Wednesday, May 25, 2011

డిస్ట్రిక్ట్ బీ13 - ఫ్రెంచ్ మసాలా పాస్తా



నిన్ననే ఈ సినిమా చూసాను. కొంత సినిమా చూడగానే ఇక అతుక్కుపోయాను టీవీకి. 2004 లో వచ్చిన ఈ ఫ్రెంచ్ సినిమా కొత్త రకం స్టంట్స్ తో ఒక వీడియో గేం చూస్తున్నట్టు సాగింది. ఇందులో ఒక హీరొ డేవిడ్ బెల్ ఇళ్ళ పైనుండి గెంతుతూ ఉంటాడు. భలే సరదాగా ఉంటుంది చూడడానికి ఈ స్టంట్స్. మన జాకీ చాన్ కూడా ఇలాగే గోడలు ఎక్కి, దిగడం చేస్తూ ఉండేవాడు అతని సినిమాలలో. చాలా వరకు ఇలా గెంతడాన్ని మన సినిమాల్లో తాడులతో కానీ, కంప్యూటర్ ఎఫెక్ట్స్ తో గానీ తీస్తూ ఉంటారు. ఈ సినిమాలో అవి రెండూ వాడకుండా డేవిడ్ నిజంగానే గెంతాడట. ఈ గెంతులాటని ఇతనే కనిపెట్టడం విశేషం, ఇలా గెంతడాన్ని పార్కోర్ అంటారట.


కొంచెం కథ చెప్పడానికి ప్రయత్నిస్తాను, ఈ కథ అంతా 2010 లో పారిస్ లో ఉన్న ఒక స్లం ఏరియా లో జరుగుతుంది. ఈ స్లం ఏరియానే డిస్ట్రిక్ట్ బీ13 అంటారనమాట.  ఈ ఏరియాకి ఒక బాస్ (తాహా) ఉంటాడు, వాడి గాంగ్ ఇక్కడ కల్లోలం సృష్టిస్తూ ఉంటారు. పోలీసులతో కూడా గొడవ పడుతూ ఉంటారు. అక్కడే ఉన్న మన హీరో లీటో (డేవిడ్ బెల్) తాహతో గొడవ పడితే, తాహ డేవిడ్ చెల్లెలిని కిడ్నాప్ చేసి తన కాంప్ కి తీసుకు వెళ్తాడు. ఈ గొడవలో డేవిడ్ జైలుకి వెళ్తాడు. రెండవ హీరో (సిరిల్) ఒక అండర్ కవర్ కాప్, దొంగల ముఠాలో చేరి ఆ గాంగ్ లని మట్టు పెడుతూ ఉంటాడు. తాహ దొంగిలించిన న్యూట్రాన్ బాంబ్ ని తీసుకువచ్చే మిషన్ లో సిరిల్ కి లీటొ హెల్ప్ అవసరమవుతుంది. ఈ ఇద్దరూ తాహ ముఠా నుండి బాంబ్ ని, లీటో చెల్లెలుని తాహా చేతిలో నుండి తప్పించడంతో కథ ముగుస్తుంది. 


ఈ సినిమా నుండి మన పూరీ పోకిరి సినిమా కోసం కొన్ని సన్నివేశాలను కాపీ కొట్టాడు. పోకిరి క్లైమాక్సులో మహేష్ బాబు తాడుని పట్టుకుని గెంతడం, సుబ్బరాజుకు తాడు దొరక్క అతని తాడు తెగడం ఈ సినిమా నుండి లేపిందే. ఈ క్లిప్పింగ్స్ ని మన తోటి బ్లాగరు ఇక్కడ పెట్టాడు చూడండి. పోకిరిలో అండర్ కవర్ కాప్ అలోచన కూడా ఈ సినిమా నుండి వచ్చినదే ఏమో? ఈ బ్లాగరు కాపీ కాట్స్ కాటగిరి కింద ఇలాంటి వీడియోలు చాలానే పెట్టాడు.  


ఇంకొక ఫైట్ సీన్ లో ఒక ఆరడుగుల అకారాన్ని తాడుతో చుట్టి పడేయడం ఒక తెలుగు సినిమా లో చూసినట్టనిపించింది. అది ఏమి సినిమానో గుర్తు రావడం లేదు, మంచు మనోజ్ బిందాస్ చేసిన సినిమా అనుకుంటున్నా. ఈ సినిమాలో మనోజ్ పార్కోర్ లాగా గెంతడం కూడా చేసాడు.  


ఈ సినిమాలో హీరోలిద్దరూ స్టంట్స్ మాన్స్ కాబట్టి సినిమా అంతా వీరిద్దరి ఫైట్స్, గెంతులాటలతో సింపిల్ గా సాగుతుంది. కథ పాత చింతకాయ పచ్చడే అయినా ఈ గెంతులతో ఒక కొత్తదనం కనిపిస్తుంది. అలాగే బాక్ గ్రౌండ్ సంగీతం మంచి ఊపు అందిస్తుంది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందట, ఈ సినిమా దర్శకుడు పీర్రె మొరెల్ నుండి వచ్చిన తరువాత సినిమాలు టేకెన్, ఫ్రం పారిస్ విత్ లవ్ అనే సినిమాలు తీసాడు. ఇక సినిమాటోగ్రాఫెర్ గా చాలా సినిమాలకే చేసాడు. ఆ పనితనం ఈ సినిమాలో మనకి బాగనే కనిపిస్తుంది. 


No comments: