Saturday, July 16, 2011

జిందగీ నా మిలేగీ దుబారా - జీవితం మళ్ళీ మళ్ళీ దొరకదు



హృతిక్ రోషన్, అభయ్ డియోల్, ఫర్హాన్ అక్తర్, కత్రీనా కైఫ్ లాంటి భారీ తారాగణంతో ఉన్న ఈ సినిమా మీద చాలా అంచనాలే ఉన్నాయి. దిల్ చాహ్తా హై సినిమాకి దర్సకత్వం వహించిన ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాకి నిర్మాత, అంతే కాకుండా ఇందులో ఒక ముఖ్య పాత్ర కూడా చేసాడు. డేవ్ డీ సినిమాలో చంద్రముఖిగా నటించిన కల్కి కోష్లిన్ ఈ సినిమాలో మళ్ళీ అభయ్ డియోల్ కి ప్రియురాలిగా నటించింది. ఫర్హాన్ సోదరి జోయా ఈ సినిమాకి దర్శకత్వం చేసింది. 


కథలొకి వస్తే కబీర్ (అభయ్ డియోల్) కి నటాషా (కల్కి) తో పెళ్ళి కుదురుతుంది. పెళ్ళికి ముందు తన చిన్ననాటి స్నేహితులు అర్జున్ (హృతిక్), ఇమ్రాన్ (ఫర్హాన్) తో కలిసి స్పెయిన్ లో బాచిలర్ పార్టీ చేసుకుందామని ప్లాన్ చేసుకుంటారు. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేక క్రీడని మిగతా వారికి పరిచయం చెయ్యాలి. ఈ ప్రయాణంలో వీరికి కత్రీనా కైఫ్ పరిచయం అవుతుంది. ఈ సాహస ప్రయాణం వాళ్ళ జీవితాన్ని చాలా మార్చేస్తుంది, అది ఎలా మార్చింది అన్నదే ఈ సినిమా. 

సినిమాలో కామెడీ, సెంటిమెంటు బాగా పండింది. ఈ ముగ్గురూ కారులో వెళ్తూ ఉండడం చూస్తుంటే దిల్ చాహ్తా హై గుర్తుకు వస్తుంది. ముగ్గురూ ఎన్నుకునే స్కూబా డైవింగ్, స్కై డైవింగ్, బుల్ ఫైటింగ్ ని బాగా చూపించాడు, చూసినవాళ్ళందరికీ వీటిని మనం కూడా ప్రయత్నించాలి అని అనిపిస్తుంది ఒక్క చివరిది తప్ప. ముగ్గురు కలిసి సరదాగా చేసే చిలిపి పనులన్నీ బాగా నవ్వించాయి. అభయ్, ఫర్హాన్ కామెడీ టైమింగ్ చాలా బాగుంది. ఎదుటివారి నుండి రహస్యాలని రాబట్టడానికి అభయ్ ప్రయత్నించే ట్రిక్ మజాగా ఉంది.

జోయా అక్తర్ దర్శకత్వం చాలా బాగుంది. రెండున్నర గంట అపుడే అయిపోయిందా అనిపిస్తుంది ఈ సినిమా చూసాక. కత్రీనా కైఫ్ కూడా పరవాలేదనిపించింది. హృతిక్ ఎప్పటిలాగే చాలా బాగా నటించాడు. కత్రీనాతో ప్రేమాయణం చాలా ఎమోషనల్గా సాగుతుంది. ఫర్హాన్ తన తండ్రిని కలుసుకునే సీనులో చాలా అద్భుతంగా చేసాడు. సినిమాని తప్పకుండా చూసెయ్యచ్చు. మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది ఈ సినిమా.


2 comments:

Unknown said...

నేను రేపు చూడబోతున్నానండీ ఈ సినిమా. ఇప్పటి వరకూ అన్ని సమీక్షలూ కూడా మీలాగే సినిమా బావుందనే చెప్పాయి.. So I am really looking forward to it..

శ్రీ said...

@ ప్రసీద, తప్పకుండా చూడండి. రివ్యూలకంటే సినిమా చాలా బాగుంది.