Monday, May 23, 2011

బెంచి కబుర్లు - 2



బెంచి మీద విజయవంతంగా రెండో వారంలోకి ప్రవేశించాను. మొదటి వారం స్లోగా సాగినా రెండో వారం బాగా బిజీ గానే సాగింది. మొదటి వారం పూర్తి అవగానే మా రాష్ట్రంలో నిరుద్యోగ భృతికి నమోదు చేసుకున్నాను. ఇక మనకి చిల్లర ఖర్చులు దొరుకుతాయి. నా రెస్యూమేని రసవత్తరంగా రాసుకుని ఉద్యోగాలకి ఎడా, పెడా అప్లయ్ చేసుకుంటున్నాను.




ఈ మధ్య కాలంలో మిస్ అయినటువంటి పరభాషా సినిమాలని ఒక చూపు చూడడం కూడా వీలయ్యింది.




నౌ వాకింగ్ - అనే జపనీస్ సినిమా చూసాను. పెద్ద కొడుకు పోయిన విచారంలో సాగే ఈ సినిమా స్లోగా, ఎమోషనల్గా బాగా సాగింది. మిగిలిన ఇద్దరు కొడుకులూ ఎదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ తండ్రి దగ్గర చీవాట్లు తింటూ ఉంటారు. ఇది కొంచెం మన నేటివిటీకి తగినట్టు ఉంటుంది. వరుసగా ఇలా బరువయిన సినిమాలు చూసి బుర్ర బరువెక్కి, మన మసాలా సినిమాలు చూస్తే కానీ తేలిక కాలేకపోయాను. ఈ నేపథ్యంలో చూసిన సినిమానే తీస్ మార్ ఖాన్.




పనిలో పనిగా ఫేస్ బుక్కులో గోకుకోవడం అలవాటు కాబట్టి అక్కడ కామెంటేయడం ఒక వ్యాపకమయిపోయింది. ఇండిపెండెంట్ తెలుగు సినిమా వాళ్ళు బాగుందని చెప్తే 'కిల్లింగ్ ఇన్స్టింక్ట్' అనే ఫ్రెంచ్ సినిమా చూసా. ఈ సినిమాలో బాంకు దోపిడీలు, కిడ్నాపులతో నిండుగా టైం పాస్ అయిపోయింది. డెబ్బయ్ లలో కాలం కాబట్టి బాంకులు దోచుకుంటున్నరన్నయ్యా! ఈ రోజుల్లో ఒక్క స్కాం చేసుకుంటే చాలు, పాపం, ఆ రోజుల్లో చాలా కష్ట పడాల్సి వచ్చేది అని తమ్ముడు ఫీలయ్యాడు.  దీనికి సీక్వెల్ కూడా ఉంది అని చెప్తే అది కూడా చూసేసా.




యూట్యూబులో కూడా మంచి సినిమాలు దొరికాయి. చిన్నపుడు వయసు తక్కువయిందని ప్రేమ సాగరం సినిమా చూడలేదు, పూర్తిగా చూసాక అనిపించింది వయసు దాటిపోయిందని. హైదరాబాదులో ఔత్సాహిక దర్శకులు తీసిన చిన్న సినిమాలు చూసాను. కొన్ని, కొన్ని బాగున్నాయి. కొన్ని మరీ పేలవంగా ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ లో ఆన్ లైన్ స్ట్రీమింగ్ ఆప్షన్ బాగా నచ్చింది. 
  


గత వారం మా స్నేహితుడికి కెనడాలో చిన్న సర్జరీ చేసారు, అతనికి తోడుగా నేను ఒక నాలుగు రోజులు కెనడాలో ఉండవలసి వచ్చింది. డెట్రాయిట్ డౌన్ టౌన్ కి ఆనుకునే కెనడా ఉంటుంది. కెనడా దేశానికి వెళ్ళాలంటే డెట్రాయిట్ రివర్ మీద బ్రిడ్జి పై వెళ్ళచ్చు, లేకపోతే నది కింద ఒక మైలు దూరం సొరంగం లో వెళ్ళచ్చు.  రెండు దేశాల మధ్య తిరగడం సరదాగా ఉంటుంది. ఈ నాలుగు రోజులూ మానవ సేవే మాధవ సేవ అనుకుంటూ కాలక్షేపం చేసాను. 


........ మరిన్ని విశేషాలు ఇంకొక టపాలో

No comments: