Monday, November 2, 2009

కాలాస్త్రి కబుర్లు - నవంబరు 2

సానా దినాల నుంచీ రాద్దామనుకుంటా ఉండా,ఖాళీ లేక రాయలేక పోతా ఉండా. ఈ రోజు కొంచెం నెమ్మళం గుండా, ఇంక సూస్కో ఇరగ రాసేస్తా.



అసలు లేటు ఎందుకంటే మా ఆవిడ ఊర్లో ల్యా. ఇంటి పనంతా నాదే, గిన్నెలు తోమడం, వంట వండడం, గుడ్డలు పిండడం అబ్బ..ఎన్ని పనులుండ్యాయి నాయనా! సచ్చి పోతా ఉండా. అంతే కాదు, నాలుగు దినాల ముందు నా జ్ఞాన దంతం గూడా పీకారు. 2 దినాల వరకు కొంచెం నొప్పి ఉండేది, ఇపుడు బాగనే ఉండాది. పోయిన వారం మా ఊరిలో దీపావళి పండగ జరిగింది, మన కొత్తపాళీ గారు ఇందాకే టపా లో బెట్టారు. అబ్బా..పిలకాయలు తుక్కు లేపారు. 2,3 సమ్మస్సరాల పిలకాయలు కూడా ఏమి డాన్సు సేసారబ్బా? మన కొత్తపాళీ గారయితే నరకాసురుడిగా తుక్కు లేపిండ్లా! నేను, గణేష్ కూడా సిన్న ఏశం ఏసాం.



మా ఊరిలో సాయిబాబా గుడికి సాయిబాబా విగ్రహం వచ్చింది. 4 దినాల నుండీ రోజూ అభిషేకాలు, హోమాలు, మహా ప్రసాదాలతో భక్తి రసం పారింది. మా వాలంటీర్లకి బాబాకి అభిషేకం చేసే అవకాశం ఇచ్చారు. యాడాడనుండో పూజారులు వచ్చి పూజలు చేసారు. ఉదయం నుండి అర్థరాత్రి వరకు చాలా సందడిగా జరిగింది. ఉదయం నుండి రాత్రి వరకు నిలబడుకుని ఉండి నేను 3 ఇంచిలు భూమిలోకి దిగబడిన్యా. ఆదివారం సంతకెళ్ళి 4 ఇంచిలు చెప్పులు కొనేసరికి చెల్లుకి చెల్లు అయిపోయింది. నేను కొంచెం భూమికి దగ్గరగా ఉంటాను కాబట్టి మిగిలిన ఒక ఇంచె కలిసొచ్చింది.



నిన్న మజ్జానం ఏక్ నిరంజన్ సినిమా కి పొయిన్యా. పరవాల్యా సినిమా, పాటలు బాగనే ఉండాయి. రెండో బెల్లు తర్వాత బాంకాక్ పోయి కంపు,కంపు అయింది. పూరీ పెద్దమ్మ బాంకాక్ లో ఉండాదో, ఏందో? ప్రతి సినిమాకి ఆడకి తీసకపోతా ఉంటాడు.సినిమా లో కామెడీ బాగుంది. పూరీ సినిమాలో ఉండేవాళ్ళంతా ఉండారు. అందరికీ పోకిరి సినిమాలో ఉండే జుట్టే ఉంది, అప్పటి నుంచీ ట్రిం చేసుకుంటా ఉండారు లాగుంది. కంగనా కి కూడా ఇదే బాచి జుట్టు. ఆ జుట్టు చూసే సినిమా లోకి తీసుకున్నాడా యేంది? ఆమె తినేదంతా జుట్టుకే పోతా ఉండాది లాగుంది, ఇంక్యాడా పెద్ద కండ లేదు. మకరంద్ దేష్ పాండే చేత ఫిలాసఫీ చెప్పించారు. ఇతను కూడా జుట్టు పోళి బాచ్చే! పోసాని డైలాగులు బాగుండాయి. సోనూ సూద్ కామెడీ కూడా బాగనే ఉంది కానీ లోకల్ టాలెంట్ తీసుకుంటే బాగుండేది. బాబాయ్ టాలెంట్ అంతా సిక్స్ పాక్,తెల్ల తోలు తప్పితే పెద్ద సీన్ లేదు.అదే డబ్బింగ్ విని, విని బోరు కొడుతుంది. హీరోయిన్ విషయంలో కూడా ఇంతే! చార్మీని చూసి అయినా తెలుగు నేర్చుకుంటే నేను సంతోషిస్తాను.



వైయెస్ సచ్చిపోయినాక సోనియా (ఈమెకి మళ్ళీ గాంధీ ఎందుకు యెనకాల) పెద్ద పార్టీ సేసుకుని ఉంటాదేమో? కాంగెస్ పార్టీ సరిత్ర తెలిసినోళ్ళందరికీ ఈ పార్టీ అజెండా పెద్దగా చెప్పక్కలేదనుకుంటా. వైయెస్, జగన్ గ్రూపుని తొక్కుడు బిళ్ళ ఆట ఆడుకుంటుంది. సందట్లో సడేమియా అంటూ యాడాడో దుప్పటేసుకుని పడుకున్న కేశవరావు, జానా రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, మధు యాష్కీ లాంటోళ్ళంతా మంచం దిగి బయటకొచ్చారు. రోశయ్య ఇంక 3 సంవస్సరాలు పండగ చేసుకుంటాడు. కొండా సురేఖ గలభా మొదటికే మోసం అయింది. బాబుకి హోం వర్కు పెరిగింది, రోశయ్య తర్వాత బాబుకే చాన్సు దొరకాలి లెక్క ప్రకారం. బాబుకి టముకు ఏసుకోవడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికలకి కాంగ్రెస్ ప్రజారాజ్యంతో కలుస్తుందన్న రూమర్ ఇపుడు బాగా వేడిగా ఉంది. ఇదే నిజమయితే చిరంజీవి రాజకేయ వేత్తగా ఒక మెట్టు ఎదిగినట్టే! మడిసిగా మూడు మెట్లు దిగినట్టే!



నిన్న రాత్రి మా టీవీలో చాలెంజ్ ప్రోగ్రాం చూసా కాసేపు.ఎలిమినేషన్ రౌండులో పార్టిసిపెంట్స్ ఎవర్ని ఎలిమినేట్ చేయాలో పేర్లు రాస్తున్నారు. ఎవడయితే ట్రోఫీ గెలుచుకోవడానికి అడ్డం అనిపిస్తే వాడి పేరు రాస్తున్నారు.టాలెంట్ బాగా ఉండేవాళ్ళు ఇంటికి వెళ్తే మిగతా వాళ్ళని తొక్కడం వీజీ కదా! ఇక్కడ కూడా బాబు ఇదే విషయం మీద పండగ చేసుకుంటున్నాడు. వైయెస్ తొక్కడం కష్టమేమో కానీ రోశయ్యని మాత్రం ఎడం కాలితో తొక్కేయచ్చు. ఇంకో విషయం వైయెస్ 2004 లో సీయెం అయ్యేముందు ఆస్తులు లక్షల్లోనే! ఇపుడు కొన్ని వేల కోట్లు, ఈ యాపారం యేదో బాగనే ఉంది.



సివరాకరిగా ఇంకో విషయం! ఈనాడు ఇపుడు సెల్ ఫోనులో సదువుకోవచ్చు. నల్ల పండులో ఇందాకే డవున్ లోడ్ చేసాను. కొంచెం నావిగేషన్ కష్టంగా ఉంది.నల్ల పండు బ్రౌజర్ అంత బాగుండదు కాబట్టి ఇంతకు ముందే ఉన్న ఒపెల్ మిని బ్రౌజర్ లో చాలా సుఖంగా చదువుకోవచ్చు. మీకు యాపిల్ పండు, ల్యాకపోతే ఇంకేదన్నా పండు ఉంటే ఉంటే ట్రై చేసుకోండి.


10 comments:

కొత్త పాళీ said...

కుమ్మేసినావ్ అబయా!

రవి said...

శానా బాగుండాది.

Anonymous said...

బాగుండాయి కబుర్లు.
జుట్టు పోలిగాళ్ళని చూసి కుళ్ళుకుంటున్నారంటే , మీది ఖచ్చితంగా బట్టతలే అయ్యుంటుంది.
ఈమెకి మళ్ళీ గాంధీ ఎందుకు యెనకాల - ఇది మాత్రం నిజం . సోనియా కొడుకు రాహుల్, సోనియా భర్త రాజీవ్, సోనియా అత్త ఇందిర ఇలా చెపితేనే ఇప్పటి పిల్లలకి తెలుస్తుంది

Sravya V said...

నిజం గానే ఇరగ రాసారు , చాల బాగున్నాయ్ మీ కబుర్లు . కాకపొతే నేను కామెంటానికి కనీసం ఒక పది నిమషాలు వెతికా ఎక్కడుందా "Post a comment" అని :)

చైతన్య.ఎస్ said...

అన్న.. శానా బాగా జెప్పినవు .. ఒకే తూరి అన్ని ఇసయాలు బాగుండాది కబుర్లు :)

శ్రీ said...

@ కొత్తపాళీ, థాంక్స్ అండ్యా!
@ రవి, థాంక్స్ బా.
@ లలిత, నాకు బట్టతల చాన్స్ లేదు లేండి! --)
@ శ్రావ్య వట్టికూటి, థాంక్స్ అండి. కామెంటుని ఎలా సర్దాలో ఇంకా నాకు తెలియలేదు.వీలయినంత త్వరలో మారుస్తాను.ఇంతకు ముందు రవి గారు కుడా ఇదే మాట చెప్పారు.
@ చైతన్య, నీకు నచ్చినందుకు శానా సంతోసం తమ్ముడా.

Bhãskar Rãmarãju said...

నాయాల్ది తొక్కేసున్డ్లా అబ్బయ్యా.
రచ్చ

మురళి said...

అక్కడక్కడా యాక్సెంట్ మిస్సయ్యింది.. ఓవరాల్ గా చాలా బాగుంది.. మీ మార్కు సెటైర్లతో...

శ్రీ said...

@ భాస్కర్ రామరాజు, శానా సంతోసం అబయా

@ మురళి, అవును. కొన్ని మామూలుగానే రాసేసాను. థాంక్స్.

పరిమళం said...

బాగున్నాయ్ మీ కబుర్లు అన్నీ కలిపి ఒకే టపాలో చెప్పెశారన్నమాట !