Friday, July 6, 2012

ఈగ – విలన్ చెవిలో జోరీగ! హీరొయినుతో లవ్లీగా…ఒరేయ్ నానీగా…నువ్వు సూపరెహ…

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో రాజమౌళి అంటే ప్రేక్షకులకే కాదు, సినిమాలో వ్యాపారం చేసుకునే వ్యాపారులకి కూడా ఆయన అంటే గౌరవం, అభిమానం, ఆశ. ఆశ అని ఎందుకు అంటున్నాను అంటే తొక్కలో సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో రాజమౌళి నుండి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే జనరంజకమయిన ఒక మంచి సినిమా వస్తుందని ప్రేక్షకులకి ఒక ఆశ.  రాటెన్ (కుళ్ళిన) రొటీన్ సినిమాలు కొనుక్కుని భళ్ళున దుకాణాలు మూసేసుకున్న సినీ డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి మళ్ళీ మంచి రోజులొస్తాయన్న ఆశ.

ఈగ సినిమాలో పెద్ద హీరో, హీరోయిన్లెవరూ లేరు. ఏదో చిన్న, చిన్న సినిమాలల్లో తన వంతు కృషి చేస్తూ నెట్టుకు వస్తున్న నానీ ఈ సినిమాలో హీరో. అదీ కాసేపు కథ మొదలయ్యి పొంగే సమయానికి హీరో పాత్ర సర్దుకుంటుంది.  ఇక పిట్ట మొహం వేసుకుని సమంతా! ఏదో మహేష్ బాబు అన్నాడని అన్నానే కానీ, సమంతాని నేంత మాటనగలనా! ఇక విలన్ పాత్రలో సుదీప్ అట, ఇతగాడు కన్నడిగుడు!  సినిమా అంతా హీరో తక్కువ, విలన్ ఇంకా హీరోయిన్ ఎక్కువ అన్నట్టు వాళ్ళిద్దరే కనిపిస్తారు ఈగతో పాటూ.

హీరో లేకుండా ఒక చిన్న ఈగతో సినిమా తియ్యడం ఒక ప్రయోగం! భారీ ఫైట్లు, ఐటం డాన్సులు, హీరో, హీరోయిన్ల తైతక్కలు లేకుండా కూడా సినిమా తియ్యచ్చని తెలుగు సినీ ప్రపంచానికి ఈ సినిమా ద్వారా రాజమౌళి చెప్తున్నాడు. సినిమా చూస్తున్నపుడు నాకు అనుకోకుండా అతడు సినిమాలో తనికెళ్ళ భరణి డైలాగ్ ఒకటి గుర్తుకు వచ్చింది.

ఒరేయ్ బుజ్జా…ఆడురా మగాడంటే!

సినిమా చూసాక ఆ డైలాగ్ నేను ఎవరిని ఉద్దేశించి చెప్పానో మీకే తెలుస్తుంది. ఇక సినిమా గురించి టూకీగా చెప్పాలంటే సాం (నేను సమంతాని ముద్దుగా పిలిచే పేరు) ఒక స్వచ్చంద సేవ సంస్థలో పని చేస్తూ ఉంటుంది. నానీ ఎప్పటి నుండో బిందు (సమంతా) వెనక పడుతూ ఆమె ప్రేమ కోసం తపిస్తూ ఉంటాడు. బిందూ కూడా నానీని వెంత తిప్పుకుని కవ్విస్తూ ఉంటుంది. ఈలొపల రాహువు లాగా సుదీప్ కథలోకి ఎంటర్ అవుతాడు. సుదీపుకి అమ్మాయిల పిచ్చి. కనిపించిన అమ్మాయిలనందరినీ కావాలనుకుంటాడు. ఒకసారి బిందుని చూసి ఆమెను వశపరుచుకుందామని ప్రయత్నిస్తూ ఉంటాడు. అడ్డం వచ్చిన నానిగాడిని పీక నొక్కి చంపేస్తాడు. నాని గాడి ప్రేమ పాకానికొస్తుందనగా ఈ దుర్ఘటన జరుగుతుంది. నాని ఆత్మ ప్రేమరాహిత్యంతో తపించి, సుదీప్ మీద పగతో జ్వలించి మళ్ళీ పుడతాడు. ఈగలా పుట్టి సుదీప్ మీద పగ ఎలా తీర్చుకున్నాడనేదే ఇక మిగిలిన సినిమా అంతా.

సినిమా మొదలయిన అరగంటకే హీరో చనిపోయి ఈగ కథలోకి వచ్చేస్తుంది. విశ్రాంతి అయ్యేంతవరకు ఈగలు నోట్లోకి వెళ్ళిపోతాయేమోనన్న ఊసే లేకుండా నోరెళ్ళబెట్టి మీరు చూడకపోతే మీ పేరు అదే కాదు. పిల్లలతో పాటూ పెద్ద వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేసే సినిమా ఈ ఈగ. ఒక ఈగతో కూడా ప్రేమ, పగ, సానుభూతి లాంటి భావావేశాల్ని సృష్టించాడంటే మన మౌళి సామాన్యుడు కాడు.

రాజమౌళి ప్రతి సినిమాలోలాగే కథ విజయేంద్ర వర్మ దగ్గర నుండి వచ్చింది. సంగీతం మన కీరవాణి. కెమెరా పనితనం సెంథిళ్, ఇతగాడి పనితనం సినిమాలో కొట్టొచ్చేలా కనిపిస్తుంది. కథలో బిగువు, కథనంలో ఆత్రుత, ప్రేక్షకులని నవరసాలతో థాయ్ మసాజ్ చేపించడంలో రాజమౌళిది అందె వేసిన చేయి అని మళ్ళీ మరో సారి నిరుపించాడు ఈ సినిమాతో. ఈ సినిమా ఇంకొంచెం ముందే వచ్చి ఉంటే గబ్బర్ సింగ్ కూడా రబ్బరుతో తుడిపేస్తే రబ్బర్ సింగులా తుడుచుకుపోయుండేవాడు. ఈ సినిమా చూసాక మనకి ఈగల మీదా, దోమల మీద బాగా సానుభూతి పెరుగుతుందేమో!

గమనిక: కాలాస్త్రి రివ్యూలు ఇక్కడ కూడా మీరు చూడచ్చు.
http://www.tarangaradio.com/ega/

7 comments:

Narayanaswamy S. said...

kewl. బిజినెస్ మేన్ తరవాత ఇంక కొత్త తెలుగు సినిమా థియెటర్లో చూణ్ణని వొట్టెసుకున్నా. మీ రివ్యూ మళ్ళీ టెంప్ట్ చేస్తోంది!

శ్రీ said...

రాజమౌళివి చూసెయ్యచ్చండి!

Anonymous said...

నీకంత గులగా ఉంటే కమ్మగా రాజమౌళిని, నానిని, కీరవాణిని, సురేష్ బాబును, కొర్రపాటిసాయిని తనివితీరా పొగుడుకో. గబ్బర్ సింగుమీదపడి ఏడవడమెందుకు. బుద్ధి బయటపెట్టుకోవడం కాకపోతే.

శ్రీ said...

హహహ....

Ramana Murthy Venkata said...

సమీక్ష బాగుంది.
''మన మౌలి సామాన్యుడు కాడు '' ఆ వాక్యం మొత్తం రిపేట్ అయ్యింది. చూసుకోండి !

శ్రీ said...

థాంక్స్ రమణ మూర్తి గారు. టపా కరెక్ట్ చేసాను.

Dreams said...

హమ్మయ్య!మనుషులే కదా! నేనింకా అవి దాటిన జంతువులనుకొన్నా!