Friday, June 3, 2011

దైవమిచ్చిన భార్య - చలం



చలం గారేమిటి, ఇలా సంసారపక్షంగా "దైవమిచ్చిన భార్య" అంటున్నారనుకుని ఈ నవల చదవడం మొదలుపెట్టా. చలం రచనలు నాకు ఎందుకు నచ్చుతాయంటే "పుస్తకాలు చిన్నవిగా ఉంటాయి! తొందరగా చదివేయచ్చు!!". ఏ పుస్తకమయినా పెద్దగా లేకుండా చదవడానికి చాలా సులభంగా ఉంటాయి. ఇక చదువుతున్నపుడు కూడా ఇటువంటి అనుభూతే!


రాధాకృష్ణ అల్లరి చిల్లరిగా తిరిగే ఒక హైస్కూలు కుర్రవాడు. రాధాకృష్ణ నాన్న ఆ వూళ్ళో తాశిల్దారు. ఆ వూళ్ళోకి దిగిన జమీందారు కూతురు పద్మావతితో రాధాకృష్ణకి స్నేహం కుదురుతుంది. ఇద్దరూ తోటల్లో ఆడుకోవడం, పాడుకోవడం చేస్తూ ఉంటారు. వయసుతో పాటూ ఇద్దరి స్నేహం కూడా ముదురుతుంది. పద్మావతికి వయసొచ్చాక పేరు మోసిన లాయరుతో పెళ్ళి కుదురుతుంది. ఇక అప్పటినుండి మొదలవుతాయి వీళ్ళిద్దరి కష్టాలు.


పద్మావతికి పెళ్ళి జరిగినా కానీ తమ స్నేహం, ప్రేమ అలాగే కొనసాగాలని ఇద్దరికీ తాపత్రయం. చాటుగా, మాటుగా తోటల్లో కలుసుకుంటూ గాఢంగా ప్రేమించుకుంటూ ఉంటారు. రాధాకృష్ణ తండ్రి పోరు తట్టుకోలేక శకుంతలని పెళ్ళి చేసుకుంటాడు కానీ కాపురం చెయ్యడు. మిగిలిన నవలంతా పద్మావతి, రాధాకృష్ణల విరహ గీతాలతో సర్దుకుపోతున్న సంసారాలతో సాగిపోతుంది.


ఈ నవల ప్రధాన కథానాయకురాలు పద్మావతి! పద్మావతి పాత్ర ద్వారా చలం స్త్రీ గురించి చాలా చెప్పాలని చూసాడు, చెప్పాడు కూడా.

పద్మావతి ఒక సందర్భంలో ప్రియుడిని ఇలా ప్రశ్నిస్తుంది.


స్త్రీలు ఎందుకనుకున్నావ్ ఉంది? జీవితమంటే ఎంత ఉన్నతమయిందో, గాఢమయిందో, పురుషునికి తెలిసేట్టు చెప్పేందుకు, పురుషుల్ని ప్రోత్సహించాలి. స్వర్గానికి ఎత్తేయాలి. గొప్ప పనులకి, గొప్ప ఆదర్శాలకి, గొప్ప ఊహలకి ఉత్సామివ్వాలి. అగ్నితో నింపెయ్యాలి, నిర్జీవమయిన బతుకులోంచి రక్షించాలి




పద్మావతి జీవితమంతా సమాజపు కట్టుబాట్లలో చిక్కుబడి సంసారం వదులుకోలేక, అలాగని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న రాధాకృష్ణతో లేచిపోవడానికి ఇష్టపడక ఎటూ తేల్చుకోలేక సతమతమవుతూ ఉంటుంది. ఇటువంటి ప్రేమాయణాలు చివరికి ఎలా ముగుస్తాయో అలాగే ముగించాడు చలం. కాకపోతే చివరి వరకు ఈ ప్రేమికులిద్దరూ పడే బాధని అద్భుతంగా మనకి చూపిస్తాడు. ప్రియురాలిగా ఉన్నపుడే తమ ప్రేమ బాగుంటుందని, పెళ్ళి అయ్యి ఇంటికి వస్తే తనని అంతగా ప్రేమించకపోవచ్చని పద్మావతి అభిప్రాయం. చలం అభిప్రాయం కూడా ఇదే కచ్చితంగా అని నా అభిప్రాయం!  



No comments: