Tuesday, January 20, 2015

అల్పజీవి - పుస్తక సమీక్ష


గడచిన ఆదివారం మా డాలసులోని 90వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో నేను అల్పజీవి పుస్తక పరిచయం చెయ్యడం జరిగింది. ఎలాగూ మాట్లాడేసాను, ఇక్కడ మన బ్లాగులో కాసేపు రాసుకుంటే నాకు కొంచెం ఊరట కలుగుతుంది.
 
ఒకటిన్నర సంవత్సరం ముందు ఆస్టినులో మాకు సాహిత్య కార్యక్రమాలు జరిగాయి. అపుడు హూస్టన్ నుండి ఒక సాహిత్య అభిమాని బుచ్చిబాబు గారు "చివరకు మిగిలేది" పరిచయం చేసారు. ఆ వక్తను పరిచయం చేస్తూ మన సత్యం మందపాటి గారు తెలుగులో నవలలలో చివరకు మిగిలేది ఒక అద్భుతమయిన నవల అని చెప్పారు. దానితో పాటూ త్రిపురనేని గోపీచంద్ గారి అసమర్థుని జీవయత్ర, అల్పజీవి కూడా మంచి నవలలు అని చెప్పారు. నేను అసమర్థుని జీవయాత్ర చదివాను కానీ అల్పజీవి చదవలేదు. సత్యం గారి మాటలు విన్నాక ఆ నవల చదవాలని నిర్ణయించుకున్నాను.
 
"ఈ ఆదివారం ఈ నవల సమీక్ష ఉంది, మా కార్యక్రమానికి రండి" అని మా ఆఫీసులోని గణపతి గారిని పిలిచాను.
 
"ఆ నవల ఎపుడు రాసారండి?" అని గణపతి గారు అడిగారు.
"ఎపుడో..ఎపుడో అంటే ఎపుడో..." అని చెప్పాను.
 
"అప్పుడు రాసిన దానికి ఇపుడు సమీక్ష ఏమిటండీ?" అని గణపతి గారు చురక అంటించారు.
 
నేను నొప్పి భరిస్తూ "మరి అలాగయితే పరిచయం చేసాద్దమండీ?" అని చెప్పాను.
 
గణపతి గారు "ఇది పద్థతి!" అని చిరునవ్వు చిందించారు.
 
అల్పాజీవి నవలని రాచకొండ విశ్వనాధశాస్త్రి గారు 1952లో రచించారు. రావిశాస్త్రి గారు కథలని ఎక్కువగా రాసారు. నవలలు కొన్నే రాసారు, ఆయన రాసిన నవలల్లో అల్పజీవి ఉత్తమమైన నవల. రావిశాస్త్రి గారు వృత్తి రీత్యా న్యాయవాది. తన అనుభవంలో ఎంతో మంచి వారు పిరికితనం వలన లేక కేసులు ఓడి పోవడం చూసి సమాజంలో దోపిడీకి గురి అవుతున్న సామాన్య ప్రజల కోసం అల్పజీవి నవలను రాయలనిపించింది అని ఈ నవల ముందు మాటలో చెప్పుకున్నారు. ఈ నవలని శ్రీ శ్రీ లేక వేరే రచయితలు రాస్తే ఎలా ఉంటుంది అని కూడా అలోచించారట!
 
ఇక నవలలోకి వెళ్తే సుబ్బయ్య కథానాయకుడు. ఈ సుబ్బయ్య మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నటువంటి సగటు మనిషి. ఈ సుబ్బయ్య గురించి అందరూ పలు రకాలుగా అనుకుంటూ ఉంటారు. 
 
"సుబ్బయ్య ఒట్టి నంగిరి పింగిరి గాడు" అని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు. 
 
"మా ఆయన ఏమీ చేతకాని మనిషి" అని సుబ్బయ్య భార్య అనుకుంటుంది. 
 
"మా నాన్న వెర్రి బాగులవాడు" అని పిల్లలు అనుకుంటూ ఉంటారు.
 
ఇలాంటి సుబ్బయ్య మంచి ప్రభుత్వ ఉద్యోగమే వెలగబెడుతూ ఉంటాడు. "సుబ్బయ్య కాక మరొకరు ఆ కుర్చీలో ఉంటే బల్ల కింద, పైనా బాగా సంపాయించే వాళ్ళే!" అని కూడా ఆఫీసులో ఉండే తోటి ఉద్యోగులు అనుకుంటూ ఉంటారు.

అందరూ అనుకున్నట్టే సుబ్బయ్య పిరికివాడు, మంచి వాడు కూడా. ఏ నిర్ణయం గట్టిగా తీసుకోలేక సతమతమవుతూ ఉంటాడు. అలాంటి సుబ్బయ్య బావమరిది వెంకట్రావు బాగా గడుసుపిండం. జమీందారు వంశంలో పుట్టి ఆస్తి హారతి కర్పూరమైనా నోటి దురుసుతనం, లోక్యంతో ఎలాగో నెట్టుకు వస్తూ ఉంటాడు. బావమరిది కోసం కంట్రాక్టరు గవరయ్య దగ్గర అయిదు వందలు అప్పు చేస్తాడు. వెంకట్రావు అప్పు తీర్చడు, గవరయ్యేమో అప్పు తీర్చమని సుబ్బయ్య నెత్తి మీద కూర్చుంటాడు. అప్పటి వరకు ఆఫీసులో తన పని తను చేసుకునే సుబ్బయ్య జీవితం అల్లకల్లోలం అవుతుంది. నవలంతా అల్పజీవి అయిన సుబ్బయ్య సంఘర్షణతో సాగుతుంది. 

రావి శాస్త్రి గారు ఈ నవలని "చైతన్య స్రవంతి" అన్న ప్రక్రియలో రాసారు. తెలుగులో ఇలాంటి ప్రయోగం ఈ నవలతోనే మొదలయిందట. రావి శాస్త్రి గారు సుబ్బయ్య అలోచనలను మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ ఉంటారు నవలలో. ఇదొక అద్భుత దృశ్య కావ్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాఠకులకి సుబ్బయ్య అలోచనలే కాకుండా తన చుట్టూ జరుగుతున్న సంఘటనలను కూడా శాస్త్రి గారు చాలా చక్కగా వర్ణించారు.

నాకయితే ఎమిలీ చిత్రం చూస్తున్నట్లు అనిపించింది. ఈ చిత్రంలో కథానాయకి తను పని చేసే రెస్టారెంటులో మనుషుల్ని గమనిస్తూ ఉంటుంది. ప్రతి రోజూ తన హోటలుకి వచ్చే కస్టమర్లని గమనిస్తూ ఉంటుంది. సుబ్బయ్య కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. తన చూసే ఆ పాత్రలకి తనకు నచ్చిన కథలు అల్లుకుంటూ ఉంటాడు. ఎర్ర రంగు చీర ఆమె, ఇద్దరు కవల పిల్లలు, ఒక డ్రైవర్ ఇలా ఎన్నొ పాత్రలని గమనిస్తూ ఉంటాడు. 

వెంకట్రావు పాత్ర చూస్తే ఇది గోపీచంద్ గారి అసమర్థుని జీవయాత్రలో కథానాయకుడుని గుర్తుకు తెస్తుంది. సుబ్బయ్య పిరికి వాడుగా ఉండడానికి కారణాన్ని రచయిత బాగా సృష్టించారు. ఈ నవల గొప్పతనమంతా సుబ్బయ్య అంతర్మథనమే! ఒక్కొక్కసారి ఈ సుబ్బయ్య మీద మనకి జాలి కలుగుతుంది. అలాగే ఇంకొకసారి ఇతని చేత కాని తనం చూసి కోపం కూడా వస్తుంది. మంచితనం, పిరికితనం ఒకచోట ఉండలేవు అని రావిశాస్త్రి గారు ఈ నవలలో మనకి చెప్తారు.

గమనిక: రావి శాస్త్రి గారి ముఖచిత్రం www.telugusahityam.com నుండి గ్రహించబడ్డది.

No comments: