Thursday, February 25, 2010

రంగుటద్దాల కిటికీ - పుస్తక ఆవిష్కరణ సభ


రంగుటద్దాల కిటికీ పుస్తక ఆవిష్కరణ సభ మా ఊళ్ళో చాలా బాగా జరిగింది. కొత్తపాళీ గారు తమ బ్లాగులో ఆ విషయాలు ఇప్పటికే రాసేసారు. కొద్ది గంటల ముందే టీవీ9 లో ఈ కార్యక్రమం మీద కొన్ని నిముషాలు ప్రసారం జరిగింది. వీడియో చూసాక నాకు కూడా బ్లాగావేశం వచ్చి ఇలా బ్లాగుతున్నాను.


తాను రాసిన కథల సంపుటి "రంగుటద్దాల కిటికీ" గత సంవత్సరం విజయవాడలో ఆవిష్కరిస్తున్నారని తెలిసి ఆనందపడ్డాను. "ఇటువంటి పండగలు మన ఊరిలో కూడా చేసుకోవాలి కదా" అని అలోచన వచ్చి కొత్తపాళీ గారిని అడిగితే "అలాగే!" అన్నారు. ఇక చూస్కోండి! అప్పటినుండి మా ఊరిలో కనిపించిన అందరికీ చెప్పాను,వచ్చే వారం పుస్తకం ఆవిష్కరించబోతున్నామని.


ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది. మనమా...యూత్ అసోసియేషన్ ప్రెసిడెంటు అయిపోతిమి, మన అసోసియేషన్లో ఉన్న వాళ్ళంతా "అక్కడకి వస్తే పుస్తకం ఫ్రీగా ఇస్తారా" అని అడగడం మొదలుపెట్టారు. ఇంక చాలా మంది "మాకు తెలుగు చదవడమే రాదు,ఇక ఇటువంటి వాటికి వచ్చి మేము చేసేదేముంది?" అని యాష్ట పోయారు. కాకపోతే మా బోర్డుని బతిమాలి కార్యక్రమానికి తీసుకువచ్చా. సాహితీ మిత్రులయితే పిలిచిందే తడవు, ఆప్యాయంగా వచ్చి సదస్సుని జయప్రదం చేసారు.


ఒక సంతోషకరమయిన విషయం ఏమిటంటే ఈ పుస్తకం గురించి మాట్లాడడానికి కొత్తపాళీ గారు మిత్రుడు ప్రసాదరాజు సామంతపూడిని ఎన్నుకోవడం. ప్రసాదరాజుగారు నాకు క్రమశిక్షణ నేర్పి కార్యక్రమాన్ని ఎలా నడపాలో చెప్పి నా చేత రిహార్సల్స్ చేపించి ముందుకు నడిపించారు. పుస్తక ఆవిష్కరణ రోజు రానే వచ్చింది. పది,పదిహేను మంది వచ్చినా కార్యక్రమన్ని మొదలు పెట్టేద్దాం అనుకున్న మాకు 50 మందికి పైగా వచ్చిన సాహితీ ప్రియులని చూసి ఉబ్బితబ్బిబ్బయ్యాము.


మా ఊరికి మొదటి ప్రెసిడెంటుగారయిన శ్రీ సోమయాజులు యెడవల్లి గారు పుస్తకాన్ని ఆవిష్కరించి మొదటి ప్రతి తానా పూర్వాధ్యక్షులు అయిన శ్రీ బండ్ల హనుమయ్యగారికి ఇచ్చారు. అలాగే వేదిక మీద ఉన్న వక్తలు ప్రసాదరాజు సామంతపూడి గారికి, రాఘవేంద్ర చౌదరి గారికి, ఇప్పటి ప్రెసిడెంట్ శ్రీ చలపతి కోడూరి గారికి ఇచ్చారు. అనుకున్నట్టే ప్రసాదరాజు గారు అద్భుతంగా మాట్లాడి మమ్మల్నందరినీ ఆకట్టుకున్నారు.రాఘవేంద్ర చౌదరి గారు కూడా తన శైలిలో చక్కగా మాట్లాడారు. చివరగా కొత్తపాళీ గారు తన కథల గురించి మాట్లాడారు.


మనలో రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాసేవాళ్ళకి ఇలా ప్రోత్సాహం ఇస్తే మరింతగా రాస్తారు, అలాగే రాసేవాళ్ళని చూసి కొత్తవాళ్ళకి రాయాలని కోరిక కలిగితే సంతోషం! లేదూ, రాసినవాళ్ళ పుస్తకం కొనుక్కుని చదివితే ఇంకా సంతోషం!!


ఈ కార్యక్రమ వివరాలు ఇప్పటికే ఆంధ్రజ్యోతి,ఈనాడులో వేసారు. ఇక ఈరోజే టీవీ9 లో కూడా ప్రసారం చెయ్యడం జరిగింది. మీరు టీవీ9 లో చూడలేకపోయారని ఫీల్ అవ్వద్దండి. మీ కోసం ఆ వీడియో ఇక్కడ ఉంచుతున్నాను చూడండి.
వీడియో చివరలో కొత్తపాళీ గారి ఇంటర్వ్యూ కూడా ఉంది, తప్పక చూడండి.



ఈ వేసవిలో అమెరికాలో బ్లాగర్స్ మీట్ కూడా ఒకటి పెడదామని అనుకుంటూ ఉన్నాను. మీరేమంటారు?



2 comments:

cbrao said...

Please advise the date for bloggers meet so that people can plan in advance.
How about 2nd May 2010?

శ్రీ said...

తప్పకుండా!
అందరికీ అందుబాటైన సమయంలో చేసుకుందాం.
అమెరికాలో ఉన్న బ్లాగర్లందరి అభిప్రాయం తీసుకుని ఒక ప్రదేశం,సమయం ఎన్నుకుందాం.