Thursday, October 11, 2007

అబ్బా..హాపీ డేస్






వారం క్రితం చూసాను హాపీ డేస్. ఆనంద్, గోదావరి సినిమాలతో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల దగ్గర బాగానే మార్కులు సంపాదించాడు శేఖర్ కమ్ముల. ఈసారి కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నాడు, ఎలా తీస్తాడో అని చాలా ఉత్సాహ పడ్డాను. నన్ను నిరుత్సాహపడనివ్వకుండా చాలా చక్కగా తీసాడు సినిమా. ఇంకొక 4 గంటలు తీసిఉన్నా బోరు కొట్టదేమో అనిపించింది నాకయితే.

కాలేజీ వాతావరణం, అందమయిన అమ్మాయిలు, రాగింగు, గొడవలు, ప్రేమ పురాణాలు, ప్రేమ కలహాలు .... ఇదే సినిమా. శేఖర్ టాలెంట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్రతి పాత్రకి తగిన వాళ్ళని వెతుక్కోవడం. అందరూ కొత్తవాళ్ళయినా చాలా బాగా చేసారు. కాలేజీ మొదలయేముందు ఒక్కొక్కరి టెన్షన్, రాగింగులో కంగారు తర్వత ఫ్రెషర్స్ డే, దాని తర్వాత ఇక పరీక్షలో మునిగిపొవడం చుస్తూ ఉంటే నా కాలేజి రోజులు నా కళ్ళ ముందు గిర్రున తిరిగాయి.

సిద్ధు(సందేష్) మొదటి సినిమా అయినా ఎంతో సునాయాసంగా చేసాడు, మధు(తమన్నా) అయితే చాలా ముద్దుగా ఉనింది, కాకపోతె ఈమె ఇంతకుముందు "శ్రీ" సినిమాలో చేసిందట. ప్రొద్దుటూరు MLA కొడుకు(నిఖిల్) చాలా సరదాగా ఉన్నాడు. ఇతను కడప బాష కాకుండా తెలంగాణ బాషలో మట్లాడడం నాకు నచ్చలేదు. ప్రొద్దుటూరు పక్కన అప్పు(గాయత్రి రావు) బాగా ఉనింది, ఇద్దరికి మంచి జోడి. పొట్టి క్రాఫుతో సరదాగా చేసింది. హాస్యరసాన్ని బాగా పోషించి అవసరమయిన చోట అవేశమయిన సన్నివేశాలనికుడా అదే విధంగా పండించాడు. ఇక tyson(రాహుల్) విషయానికీ వద్దాము, ఇతను చాలా అమాయకుడు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళు అనుకునే రకం. స్నేహితుడు బాగు కోసం త్యాగాలు, తన స్నేహితుడి ప్రేమ కోసం ఇతను పడే బాధ వర్ణణాతీతం! తన సీనియర్ని ప్రేమలో పడవేయడానికి ప్రయత్నించడం సరదాగా ఉన్నాయి. నాకు అందరిలోకి నచ్చిన పాత్ర అంటే ఇదే! tyson కి సీనియర్ గా స్రవంతి(సోనియా) ఎక్కువ మాట్లాడకుండా కళ్ళతోనే చాలా బాగా మాట్లాడింది. శంకర్(వంశీ క్రిష్న) ని స్వార్ధపరుడుగా చాలా బాగా చేసాడు, కాలేజీలో ఇటువంటి వాళ్ళు మనకి తగలకుండా ఉండరు. ఇతని పక్కన సంగీత(మొనాలి చౌదరి) చాలా బాగ చేసింది. సినిమాలో పాటలు సన్నివేశాలని కౌగిలించుకుని ఉక్కిరిబిక్కిరి చేసాయి. కాలేజీ principal అక్కడక్కడా విధ్యార్ధులతో కలుస్తూ మంచి సందేశాలను వదులుతూ ఉంటాడు. శేఖర్ కమ్ముల ఈ సినిమా ద్వారా మంచి అదర్శనీయమయిన కాలేజి జీవితాన్ని చూపించాడు.


ఇక చివరి మాటకి వస్తే tyson బాష కొంచెం ఇబ్బంది పెట్టింది. తెలుగు రాని వాడు మాట్లాడినట్టు మాట్లాడుతాడు. శేఖర్ కమ్ముల సినిమాల్లో ఇటువంటి పాత్రలు చాలా ఉంటారు.

1 comment:

రాధిక said...

ఇలా అందరూ ఈ సినిమా గురించి చెప్పేస్తుంటే నాకు కంగారుగా వుంది.అలా అని ఇప్పుడే చూడలేను.ఏమిచెయ్యాలబ్బా?