Monday, December 2, 2013

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ - లేటుగా వచ్చినా లేటెస్టుగా ఉంది!

 

చిత్రం: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్
హీరో: సందీప్ కిషన్
హీరోయిన్: రకుల్ ప్రీత్ సింగ్
హాస్య నటులు: సప్తగిరి, తాగుబోతు రమేష్, ఎం.ఎస్.నారాయణ
మిగతా తారలు: నాగినీడు, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజీ
సంగీతం: రమణ గోగుల
సినిమాటోగ్రఫీ: చోట.కే.నాయుడు
నిర్మాత: కిరణ్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: మేర్లపాక గాంధి

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ట్రైలర్ చూసి ఈ సినిమా తప్పకుండా చూడాలని అనుకున్నా. ఎందుకంటే మనకి సందీప్ నటన ఇష్టం కాబట్టి.

"చాలా రోజులకి మనవాడికి మంచి హీరో చాన్స్ కూడా వచ్చింది" అని సంతోషించా.

ప్రస్థానం సినిమా చూసినపుడు నాకు అందరిలోకీ సందీప్ నటన బాగా నచ్చింది. కుర్రాడు చాలా బాగా చేసాడు అనిపించింది. తర్వాత ఇతను గుండెల్లో గోదారి సినిమాలో మంచు లక్ష్మి పక్కన కూల్ గా నటించాడు. "షోర్ ఇన్ ద సిటీ" హిందీ సినిమాలో క్రికెటర్ లాగా ఒక మంచి పాత్ర చేసాడు.   రొటీన్ లవ్ స్టొరీ సినిమా కూడా బాగనే ఉంది. ఇక భజన ఆపి ఈ సినిమా గురించి చెప్తాను.

సందీపు నాన్న మా డాడీ లాగే ఇంట్లో విపరీతమయిన క్రమశిక్షణ అన్నమాట. అందరి తప్పులు లెక్కపెట్టి, అవి వంద దాటంగానే ఇంట్లో నుండి బయటకి పంపేస్తారు. మా ఇంట్లో ఇలాగ కాదులెండి, జర చూసి పోతుంటారు. మన సందీపు ఏమిటంటే ఊరులో ఎవరు గొడవ పడినా అన్యాయాన్ని సహించలేక ఎదురుతిరుగుతూ ఉంటాడు . కాబట్టి తప్పులు 99 కి చేరుకుంటాయి. అన్నయ్య బ్రహ్మాజీకి మన తిరుపతిలో పెళ్ళి, ఇంట్లో అందరూ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కి బయలుదేరి వెళ్ళాలి. వందో తప్పు చెయ్యకుండా సందీపు తిరుపతి వెళ్ళాడా? పెళ్ళి సక్రమంగా జరిగిందా? అనేది కథ!

సినిమా రెండు గంటలూ చాలా సరదాగా అయిపోతుంది. ఇక మహేష్ బాబు సినిమా అయినా, ప్రిన్స్ బావ సుధీర్ సినిమా అయినా నడవాలంటే మన హాస్య నటులు చేతులు పడాల్సిందే! మహేష్, జూ, ప్రభాస్ ఇలా పెద్ద హీరోలకి బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ఆలీ చేతులు వెయ్యాల్సిందే ఈ రోజుల్లో. చిన్న సినిమాలకి ఈ మధ్య తాగుబోతు రమేష్, సప్తగిరి చేతులు వేస్తున్నారనమాట. ప్రేమకథా చిత్రములో సప్తగిరి కామెడీ కేకలా ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఆ కెవ్వుని అలాగే కొనసాగించాడు. దస్తగిరి పాత్రలో ఇతని కాలర్ ట్యూన్ కామెడీ బాగుంది. తాగుబోతు రమేష్ కి అలవాటైయిన పాత్ర, బాగా నవ్విస్తాడు.

సందీపు కూడా బాగా చేసాడు, కామెడీ దగ్గర ఇంకొంచెం ట్యూషన్ పెట్టించుకుంటే బాగుంటందని నా సలహా. కాకపోతే సినిమా అంతా ఇతనే బాగా మోసాడు, తన పాత్రకి న్యాయం చేసాడు. కొత్త కథానాయకి బాగా చేసింది, ఈ రవ్వ పంజాబు నుండి దిగుమతి చెయ్యబడింది. పాపకి బట్టలు కొంచెం బిగుతు అయ్యాయి. చిన్న సైజు కొన్నారో? లేక బట్టలు ఉతికితే చిన్నవి అయిపోయాయో ఉతికిన వాళ్ళకే తెలియాలి. పాపకి కూడా మంచి పాత్ర దొరికింది, బాగా చేసింది కూడా. ఈమెకీ మంచి భవిష్యత్తు ఉంది.

ఒక సీనులో బ్రహ్మాజీ తమ్ముడిని తిడుతూ ఉంటే అతని నోటి తుంపర నయాగరా జలపాతాన్ని తలపించింది. ఈ సీను చూడగానే నాకు అనిపించింది "ఓహో....కెమెరా మన చోటా.కే.నాయుడు గారనమాట" అని. సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రతి ఫ్రేమూ హీరోయిన్ లాగా అందంగా ఉంది. కథని చెప్పిన విధానం కూడా బాగుంది. ఎడిటింగ్ కి ఒక కొత్త వీరతాడు వేసెయ్యచ్చు.

రెండు గంటలు నవ్విస్తూ మనకి సినిమా చూపించింది మన కొత్త దర్శకుడు మేర్లపాక గాంధి. మంచి కథని తెలుగు సినిమాకి పరిచయం చేసారు. మాటలు కూడా అక్కడక్కడా కొన్ని పంచులతో సరదాగా ఉంది. మేర్లపాక అంటే మా కాలాస్త్రి నుండి రేణిగుంటకి వెళ్ళే దారిలో ఒక చిన్న పల్లె. స్వాతి వారపత్రికలో మేర్లపాక మురళి గారి నవలలు చదివే ఉంటారు. మురళి గారి రచనలు భలే ఉండేవి, ఆయన బ్రదరే మన గాంధి అని డెట్రాయిట్ నుండి మన తిరుపతి ఫ్రెండు రాజశేఖర్ రెడ్డి చెప్పాడు.

ఈమధ్య కాలంలో వస్తున్న చిన్న తెలుగు సినిమాలు బాగుంటున్నాయి. ఇది ఒక మంచి పరిణామం. నేను ఆదరించినట్లే మీరు కూడా చిన్న సినిమాని ఆదరించండి.
 

10 comments:

Surya prakash.josyula said...

@ ఆయన బ్రదరే మన గాంధి అని డెట్రాయిట్ నుండి మన తిరుపతి ఫ్రెండు రాజశేఖర్ రెడ్డి చెప్పాడు.
కాదు..మేర్లపాక మురళి కుమారుడు..గాంధీ.
.

శ్రీ బసాబత్తిన said...

అవునా? థాంక్స్ సూర్యప్రకాశ్ గారు. మా ఫ్రెండుకి చెప్తాను.

Anonymous said...

mee sameekSha aartanaadaM saar choostaanu vaijaagu vellagaanE
bhavadeeyudu raajendra kumar devarapalli

శ్రీ బసాబత్తిన said...

అలాగేనండి.

Kishor Kumar said...

Thanks.more and more reviews expected from your side like this.

శ్రీ బసాబత్తిన said...

Thank you.

వరప్రసాద్ దాసరి said...

నిన్న వెళ్ళాను. టికెట్లు దొరకలేదు. ఓ థియేటరు జనం బయటున్నారు టికెట్ల కోసం. బ్లాకు లో కొనను కాబట్టి వచ్చేసాను. త్వరలో చూస్తాను. వరప్రసాద్ దాసరి (dasarigamalu.blogspot.in)

శ్రీ బసాబత్తిన said...

బ్లాకులో కొనకుండా మంచి పని చేసారు.

Bharat said...

Uyyala Jampala kooda chala bagundi. Thappaka choodandi.... blogandi...

Chandra Shekhar said...

mee review chala bavundi.