Friday, November 16, 2018పొదలకూరులో నాకు ఒక కొత్త స్నేహితుడు పరిచయం అయిన రోజులవి. సాయంత్రం వరకు వాళ్ళ ఇంట్లో ఆడుకునేవాడిని. చీకటి పడుతుందనగా స్నేహితుడి నాన్న "డుగు డుగు డుగు డుగు" మంటూ శబ్దం చేస్తున్న మోటార్ సైకిలులో వచ్చేవాడు. "లబ్ డబ్ లబ్ డబ్" అంటూ కొట్టుకోవలసిన నా గుండె కాసేపు ఆగిపోయేది. ఆ మోటార్ సైకిలు మీద అభిమానమో, ఆశ్చర్యమో, అందోళనో నాకు అప్పటికి తెలియని వయస్సు. లగెత్తుకుంటూ మా ఇంటికి తుర్రుమనే వాడిని.

మళ్ళీ అదే మోటారుసైకిలుని నేను నెల్లూరులో చూసాను. ఈసారి ఆ బండిని మా పెదనాన్న అల్లుడు (అంటే మనకి బావ) తోలాడు. మా బావ మెకానిక్. గారేజులో వచ్చిన బండ్లని నడిపిస్తూ ఉండేవాడు. కామాటి వీధి నుండి సంత పేట మీదుగా వెళ్తూ ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఎడమ మలుపు తిప్పాడు. అప్పటికి నేను ఇంకా చదవని గురుత్వాకర్షణ శక్తి ఈ మలుపు దగ్గర మా బావకి లొంగి పోయింది. నేలని రాసుకుంటూ తిరిగిన ఆ మలుపు నాకు ఇంకా గుర్తు.

నాకు తరువాత తెలిసిన విషయం ఏమిటంటే ఇవి జావా మోటారుసైకిళ్ళు. జర్మనీకి చెందిన వాండరర్ అనే కంపెనీ సైకిళ్ళు, మోటారుసైకిళ్ళు, కార్లు, వాన్లు మరి ఇతర యంత్రాలు చేసేవారు. 1902 నుండి మోటారుసైకిళ్ళు, 1903 నుండి కార్లు తయారు చేసేవారు.  చెకొస్లొవేకియాకి చెందిన ఫ్రాంటిసెక్ జానెసెక్ జర్మనీలో ఇంజినీరింగ్ చేసి ప్రాగ్ లో తన మెకానికల్ వర్క్ షాపులో ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇతను హాండ్ గ్రెనేడ్ తయారీలో ఆరితేరి చెక్ మిలిటరీకి ఒక గ్రనేడ్ తయారు చేసి ఇస్తాడు. దాన్ని ఇతని పేరు మీదనే పిలిచేవారు. తరువాత మోటారూసైకిళ్ళు తయారుచేద్దామని నిర్ణయించుకున్నాడు. బీయెండబ్ల్యూ కంపెనీతో పోటీపడలేక వాండెరర్ తన మోటారుసైకిల్ కంపెనీని జానెసెక్ కి అమ్మేసాడు. వాండెరర్ కి చెందిన 500 సీసీ ఇంజిన్ తీసుకుని తన మోటారుసైకిల్లో కలిపి 1929 లో జావా పేరిట ప్రపంచానికి పరిచయం చేసాడు జేనెసెక్.

1930 లో ఆర్ధికమాంద్యం మూలంగా ఇంజిన్ సామర్ధ్యం తగ్గించి 175 సీసీ మోటారుసైకిళ్ళు తయారు చేసారు.  1950 నాటికి 250,350 సీసీ మోటారుసైకిళ్ళు బాగా పేరు తెచ్చుకున్నాయి. ఇంచుమించు 120 దేశాలకు ఈ మోటారుసైకిళ్ళు ఎగుమతి అయ్యాయి. అలా మన దేశానికి కూడా జావా మోటారుసైకిల్ చేరుకుంది. ఐడియల్ జావా పేరిట పూనే కి చెందిన రుస్తుం మరియు ఫరూఖ్ ఇరాని జావా మోటారుసైకిళ్ళని భారతదేశానికి దిగుమతి చేసారు. 1960 లో మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వొడెయార్ వీరికి ఆర్ధికసహాయం చేసి మైసూరులోనే వీటిని తయారుచేయడం మొదలుపెట్టారు. 1970 నుండి వీటినే కొంచెం మార్చి ఎజ్డి పేరిట తయారుచేసారు.


బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో జావా, ఎజ్డి మోటారుసైకిళ్ళు బాగా సందడి చేసింది.  హాలీవుడ్ మాడ్ మాక్స్ చిత్రం కాపీ చేసి తీసిన యమకింకరుడు సినిమాలో విలన్లందరూ జావా మోటారుసైకిళ్ళు వాడుతారు. చిరంజీవి కూడా చాలా సినిమాల్లో జావా మోటారుసైకిలు తోలుతాడు. చాలా సినిమాలలో హీరో కి ఇదే మోటారుసైకిల్! ముందు చక్రం దూరంగా ఉండి, హెడ్ లైట్స్ మీద ఇగ్నిషన్, ఇంజిన్ నుండి వయ్యారంగా కిందికి వచ్చి పొడవుగా కాళ్ళు జాపినట్టు ఉన్న ముఫ్లర్లు జావాకి హుందాతనం అద్దింది. గొంగళిపురుగు మారి సీతాకోకిల అయినట్టు కిక్ రాడ్ తిరిగి గేర్ రాడ్డుగా మారడం నిజంగా ఒక అద్భుతం!


1996లో ఈ మోటారుసైకిళ్ళ తయారీ ఆగిపోయింది. ముప్పై, నలభై ఏళ్ళుగా భారతదేశం రహదారుల మీద సవారీచేస్తూ అందరి గుండెల్లో మాత్రం నిలిచిపోయింది. ఇప్పటికీ జావా, ఎజ్డీ ప్రేమికులు ఆదివారం కలిసి తమ పాత బైకుల మీద సవారీ చేస్తూ ఉంటారు. ఇటువంటి క్లబ్బులు ఇప్పటికీ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, చంఢీగడ్, తిరువనంతపురం నగరాలలో లో ఉన్నాయి. కోఠీలో పాత బైకుల మార్కెట్లో ఈ బైకులకి మంచి గిరాకీ ఉంది. పెట్రోల్ లేకపోతే కిరోసిన్ పోసినా కూడా ఈ మోటారుసైకిళ్ళు నడుస్తాయి. ఈ జావా ముచ్చట నాకు 2000 సంవత్సరంలో తీరింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఒక మెకానిక్ షాపులో మూలగా పడిఉన్న ఎజ్డీని రెండు, మూడువేలకి బాగుచేసుకుని కొన్ని వారాలు పండగ చేసాను. ఎప్పటికైనా ఒక జావా మోటారుసైకిల్ సొంతం చేసుకోవాలన్న కల ఇపుడు నెరవేరబోతుంది.

మహీంద్రా కంపెనీ జావా మోటారుసైకిళ్ళని మళ్ళీ భారతీయ మార్కెట్ కి కొద్ది రోజుల క్రితం తీసుకువచ్చింది. గత సంవత్సరం భారతదేశంలో 2 కోట్ల మోటారుసైకిళ్ళు అమ్ముడయ్యాయి. బ్రిటన్ కి చెందిన రాయల్ ఎంఫీల్డ్, ట్రయంఫ్ మన మర్కెట్లో చాలా సందడి చేస్తుంది. అమెరికాకి చెందిన హార్లీ డేవిడ్సన్ కూడా మన మార్కెట్ పై ఆశ పడింది. బీఎండబ్ల్యూ కూడా 310 మోడల్ని హోసూరులో తయారుచెయ్యడం మొదలుపెట్టింది. జావా మోటారుసైకిల్ని మళ్ళీ విడుదల చేసినందుకు మహీంద్రాకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి వ్యాపారం బాగా నడుస్తుందని ఆశిస్తాను.