జావా మోటారుసైకిల్ని మళ్ళీ విడుదల చేసినందుకు మహీంద్రాకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి వ్యాపారం బాగా నడుస్తుందని ఆశిస్తాను. 

Wednesday, January 24, 2018

దర్గామిట్ట కతలు



డెట్రాయిట్టులో ఉన్నపుడు ఈ కథల గురించి విన్నాను. దర్గామిట్ట అంటే మా నెల్లూరులో ఉండేది కదా, నాకు బాగా పరిచయమైన స్థలం కూడా! ఈ కథలు చదవాలనుకున్నా కానీ వీలు కుదరలేదు.

ఈమధ్యలో మొహమ్మద్ ఖదీర్ బాబు రాసిన ఖాదర్ లేడు కథలు చదివాను. అవి చదివాక దర్గామిట్ట కథలు చదవాలన్న కోరిక మరింత బలపడింది. కాళాస్త్రిలో కూడా "ఈ కథలు మేము చదివేశాం, చాలా బాగా ఉంటాయి శీను" అన్నారు అక్కయ్యలు. మొన్న సెలవల్లో నేను, త్రిలోక్ తిరుపతిలో దిగి టౌనుహాలు దగ్గర కుష్బూ ఇడ్లీ, పాయా తిన్నాక ఎదురుగా పుస్తకాల షాపు కనిపించింది. అందులో దర్గామిట్ట కతలు, పోలేరమ్మ బండ కతలు కలిపి ఒక పుస్తకంగా వేసారు. అలా మనకి ఈ పుస్తకం దొరికింది.

డాలసు వచ్చేముందు అత్తగారు ఇచ్చిన సక్కినాలు బాగులో సర్దుకుని దర్గామిట్ట కతలు మాత్రం కారీ బాగేజులో వేసుకున్నా. మాదాపూర్ పెట్రోల్ బంక్ పక్కన ఉడిపీలో సాంబార్ ఇడ్లీ తిని లెమన్ టీ తాగి ఇంటికి వెళ్ళాక కతలు చదవడం మొదలుపెట్టా. డాలసులో దిగాక చలికి ఎటూ బయటకు పోక మూడు రోజుల్లో దర్గామిట్ట కతలు చదివేసా. ప్రతి కథ చదివాక "భలే ఉన్నాయే" అనుకుంటూ ఒకేసారి పది, ఇరవై కథలు చదివించేలా చేసాయి.

ఖదీర్ బాబు పుట్టినప్పటి నుంచీ ఏడో తరగతి చదివే వరకు జరిగిన తన జీవితానుభవాలని ఈ కథలలో పాఠకులకి బాగా ఆసక్తి కలిగేలా చెప్పారు. సినబ్బ కతలలో నామిని గారు మా చిత్తూరు యాసలో చెప్తే ఈ దర్గామిట్ట కథలలో ఖదీర్ బాబు గారు మా నెల్లూరు యాసలో చెప్పారు. నేను చిన్నపుడు పెరిగిన రాపూరులో డెబ్బై శాతం పైగా ముస్లింవాళ్ళుండేవారు. నా స్నేహితులు కూడా చాలా మంది ముస్లింలే. ప్రతి పండక్కి వాళ్ళింటికి నేను వెళ్ళడం, వాళ్ళు మా ఇంటికి రావడం జరుగుతూ ఉండేది. మా నాన్న ఆఫీసులో పని చేసే అమీర్ జాన్ ప్రతి పండక్కి మా ఇంటికి ఒక కారేజ్ పంపేవాడు.

ఈ కథలు చదువుతూ ఉంటే నేను మళ్ళీ రాపూరులో అస్లాం, జమీలుతో తిరుగుతున్నట్లు అనిపించింది. ఖదీర్ బాబు నాయనమ్మ గురించి చదివినపుడల్లా జమీల్ ఇంటికి వెళ్ళినపుడు మంచంలో పడుకుని ఉండే అవ్వే గుర్తుకు వస్తుంది. పండగలప్పుడు అస్లాం వాళ్ళమ్మ ఉదయాన్నే లేచి రాత్రి వరకూ వంటలు చేస్తూ ఉండేది.

"కసాబ్ గల్లీలో సేమ్యాల ముగ్గు" కథ చదివితే అస్లాం అమ్మే గుర్తుకు వచ్చింది. మొన్న ఇంటికి వెళ్ళినపుడు కూడా పలావు, చేపలు, రొయ్యలు చేపించాడు. ఖదీర్ గారి నాన్న కూడా ఇలాగే ఇంట్లో హడావిడి పెట్టి పండక్కి అన్నీ చేపించుకుని అందరికీ పంచేస్తాడట. అస్లాం కూడా ఇంతే!

ఈ కథలు చదివాకే దర్గామిట్టకి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలిసింది. నేను నెల్లూరులో ఉన్నపుడు రొట్టెల పండగ వస్తే ఊరంతా సందడిగా ఉండేది. చదువుల రొట్టె, పెళ్ళి రొట్టె, ఉద్యోగం రొట్టె లాంటి మొక్కులు ఈ పండగలో తీర్చుకునేవారు. ఈ పండగ గురించి నాకు తెలియని మరి కొన్ని వివరాలు ఇందులో ఉన్నాయి.

మా స్కూలు పక్కనే పీర్ల చావిడి ఉండేది. పీర్ల పండగ వచ్చిందంటే అప్పట్లో తెలియని భయం ఉండేది. పూనకం వచ్చిన భక్తులు పీర్లు పెట్టుకుని ఊరిలో పరిగెత్తేవారు. వాళ్ళ వెనక పిల్లలు ఉరికేవాళ్ళు. ఆ పీర్ల కథ కూడా చాలా బాగుంది ఇందులో.

రంజాన్ నెలలో ఉపవాసం ఉండడానికి వీళ్ళేదంటూ అత్త, మొగుడితో గొడవ పడి ఎదిగే పిల్లలకి అన్నం పెట్టి కాపాడుకోవానే తపన "పాపాలన్నీ మాయమ్మకే" కథలో మనకి కనిపించి కంట తడి కూడా పండగ బోనసుగా అందిస్తుంది.

కాలేజీలో చదువుకునేటపుడు ప్రతి సోమవారం ఉదయాన్నే శ్రీహరికోట నుండి కావలి డిపో బస్సులో గూడూరు వరకు వెళ్ళేవాడిని. అంతకు మించి కావలి గురించి తెలియదు. ఈ కథలు చదివాక దర్గా మిట్ట, కసాబ్ గల్లీ, పోలేరమ్మ బండ మనకి బాగా పరిచయమవుతాయి.

ఆదివారం మా ఇంట్లో తలకాయ కూర చేసుకోవాలంటే నేనే మార్కెట్ వెళ్ళి పొట్టేలు మెడ కోసిన దగ్గర నుండి తల, కాళ్ళు మార్కెట్ పక్కనే సాయిబు పక్కన కూర్చుని కాల్పించుకుని వచ్చేవాడిని. తలకాయ కూర కథ చదువుతూ ఉంటే మా సూళ్ళూరుపేట మటన్ మార్కెట్టే గుర్తుకు వచ్చింది.

నెల్లూరు కాపు వీధిలో మా పెదనాన్న కొడుకులిద్దరూ బంగారు పని చేస్తూ ఉంటారు. చిన్న బజారులో కొన్ని వేల బంగారు అంగడులుంటాయి, ప్రతి చిన్న అంగడిలో ఒక యజమాని, అతని కింద ఒకరు లేక ఇద్దరు కుర్రవాళ్ళు పనికి ఉంటారు. ఈ బంగారు పనిలో ఉండే కుర్రవాళ్ళ గురించి రాసిన కథ చదువుతూ ఉంటే నాకు కాపు వీధిలో నేను చూసిన ఆ అంగడులే గుర్తుకు వచ్చాయి. దసరా పండగ అపుడు ఈ అంగళ్ళలో సందడి చూడాలి, భలే ఉంటుంది.

ఇలా తెలిసినవి, తెలియనివి చాలా మనకి ఈ కథల్లో బాగా అర్థం అయ్యేలా చెప్పారు ఖదీర్ బాబు గారు. చిన్నపుడు అడగాలని తెలియని ఎన్నో ప్రశ్నలకు ఇందులో జవాబులు దొరికాయి. ప్రతి ఒక్కరూ చదవి తీరాల్సిన కతలు ఈ దర్గామిట్ట కతలు.

చాలా నెలల తర్వాత మళ్ళీ బ్లాగులో రాస్తున్నాను.

"మీరు బాగా రాస్తూ ఉంటారు. ఈమధ్య రాయడం మానేసారు, రాస్తూ ఉండండి" అని ప్రోత్సహించిన కోడూరి విజయ్ కుమార్ గారికి ఈ టపా అంకితం.  నా ప్రతి టపా చదివి నన్ను ప్రోత్సహిస్తున్న రవి మామయ్యకి, పెద్దక్కయ్యకి కూడా వందనాలు!


Sunday, June 19, 2016

రాయల వారి హారం - సినిమా షూటింగ్ ముచ్చట్లు


స్థలం: రియల్ డి కార్తే, మెక్సికో దేశం (సముద్ర మట్టానికి ఇంచుమించు 8000 అడుగుల ఎత్తులో)


సమయం: వాచ్ తీసుకువెళ్ళలేదు, ఫోనులో చార్జు లేదు!


సందర్భం: కొండ ప్రాంతంలో ఆగిపోయిన బైకు, ఎలా తీసుకురావాలో అలోచించకుండా మిగతావారితో కలిసి తందనాలు ఆడేవేళ...






మెక్సికోలోకి వచ్చీరాగానే కొన్ని ఫోటోలతో ఫరూక్ చేసిన వీడియోని whatsapp లో చూసి హరి చరణ్ గారు ఫోన్ చేసి " Rj, నువ్వు డాలస్ తిరిగి వచ్చాక విజయ్ బాబు గారు వారి సినిమాలో మీ బైకర్స్ తో ఒక చిన్న సీన్ తీద్దామనుకుంటున్నారు" అని చెప్పారు.




 "ఓ...సూపర్ అండి! నేను మా వాళ్ళనందరినీ నాలుగు సూమోల్లో తీసుకు వచ్చేస్తాను, place మీరు చెప్పినా సరే...నన్ను చెప్పమన్నా సరే...టైము మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే..ఎక్కడైనా సరే, ఎపుడైనా సరే..." అని నేను తొడల మీద మార్చి, మార్చి కొడుతూ చెప్పాను.




న్యూయార్కు నుండి వచ్చిన రాం కి విషయం అర్థం కాలేదు. "తంబీ.....క్యా హువా?" అన్నాడు.




మేము బస చేసిన హోటల్ మేనేజరుకి అర్థం కాక "వూనో సర్వీసా? ఇంకో బీరు కావాలా" అని స్పానిష్ లో అడిగాడు.


అపుడపుడూ డబ్బింగ్ తెలుగు సినిమాలు యూట్యూబులో చూస్తున్న ఫరూక్ కి విషయం అర్థం అయింది.



"కుచ్ నై బే...సాలా, సవాల్ కర్ రై! గుల్టి లోగ్ ఐసాహీ కర్తే హై..." అని రాం కి, స్పానిష్ మేనేజరుకి సర్ది చెప్పాడు.




రాంకి కొంచెం అర్థం అయ్యి ఫరూక్ దగ్గర కొన్ని తెలుగు డబ్బింగ్ సినిమా పేర్లు తీసుకున్నాడు. మాన్ హాటన్ వెళ్ళాక టైము ఉన్నపుడు చూద్దామని!



హరిగారితో మాట్లాడేసాక మా వాళ్ళతో చెప్పాను "మనం డాలస్ వెళ్ళగానే మనం ఒక సినిమాలో నటించబోతున్నాము" అని. అందరూ ఎగిరి గంతేసారు.

     
                                                      **********************



వారం తర్వాత మేమందరం క్షేమంగా మెక్సికోనుండి టెక్సాస్ చేరుకున్నాము.



వారాంతం హరిగారు నన్ను డాలాసులోని షూటింగ్ లొకేషన్ కి పిలిచి నన్ను సినిమా నిర్మాతకి పరిచయం చేస్తూ "మావాడు మంచి నటుడు అండి, ఈమధ్యనే మిస్సమ్మ నాటకంలో కూడా నటించాడు" అన్నారు.



ఆ సాయంత్రం అక్కడే ఉండి వారు తీస్తున్న రెండు సన్నివేశాలను గమనిస్తూ గడిపాను.



ఈ కొత్త సినిమా పేరు "రాయల వారి హారం", ఈ సినిమాలో వరుణ్, కౌశిక్ హీరోలుగా నటిస్తున్నారు. వరుణ్ కి జంటగా వృతికా నటిస్తుంది. వరుణ్, వృతికాకి ఈమధ్యనే నిశ్చితార్థం అయింది, మరి కొన్ని నెలల్లో ఇద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారు.



ఆ సాయంత్రం షూటింగ్ అంతా ఇంట్లోనే జరిగింది. లివింగ్ రూములో కొన్ని సన్నివేశాలు, రాత్రి ఇంటి ఆరుబయట పచ్చికలో పుట్టినరోజు సన్నివేశం.



షాట్ కి రెడీ చేసే సమయంలో యూనిట్ అంతా లివింగ్ రూములోనే సందడిగా తిరుగుతూ ఉన్నారు. వరుణ్ తో కలిసి అందరూ NBA బాస్కెట్ బాల్ ఆట చూస్తూ ఉన్నారు.



ఆదిశంకరాచార్య చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన కౌశిక్ యూనిట్ కి కావలసిన ఏర్పాట్లు చేస్తూ కనిపించాడు. కౌశిక్ వాళ్ళ నాన్నే సినిమాకి నిర్మాత, అందుకే సినిమాకి కావలసిన ఏర్పాట్లన్నీ తండ్రితో పాటూ తను కూడా చూసుకుటున్నాడు. కేమెరామన్ దీపకుతో అనర్గళంగా మళయాళంలో మాట్లాడుతూ ఉన్నాడు. కేరళ వాళ్ళకి అయ్యప్ప పాత్రలో కౌశిక్ బాగా పరిచయం. సందడిగా తిరుగుతున్న కౌశిక్ ని చూస్తుంటే నాకు ఆదిశంకరాచార్యులు పాత్రని చూస్తున్నట్లే అనిపించింది!

ఆరోజు అర్థరాత్రి వరకు అక్కడే ఉండి పుట్టినరోజు పండగ సన్నివేశంలో పాల్గొని ఇంటికి చేరుకున్నాను.



                                                               **********************



పక్క రోజు నిర్మాతగారు ఫోన్ చేసి "రేపు ఉదయం షూటింగుకి నలుగురు అమెరికన్లు కావాలండీ" అన్నారు.



"అలాగేనండీ! నేను ఏర్పాటు చేస్తాను" అని చెప్పాను.



పక్కరోజు పని రోజు, ఆరోజు కావాలంటే ఆఫీసులో మనకి తెలిసిన వాళ్ళని తీసుకువెళ్ళలేము. నాకు తెలిసిన వాళ్ళని కొంతమందిని అడిగాను.



ఒకామె, బాగా సిగ్గు పడుతూ "అబ్బే...నాకు కెమెరా పడదు శీనూ" అని చెప్పింది.



సన్నీ మాత్రం "ఎపుడు రావాలి? ఎక్కడకు రావాలి" అని సమరసింహారెడ్డి తరహాలో సమాధానమిచ్చాడు.

సన్నీ మన భారతదేశం పక్కనే ఉన్న కంబోడియా దేశస్తుడు. థాయిలాండులో, కంబోడియాలో హిందీ సినిమాలు బాగా చూస్తారు. బాలయ్య సినిమా ఎపుడో చూసే ఉంటాడనుకున్నాను.



నిర్మాతగారికి ఫోన్ చేసి "ఒక్కాయన దొరికారండీ, మిగతా వాళ్ళని షూటింగ్ ప్రదేశంలో పట్టుకుందాము" అని సర్దిచెప్పాను.

"అలాగే! రేపు మీరిద్దరూ సూటు వేసుకుని లొకేషన్ కి వచ్చేయండి" అని చెప్పారు.

                                                                                   
                                                                 **********************



ఉదయాన్నే పదిన్నరకి నేను షూటింగ్ లొకేషన్ కి వెళ్ళిపోయాను. ఒక పది నిముషాలకి సన్నీ కూడా చేరుకున్నాడు. ఇద్దరం కూర్చుకుని కబుర్లాడుతూ సెల్ఫీలు దిగాము.







ఒక అరగంటకి యూనిట్ సభ్యులు అందరూ వచ్చేసారు. సన్నీ 1 గంటకి ఇంటికి వెళ్ళి కారు వాళ్ళ పెద్ద అమ్మాయికి ఇచ్చేయాలి. ఇంట్లో ఇంకో కారు మినీ వాను, టీనేజీ అమ్మాయి ఆ కారుని నడపడానికి ఇస్టపడదు, పైగా డ్రైవింగ్ కి కొత్త. చిన్న కారయితే ఆ అమ్మాయికి సౌకర్యం! కెమరావాళ్ళు సర్దుకుని షాటుకి రెడీ అయేలోపల ఇంచుమించు 11:30 అయింది.

నిర్మాతగారు దర్శకుడికి "ముందు మీరు ఆయన సన్నివేశాలు తీసి అతన్ని పంపేయండి" అని చెప్పారు.



మేము గత కొన్ని నెలలుగా షార్టు ఫిలిం ఒకటి తీస్తూ ఉన్నాము.  హరిగారి దర్శకత్వంలో మా డాలస్ మూవీ బఫ్స్ బృందం నిర్మిస్తున్న ఒక చిన్న సినిమా. ఈ సినిమాకి నిర్మాణ, పర్యవేక్షణ భాద్యతలు పరిమళ, డీ గారు, నేను చేపట్టాము. సినిమాకి కావలసిన ఏర్పాట్లు అన్నీ మేము ముగ్గురం చూసుకుంటూ ఉంటాము.మా సినిమాకి పనిచేసేవాళ్ళతో పరిమళ మాట్లాడుతూ వారి స్కెడ్యూల్స్ అన్నీ చూసుకుంటూ ఒక మంచి మేనేజరులా ఎంతో చాకచక్యంగా పనులు చేసేస్తుంది. పరిమళ మాకందరికీ బిగ్ బాస్ అనమాట. నేను కూడా చిన్నా, చితకా పనులు చేస్తూ ఉంటాను.








షూటింగ్ మొదలు పెట్టక ముందు మేము లొకేషన్స్ రాసుకుంటూ ఎక్కడ ఏ సీన్ తియ్యాలి, ఒకే చోట ఎన్ని సన్నివేశాలు తీసుకోవచ్చు...గట్రాలు చర్చించుకున్నాము. అంటే కిచెనులో సీన్ తీసేటపుడు అక్కడ తీసే వివిధ సన్నివేశాలు రాసుకుని, వాటిని అలాగే తీసాము. ఎడిటింగ్ చేసే సమయంలో వీటన్నిటినీ మా ఎడిటర్ వెంకట్ జొన్నాడ గారు కలుపుకుంటూ ఉంటే మాకు కథ అంతా తెలిసి వచ్చేది. 



కొన్నిసార్లు హీరోయిన్ లేకపోయినపుడు హీరోని పెట్టి తీసి మళ్ళీ అమె వచ్చాక ఆమెని తీసి రెండు సీన్లు కలిపేవాళ్ళం. అందుకే నేను నిర్మాత గారు పై మాట అన్నపుడు సులభంగా అర్థం చేసుకోగలిగాను. 



విజయ్ బాబుగారు చెప్పగానే దర్శకులు, యాట సత్యనారాయణ గారు దానికి కావలసిన సీన్స్ రెడీ చేసుకుని కెమెరామాన్ దీపక్ కి హిందీలో చెప్పారు. దీపక్ తన సహాయకుడితో తమిళంలో మాట్లాడుకున్నారు. మనం అన్ని భాషలని అర్థం చేసుకునే ఖాదర్ బాషా! అందరినీ అర్థం చేసుకుంటూ ఉన్నాను.



ప్రసాద్ గారు సన్నీకి డైలాగులు రాసి నేర్పించారు. దీపక్ చక, చకా రెండు, మూడు ఆంగిల్స్ లో తీసి షాట్ ఓకే చేసారు. ప్రసాద్ గారు డైలాగులు అందిస్తూ ఉంటే సన్నీ వల్లె వేస్తూ చక్కగా చేసాడు. అనుకున్న సమయానికి ముగించి ఇంటికి వెళ్ళిపోయాడు.



విజయ్ గారు "శ్రీ గారు భలే అతన్ని తెచ్చారు" అని నన్ను మెచ్చుకున్నారు. 



కాసేపటికి కౌశిక్ "కింద వరుణ్ బిల్డింగ్ అడ్రెస్ కోసం వెతుకుతూ ఉన్నాడు" అని నాతో చెప్పాడు. మేము అపుడు 5 అంతస్థులలో ఉన్నాం, లిఫ్టులో కిందకి దిగి అక్కడ తచ్చాడుతున్న వరుణ్, వృతిక ని పలకరించి వాళ్ళని పైకి తీసుకు వెళ్ళాను.



వరుణ్ పక్కన ఉన్నది వృతిక అని నాకు తర్వాత కానీ తెలియదు. లేకుంటే అపుడే వారిద్దరికీ పెళ్ళి శుభాకాంక్షలు చెప్పే వాడిని. అసలు వృతికని చూస్తే తెలుగు అమ్మాయి అని కూడా చెప్పలేము. ముందు రోజు రాత్రి వరుణ్ intreview ని youtube లో చూసాను. 



వృతిక గురించి మాట్లాడుతూ "నన్ను మా అమ్మలా చూసుకుంటుంది" అని చెప్పాడు. 

వరుణ్ అన్నట్లే వృతిక అతనికి కావలసినవన్నీ అందిస్తూ, భోజనం తినిపిస్తూ చక్కగా చూసుకుంది. 



"ఇద్దరూ మంచి జంట" అని నేను అనుకున్నాను.



తరువాత సన్నివేశం తీసే సమయంలో నేను, విజయ్ గారు, నాతో పాటూ నటిస్తున్న పద్మశ్రీగారు కూర్చుని కబుర్లాడుతూ
కూర్చున్నాము.



విజయ్ గారు పాత రోజుల్లో తెలుగు సినిమా గురించి మాకు విశేషాలు చెప్తూ ఉన్నారు. మహానటులు నాగేశ్వర్ రావు, రామారావు, చిరంజీవి గురించి కొన్ని కొత్త విషయాలు పంచుకున్నారు.



వాణిశ్రీ గారి మేకప్ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాము. ఆమెకి కౌశిక్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు.

కౌశిక్ ఎపుడు కనపడినా "నువ్వు ఆధ్యాత్మిక పాత్రలే వెయ్యి, commercial సినిమా చెయ్యద్దు" అని చెప్పేవారట. 

మేము ఇలా కబుర్లలో ఉండగా వరుణ్ తో సత్యనారాయణ గారు కొన్ని సన్నివేశాలని తీస్తూ ఉన్నారు.

Young software proffessionals తో మాట్లాడే సన్నివేశం అనమాట. 



వాళ్ళు తడబడుతూ ఉంటే వరుణ్ "టెన్షన్ పడకు బాస్...ఇదిగో ఇలా చేసెయ్" అని చూపించాడు. అతనితో నటించిన అరుణ్ కి ధైర్యం వచ్చి వెంటనే షాట్ ఒకే అయ్యేలా నటించేసాడు.



అంతలో భోజనాల వేళ అయింది. విజయ్ బాబు గారు ఆఫీసులోని ఇంకొక వ్యక్తితో కలిసి అక్కడకి దగ్గరలో ఉన్న హిల్ టాప్ రెస్టారెంటుకి వెళ్ళి మాకందరికీ భోజనాలు తీసుకువచ్చారు. అందరం కలిసి కడుపునిండా భోజనం చేసాము. 

కాసేపటికి నా సీన్ కూడా వచ్చింది. సత్యనారాయణ గారు నాకు డైలాగులు చూపించి కాసేపు చదువుకోమన్నారు. వరుణ్ కి కూడా చూపించి ఇద్దరినీ నేర్చుకోమన్నారు. 



సత్యనారాయణ గారు "ఒకసారి ట్రై చేస్తారా?" అంటే అలాగే అని తల ఊపాను. 



"ఎంత వరకు చేస్తారు" మొత్తం చేస్తారా?" అంటే "అలాగే" అన్నాను.



కొంత చేసేసరికి "బెబ్బెబ్బే..." అన్నాను. 



సత్యనారాయణ గారు "సరే...కొంత చేయండి" అని మూడు సీన్లుగా విడగొట్టారు.








20కి పైగా సినిమాలలో నటించిన వరుణ్ మూడు అడుగుల ముందు కూర్చుంటే కొంచెం ఉద్వేగంగా అనిపించింది. 



మొదటి షాట్ అయిపోగానే "భలే చేస్తున్నారే..." అన్నాడు.



తరువాత రెండు ఆంగిల్స్ తో మరి కొన్ని షాట్స్ తియ్యడంతో నా పని అయిపోయింది. నాతో తీసిన సన్నివేశంతో స్టోరేజ్ కార్డు నిండిపోయింది. కౌశిక్ మాకు దగ్గరలో ఉన్న Frys Electronics కి వెళ్ళి స్టోరేజ్ కార్డు కొనుక్కువస్తానని వెళ్ళాడు. మేము తీసే షార్ట్ ఫిలిం కూడా డిజిటల్, అందులో కూడా ఇలాంటివే వాడుతాము. కాకపోతే ఇక్కడ Red Camera, ఇంకొంచెం ఎక్కువ కెపాసిటీ ఉండే స్టోరేజ్ వాడుతారు.


దీపక్, అతని సహాయకుడు శక్తి, నేను కలిసి కబుర్లాడుతూ కూర్చున్నాము. అపుడే విడుదల అయిన కబాలి ట్రైలరు చూస్తూ కాసేపు ఆ సినిమా గురించి మాట్లాడుకున్నాము. శక్తి చాలా చిన్న కుర్రాడు, వయసు ఇరవై లోపే ఉంటుంది. అతను ఇప్పటికి 56 సినిమాలలో నటించాడని తెలిసి చాలా ఆశ్చర్యం వేసింది.



కౌశిక్ తిరిగి రాగానే చక, చకా షూటింగ్ జరిగిపోయింది. వరుణ్ సీను, సీనుకీ సూట్లు మారుస్తూ, అందరినీ encourage చేస్తూ నటించేసాడు.



షూటింగ్ పూర్తి అయిపోగానే ఆఫీసులోని కుర్రవాళ్ళందరూ వరుణ్ తో సెల్ఫీలు దిగారు. నేను కూడా యూనిట్లోని వారందరికీ వీడ్కోలు చెపుతూ ఇంటికి వెళ్ళాను.



Monday, March 28, 2016

సరసిజ థియేటర్స్ మిస్సమ్మ - రంగస్థల నాటకం





గత సంవత్సరం ఫేస్ బుక్కులో ఒక ప్రకటన చూసాను. ఒకానొక కాలంలో తెలుగునేల మీద ఒక వెలుగు వెలిగిన నాటకరంగాన్ని డాలస్ తీసుకువచ్చే ప్రయత్నం చేపట్టామని అందులో నటించడానికి నటులు కావాలని సరసిజ - The Stage వారు ప్రకటించారు. 

"నేను ఉత్సాహంగా ఉన్నానండీ" అని నా వివరాలు తెలిపాను.

పంపిన వెంటనే రాజేశ్వరి ఉదయగిరి గారు ఫోన్ చేసారు. నాతో కాసేపు మాట్లాడి, నాటకం వివరాలు త్వరలో అందజేస్తామన్నారు.


రాజేశ్వరి గారి గొంతు ప్రతి ఆదివారం యువ రేడియోలో వింటూ ఉంటాను. కొన్ని సార్లు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, నాటా, తానా కార్యక్రమాలలో ఆమెని చూడడం కూడా జరిగింది. చక్కని తెలుగు మాట్లాడుతూ అటు రేడియోలోనే కాకుండా అమెరికాలో పలు తెలుగు సంఘాల సాంస్కృతిక కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు.
   

తొందరలోనే నటీ, నటులందరం రాజేశ్వరి గారి ఇంటిలో కలిసాము. నాతో పాటూ భాస్కర్ రాయవరం గారు, శ్రీకాంత్ సముద్రాల గారు, కళ్యాణి సిద్ధార్థ గారు, బాలా కర్రి గారు, జయ కళ్యాణీ గారు, వెంకట ఫణీంద్ర సుసర్ల గారు నాటకంలో ఉన్నారని తెలిసింది. భాస్కర్ రాయవరం గారు మనబడిని నడిపిస్తూ తెలుగు భాషని పిల్లలకు నేర్పిస్తూ ఎంతో కృషి చేస్తూ ఉంటారు. భాస్కర్ గారితో కలిసి పని చెయ్యడం ఇదే మొదటిసారి. శ్రీకాంత్ IT Happens సినిమాతో మంచి నటుడిగా, దర్శకుడిగా అందరికీ పరిచయమే! కళ్యాణి సిద్ధార్థ గారు, బాలా కర్రి గారు, వెంకట ఫణీంద్ర సుసర్ల గారు కూడా మనబడిలో పిల్లలకి తెలుగు నేర్పిస్తూ ఉంటారు.జయ కళ్యాణి గారు డాలస్ వాసులకి ఆది రేడియో జాకీగా, మంచి గాయనిగా పరిచయం. రాజేశ్వరి ఉదయగిరి గారు, భాస్కర్ రాయవరం గారు, కళ్యాణి సిద్ధార్థ గారు, బాలా కర్రి గారు, జయ కళ్యాణీ గారు డాలసులో ఇంతకు మునుపు కొన్ని నాటకాలు వేసారు కూడా.  


రాజేశ్వరి గారు, జయ కళ్యాణి గారు ఇద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరూ ఒక సాయంత్రం విజయా వారి మిస్సమ్మ సినిమా చూస్తూ తన్మయత్వం చెందుతూ ఈ నాటకాన్ని మనం డాలసులో వేస్తే ఎలా ఉంటుంది అని అలోచించించగా పుట్టినదే ఈ సరసిజ. తమ ప్రయత్నం అద్భుతమైనదే కాకుండా ఎంతో సాహసంతో కూడినదని కూడా వీరిద్దరికీ తెలుసు. అయినా ఎక్కడా తడబడకుండా, అంతులేని ఆత్మవిశ్వాసంతో నిన్న నాటకం ప్రదర్శించేవరకూ అహర్ణిశలూ వీరిద్దరూ పడిన తపన చూసి నాకు చాలా ముచ్చటేసింది. మేమందరం మిస్సమ్మ నాటకం వేస్తామని తెలియగానే ఆనందంతో నాకు కొన్ని వారాలు నిద్ర కూడా పట్టలేదు. ఇంతటి అద్భుతమైన కళాఖండాన్ని నాటకంలాగా ప్రదర్శించబోతున్నామన్న నిజం మమ్మల్నందరినీ ఉక్కిరిబిక్కిరి చేసింది.



మిస్సమ్మ సినిమా నుండి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు తీసుకుని రాజేశ్వరి ఉదయగిరి గారి తల్లి గారు విజయలక్ష్మి అత్తలూరి గారు మాకు నాటకానికి కావలసిన కథ, సన్నివేశాలను అందించారు. వీటిని రాజేశ్వరి గారు, జయ గారు అమెరికాకి తగ్గట్టుగా మార్పులు చేసారు. సినిమాలో రామారావు, సావిత్రి గారు స్కూలులో టీచరుగా ఉద్యోగంలో చేరుతారు. ఆ మిస్సమ్మ అమెరికా వస్తే ఎలా ఉంటుందో, అలాగ కథని చక్కగా మలిచారు. విజయలక్ష్మి గారు ప్రముఖ రచయిత్రి. ఎన్నో కథలు, నవలలు రాసారు. కొన్ని సంవత్సరాల ముందు మా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నిర్వహిస్తున్న నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా వచ్చారు. ఆమె రాజేశ్వరి గారి తల్లి అని తరువాత తెలిసింది. అంతే కాకుండా రాజేశ్వరి గారు చిన్నప్పటి నుండి ఆకాశవాణిలో ప్రముఖ నటులు చాట్ల శ్రీరాములు, రమణ మూర్తి లాంటి వారితో కలిసి నాటకాలలో పాల్గొన్నారట. అందుకే రాజేశ్వరి గారి నటన ఎంతో సహజంగా ఉంటుంది. సన్నివేశానికి తగ్గట్లుగా మాటలతో ప్రయోగాలు చేయడంలో అందె వేసిన చేయి. మరొక విషయమేంటంటే రాజేశ్వరి గారు జెమినీ టీవీలో కూడా పనిచేసారు. ఇప్పటి ప్రముఖ anchors అయిన సుమ, ఝాన్సీ, గాయని సునీత, అనిత, రఘు కుంచె గారితో పనిచేసారని కూడా తెలిసింది.









ఇంచుమించు డిసెంబరు నుండి ప్రతి వారాంతం కలిసి నాటకానికి తయారయ్యేవాళ్ళం. డైలాగులు ఎలా పలకాలి? భావాన్ని ఎలా ప్రదర్శించాలి? వాటి మీద రాజేశ్వరి గారు అందరికీ తగిన తర్ఫీదు ఇచ్చారు. మొదటి కొన్ని వారాలు డైలాగులు నోటికి రావడానికి సరిపోయింది. వారం మధ్యలో ఫోనులో అందరూ కలిసి డైలాగులు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మాతో పాటూ గాయత్రి కందడై న్యూజెర్సీ నుండి ఫోనులో, గూగొల్ హాంగ్ అవుట్ లో కలిసి నటించేది. కొన్ని వారాలు గడిచేసరికి అందరికీ నాటక అనుభవం చాలా సరదాగా తయారయ్యింది. నాటకం ఆడుతున్నంతసేపూ జోకులు బాగా పేలేవి. అందరూ పడీ,పడీ నవ్వే వాళ్ళం. నాటకంలో సినిమా పంచ్ డైలాగులు చెప్పడం, నాటకం అయిపోయినా ఇంకా ఆ పాత్రలాగే ప్రవర్తించడం ఇలా చాలా సరదా పంచుకున్నాం. ఇష్టమైన పని చేస్తూ ఉంటే కష్టం తెలియదన్నట్టు ఉదయం నుండీ రాత్రి వరకూ నాటకమే మాకు జీవితం అయిపోయింది.



ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఈ నాటకం గడిచిన అన్ని రోజులూ మాకు కాఫీలు, టీలు, టిఫిన్లూ, భోజనాలూ అన్నీ రాజేశ్వరి గారి ఇంట్లోనే! ఉదయాన్నే ఏదు గంటలకి వేడి, వేడిగా ఇడ్లీలూ, చట్నీలూ, సాంబార్లూ! మళ్ళీ మధ్యాహ్నం పెళ్ళి భోజనాలూ! గంట, గంటకీ కాఫీలూ, టిఫిన్లూ! రాజేశ్వరి గారి భర్త రాధేష్ పిల్లలని చూసుకుంటూ, మాకు భోజనాలు, కాఫీలు చేసేవారు. పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు! రాధేష్ గారిని చూస్తే అది నిజం అనిపించింది. పిల్లలు కూడా వారి పని వారు చేసుకుంటూ శ్రద్ధగా మా నాటకం కూడా చూసేవారు.


మిస్సమ్మ నాటకంలో సావిత్రి గారి పాత్రలో రాజేశ్వరి గారు నటిస్తుంటే జయ కళ్యాణి గారు నాటకానికి కావలసిన సాధకబాధలన్నీ చూసుకుంటూ ఉండేవారు. నాటకం వెనక వచ్చే సంగీతం, తెర మీద ఉండవలసిన దృశ్యాలు, నాటకానికి కావలసిన ప్రచారం లాంటి విషయాలన్నీ చూసుకుంటూ అందరికీ తలలో నాలుకలా ఉన్నారు. నాటకం practice కి ఎవరు రాకపోయినా వారి పాత్రని ఆమె ఎంతో అవలీలగా పోషించేవారు. మిస్సమ్మ నాటకంలో ఆమె వేయని పాత్ర లేదు! ఈ నాటకంలో జయ గారు పాల్ పాత్రకి భార్యగా నటించాలి. కానీ మా నాలుగు స్తంభాలాటలో విధి వక్రించింది. నాటకానికి సరిగ్గా రెండు వారాల ముందు జయ గారి తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోయేసరికి ఆమె కుటుంబంతో సహా హైదరాబాదు వెళ్ళవలసి వచ్చింది. జయ గారు లేని మా నాటకాన్ని ఎవరూ ఊహించలేకపోయాము. దేవుడి దయ వలన జయ గారి తండ్రి ఆరోగ్యం ఇపుడు కుదుట పడింది.

మా పాత్రలకి తగ్గ సామగ్రి కోసం చాలా చోట్ల తిరిగాము. నాకు కావలసిన గడ్డం, కళ్ళజోడు, చేతి సంచీ, రెండు రకాల టోపీలు, కిరస్తానీ తండ్రి పాత్రకి తగ్గ వేషము, బట్టలు సేకరించడానికి కొన్ని వారాలు పట్టింది. చాలా వరకు మా దగ్గర ఉన్న వాటితో నడిపించాము. కొంత సామగ్రి కొనవలసి వచ్చింది. అందరూ వారి సామగ్రి వారు తయారు చేసి పెట్టుకున్నారు. భాస్కర్ రాయవరం గారు యెస్వీ రంగారావు గారి పాత్ర పోషించాలి. ఆయన గడ్డాన్ని ప్రత్యేకంగా భారతదేశంలో తయారు చేపించారు. బాలా కర్రి గారు రమణా రెడ్డిగారి బట్టలు రెడీ చేసుకుని వాటికి సరిపోయే టోపీని తయారు చేసుకున్నారు. శ్రీకాంత్ సముద్రాల అక్కినేని నాగేశ్వర్ రావు పాత్రకు తగ్గ డిటెక్టివ్ బట్టలు తెచ్చుకున్నారు. రాజేశ్వరి గారు కూడా సావిత్రి పాత్రకి తగ్గ విగ్గుని తయారుచేపించి తెచ్చుకున్నారు. భాస్కర్ గారు, కళ్యాణీ గారు, గాయత్రి గారు తెలుగుదనం ఉట్టిపడేలా బట్టలు, ఆభరణాలు కుదుర్చుకున్నారు. ఫణీంద్ర గారి పాత్ర అమెరికాలోని మేనేజరు కాబట్టి చక్కగా సూటూ, బూటు వేసుకున్నారు. 





మా నాటకంలో ప్రత్యేకత ఏమిటంటే నందమూరి తారకరామారావు గారి పాత్రలో ఉత్తేజ్, రేలంగి గారి పాత్రలో హరీష్ గారు తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుండి రావడం! నాటకం ఒక వారం ఉందనగా ఇద్దరూ డాలస్ చేరుకున్నారు. వీరిద్దరినీ కలిసినప్పటి నుండీ మా సరదాకి ఇక అంతులేదు. వీరు దిగిన పక్క రోజు అందరం కలిసి డైలాగులు ప్రాక్టీస్ చేసాము. భోజనం పూర్తి అవగానే భోరున వర్షం, పింగ్ పాంగ్ సైజులో వడగళ్ళ వర్షం డాలసుని ముంచెత్తింది. ఉత్తేజ్ గారి నాటక రంగం, సినీ రంగంలో ప్రావీణ్యం మనందరికీ తెలిసిందే! నాటకంలో మెలకువలన్నీ నేర్పిస్తూ పాత్రలకి ఊపిరి పోసారు. హరీష్ గారు కూడా రేలంగి పాత్రలో జీవిస్తూ మమ్మల్ని బాగా నవ్వించారు. ఉత్తేజ్ గారు ప్రతి నిముషం ఒక జోకు పేలుస్తూ మమ్మల్నందరినీ నవ్వించారు.





















కళ్యాణీ గారికి ఒక సీన్ గురించి చెప్తూ ఆయన నటించి చూపించారు. ఆ నటన చూసి మా అందరి కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.










నాటకం ముందు రోజు బావర్చి బాంకెట్ హాలులో ఉదయం నుండి సాయంత్రం వరకు నటించి అందరం ఇంటికి వెళ్ళి తొందరగా పడుకున్నాము. అందరి బట్టలు, పాత్రల సామగ్రి తీసుకుని హాలుకు చేరుకున్నాము. స్టేజి మీద ఒకసారి మళ్ళీ నాటకం ప్రాక్టీస్ చేసి మైకులు తగిలించుకున్నాము. నాటకానికి స్టేజి మీద ఏమేమి ఉండాలో చూసుకోవడానికి మాకొక చాకు లాంటి కుర్రాడు దొరికాడు. అవినాష్, అతని స్నేహితులు కలిసి ఏ సీన్ కి ఏమి ఉండాలో చూసుకుంటూ నాటకానికి రక్తి కట్టించారు. నా మేనకోడలు శ్వేత కూడా వాళ్ళకి సహాయం చేస్తూ ఒక చిన్న అతిథి పాత్రని కూడా పోషించేసింది.  వెంకట ఫణీంద్ర సుసర్ల గారు, బాల గనపవరపు గారు నాటకానికి సంగీతం ఏర్పాట్లు ఎంతో ఘనంగా నిర్వహించారు. మేకప్ రూములో రంగు పూసుకుంటూ ఆ కాలంలో నాటకాలు వేసేటపుడు వారి అనుభవం ఎలా ఉందో కాసేపు ఊహించుకున్నాము. 



 మా నాటకాన్ని మద్దుకూరి చంద్రహాస్ గారు ప్రేక్షకులకు చక్కగా పరిచయం చేస్తూ సరసిజ టీముని అభినందించారు. నాటకం జరుగుతున్నంతసేపూ ప్రేక్షకులు ఎంతో నిశ్శబ్దంగా చూస్తూ మమ్మల్నెంతో అభినందించారు. మా ఆహ్వానాన్ని స్వీకరించి మా నాటకాన్ని ఆద్యంతం తిలకించిన డాలసు నగరవాసులకు, స్నేహితులకు, బంధువులకు మళ్ళీ ఒకసారి వందనాలు తెలుపుకుంటున్నాను.




ఈ నాటకంలో నాకూ ఒక పాత్ర ఇచ్చినందుకు రాజేశ్వరి గారికి ధన్యవాదాలు. గత కొన్ని నెలలుగా అందరూ ఒక కుటుంబ సభ్యులులాగ మెలిగాము. నాకయితే నాటకం మొదలయిన రోజు నుండీ ప్రతి రోజూ ఒక కొత్త పాఠం నేర్చుకున్నట్లనిపించింది. మిస్సమ్మ నాటకం ఒక మధురానుభూతిని మిగిల్చింది. నాటకం పూర్తి అయ్యాక రాజేశ్వరి గారి కళ్ళలో ఆనందం కనిపించింది. ఈ నాటకాన్ని డాలసునుండే కాక బయటివారు కూడా అంతర్జాలంలో చూడడం జరిగింది. నాటకంలో పాల్గొన్న పాత్రల కుటుంబసభ్యులు తెలుగుదేశం నుండి చూసే అవకాశం కల్పించిన హమారా టీము సురేష్ కాజా గారికి ధన్యవాదాలు. విజయవాడ నుండి మా అక్క, చెన్నై నుండి అన్నయ్య, సూళ్ళూరుపేట నుండి స్నేహితుడు ఈ నాటకం చూసారు. నాటకాలని పోషించేవారుంటే మరిన్ని ప్రదర్శనలు మన ముందుకు వచ్చే అవకాశాలు లేకపోలేవనిపించింది. అమెరికాలో, భారతదేశంలో మళ్ళీ రంగస్థలం పుంజుకునే రోజులు రావచ్చేమో అని నాకు ఆశ కూడా కలిగింది.    


Monday, January 11, 2016

పెళ్ళి పుస్తకం - 1






జనవరి 11వ తేది అంటే నాకు ఒక చేదు జ్ఞాపకం. నిండుగా ఉన్న పెళ్ళి పుస్తకంలో ఇంకా పేజీలు ఉన్నా మోడయిన రోజు. పూర్ణ చంద్రుడిని రాహుకేతువులు గుటకాయస్వాహా చేసిన రోజు.


అపుడెపుడో చిన్నపుడు చదివిన మేర్లపాక మురళిగారి నవలలో లాగా "మచ్చల పాము అమాయకమైన లేత కప్పని ఆకలితో చప్పరించినలాంటి రోజు"! కాలకేయులు చూడ ముచ్చటగా ఉన్న మాహిష్మతి సామ్రాజ్యంపై దండెత్తినలాంటి రోజు. మళ్ళీ ఆ చేదు నిజం గుటక వేసే రోజు!


పసివాడి ప్రాణం సినిమాలో చిరంజీవి కొత్త వాళ్ళకి "మీకు నవంబర్ 18 ఏమి జరిగిందో తెలుసా?" అని అంటూ ఉంటాడు. జనవరి 11 అంటే నాకు అలాంటిది అనమాట!


ఏమిటో ఆరోజు ఆకాశం విరిగి కింద పడలేదు. భూమి బద్దలవుతుందనుకున్నా, కానీ అవలేదు. ప్రపంచమే ఆగిపోతుందనుకున్నా. అది కూడా జరగలేదు. ముందు రోజు బాంబు దాడులు జరిగినా ఏమీ పట్టనట్టు మళ్ళీ రైళ్ళెక్కి పని కోసం వెళ్ళిన ముంబై వాసులులాగా అందరూ ఎవరి పనిలో వాళ్ళున్నారు.


నిజమే! చట్టం తన పని చేసుకుపోతున్నట్టు కాలచక్రం కూడా తన దారిన దొర్లుకు పోతుంది.


కొత్త సంవత్సరం తెచ్చే ఆనందం కంటే మళ్ళీ 11వ తేది ఎదురవుతుందన్న ఆందోళన నాలో ఎక్కువ. ఆ జ్ఞాపకాలకి ఈసంవత్సరంతో పన్నెండేళ్ళు నిండాయి. అతడు సినిమాలో నాజర్ చనిపోయిన తన కొడుకు గురించి ఒక మాట అంటాడు. వాడు పోయి చాలా సంవత్సారాలయినా ఇంకా మర్చిపోలేదని " మర్చిపోవడానికి అదేమన్న చిన్న విషయమా? చెట్టంత జ్ఞాపకం" అని అంటాడు.


యాదే సినిమాలో ఒక మంచి పాట ఉంటుంది.


"మాటలు మర్చిపోతాము
జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు వస్తాయి
ఈ జ్ఞాపకాలు, ప్రియురాలు వెళ్ళిపోయాక
తిరిగి వస్తాయి!"


చివరగా మా సూళ్ళూరుపేటలో పుట్టిన మనసు కవి ఆత్రేయ గారి పాట కూడా ఒకసారి చూద్దాం.

పోయినోళ్ళందరూ మంచోళ్ళు...
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు!



మళ్ళీ కలిసేంతవరకూ ఈ విరహాన్ని భరించాల్సిందే...



Sunday, January 3, 2016

స్మోకీ పర్వతాలలో కలుసుకున్న వాకాడు కాలేజీ మిత్రులు

గత సంవత్సరం కాలేజీ రీయూనియన్ అపుడు మాకోసం రాసుకున్న జ్ఞాపకాలు. ఇపుడు మీకోసం కూడా...



సెప్టెంబరులో ఒక రోజు. అతడు సినిమా మాటీవీలో మొదలయ్యి అరగంట అయింది.

వచ్చే నెల అక్టోబరు 15 వారాంతంలో మాతోపాటూ నేదురుమల్లి ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకున్న స్నేహితులందరూ స్మోకీ పర్వతాలలో కలుద్దామని చాలా రోజుల నుండి అనుకుంటూ వచ్చాము. ఈ వారంలో ఆ ప్రయాణానికి ముందస్తుగా డాలాస్ నుండి బయలుదేరే మిత్రులతో కలిసి టిక్కెట్లు కొనుక్కుని తయారవుతున్నాను. అందరం కలుసుకున్నాక చాలా కబుర్లు చెప్పుకుందామని నిర్ణయించుకున్నాము. కాలేజీ అయిన తర్వాత అంటే 1994 తర్వాత అందరం ఎవరి దారి వారు చూసుకున్నాము. 1998 సంవత్సరంలో ఏ నెలో గుర్తు లేదు, ఒకసారి అందరం నయాగరా జలపాతం దగ్గర కలుసుకున్నాము. అప్పట్లో ఫేస్ బుక్కు, వాట్సాప్ లేవు కాబట్టి చాలా మంది మిత్రులతో చాలా సంవత్సరాల వరకు ఫోనులో సంబంధాలు నిలుపుకున్నాము. కానీ ఊరు మారడం, దానితో పాటూ టెలిఫోన్ నంబర్లు కూడా మారడం మా మధ్య దూరం పెంచింది. మళ్ళీ ఈ ఫేస్ బుక్కుల వల్ల, వాట్సాపుల వల్ల ఫోన్లు తెగ బీపుతున్నాయి. ప్రపంచం నలు మూలలా ఉన్న మిత్రులతో ఫోన్ ఇరవై నాలుగు గంటలూ కుయ్యి,కుయ్యిమంటూనే ఉంది. నెల ముందు నుండీ మా ప్రయాణం గురించి కబుర్లు, ఏర్పాట్లు చాలా చక్కగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరానికి మేము కాలేజీ చేరి పాతిక సంవత్సరాలయింది. నూనూగు మీసాలతో కలిసి చదువుకున్న మేమందరం నడివయస్సులోకి చేరుకున్నాము. అందరం నలభైలు దాటి జుట్టు నెరిసి, ఊడిన స్థితుల్లో ఉన్నాము.

ఇది వ్రాయడం మొదలుపెట్టి ఒక నెల దాటింది. ఇక్కడ నుండి కొత్తగా చదువుకోండి. ఇంక ఒక వారంలో అందరినీ కలవడం జరుగుతుంది.

అప్పట్లో మా కాలేజీకి మంచి పేరు ఉండేది, అంటే ఇపుడు లేదని కాదు. ఇపుడు చాలా కాలేజీలు వచ్చాయి, పేరుతో పెద్ద అవసరం లేదేమో! ఆ చిన్న పల్లెటూరిలో నాలుగు సంవత్సరాలు ఎలా గడిచాయో తలుచుకుంటేనే చాలా ఆశ్చర్యం వేసేది. మా ఊరు పక్కనే అయ్యేసరికి చాలా ఆదివారాలు ఇంటికి వెళ్ళిపోయేవాడిని. నేను కాలేజీ హాస్టలులో కాకుండా బయట ఉండేవాడిని. ప్రతి సంవత్సరం ఒక కొత్త రూములో తిరుగుతూ ఉండేవాడిని. కాలేజీల్లో నీరసంగా క్లాసులు, మెస్సుల్లో ఆయాసంగా భోజనాలు, రూముల్లో బ్రేకుల్లేకుండా బాతాఖానీలు, పక్కనే ఉన్న ఊరికి సైకిళ్ళమీద వెళ్ళి సినిమాలు చూడడం, వారాంతం ఇంటికి పోయి సూళ్ళూరుపేటలో సినిమాలు ఇలా చాలా సరదాగా జీవితం దొర్లిపోయింది. నాకు ఊహ రావడం మొదలు, చదువు మేఘాల్లో విహరిస్తూ ఉండేది.


అక్టోబరు 18, దెయ్యాలు ప్రేమించుకునే సమయం.

ముందు రాత్రి పడుకునేసరికి చాలా సమయం అయింది. ఉదయాన్నే ఎనిమిది గంటలకు విమానం. శ్యాము, ఫిరోజ్ తయారయ్యి నన్ను అయిదున్నర ప్రాంతంలో తీసుకుని వెళ్ళేటట్లుగా తీర్మానించాము.

ముందు రోజు రాత్రి ప్రవీణ్ ఫోన్ చేసి "మామా, నువ్వసలే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటావ్. ఉదయాన్నే లెయ్యగలవా?" అని ఆశ్చర్యాన్ని వెల్లిబుచ్చాడు.

ప్రవీణ్ కి ధైర్యం చెప్పానే కానీ నాలో కూడా ఆ అనుమానమే కొన్ని క్షణాలు వేసింది. పకడ్బందీగా అలారం పెట్టుకుని పన్నెండు గంటలకు పడుకున్నా. నా సామానంతా రెండు రోజులముందే సర్దేసాను. మా మోటార్ సైకిల్ ప్రయాణానికి వెళ్ళే ముందు ప్రయాణానికి కావలసిన సామాను ఎలా సర్దుకోవాలి అని చాల వీడియోలు చూసాను. రెండు చక్రాల మీద వెళ్ళేటపుడు వీలయిననత తక్కువ, చాలా తెలివిగా సర్దుకోవాలి. ఒక మూడుగంటలు బాగా పడుకున్నా. తరువాత ఇక నిద్ర రాలేదు. మా ఆవిడని బలవంతంగా లేపి కాఫీ పెట్టించి తాగి స్నానం చేసి బట్టలు వేసుకుని శ్యాముకి వాట్సపులో మెసేజ్ పెట్టాను. నాలుగున్నరకంతా నేను రెడీ. ఇంటి పక్కనే ఏటీఏం కి వెళ్ళి మా ఆవిడ అడిగిన డబ్బులు తీసుకుని కారులో పెట్రోలు కొట్టించి ఇంటి దగ్గర పెట్టా. ఈలోపు శ్యాము, ఫిరోజ్ ఇంటికి చేరుకున్నారు. నా లగేజ్ ఫిరోజ్ కారులో పెట్టి నేను వెనక సీటులో కూర్చున్నా. మెరుపువేగంతో బండిని నడిపి అనుకున్న సమయం కంటే ముందే మమ్మల్ని ఏర్పోర్ట్ తీసుకువచ్చేసాడు. ఇతని వేగం చూసి నేను వేసుకున్న రెండు, మూడు సీటు బెల్టులు విప్పి అపుడే వచ్చిన షటిల్ ఎక్కాము. షటిలులో కూర్చుని ఒక ఫోటో తీసుకుని వాట్సాపులో పోస్ట్ చేసాము. ఫిరోజ్ ప్రతి వారం ఏర్పోర్ట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు కాబట్టి మమ్మల్ని ఎక్స్ ప్రెస్ పార్కింగ్ కి తీసుకురావడం, అక్కడే ఉన్న షటిల్ ఎక్కి టెర్మినల్ చేరుకోవడం నిముషాలలో జరిగిపోయాయి. అంతకు ముందే చెక్-ఇన్ అవడం వలన నేరుగా సెక్యూరిటీలోకి వెళ్ళిపోయి విమానం ఎక్కేసాము. మేము ముగ్గురం చదువుకునే రోజుల్లో విద్యానగర్ హాస్టలులో కాకుండా సెంటరులో ఉండేవాళ్ళం. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ఇలా కలిసి ప్రయాణించి మిగతా మిత్రులని కలుస్తామని కలలో కూడా అనుకోలేదు. ఇదే మాట శ్యాము తరువాత రెండు రోజుల్లో చాలా సార్లు అన్నాడు. విమానంలో కూడా ఇంకొక సెల్ఫీ తీసుకుని మా గ్రూపులో పెట్టేసి పడుకుందామని కాసేపు కళ్ళు మూసుకున్నాం. నేను ఉదయం కొంత సమయం ఉండి సీరియల్ తిన్నాను. శ్యాము కాఫీ తాగాలన్నాడు, ఫిరోజ్ మాత్రం అప్పటికే నిద్రలోకి వెళ్ళాడు. మేమిద్దరం కాఫీ తాగి కాసేపు పడుకున్నాము. అట్లాంటా మాకు తూర్పులో ఉంటుంది, మాకంటే అక్కడ కాలం ఒక గంట ఎక్కువ. మాకు కాలం కలిసి వచ్చి రెండు గంటలలోపే అట్లాంటా చేరుకున్నాము. 

నాకు డెట్రాయిట్ లో స్నేహితుడు కళ్యాణ్ ఇపుడు అట్లాంటాలో ఉన్నాడు. అతనికి నేను వస్తున్నానని చెప్పాను. కళ్యాణ్ మాతో పాటూ ఫోర్డ్ లో పని చేసాడు. తరువాత భారతదేశం వెళ్ళడం జరిగింది. నేను 2010 లో చెన్నై వెళ్ళినపుడు ఇద్దరం చెన్నైలో, సూళ్ళూరుపేటలో కలిసి తిరిగాము. ఈమధ్యే మళ్ళీ అమెరికా వచ్చాడు, వచ్చాక ఇపుడే కలుసుకోవడం. ప్రవీణ్, గురునాధం ఫీనిక్స్ నుండి వచ్చి మమ్మల్ని తీసుకుని స్మోకీస్ వెళ్తాడు, అదీ మా పధకం! నేను అట్లాంటా దిగగానే కళ్యాణ్ కి మెసేజ్ చేసాను. అట్లాంటా ఏర్ పోర్టు నాకంటే నాలుగు ఇంచెలు పొడుగు. మా టెర్మినల్ దిగి రైలు ఎక్కి పది నిముషాలు ప్రయాణించాక నేల కనిపించింది. కాసేపయ్యాక కళ్యాణ్ కూడా చేరుకున్నాడు. మా ముగ్గురి సామాను కళ్యాణ్ కారులో పెట్టి ఏర్ పోర్ట్ బయటపడదామనుకున్నాం. అప్పటికి పదకొండు అయింది, కొంచెం ఎంగిలి పడదామని జీపీఎస్ లో మెక్సికన్ రెస్టారెంటు బయలుదేరాము. ఇక్కడ ఒక తమాషా జరిగింది. జీపీఎస్ మమ్మల్ని మళ్ళీ ఏర్ పోర్టు వైపుకి తీసుకువచ్చింది. ఆ రెస్టారెంట్ ఏర్ పోర్టు లోపల ఉంది. ఈ కామెడీ తట్టుకోలేక ఈసారి జాగ్రత్తగా ఒక చైనీస్ హోటల్ వైపు బయలుదేరాము. అక్కడకి చేరుకున్నాక అది నచ్చక పక్కనే ఉన్న లా ఫియస్టా అనే హోటల్ చేరుకున్నాము. 


 అట్లాంటాలో వాతావరణం చాలా బాగుంది. మా ఊరి కంటే కొంచెం చల్లగా ఉంది. అందరం హోటల్ పాటుయోలో కూర్చుని ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. ఈలోపల దేవ్ నాధ్ ఫ్లోరిడా నుండి దిగాడు. మేము ఏర్ పోర్ట్ పక్కనే ఉన్నాము, మా దగ్గరకి రా అని చెప్పాము. అతనికి కారు లేకపోయేసరికి నేను, కళ్యాణ్ వెళ్ళి పది నిముషాలలో తిరిగి వచ్చాము.  కాలేజీ తర్వాత దేవాని కలుసుకోవడం ఇదే మొదలు, ఫేస్ బుక్కులో ఫోటోలు మాత్రం చూస్తూ ఉండే వాళ్ళం. అందరం కలిసి కబుర్లతో కడుపు నింపుకుంటూ మధ్యమధ్యలో చికెన్ ఫహీటాలు నంజుకున్నాము.ఈలోపల ప్రవీణ్, గుర్నాధం అట్లాంటాకి వచ్చారు. ఇక్కడ ఇంకొక తమాషా జరిగింది. ప్రవీణ్ కారు తీసుకుని మేమున్న రెస్టారెంటు వైపు వస్తూ ఉన్నాడు. నాకు ఫోన్ చేసి మేము దగ్గరలోనే ఉన్నాము అని చెప్పాడు. నేను వాళ్ళకి పక్కనే ఉన్న చైనీస్ హోటల్ అడ్రెస్ ఇచ్చాను. అక్కడ నుండి కొన్ని అడుగులు వేస్తే మా హోటలు. నేను ఫోనులో ఈ విషయం చెప్తూ ఉన్నాను. ప్రవీణ్ ఇంకాసేపట్లో మీ దగ్గరకి వస్తూ ఉన్నాను అని చెప్పాడు. రోడ్ చూస్తూ మాట్లాడుతున్న నేను ప్రవీణ్ కి కనిపించాను అన్నాడు. నాకు ప్రవీణ్ కారు ఇంకా కనపడలేదు. రోడ్ మీద వెళ్ళే కార్లన్నింటికీ నేను చేయి ఊపుతూ నిలుచున్నా. కొంత మంది నాకు చేతులు ఊపారు కూడా. ఈలోపల ప్రవీణ్ వేరే వైపు నుండి వచ్చాడు. గురునాధం ని కాలేజీ అయినతర్వాత ఇదే చూడడం. ప్రవీణ్ ని ఒకసారి నేను చెన్నై నుండి సూళ్ళూరుపేట వచ్చేటపుడు కలిసాను. మళ్ళీ కబుర్లు దొర్లాయి. మరి కాసేపయ్యాక మాధవ్ రెడ్డి డాలస్ నుండి దిగాడు, అతను కూడా లా ఫియెస్టా కి చేరుకున్నాడు. మాధవ్ కూడా మా ఊరి నుండే వచ్చాడు, కాలేజీ రోజుల్లో ఇతను హాస్టలులో ఉండేవాడు, మాకు ముఖ పరిచయం మాత్రమే. కాసేపు మాట్లాడుకుని అందరం చీకటి పడక ముందే స్మొకీస్ చేరుకోవాలని కళ్యాణ్ దగ్గరనుండి సెలవు తీసుకుని అట్లాంటా నుండి బయట పడ్డాము.


దేవ, మాధవ్ ఒక కారులో, నేను, ప్రవీణ్, శ్యాము, ఫిరోజ్, గురునాధం ఒక కారులో. సమయం నాలుగు దాటింది. ఆఫీసునుండి ఇంటికి వెళ్ళే వాళ్ళతో అట్లాంటా బిజీగా ఉంది. మాకు ఊరు దాటడానికి రెండు గంటల పైనే పట్టింది. మా కారుని ప్రవీణ్ నడుపుతున్నాడు, శ్యాము పక్కనే కూర్చుని దారి చెపుతున్నాడు. వీళ్ళిద్దరూ ఎమ్మెస్ రెడ్డి బిల్డింగులో ఉండేవాళ్ళు. వాళ్ళు కబుర్లలో పడి రోడ్ కూడా పట్టించుకోవడం మానేసారు. అసలే బిజీగా ఉన్న రోడ్డులో దారి తప్పి మళ్ళీ సరైన రోడ్ మీదకు వచ్చాము. మా వెనకాల మాధవ్ రెడ్డి, దేవ వస్తున్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కుందామని శ్యాం వాళ్ళకి కాల్ చేసాడు. వాళ్ళు మా వెనక కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నారు. అప్పటికే అందరూ అలిసిపోవడం వలన దారిలో స్టార్ బక్స్ కనిపిస్తే ఆగి కాఫీ తాగుదామని అనుకున్నాము. కాసేపయ్యాక మాకు స్టార్ బక్స్ కనిపించి ఆగాము. మేము దిగిన కాసేపటికి దేవ వాళ్ళు కూడా వచ్చారు. అందరం కలిసి కాసేపు కాఫీ తాగి రిలాక్స్ అయ్యాము. చీకటి పడే లోగా స్మోకీస్ చేరుకోవాలని బయలుదేరాము. 

అట్లాంటా నుండి దారి కొండ ప్రాంతం లాగా ఉంది. కాసేపయ్యాక మాకు ఫాల్ కలర్స్ కూడా కనపడడం మొదలుపెట్టింది. కారులో గురునాధం జోకులు ఆగకుండా పేలుతున్నాయి. దారిపొడుగునా ప్రకృతి సౌందర్యం చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ స్మోకీ పర్వతాలలోకి ప్రవేశించాము. జీపీఎస్ లో రోడ్ వంకరలు చూస్తుంటే మాకు మతి పోతుంది. శ్యాం అయితే కేకలు పెడుతూ ఉన్నాడు. ప్రవీణ్ కేకలు పట్టించుకోకుండా అంత పెద్ద ఎస్యూవీని అదిలిస్తూ తోలుతున్నాడు. మా కారునే కాక ముందు వారిని కూడా బెదరకొడుతున్నాడు. మా ముందు ఎవరో ముసలాయన అనుకుంటా, అతని ట్రక్కుని నెమ్మదిగా పోనిస్తూ ఉన్నాడు. ప్రవీణ్ అతని కారుకి బాగా దగ్గరగా పోనివ్వడం చూసి అతను రెండు, మూడు సార్లు హారన్ కూడా కొట్టాడు. మా అందరి ప్రార్ధనలు విని ప్రవీణ్ అతని ట్రక్కుని వెంబడించడం మానేసాడు. చీకటి పడ్డాక స్మోకీస్ చేరుకున్నాము. ఇక్కడ నుండి మేను ఉండబోయే ప్రదేశానికి జీపీఎస్ పని చేయదు. సెల్ ఫోన్లకి సిగ్నల్ లేదు. నేను ముందు జాగ్రత్తగా గూగుల్ మాప్ ప్రింట్ చేసి తీసుకువచ్చా. ఈలోపల నా ఫోనులో కొంత సిగ్నల్ వచ్చి గూగుల్ మాపు ఆధారంగా బయలుదేరాము. చాలా మలుపులు చీకటిలో కనపడడం లేదు. రెండు, మూడు సార్లు ముందు, వెనక్కి వచ్చి చివరికి సరైన దారిలో పడ్డాము. రోడ్ మీదకి కారు నిట్టనిలువుగా ఎక్కుతుంది. ముందు ఏముందో కనపడడం లేదు. ప్రవీణ్ కి ఏమీ కనపడడం లేదు, శ్యాం మాత్రం నేను చెపుతున్నాను కదా, వెళ్ళు అని అంటున్నాడు. అలా వెళ్ళాక మేముండబోయే ఇల్లు కనిపించింది. అంతకుముందే వాట్స్ ఆపులో ఇల్లు ఫోటోలు చూసి ఉన్నాము కాబట్టి నేరుగా లోపలకి వెళ్ళాము. 

94లో కాలేజీ వదిలిన తర్వాత మళ్ళీ ఇపుడే చాలామందిని చూడడం. అందరినీ పలకరిస్తూ తింటూ, తాగుతూ శుక్రవారం రాత్రి చాలా ఉత్సాహంగా జరిగింది. నార్త్ కారోలీనా నుండి పురుషోత్తం చౌదరీ, నరేందర్ రెడ్డి, రఘురామి రెడ్డి, సంజీవ రెడ్డి వచ్చారు. న్యూజెర్సీ నుండి శ్రీనివాస్ పిట్టల, సుధీర్, శ్రీనివాస్ వచ్చారు. ఫిలడెల్ఫియా నుండి బాలాజీ, సత్య గణేష్, ప్రవీణ్, కృష్ణ వచ్చారు. ఎలెక్ట్రానిక్స్ లోని ప్రవీణ్ ని ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. చికాగో నుండి గణేష్, సురేష్ వచ్చారు. వాషింగ్టన్ డీసీ నుండి జితేంద్ర ఒక్కడే వచ్చాడు. రమేష్ కుమార్, జగన్ రెడ్డి, వల్లభ్, వర్మ, సీవీ రాజు, రంగయ్య విమానంలో చేరుకున్నారు. రవి చేజర్ల వల్లభ్ అని అట్లాంటా నుండి తీసుకువచ్చాడు. వీరయ్య చౌదరీ ఈ కార్యక్రమానికి భారతదేశం నుండి వచ్చాడు. కులదీప్ అట్లాంటా నుండి వర్మ, సీవీ రాజు, రంగయ్య, వీరయ్య చౌదరీ, జగన్ రెడ్డిని తీసుకువచ్చాడు. డెట్రాయిట్ నుండి ప్రభాకర్ రెడ్డి, పెంచల్ ప్రసాద్, రాజశేఖర్ కళ్ళెం, సుధాకర్, సుధీర్ కలిసి వచ్చారు. మేము అయిదు మంది, దేవా, మాధవులతో కలిపి మొత్తం ముప్పై ఏడు మందిమి అయ్యాము. ఉడిపి నుండి ఇద్దరితో ముప్పై తొమ్మిది మందిమి. అందరం కలిసిఉండడానికి ఎనిమిది బెడ్ రూములున్న ఒక ఇంటిని మూడు రోజులు రెంట్ చేసారు. ఒక్కొక్క గదిలో నలుగురు ఉండేలా, మిగిలిన వాళ్ళు సోఫాలలో సర్దుకునేలా ఏర్పాట్లు జరిగాయి. నార్త్ కారొలీనా కి చెందిన ఉడిపి హోటలు నుండి వంటవాడు వచ్చి మాకందరికీ నోరూరించేలా వంట చేసాడు. పలకరింపులు, పులకరింపులు, నోరూరించే వంటకాలు, ఉర్రూతలూగించే ద్రవాలు మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసాయి. నిన్న రాత్రి కూడా సరిగా నిద్ర పోవకపోడంతో మాకు కేటాయించిన రూములో తొందరగానే పడుకున్నా.

అక్టోబరు 19, స్నేహితుల రోజు!
ఉదయం ఆరుకంతా శ్యాము, ఫిరోజ్ నిద్ర లేచారు. నాకు హాంగ్ ఓవరుతో నిద్ర లేక కాసేపు అలాగే దొర్లుతూ కూర్చున్నా. 

నన్ను గమనించి గణేష్ "మాత్ర వేసుకుంటావా" అన్నాడు.

"అలాగే" అన్నాను.

బాలాజీ నాకు రెండు మాత్రలు ఇచ్చి "తిని వేసుకో" అన్నాడు.

ఉదయాన్నే ఉడిపి వారు దోసలు వెయ్యడం మొదలుపెట్టినపుడు నేను రెండు తినేసాను. కాఫీ కూడా తాగి రెండు మాత్రలు వేసుకున్నాక హాంగ్ ఓవర్ తగ్గడం మొదలయింది. బాత్ రూము కోసం అందరూ హాడావిడిగా తిరుగుతూ ఉన్నారు. నాకు అవకాశం దొరకగానే అన్నీ ముగించుకున్నాను. నిన్న రాత్రి మేము పడుకున్నాక ఒక చిన్న ఎలుగుబంటి వచ్చిందట, అది బయట పడి ఉన్న ట్రాష్ లోని బిరియానీ తినేసిందట. మళ్ళీ ఉదయం కూడా బిరియానీ కోసం వచ్చింది. ఈసారి అందరూ నిదానంగా దాని ఫోటోలు తీసుకున్నారు.

నా హాంగ్ ఓవర్ పూర్తిగా తగ్గిందా అని బాలాజీ తమాషాగా ఇలా అన్నాడు "నిన్నటి మందుకి నేనిచ్చిన మందు పని చేసిందా?".

నాకు మొదట అర్ధం కాలేదు. మళ్ళీ ఇంకోసారి చెప్పేసరికి ట్యూబ్ లైటు వెలిగింది.

"బాగా పని చేసింది" అని చెప్పాను.

అందరి స్నానాలు, టిఫిన్లు అయ్యాక బయట చూసే ప్రదేశాలు ఏమున్నాయి అని గణేష్, నేను, బాలాజీ, పెంచల్, జగన్, ఫిరోజ్ కలిసి ఊరి మీదకు వెళ్ళాము. స్మోకీస్ కి వచ్చిన టూరిస్టులతో ఊరంతా చాలా సందడిగా ఉంది. విజిటర్స్ ప్లేస్ కి వెళ్ళి మేము చూడవలసిన వాటి గురించి వివరాలు కనుక్కుని, మాపులు తీసుకుని ఇంటికి తిరిగివచ్చాము. మా కోసం వేచి చూస్తున్న వారందరికీ ఈ విషయం చెప్పాము. కొంత మంది అపుడే కొండ కిందకు నడుచుకుంటూ వెళ్ళి తిరిగి వచ్చారు. కొంతమంది షటిల్ ఆడుతూ ఉన్నారు. పురుష్ మాకు ప్రతి గంటకు ఒక కొత్త రకం స్వీట్ తీసుకువచ్చి తినిపిస్తూ ఉన్నాడు. అప్పటికి సమయం 11 దాటి ఉంటుంది. మధ్యాహ్నం బోజనం చేసి అందరం బయటకు వెళ్దామని అనుకున్నాము. అప్పటివరకు ఏమి చెయ్యాలి అని అలోచిస్తున్న సమయంలో నేను ఒక కథ చదువుతాను అని చెప్పాను. అందరూ బుద్దిగా హాలులో కూర్చుని నేను చదివిన, చెప్పిన సీజన్ బాయ్ కథ విన్నారు.  కథ పూర్తి అయేలోపల భోజనాలు కూడా పూర్తి అయ్యాయి. అందరూ పొట్ట నిండా తిని ఇక బయటకు వెళ్దామని తీర్మానించుకున్నారు. వాషింగ్టన్ డీసీ నుండి శ్రీనివాస్ రేగేటి అక్కడకు చేరుకున్నాడు. రేగేటి వాషింగ్టన్ వైపు చాలా ప్రముఖ చాయాగ్రహుడు కూడా. మాకందరికీ స్మోకీస్ లోని ఫాల్స్ లో మంచి ఫోటో తీస్తానని చెప్పాడు. ఈలోపల ఎలెక్ట్రానిక్స్, ఎలెక్ట్రికల్, మెకానిచల్, సివిల్ బాచ్ విడివిడిగా ఫోటోలు తీసుకున్నారు. ఎలెక్ట్రానిక్స్ నుండి ఎక్కువ మంది ఉండడం విశేషం. తరువాత ఎలెక్ట్రికల్, మెక్ చివరలో సివిల్.

అంతకు ముందే అనుకున్నట్టు లారెల్ ఫాల్స్ కి అందరం బయలుదేరాము. ఈసారి కారులో మా అయిదు మందితో పాటూ రమేష్ కూడా ఎక్కాడు. మాకు దారి తెలియదు, మా ముందు టాల్ (రాజశేఖర్) కారు ఉంది, అతన్ని అనుసరిద్దామని అతని వెనక బయలుదేరాము. కొంచెం దూరం వెళ్ళగానే టాల్ మాకు దూరమయ్యాడు. మేము దారి తప్పి ఎక్కడకో వెళ్ళిపోయాము, వెనక్కి రావడానికి గంట పైనే పట్టింది. మళ్ళీ ఇంకోసారి దారి తప్పాము, మళ్ళీ ఇంకో గంట పైన పట్టింది వెనక్కి తిరిగి రావడానికి. ఈసారి విజిటర్ సెంటర్ కి వెళ్ళి అడ్రెస్ తీసుకుని బయలుదేరాము. తమాషాగా అది చాలా దగ్గరలోనే ఉంది. కారు పార్క్ చేసి ఫాల్స్ వైపు బయలుదేరాము. ఫాల్స్ కి చేరుకోవడానికి 1.4 మైళ్ళు నడవాలని అక్కడ చెప్పారు. కొండ పైకి కూడా ఎక్కాలి, మేము అనుకున్నట్ట్లు అది 1.4 మైళ్ళు కాకపోవచ్చు, ఇంకా ఎక్కువే ఉంటుందని అందరం నడవడం మొదలుపెట్టాము. రమేష్ కుమార్ అందరికంటే వెనక రావడం మొదలుపెట్టాడు. నేను, ప్రవీణ్ అతనికి తోడుగా వస్తున్నాము. అంతకుముందే పొట్ట నిండా తినడం వళ్ళ నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉన్నాము. మాకు ఎదురుగా ఫాల్స్ నుండి తిరిగివస్తున్న వాళ్ళకి హలో చెపుతూ నడుస్తున్నాము. అపుడు ఇంకో తమాషా జరిగింది.

ప్రవీణ్ మాతో "ఇప్పటివరకు అందరూ కనపడుతున్నారు కానీ మనవాళ్ళు ఎక్కడా కనపడడం లేదు" అన్నాడు.

అంతే, అప్పటినుండి మనవాళ్ళే కనపడడం మొదలుపెట్టారు, వేరే వాళ్ళు కనపడడానికి పది నిముషాలపైనే పట్టింది. అప్పటివరకు కనపడని దేశీలు కుప్పలుగా కనపడ్డారు. ప్రవీణ్ నోటి మాట ఎంత శక్తివంతమైనదో మాకు అపుడు అర్థమయింది. ఇంటి నుండి బయలుదేరేముందు మా కాలేజీ రీయూనియన్ గుర్తు ఉండేటట్లు నరేందర్ అందరికీ చేపించిన టీ షర్టులు వేసుకున్నాము. ఫాల్స్ కి అందరూ ఆ చొక్కాలు వేసుకుని వెళ్ళాము.

మా ముందుగా వచ్చేవారిని "మాలాంటి చొక్కాలు మీకు ఫాల్సులో కనిపించాయా?" అని అడిగాము.

వాళ్ళు తలఊపి "చాలామంది ఉన్నారు" అన్నారు.

దానితో మాకు ఇంకొంచెం ఆనందం వేసి ఫాల్స్ చేరుకోగానే మా కాలేజీ మూక అక్కడ ఫోటోలు తీసుకుంటూ అల్లరి చేస్తూ ఉన్నారు. మేము కూడా వారిని చేరుకుని గ్రూప్ ఫోటో తీసుకున్నాము. రేగేటి అక్కడకి తన కమెరాతో వచ్చి అందరికీ గుర్తుండిపోయేలా ఒక్కొక్కరికి ఓపికగా ఫోటోస్ తీసాడు. అందరికీ ఫేస్ బుక్ ప్రొఫైల్స్ కి ఫోటోస్ దొరికాయి అని పెంచల్ ప్రసాద్ జోక్ చేసాడు. రేగేటి తర్వాత జితేంద్ర కూడా అందరికీ ఫోటోస్ తీయడం మొదలుపెట్టాడు. టాల్ ఒక చెట్టుని ఎత్తుతున్నట్టు ఫోటో తీసుకున్నాడు. దాన్ని రాజమౌళికి పంపితే బాహుబలి-3 తీస్తాడు అని వల్లభ్ జోక్ వేసాడు. చీకటి పడుతుండడంతో వెనక్కి రావడం మొదలుపెట్టాము.

మేము ఫాల్స్ వైపు వచ్చేటపుడు ఒకచోట ఒక ఫోటోగ్రాఫర్ కెమెరా సెటప్ చేసి ఎదురుచూస్తూ ఉన్నాడు. మేము తిరిగివచ్చేటపుడు అతను ఫోటోస్ తీస్తూ కనిపించాడు. అతనికి ఎదురుగా రెండు పెద్ద కొండలు, వాటి మధ్యలో అస్తమించబోయే సూర్యుడు చాలా అద్భుతంగా కనిపించాడు.తిరిగివచ్చేటపుడు అందరూ తొందరగా దిగుతూ ఉన్నారు. నేనూ, ప్రవీణ్ మాట్లాడుకుంటూ వస్తున్నాము. ప్రవీణ్ తనకు ఫీనిక్స్ లో పరిచయమైన జంటల గురించి చెప్పాడు. చాలా వింతగా అనిపించింది. మన చుట్టూ ఎంతమంది విచిత్రమైన మనుషులు ఉంటున్నారో అని ఇద్దరం ఆశ్చర్యపడ్డాము. మా వెనక వస్తున్న శ్యాముకి మా మాటలు అర్థం కావడంలేదు. మేము చెప్పినా అతనికి అర్థం కాదని ఇద్దరం నవ్వుకున్నాము. అందరం పార్కింగ్ కి చేరుకుని ఎవరి కార్లలో వాళ్ళు ఎక్కి ఇంటికి చేరుకున్నాము.

ఫాల్సులో బాగా తిరగడం వలన అందరూ అలిసిపోయి కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. మాకోసం చేసిన మిరపకాయ బజ్జీలు, వడ, సాంబార్ తిని అందరూ శాంతించారు. పుల్లారెడ్డి హల్వా కూడా ఆరగించాము. ఇపుడే ఆసక్తికరమైన కార్యక్రమం ఒకటి మొదలైంది.

"మనందరం కాలేజీ వదిలిన రోజు నుడి ఇప్పటివరకు ఏమి చేసామో అందరికీ ఒకసారి చెప్పాలి" అని టాల్ అన్నాడు. అందరూ అర్థం కాని మొహం పెట్టడంతో టాల్ ముందు తనే చెప్పడం మొదలు పెట్టాడు. కాలేజీ అయిపొయ్యాక ఎలా ఎం.టెక్ చెయ్యడం, జాబులో చేరడం, అమెరికా రావడం చెప్పాడు. ఇలా అందరూ వాళ్ళ గురించి చెప్పుకోవడం మాకందరికీ బాగా నచ్చింది. ఒక్కొక్కరు వారి జీవితాల్లో ఎలా సెటిల్ అయ్యారో, దానికి ఎవరు సహాయ పడ్డారో చెపుతూ వచ్చారు. చాలామంది బట్టే, బద్రి, ప్రభాకర్, పురుష్ సహాయపడ్డారు అని చెప్పారు. ప్రతి ఒక్కరి కథ చాలా బాగా అనిపించింది. వారి, వారి కథలో వాళ్ళే హీరోలు! అందరూ చాలా కష్టపడి పైకొచ్చారని తెలిసి అందరికీ చాలా ఆనందమేసింది."మన బాచులో మనతో పాటూ 235 మంది చదువుకున్నారు. వారిలో నలభై మంది మాత్రమే ఈరోజు ఇక్కడ కలిసాము. మిగతా వారు ఎలా ఉన్నారు? వారిలో ఎంతమందికి సహాయం అవసరమో తెలుసుకోవాలని" గణేష్ అన్నాడు. అందరికీ గణేష్ చెప్పిన మాట బాగా అనిపించింది. తమ బాచ్ వారు ఎలా ఉన్నారో ఒకసారి కనుక్కుని వారికి సహాయం అవసరమైతే చెయ్యాలని అనుకున్నాము. మాతో పాటూ చదివి మమ్మల్ని వదిలి పైలోకాలకు వెళ్ళిన స్నేహితులని తలుచుకున్నాము. వెంకటేశ్వర్లు కుటుంబానికి సహాయం చెయ్యాలని కూడా అనుకున్నాము.  ఇప్పటివరకు అందరూ కలిసే ఉన్నాము. ఇక మీదట కూడా కలిసే ఉండాలని బట్టే అన్నాడు. చివరగా అందరం కలిసే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఫిరోజ్, జితేంద్రని అందరూ పొగిడారు.

చివరగా షాంపేన్ పార్టీ జరిగింది. ఎవరికీ ఇంటికి వెళ్ళాలని లేకపోయినా వెళ్ళాలి కాబట్టి బయలుదేరుతున్నారు. నాలుగు షాంపేన్ బాటిల్స్ ని ఓపన్ చేసి అందరూ ప్రసాదంలా తాగారు.

"షాంపేన్ ఎవరి మీదా పొయ్యద్దు" అని బట్టే చెప్పాడు.

కానీ ప్రభాకర్ అందరి మీద పోసి రచ్చ చేసాడు. చల్లగాలిలో ఇంకా చల్లగా షాంపేన్ పడడం సరదాగా అనిపించింది. అప్పటికే అర్థరాత్రి దాటి కొన్ని గంటలయింది. ఉదయాన్నే వెళ్ళేవారికి ఆరాత్రే టాటాలు చెప్పి మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉండాలని అందరం అనుకున్నాము. మేము ఆదివారం సాయంత్రం అట్లాంటా నుండి విమానం ఎక్కాలి, అంటే స్మోకీస్ నుండి మేము ఉదయం తొందరగానే బయలుదేరాలని అప్పటికప్పుడు పడుకున్నాము.

అక్టోబరు 19, టాటా...బై..బై...

ఉదయాన్నే లేచేసరికి చాలా మంది బయలుదేరి వెళ్ళిపోయారు. సియటిల్ వెళ్ళాల్సిన జగన్ మాతోపాటూ అట్లాంటాకి వస్తానన్నాడు. మా వాళ్ళందరూ నిద్ర లేచి స్నానాలు పూర్తి చేసుకున్నాము. ఉడిపి వారి టిఫిన్లు కూడా తయారయ్యాయి. కాఫీలు, టిఫిన్లు తిని లగేజీ సర్దుకుని కారులో పెట్టుకున్నాము. డూరం డ్రైవ్ చేసే వాళ్ళు కూడా బయలుదేరారు. ఉడిపి వాళ్ళు కూడా వంట సామాను మొత్తం వారి వానులోకి ఎక్కించారు. మళ్ళీ ఫోటోల కార్యక్రమం మొదలయింది.

ఎవరికీ ఇంటికి వెళ్ళాలని లేకపోయినా వెళ్ళాకి కాబట్టి బయలుదేరుతున్నారు.

"లేటు అయ్యేకొద్దీ ట్రాఫిక్ కూడా పెరుగుతుంది, పదండి, పదండి" అని కులదీప్ అందరినీ కదిలించాడు.

అందరికీ చివరి సారిగా టాటా చెప్పి ఆరుమందిమి అట్లాంటా వైపు కదిలాము. కారు రోడ్ మీద పడడంతో మా కబుర్లు మళ్ళీ మొదలయ్యాయి. ప్రవీణ్ ప్రస్తుతం ఫీనిక్సులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని తెలిసి శ్యాం అతన్ని ప్రశ్నలు వెయ్యడం మొదలుపెట్టాడు. డాలసులో కూడా ఇలాంటి వ్యాపారం చెయ్యమని ప్రవీణ్ ని ప్రోత్సహించాము. మాటల్లో గురునాధం కుటుంబం శ్రీకాళహస్తికి పక్కనే ఉంటారని తెలిసింది. గురునాధం వాళ్ళ ఊరులో పిల్లలని చదువులో ప్రోత్సహించడం గురించి చెప్పాడు. మంచి పని చేస్తున్నందుకు అతన్ని అభినందించాము. డాలసులో శ్యాం, నేను, ఫిరోజ్, మంజునాధ్ ఎలా కలిసిన విషయం అందరికీ చెప్పాము. కాలేజీ అయిపోయి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా కలిసుతామని ఎపుడూ అనుకోలేదు అని శ్యాం అన్నాడు. ఇదే విషయాన్ని అతను చాలా సార్లు చెప్పాడు. మాకూ అలాగే అనిపించింది.  స్మోకీస్ కొండ దిగేముందు ఆ కొండలో ఎత్తైన ప్రదేశానికి వెళ్దామని ఫిరొజ్ చెప్పగా ప్రవీణ్ కారుని అటు కదిలించాడు. ఒక పది మైళ్ళు లోపలకి వెళ్ళగానే చాలా మంది పార్కింగ్ కోసం తిరుగుతూ కనిపించారు. మేము ముందే దిగేసి కొన్ని ఫోటోలు దిగాము. ఆ ప్రదేశం నుండి చూస్తే చాలా కొండలు కనిపించాయిల్. వాటి పైన రంగులు మారుతున్న ఆకులు, చాలా అద్భుతంగా ఉంది ఆ దృశ్యం. కొండ పైన ప్రాంతం కాబట్టీ బాగా చలిగా కూడా ఉంది. తొందరగానే ఈ కార్యక్రమం ముగించి మళ్ళీ రోడ్డెక్కాము. స్మోకీస్ దిగిన కాసేపటికి అందరం చిన్న బ్రేక్ తీసుకున్నాము. పెట్రోల్ కొట్టించి కాఫీలు తాగి బాత్ రూం వెళ్ళి వచ్చాము. ఈ ప్రాంతంలో వేరుశనగలు ఉడకబెట్టి అమ్ముతారట. ఆ గాస్ స్టేషనులో పల్లీలు ఖాళీగా ఉన్నాయి. జగన్ అందరికీ కొన్ని కాల్చిన చనక్కాయలు కొనిచ్చాడు. వాటిని తింటూ కబుర్లు మాట్లాడుతూ అట్లాంటా చేరుకున్నాము. 

ముందు జగన్ ని దించి మేము కారులో మరి కొంత గాస్ కొట్టించి కారు రిటర్న్ చేసాము. అక్కడ నుండి ట్రైన్ ఎక్కి ఏర్ పోర్ట్ చేరుకున్నాము. ఈసారి మేము కారులో వచ్చేటపుడు ఆన్ లైనులో చెక్ ఇన్ చేసాము, అందరి దగ్గర ఈమెయిలు ఉంది కానీ ప్రింట్ ఔట్ లేదు. సెక్యూరిటీ వాడు మమ్మల్ని ప్రింట్ ఔట్ తీసుకురమ్మన్నాడు. మేము మళ్ళీ మా ఏర్లైన్స్ దగ్గరకి వెళ్ళి ప్రింట్ ఔట్ తెచ్చుకున్నాము. ఆదివారం సాయంత్రం కాబట్టి ఏర్ పోర్ట్ బాగా హడావిడిగా ఉంది. మేము ప్రింట్ ఔట్ తెచ్చేలోపల గురునాధం, ప్రవీణ్ ముందు వెళ్ళిపోయారు. నేను, శ్యాం, ఫిరోజ్ వెనక చేరాము. ఫిరోజ్ వెనక మేము క్యూలో వస్తూ ఉన్నాము. ఒకచోట ఫిరోజ్ ఇంకో లైనులో వెళ్ళిపోయాడు. నేను, శ్యాం ఇంకో లైనులో వస్తున్నాము. ఈలోపల శ్యాం కి ప్రవీణ్ ఫోన్ చేసాడు. ఇద్దరూ నవ్వుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు.

*** ఇక్కడ జరిగిన విషయాన్ని సెన్సార్ వారు తీసివేయబడినది. ***

ఈలోపల మా సెక్యూరిటీ పూర్తి అయింది. అయిదుమంది కలిసి డాలస్ వెళ్ళే విమానం దగ్గరకి వెళ్ళాము. మేము స్మోకీసులో బయలుదేరినప్పటి నుండి ఏమీ తినలేదు. అట్లాంటాలో తిందామనుకున్నాము కానీ సమయం లేక తినలేదు. సెక్యూరిటీ అయ్యాక అక్కడ ఉన్న ఒక షాపులో నేను ట్యూనా సాండ్ విచ్, ఫిరోజ్ వెజీ రాప్ తీసుకున్నాడు. శ్యాం "ఆకలి లేదు" అని ఏమీ తీసుకోలేదు. ప్రవీణ్, గురునాధం విమానం మేము వెళ్ళాక ఉంది. వాళ్ళు "మేము మళ్ళీ తింటాము" అని చెప్పారు. బోర్డింగ్ కి ముందే నేను ట్యూనా తినేసా. ఫిరోజ్ "రాప్ అంత బాగాలేదు" అని చెప్పాడు. 

మా బోర్డింగ్ మొదలవగానే మేము ముగ్గురం ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని బండెక్కాము. మేము డాలస్ నుండి వచ్చినపుడు మాతొ పాటూ వచ్చిన కొంతమంది మాలాగే తిరిగి డాలస్ వెళ్ళడం గమనించాము. ఒక తల్లీ, కూతురు, ముగ్గురు ఆడవాళ్ళు, ఒక భార్య, భర్త, వారి అబ్బాయి. క్రితం సారి కూడా సరిగ్గా లాండింగ్ అయే సమయానికి పిల్లవాడిని ఎత్తుకుని తండ్రి బయట నిలబడ్డాడు. తల్లీ, కూతురు మాకు ముందే కూర్చుని ఉన్నారు, ఇద్దరూ కన్నడలో ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు.  

శ్యాం కిటికీ పక్క సీటులో కూర్చుని కునుకు వేసాడు. ఫిరోజ్ వాకాడు కాలేజీ విశేషాలు చెపుతూ కూర్చున్నాడు. నేను వింటూ ఉన్నాను. కాలేజీలో ఇపుడు మంచి లెక్చరర్లు లేరనీ, ఉన్న వాళ్ళకి జీతాలు సరిగా ఇవ్వడం లేదనీ, లాబుల్లో విధ్యార్థులు వాళ్ళ పని వాళ్ళు చేస్తుకుంటున్నారనీ చెప్పాడు. క్రితం సారి ఇంటికి వెళ్ళినపుడు పిల్లలతో మాట్లాడానని, వాళ్ళకి కొన్ని క్లాసులు కూడా తీసుకున్నానని చెప్పాడు. బయటి వాతావరణం గురించి వాళ్ళకి మనం చెప్పాలని అన్నాడు. మాటల్లోనే డాలస్ కూడా వచ్చేసింది. అట్లాంటాలో ఏర్ పోర్ట్ నుండి బయటకు రావడానికి మాకు పదిహేను నిముషాలు పైనే పట్టింది. డాలసులో అయిదు నిముషాల లోపలే రోడ్ మీదకు వచ్చేసాము. అప్పటికే పార్కింగ్ కి తీసుకు వెళ్ళే షటిల్ రెడీగా ఉంది. ముగ్గురం ఎక్కాము. మా ముందు ఒక పడుచు జంట కూర్చుని ఉన్నారు. ఇద్దరూ కంట్రీ సైడ్ నుండి వచ్చినట్లున్నారు. అమ్మాయి ఆరడుగుల పొడుగుంది, పెద్ద కళ్ళతో చాలా అందంగా ఉంది. షటిల్ మా కారు వద్దకు వచ్చి ఆపాక మా లగేజ్ తీసుకుని షటిల్ డ్రైవరు కారు డిక్కీలో పెట్టాడు. అక్కడ నుండి ఒక అరగంటలో మా ఇంటికి చేరుకున్నాము. నా లగేజీ దింపి ఫిరోజ్ కి, శ్యాం కి టాటా చెప్పి ఇంట్లోకి నడిచాను. అప్పటికే భోజనాలు కూడా అయిపోయింది కాబట్టి పడక ఎక్కేసాను. ఒక అరగంటకి శ్యాం, ఫిరోజ్ కూడా ఇంటికి చేరుకున్నారు. ఇంకో రెండు గంటలకి ప్రవీణ్ కూడా ఫోన్ చేసి "మేము కూడా ఫీనిక్స్ చేరుకున్నాం. మా విమానం లేట్ అయింది" అని చెప్పాడు. అలా మా వాకాడు కాలేజీ రీయూనియన్ సుఖాంతం అయింది.