కొంతమందిని చూస్తే గౌరవించాలని అనిపిస్తుంది. ఈ గౌరవం అనేది అడిగితే ఇచ్చేది కాదు! అయా వ్యక్తులని, వారి ప్రతిభా పాటవాలను చూసి మనకే గౌరవించాలనిపిస్తుంది. కిరాయి కోటిగాడు సినిమాలో శ్రీదేవి ఒక సన్నివేశంలో ఇలా అంటుంది "మా పెరట్లో ఏపుగా పెరిగిన తాటిచెట్టు కూడా నీకంటే పెద్దదే!" పెద్దరికం ఒక్కటే గౌరవానికి కారణం కాదు! వ్యక్తుల్ని గౌరవించినట్టే కొన్ని సినిమాలని కూడా గౌరవించక తప్పదు.
నిన్న అర్ధరాత్రి ఈ సినిమా చూస్తూ అలసట వల్ల కాసేపు నిద్ర పోయా. సినిమా ఏమో చాలా బాగుంది. ఈ సినిమాకి నేను సరిగ్గా గౌరవించడం లేదని అనిపించి పూర్తిగా నిద్రలోకి జారుకున్నా. ఈరోజు సినిమా పూర్తిగా చూసాక గుండె బరువెక్కి మంచి సినిమా చూసిన ఆనందం కలిగింది.
ఫిన్లాండ్ దేశం రష్యాతో రెండవ ప్రపంచ యుద్ధం జరుపుతున్న రోజులవి. మగవాళ్ళు యుద్ధానికి వెళ్ళి వీరస్వర్గం పొందిన వారి పిల్లలని పెంచడం కష్టమవుతుంది ఆడవాళ్ళకి. అటువంటి పిల్లలని పక్క దేశం అయిన స్వీడన్ దత్తత తీసుకుని వాళ్ళని అవసరమయిన కుటుంబాలకు చేరవేస్తుంది. ఇలా ఇంచుమించు ఢెబ్బయ్ వేలమంది పిల్లలని స్వీడన్ కి చెందిన కుటుంబాలు దత్తత తీసుకుంది.
ఏరో నాన్న యుద్ధంలో చనిపోగా తల్లి విధిలేని పరిస్థితుల్లో పిల్లవాడిని స్వీడన్ కి చెందిన ఒక కుటుంబానికి పంపుతుంది. ఏరోకి ఇల్లు వదిలి వెళ్ళాలనిపించదు, కొత్తగా చేరిన ఇంటికి అలవాటుపడక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఏరోని దత్తత తీసుకున్న కుటుంబం ప్రమాదవశాత్తు వాళ్ళ అమ్మాయిని పోగొట్టుకుంటారు. అమ్మాయినే దత్తత తీసుకుందామనుకుంటే అబ్బాయి ఇంటికి రావడం పెంపుడు తల్లి సీనేకి ఇష్టం ఉండదు.
కొన్ని రోజులయ్యాక ఏరో, సీనేకి దగ్గరవుతాడు. అంతా బాగనే ఉంది అనుకున్న సమయంలో యుద్ధం ముగిసి ఫిన్లాండులో పరిస్థితులు చక్కబడుతాయి. దత్తత ద్వారా స్వీడన్ కి వచ్చిన పిల్లలందరూ తిరిగి ఫిన్లాండ్ వెళ్ళిపోతారు. మొదట్లో స్వీడనులో ఉండడానికి ఇష్టపడని ఏరోకి ఇపుడు ఫిన్లాండుకి తిరిగి వెళ్ళాలనిపించదు. ఇష్టం లేకనే ఇంటికి తిరిగి వెళ్తాడు. ఇంటికి తిరిగి వెళ్ళినా పెంపుడు తల్లి మీదనే ప్రేమ ఉంటుంది ఏరోకి. ఎప్పటికయినా తనని మళ్ళీ ఇంకెక్కడికో పంపేస్తుందని భయపడుతూ పెరుగుతాడు ఏరో. ఏరో అసలు తల్లికి దగ్గరవుతాడా? పెంచిన తల్లికి దగ్గరవుతాడా? తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే!
మంచి సెంటిమెంటు ఉన్న కథ, ఆకట్టుకునే కథనంతో సినిమా చాలా బాగా ఉంది. సినిమాలో లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. స్వీడనులో ఏరో ఇల్లు ఎగుడు, దిగుడు కొండల మధ్యలో ఉంటుంది. చిన్న పిల్లవాడయిన ఏరో యుద్ధం వల్ల ఇల్లు వదిలి వెళ్ళి ఇంకో ఇంట్లో సర్దుకుపోవడానికి చేసే ప్రయత్నం చాలా బాగుంటుంది. పెంపుడు తల్లి ఏరోకి తన కూతురు గురించి చెప్పే సీన్ చాలా బాగుంటుంది. అలాగే క్లైమాక్సులో నిజం తెలుసుకున్న ఏరొకీ, తల్లికి మధ్య జరిగే సన్నివేశం చాలా టచింగ్గా ఉంది.సినిమా చూస్తున్నంతసేపు మాతృ దేవోభవ, ఇల్లాలు ప్రియురాలు సినిమాలు గుర్తుకు వచ్చాయి.
4 comments:
శీర్షిక చూసి 'మాతృదేవోభవ' ని కాపీ చేసిన విదేశీ సినిమానా అని డౌట్ వచ్చిందండీ.. ఇరానియన్ సినిమాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయ్ ఇలాంటి కథలు..
హహహ
-- శీర్షిక చూసి 'మాతృదేవోభవ' ని కాపీ చేసిన విదేశీ సినిమానా అని డౌట్ వచ్చిందండీ..--
Movie bavundi...feel good movie..Thanks for the review which made me watch the movie..
Sapna..
మీకు నచ్చినందుకు థాంక్స్.
Post a Comment