Friday, May 1, 2009

ఆకాశమంతా - ఒక మంచి అనుభూతి కలిగించే చిత్రం
ఆకాశమంతా సినిమా సరిగ్గా నెల రోజుల ముందు విడుదల అయింది. డెట్రాయిట్ లో తెలుగు సినిమా విడుదల కావాలంటే భారీ తారాగణం ఉంటే కానీ పైసా వసూలు కాదు. చిన్న సినిమాలని ఒకప్పుడు బాగానే ఆదరించేవారు,ఇపుడు మారుతున్న ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మంది సినిమాకి రావడం గగనమయి పోయింది. మొదటి రెండు,మూడు వారాలు పెద్ద సెంటర్లలో ఒక మాదిరిగా ఆడింది ఈ సినిమా. ఆడింది అంటే నా ఉద్దేశం కొంత మంది ప్రేక్షకులు ఈ సినిమాని చూసారు అని పాఠకులు చదువుకోగలరు. ఈ కొంత మంది ఎంత మంది అన్న విషయం వ్యాపార రహస్యాలు కాబట్టి వాటిని నేను బయట పెట్టదలుచుకోలేదు. మూడవ వారం తరువాత అక్కడ ఈగలు తోలుకోవడం ఎందుకు అని మా డెట్రాయిట్ కి బాక్సు పంపారు డిస్ట్రిబ్యూటర్ గారు.
పని ఒత్తిడిలో నిన్నటివరకు సినిమా చూసే అవకాశం కలగలేదు. పనిలో పనిగా మా ఆవిడ పరీక్షలు మంగళవారంతో పూర్తయ్యాయి. నిన్న సాయంత్రం మా అమ్మాయిని కుడా తీసుకుని చూసాం ఈ సినిమా ని. సినిమా హాలుకు వెళ్ళగానే కొంచెం నిరాశకు గురయ్యాను. ఎందుకంటే సినిమా హాలులో మా కుటుంబం మాత్రమే ఉంటుందని ఊహించాను. దానికి భిన్నంగా చాల మంది తల్లిదండ్రులు పిల్లలని వెంటబెట్టుకుని వచ్చారు. సరే, అందరూ కలిసి సినిమా ఎంజాయ్ చేద్దామనుకుని సరిపెట్టుకున్నాను. సినిమా మొదలుపెట్టకముందే హాలులో కూర్చున్నాం, ఇదొక తృప్తి. కొంచెం పేర్లు పడడం మొదలయినా ఎదో మిస్ అయ్యామన్న ఫీలింగు సినిమా అంతా పీకుతూ ఉంటుంది. ఇక సినిమా విషయానికొద్దాం.
ఈ సినిమా గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే "ఆడ పిల్ల జీవితంలో తండ్రి పాత్ర" అని చెప్పచ్చు. పార్కులో తనకు పరిచయమయిన వ్యక్తితో తన కూతురు గురించి చెప్పుకొస్తూ రావడం ద్వారా కథ మొదలవుతుంది. కూతురుని పెంచడం, స్కూల్లో చేర్పించడం, కాలేజీలో చేరడం, చివరికి కూతురు ప్రేమ-పెళ్ళి మలుపులతో మనకి ఒక మంచి అనుభూతిని మిగిలిస్తుంది ఈ సినిమా. మంచి అనుభూతిని మనకి మిగల్చడం కోసం పాత్రలని మంచితనంలో ముంచి తీసినట్టు మనకి అనిపిస్తుంది. కూతురు పాత్రలో త్రిష, తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్, తల్లి పాత్రలో ఐశ్వర్య, పార్కులో పరిచయమయిన కొత్త వ్యక్తిగా జగపతి బాబు నటించారు. ఇంటికి తీసుకువచ్చిన బిక్షగాడిగా గణేష్ వెంకటరామన్ నటించారు. కన్నడ రాష్ట్రం నుండి దిగుమతి చేసుకున్న ప్రకాష్ రాజ్ చాలా సహజంగా నటించాడు. ఐశ్వర్య,త్రిష నటన మమూలుగానే ఉంది.గణేష్ వెంకటరామన్ నటన బాగుంది, ఆ పాత్ర మీద మనకి కలిగే జాలి వల్ల అతని నటన కూడా బాగుందేమో?
ఇటువంటి సినిమా తీసినందుకు ప్రకాష్ రాజ్ ని ( తమిళ్ లో నిర్మాత అనుకుంటా),రాజుని (దిల్ తీసేసాడు ఈ మధ్య) తప్పకుండా మెచ్చుకోవాలి. ఈ సినిమా హాలులోకి రాకముందే చాలా మంది ఇంటర్నెట్లో చూసేసారట. పైరసీని ఎలాగూ ఆపలేరు కాబట్టి సినిమా ఖర్చు తగ్గించుకోమని తెలుగు సినీ నిర్మాతలకు నా ఉచిత సలహా. "అబ్బా...ఈ రోజుల్లో మంచి తెలుగు సినిమాలు రావడం లేదండీ" అనుకొనే వాళ్ళు ఈ సినిమా తప్పక చూడండి, ఇటువంటి సినిమాలు రావడం అరుదు. వీళ్ళని ప్రోత్సహిస్తే మనం ఇంకా మంచి సినిమాలు పొందవచ్చు.


10 comments:

అబ్రకదబ్ర said...

సున్నితమైన హాస్యం, భావోద్వేగాలు, అతిగా లేని సెంటిమెంట్ - వెరసి మంచి సినిమా. డబ్బింగ్ అయినా ఆ తేడా తెలీలేదు.

రవి said...

శ్రీ గారు,

ఈ మధ్య పరిస్థితి ఎలా తయారయ్యిందంటే, చెత్త సినిమాలు చూసీ చూసీ, మరో చెత్తకు వెళితే "అబ్బా ఇదీ చెత్తేనా" అనిపిస్తుంది.ఇలాంటి సినిమాకెళితే "అబ్బ, ఎమీ మసాలా లేదు.పులుపు, కారం తిని పెరిగిన వళ్ళు కదా. మనకు ఇలాంటివి నప్పవు" అన్న వెధవ ఫీలింగు.

మొత్తానికి చెత్త సినిమాల్లో మంచిని, మంచి సినిమాల్లో చెత్తను చూసుకుంటూ, రెంటికీ చెడిన రేవడి అయ్యాను. జీవితంలో మొదటి సారి సినిమాలంటే విరక్తి కలుగుతోంది. శేష జీవితాన్ని డిస్కవరీ లాంటి చానెల్స్ కు అంకితం చేసే పరిస్థితి కనబడుతా ఉంది.

శ్రీ said...

@అబ్రకదబ్ర, మీరు చెప్పే వరకు ఇది డబ్బింగ్ అని నాకు గుర్తు రాలేదు.

@రవి, ఈ మధ్య కొన్ని మంచి సినిమాలు వస్తున్నాయండి. డిస్కవరీ ఐడియాకి ఢోకా లేదు.

పరిమళం said...

ఈ సినిమా లో తండ్రి ప్రేమను చూపించారు తప్ప కూతురు తండ్రిని అర్ధం చేసుకున్నట్టు అనిపించలేదు . ఇంకా తల్లికే దగ్గరైనట్టు ఉంటుంది .టోటల్ గా సినిమా ok . కానీ ప్రకాష్ రాజ్ ని చూపించిన విధానం నచ్చలేదు .దీనికంటే నువ్వే నువ్వే లో తండ్రీ కూతుళ్ళ ప్రేమ ....సంఘర్షణా చాలా బాగా చూపించారనిపిస్తుంది .

శ్రీ said...

@పరిమళం, మీరు చెప్పింది నిజమే. పిల్లల గురించి ఇంతకు ముందే బొమ్మరిల్లులో చూపించారని ఇక్కడ స్కిప్ చేసినట్టున్నారు --)

నువ్వే నువ్వేలో మీరన్నట్టు తండ్రీ కూతుళ్ళ సంఘర్షణ చాలా ఉంటుంది,ఈ సినిమాలో మనకి ఒక వైపు నుండి మాత్రమే కనిపిస్తుంది.

Anonymous said...

Good effort to improve your writing skills ;-) Keep it up.

భాస్కర్ రామరాజు said...

పైన అజ్ఞాతని నేను కాదు గురు :):) మంచి సినిమాలానే ఉందే. టొరెంటు దొరికితే ఇటు పడేయ్ బాసు

శ్రీ said...

@అనానిమస్, ఈసారి జాగ్రత్తగా రాసాను. ఈ విజయాన్ని మీకే అంకితం చేస్తున్నాను.

@భాస్కర్ రామరాజు, పిల్లలతో చూడవలసిన సినిమా! ఇపుడు టిక్కెట్టు $5 కే దొరుకుతుంది.

ఏకాంతపు దిలీప్ said...

"ఆడ పిల్ల జీవితంలో తండ్రి కి పాత్ర" ఎమీ లేదు... ఆడ పిల్ల ఇచ్చిన పాత్రనే తండ్రి వేసి తన జీవితాన్ని నిలుపుకోవాలి అని చెప్పారు కదా సినెమాలో... :-)

శ్రీ said...

అద్భుతంగా చెప్పారు దిలీప్. ఒక 4,5 సార్లు చదివితే కానీ నాకర్థం కాలేదు. తండ్రి పాత్ర పరిథిని కూతురు నిర్ణయించింది.