Tuesday, May 24, 2011

శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (1976)

సూపర్ స్టార్ కృష్ణ కి ఉన్న కొన్ని మంచి సినిమాల్లో ఇదొకటి. సినిమా చూస్తున్నంతసేపు ఎండాకాలంలో చన్నీళ్ళ స్నానం చేసిన అనుభూతి కలుగుతుంది. విజయ ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరయిన చక్రపాణి ఈ సినిమాకి నిర్మాతే కాకుండా ఈ సినిమాకి కథ కూడా అందించారు. చక్రపాణి 1975 లో మరణించారు, అంటే ఈ సినిమాకి కొంతవరకు దర్శకత్వం చేసినట్టున్నారు. మిగిలిన సగం బాపు పూర్తి చేసి 1976 లో ఈ సినిమా విడుదల అయినట్టుంది. 


కథలోకి వస్తే కృష్ణ బి.ఏ చదివి ఉద్యోగం కోసం చెన్నపట్నం తిరుగుతూ తన స్నేహితుడి పని చేసే హోటలులో సర్వరుగా చేరుతాడు. హోటలు ఓనరు (జగ్గయ్య) బ్రాహ్మణుడు, బ్రాహ్మణులకే ఉద్యోగం ఇస్తాడని క్రైస్తవుడయిన కృష్ణ పేరు మార్చుకుని పని చేస్తూ ఉంటాడు. ఆ రోజుల్లో వేరే మతాల వాళ్ళు బ్రాహ్మణుడని చెప్పుకుని హోటళ్ళు పెట్టుకునేవారేమో అనిపిస్తుంది ఈ సినిమా చూసాక. సర్వరు ఉద్యోగం కుదరక జగ్గయ్య కూతురికి (జయప్రద) సంగీతం చెప్పే మాస్టారుగా మారుతాడు. జయప్రద సంగీత పాఠాలు నేర్చుకుంటూ కృష్ణతో ప్రేమలో పడుతుంది. మొదట చెప్పిన అబద్ధంతో వచ్చే చిక్కులతో కృష్ణ సతమవుతూ ఉంటాడు. ఈ ప్రేమ జంట చివరికి జగ్గయ్య రహస్యం కూడా బయట పడడంతో సుఖాంతమవుతుంది.  


కృష్ణ చేత హై జంపులు, లాంగ్ జంపులు చేపించకుండా పాత్రకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కట్టుదిట్టం చేసాడు దర్శకుడు. అందమయిన బ్రాహ్మణ  యువతిగా జయప్రద చక్కని చుక్కలాగ ఉంటుంది. శేషాద్రి పాత్రలో కొంగర జగ్గయ్య, జాన్ పాత్రలో కాంతారావు బాగా నటించారు. జయప్రద అమ్మమ్మ కూడా బాగా చేసింది, ఆమె పేరు ఏమిటో తెలియదు. లేతమనసులు సినిమాలో కూడా హరనాథ్ కి గయ్యాళి అత్తగా బాగా చేసింది. పద్మనాభం, రమాప్రభ కామెడీ సరదాగా ఉంటుంది. ఈ సినిమాకి పాటలే పెద్ద పెట్టుబడి, సంగీత దర్శకుడు పెండ్యాల ఈ సినిమాకి మంచి పాటలు అందించారు. అన్ని పాటలు మంచి సాహిత్యంతో చక్కగా ఉంటాయి.


   

14 comments:

Anonymous said...

జయప్రద అమ్మమ్మగా చేసిన నటి జి. వరలక్ష్మి గారు. గతంలో "పెళ్ళి చేసి చూడు" వంటి చిత్రాల్లో కథానాయికగా చేసింది. కె. రాఘవేంద్రరావు గారి తండ్రి కె.ఎస్. ప్రకాశరావు గారి (రెండవ) భార్య కూడా.

శ్రీ said...

నెనర్లు నచకి గారు.

siri said...

సినిమాయే కాదండీ, ఇందులో పాటలు కూడా అద్భుతం గా ఉంటాయి.

"యేమని పిలువనురా నిను నే యే విధి కొలువనురా" అనే పాటలో హీరో దేవుడిని తలచుకుంటూ తన్మయత్వంతో పాడుతుంటే జయప్రద చిలిపిగా హీరో ని వూహించుకుంటూ పాడటం సరదాగా ఉంటుంది. ఇంకా "ఆకాశ పందిరిలో" కూడా చాలా చక్కని పాట.

శ్రీరాగ

ఆ.సౌమ్య said...

అసలు ఇందులో జయప్రదని చూస్తే కళ్ళు తిప్పబుద్ధి కాదు...ఎంత అందమో! కృష్ణ కూడా పిచ్చి డాన్సులు చెయ్యకుండా హుందాగా ఉంటాడు. పాటలయితే ఈ జన్మకి మరువలేము. నాకు అన్నిటికన్నా బాగా ఇష్టమైన పాట "నా దారి ఎడారి, నా పేరు విహారి"...ఆ చిన్నప్పటి SPB గొంతు నాకు ఎంతో ఇష్టం. అలాగే రాకోయి అనుకోని అతిధి, ఆకాశపందిరిలో...అద్భుతమైన పాటలు. కథ, కథనం కూడా ఆహ్లాదంగా ఉంటాయి. సినిమ మొత్తం చూసాక హాయిగా అనిపించి చిరునవ్వు మొలుస్తుంది పెదవులపై.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

ఇదన్యాయం అధ్యక్షా!మా అభిమాన నటుడు కృష్ణ నటించిన మంచిసినిమా గురించి
ఇలా గుట్టుచప్పుడు కాకుండా గుంభనంగా టపా ప్రచురించటం పైగా
ఉన్న కొన్ని మంచిసినిమాల్లో అని ద్వందార్థాలతో రాయటాన్ని తీవ్రంగ
ఖండిస్తున్నా.రామారావు తర్వాత విజయా వారి సినిమాల్లో రెండు సార్లు
హీరోగా నటించింది ఒక్క కృష్ణమాత్రమే.తర్వాత ఎప్పటికో బాలకృష్ణకు ఆ అవకాశం కలిగింది.
పేరు గుర్తులేదు గానీ మళయాళ సినిమాకు రీమేక్ ఇది.చక్రపాణి సంచాలకుడు కాగా బాపు
సహాయకుడు.ప్రతిపాటా,ప్రతిసన్నివేశం గుర్త్తుండిపోయే విజయావారి సంప్రదాయం కొనసాగిస్తూ వచ్చిన
చివరి సినిమా ఇది.

శ్రీ said...

@ సిరి, అవును పాటలు చాలా బాగుంటాయి.

@ సౌమ్య, మంచి సినిమా. ఎపుడూ పాటలు చూడడమే కానీ, సినిమా చూడడానికి నాకు ఇపుడు వీలయింది.

@ రాజేంద్ర కుమార్, నేను కూడా ఊహ తెలియనపుడు కృష్ణకి పెద్ద అభిమానినండి. మంచి సినిమా అని ఒక కవ్వింపు చర్య చేసా అంతే!

కమల్ said...

అద్భుతమైన పాటలున్న సినిమా ఇది, కాని ఈ సినిమా విజయవంతం కాకపోవడంతో విజయస సంస్థ వారు ఈ సినిమా తర్వాత సినీ నిర్మాణం ఆపేశారు. " ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట " పాట వున్న రాగం ఆ తర్వాత ఏ సినిమాలొ ఉపయేగించలేదనుకుంటాను..!? కొన్ని సంవత్సరాలకు కమల్‌హాసన్ తన " భామనే సత్యభామనే " సినిమాలో అదే రాగంతో ఒక పాట పాడించి..తను కూడ కూడ గాత్రం కలిపారు. " రుక్కు బాబా రుక్కూ అరె బాబా రుక్కూ..ఓ మై డార్లింగూ.." ఈ పాట " ఆకాశ పందిరిలో " పాట రాగం రెండు ఒకటే.. తాళంతో సహా! మంచి సినిమాని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

శ్రీ said...

@కమల్, చక్రపాణిగారు కూడా సినిమా విడుదల ముందే మరణించారు కదా! అందుకే ఈ సినిమానే విజయా వాళ్ళకి చివర సినిమా కావచ్చు కదా ? ఏమంటారు ?

ఈ సినిమా పాటలు మీకు కూడా నచ్చినందుకు సంతోషం!

ప్రసీద said...

మొన్న కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ఈ.టీ. వీ లో రాత్రి పదిన్నర తర్వాత ప్రసారం చేస్తే, కదలకుండా కూర్చుని పూర్తిగా చూసేసాను. పాటలకోసమే చూడవచ్చు సినిమా. మిమిక్రీలూ అవీ చేరని ఆ నాటి బాలూ గారి గొంతు అంటే నాకెంతో ఇష్టం.

శ్రీ said...

పాటలు ఎన్ని సార్లయినా చూడచ్చు. మీ కామెంటుకు నెనర్లు!

కంది శంకరయ్య said...

ఈ చిత్రంలో జయప్రద అమ్మమ్మ, లేతమనసుల్లో హరనాథ్ గయ్యాళి అత్త వేరు వేరు నటులనుకుంటాను.

శ్రీ said...

వీకీపీడియాలో చూస్తే జీ.వరలక్ష్మి లేతమనసులులో కూడా ఉందని చెప్తుందండీ! నేను ఒకసారి లేతమనసులు కూడా చూసి చెపుతాను.

Anonymous said...

కమల్ గారూ, ఆ రాగం శహాన (శహన అని కూడా అంటారు కొందఱు). అందులో చాలా పాటలే ఉన్నాయి తెలుగులో. "చూచి, వలచి, చెంతకు పిలచి..." (వీరాభిమన్యు) కూడా అదే రాగం. "ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది..." (సంపూర్ణ రామాయణం), "పూవు వలె విరబూయవలె..." (కానిస్టేబుల్ కూతురు) లాంటి మధురమైన పాటలున్నాయి యీ రాగంలో. "శహాన పాటే వీచెనో, సహారా పూవై పూచెనో..." (శివాజీ) అన్న పాటలో పేర్కొన్న రాగమిదే. (కానీ, "సహానా" అని పలికిన ఉదిత్ పుణ్యాన ఆ విషయం గమనించి ఉండకపోవచ్చు చాలా మంది.) ఆ పాట శహాన అవునో కాదో తెలియడంలేదు నాకు. కాస్త కాస్త అలానే ఉంది. రహ్మాన్ రాగాలని అద్భుతంగా మార్చి మునుపెన్నడూ వినని భావన కలిగించటం సాధారణంగా జఱిగేదే కనుక యీ పాట శహాన రాగమే అయ్యే అవకాశముంది. సంగీతం తెలిసినవాళ్ళెవఱైనా చెప్పాలి.

కమల్ said...

@నచకి గారు..ఎప్పుడో17 ఏళ్ళ క్రితం కర్ణాటక సంగీతం రెండు మూడు ఏళ్ళు పాటు నేర్చుకున్నా కూడ గానం విని రాగం గుర్తు పట్టేంత జ్ఞానం సంపాదించుకోలేదు గాని..! ఈ విషయం గురించి అప్పట్లో కమల్‌హాసన్ గారు..తన భామనే సత్యభామనే సినిమా నిర్మాణ సమయంలో చెప్పగా నేను పేపర్లలో చదివాను..! ఆ విషయం నాకు ఇప్పటికీ గుర్తుండడం వలన ఇక్కడ ప్రస్తావించాను.మరది శహనా రాగం అవునో కాదో కూడ చెప్పలేను..! ఒక సారి నా పాత సంగీతపు పుస్తకాలను తిరిగేయాలేమో..??