Tuesday, August 30, 2011

రాఘవరావు మళ్ళీ కనిపించాడు


కొత్తపాళీగారు రాసిన రంగుటద్దాల కిటికీలో పుస్తకంలో "వీరిగాడి వలస" అని ఒక కథ ఉంటుంది. అమెరికాకి కొడుకు, కూతురుని చూడడానికి వచ్చిన రాఘవరావుకి ఏమీ తోచక ఏదో ఒక వ్యాపకం పెట్టుకుని కాలం వెళ్ళదీస్తూ ఉంటాడు. మాట్లాడడానికి మనుషులు దొరక్క బాతులతో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈ కథ గురించి రంగుటద్దాల కిటికీ పుస్తక ఆవిష్కరణ సభలో  మా స్నేహితుడు ప్రసాదరాజు సామంతపూడి గారి వీడియో కింద చూడండి. 




నిన్న మధ్యాహ్నం ఏదో పని మీద బయటకి వెళ్ళాను. షాపులో నా పని పూర్తి అయిపోయింది. పార్కింగ్ లాటులో ఉన్న బైకు దగ్గరకి నడుస్తూ ఉండగా ఒక ముసలాయన నా వైపు చూస్తూ వస్తున్నాడు. మనకి పరిచయం లేని వ్యక్తి, నన్ను ఏదో అడగడానికి వస్తున్నాడని తెలిసి ఆగాను.   


అదేదో సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అమితాబ్ చెడ్డపనులు చేస్తూ బాగా డబ్బులు సంపాదించి ఉంటాడు. శశికపూర్ అతని తమ్ముడు, పోలీస్ కూడా. ఒక సన్నివేశంలో శశికపూర్ తో అమితాబ్ "నా దగ్గర బంగళా ఉంది, కారు ఉంది. నీ దగ్గర ఏముంది?" అంటాడు.

శశికపూర్ అప్పుడు చిన్నగా "నా దగ్గర అమ్మ ఉంది" అంటాడు.


ఇపుడు ఈ పిట్టకథ ఎందుకు చెప్పానంటే ఆ సినిమాలో శశికపూర్ తో అన్నట్టే అమితాబ్ నాతో అన్నాడనుకోండి? అపుడు నేను ఏమి చెప్తానో తెలుసా?

"నా దగ్గర కావలసినంత టైం ఉంది" అని. మనం ఖాళీగా ఉన్నాం కాబట్టి ముసలాయన కోసం నేను ఆగాను. లేకపోతే ముసలాళ్ళ కోసం యువతరం ఆగుతుందా?


ముసలాయన నా దగ్గరకొచ్చి "మీరు భారతీయులేనా?" అని ఆంగ్లములో అడిగాడు.

"అవును" అని హిందీలో చెప్పాను. ఎందుకంటే ఆయన భాష తెలుగు కాదని తెలుస్తోంది.

"ఏ వూరు" అని అడిగాడు. 

"కాలాస్త్రి" అని చెప్తే తెలియదు కాబట్టి "తిరుపతి, బాలాజీ" అని హింట్ ఇచ్చాను.

తిరుపతి తెలియకుండా ఎవరుంటారు? ముసలాయన ఇట్టే పట్టేసాడు. 

"తెలుసు, తెలుసు! నేను ఒకసారి మద్రాసుకి కూడా వచ్చాను" అన్నాడు.


ముసలాయన కొడుకుని చూద్దామని గుజరాత్ నుండి మా ఊరికి వచ్చాడు. కొడుకు అఫీసుకు వెళ్తే, కోడలు బిడ్డతో ఆడుకుంటుంటే ముసలాయన ఎంతసేపు ఇంట్లో ఉండగలడు? బోరు కొట్టి ఇలా ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ నాకు కనిపించాడనమాట.


"నాకేదన్నా ఉద్యోగం దొరుకుతుందా?" అని అడిగాడు మన్నూభాయ్ పటేల్.


అయన విజిటింగ్ వీసాలో ఉన్నాడు కాబట్టి చుట్టుపక్కల మన దేశీయుల వ్యాపారాలు రెండు చెప్పాను, "అక్కడకి వెళ్ళి అడిగితే మీకు ఉద్యోగం దొరకచ్చు" అని. విజిటింగ్ వీసాలో ఉన్న వాళ్ళు పని చేయడానికి వీలు ఉండదు. మన వాళ్ళు నడిపే షాపుల్లో ఇటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలెక్కువ!



"నువ్వేం చేస్తున్నావ్?" అని నన్నడిగాడు.


"నేను ఉద్యోగం కోసం చూస్తున్నాను" అని చెప్పా.



"కాంటన్ లో పంజాబీ కంపెనీ డ్రైవర్లని తీసుకుంటున్నారు. నేను అప్ప్లై చేసా, నువ్వు చెయ్" అన్నాడు.


నేను బైకర్ వేషంలో యమ మాస్ గా ఉన్నానని నాకు అర్ధమయింది.




"నేను మామూలు బాషా కాదు! ఖాదర్ బాషా!!" అని నా కథ చెప్పా.


బాషా సినిమా గుజరాతీ భాషలో డబ్ చేసినట్టు లేదు, పటేల్ దగ్గర నుండి పెద్ద ఎమోషన్ కనిపించలేదు.


షాపింగ్ మాలులో ఇద్దరం కుర్చీలేసుకుని ఒక గంట సేపు పైగా మాట్లాడుకున్నాం. అమెరికా ఎకానమీ, రియల్ ఎస్టేట్ గురించి ఇక చెన్నై, తిరుపతి, అహ్మదాబాదు గురించి కబుర్లాడుకున్నాం. నాకు తెలిసిన రెండు దుకాణాల్లో ఉద్యోగం అడిగి చూడమని సలహా ఇచ్చాను.


నా బైకింగుకి సమయం ఆసన్నమయేసరికి నేను మన్నూ భాయ్ దగ్గర సెలవ్ తీసుకున్నాను. పాపం, మన్నూ భాయ్ నన్ను వదిలి పెట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. రాఘవరావు లాంటి పాత్రలు మాటలకోసం ఎంత తపిస్తారో నాకు తెలుసు. వాళ్ళతో వీలయితే కొన్ని మాటలు, కుదిరితే కప్పు కాఫీ పంచుకుంటే అదే వాళ్ళకి పదిలక్షలు! (పదివేలు ఈరోజుల్లో ఏమి సరిపోతాయ్?). 


"మళ్ళీ కుదిరితే కలుస్తాను" అని చెప్పి బైకు స్టార్ట్ చేసి రోడ్డెక్కాను.




8 comments:

Anonymous said...

చాల మంచి పని చేసారు. కాసిన్ని మాటలే వారికి కొండంత ఓదార్పు. కే. ఏ. అబ్బాస్ గారి " Sparrows ' అనే కథ చదవండి. అందులో ఇంకో రాఘవ రావు కనిపిస్తారు. Nice sharing.
రామకృష్ణ

శ్రీ said...

తప్పకుండా రామకృష్ణ గారు.

కొత్త పాళీ said...

శ్రీ, ఏ పని చేసినా మీ స్టైలే వేరు :)

శ్రీ said...

నెనర్లు కొత్తపాళీ గారు

మురళి said...

బాషా సినిమా గుజరాతీ భాషలో డబ్ చేసినట్టు లేదు, పటేల్ దగ్గర నుండి పెద్ద ఎమోషన్ కనిపించలేదు.
:-) :-)

Prasad Samantapudi said...

శ్రీ,
కొత్తపాళీ గారు తన ఆంతరంగిక ప్రపంచంలో రాఘవరావుని సృష్టించి మనకివ్వడం, మీరు బాహ్య ప్రపంచంలో రాఘవరావుని కలవడం... చాలా బావుంది. మరి మిగతా పాత్రల్ని కూడా వీలు చూసుకుని కలిసి, మీ అనుభవాల్ని రాస్తారు కదూ!

శ్రీ said...

తప్పకుండా ప్రసాద్ గారు

Unknown said...

Super andiii