మన బల్ల పైన (డెస్క్ టాపు) కి తుప్పు పట్టినందువల్ల రెండు నెలల నుండి మా తమ్ముడు ఒడి పైన (లాపుటాప్) వాడుతున్నా. ఈ లాపీలో శబ్దం వినపడదు.
"ఈ లాపీకి ఏమయింది బ్రదర్?" అని నందమూరి స్టెయిల్ లో అడిగాను తమ్ముడిని.
"దీంట్ల స్పీకర్ ఖరాబయ్యింది అన్నయ్యా" జవాబిచ్చాడు తమ్ముడు.
పని లేని మంగలోడిని కదా, పిల్లికి బొచ్చు తీసాక ఇంకా ఎదో ఒకటి చేద్దామని నిర్ణయించుకున్నా. ఇంకొంచెం సమాచారం కోసం కొన్ని ప్రశ్నలడిగాను.
విస్టా లోడ్ చేసినప్పటి నుండి ఇలాగయ్యిందని నా పరిశోధన మొదలుపెట్టి జారిపోతున్న లాగుని బిగించా.
ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చెడ్డీ (లాగు) కిందకి జారడానికి రెండు కారణాలున్నాయి.
మొదటి (Feel Good) కారణం: అయిదు పాకులున్న బాడీకి ఆరో పాకు చేరడం.
రెండవ (చేదు నిజం) కారణం: పెరిగిన పొట్ట చెడ్డీని కిందకి తొయ్యడం.
పరిశోధనలో మనం మొదట చెయ్యాల్సిన పని ఏమిటంటే ఇబ్బందిని సరిగ్గా అర్ధం చేసుకోవడం.
ఈ లాపీలో స్పీకర్ మీద ఎర్ర మూత ఉంటుంది ఇలా.
ఎలుకని లాపీ స్పీకర్ మీదుగా కెలికితే ఈ విధంగా తన గోడు చెప్పుకుంటుంది.
'No Audio output device installed'
శబ్ద తీవ్రత తగ్గి ఉందేమోనని ఒకసారి చెక్ చేసి చూసా. అంతా బాగనే ఉంది. స్పీకర్ దగ్గరకెళ్ళి ఎలుక కుడి చెవి మెలి వేస్తే 'అసలు శబ్ద చోదకులే లేరు" అని తిట్టింది.
లాపీ మోడల్ ప్రకారం అంతర్జాలంలో శబ్దానికి సంబంధించిన "డ్రైవరు రాముడు" లాంటి డ్రైవరుని కాలరు పట్టుకుని కిందకి లాగా.
ఊహూ, శబ్దం లేదు!
ఇక గూగులక్కని (మీకు అమ్మ, నాకు అక్క. నేను ఇంకా యూత్ కదా...) అడిగా.
"ఒరేయ్ లింగం! నీలాంటి బోడిలింగాలు ఇక్కడ శతకోటి" అని గూగులక్క తిట్టింది.
విస్టా బాధితుల ఆర్తనాదాలు చదివి నా తల ప్రాణం కాలికి (నాకు తోక లేదుగా) వచ్చింది.
అందరి గోడులు చదివి, విని కన్నీళ్ళు తుడుచుకుంటూ కొంతమందికి పనికి వచ్చిన కిటుకులు వాడడం మొదలుపెట్టాను.
మొదటిది: నా లాపీ తయారీదారుడు HP. వాడి ఇంటికెళ్ళి సమరసింహా రెడ్డిలాగా గట్టిగా అరిచా.
ఒరేయ్ HP! నీ ఇంటి కొచ్చా... నీ నట్టింటి కొచ్చా...(తొడలు కొట్టీ, కొట్టీ చామగడ్డల్లాగా కందిపోయాయి)
"వీళ్ళు పనికోస్తారేమో, తీసుకెళ్ళు!" అని HP వాడింట్లో ఉన్న ముగ్గురు చోదకులనిచ్చాడు.
ముగ్గురిలో ఒకడికి మాత్రమే నా బండిని తోలడం వచ్చు. వాడు సరిగ్గా తోలడం మొదలుపెట్టగానే శబ్దం "పింగ్" అనింది.
నా ఆనందం గ్రాండ్ కాన్యాన్ అంచులదాకా వెళ్ళింది. ఆ ఆనందం అయిదు నిముషాలు కూడా నిలవలేదు. మళ్ళీ పాత పాటే!
ఇక్కడ చిన్న తమాషా.
శబ్దం లేనపుడు చోదకులు ఉండరు. తాత్కాలికంగా శబ్దం రాగానే చోదకులు కూడా మనకి కనిపిస్తారు. అప్పటి వరకు పరికరం నిర్వాహకుడి (Device Manager) దగ్గర కూడా లేని చోదకులు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు.
రెండవది: HP తొందర ఆటగాడిని (Quick Player) లాపీలోకి లాగాను. వాడు ఆట మొదలుపెట్టినపుడల్లా శబ్దం కాసేపు పని చేస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది.
మూడవది: అంతర్జాలంలో రామలింగం చెప్పినట్టు ఇంకొకటి ప్రయత్నించాను.
లాపీ నిద్ర లేచేటపుడు ఒక పని చెయ్యమన్నాడు. ప్రాధమిక లోపలకి, బయటకి కట్టడం (BIOS) పైకి ఎక్కి బొత్తం శబ్దాన్ని ఆపేయమన్నాడు.
లాపీకి రెక్కలు తొడగగానే మళ్ళీ శబ్దం వచ్చేసింది. ఈసారి కూడా అయిదు నిముషాలకి శబ్దం ఆగిపోయింది.
చిరంజీవి లాగా మొదటి మూడు దెబ్బలు తిన్నాను. జుట్టు విదిలిద్దామనుకున్నా, గుండు గుర్తుకొచ్చి ఇలా ఫోజులిచ్చా.
మళ్ళీ లాపీని పడుకోబెట్టి, నిద్ర లేపి బొత్తం శబ్దాన్ని ఆపేసాను. అనుకున్నట్టే శబ్దం వచ్చింది. ఇంకో అయిదు నిముషాల్లో మళ్ళీ మామూలుగా మారిపోతుంది. ఈ లోపల ఈ ఆనందాన్ని శాశ్వతం చేసుకోవాలి?
ఎలా ? ఎలా ? జుట్టు పీక్కుందామనుకుంటే గుండు కదా! గుండు కాబట్టి బుర్ర పాదరసం లాగా పని చేసింది.
Idea! ఈ ఐడియా నా జీవితాన్ని మార్చేసింది.
పరికరం నిర్వాహకుడి దగ్గరకెళ్ళి చోదకుడి వివరాలు చూసాను. వాడు బాగా పాత బడ్డాడు. చోదకుడి బుర్రలో కొత్త శక్తిని నింపాను.
నువ్వు టాపు! నువ్వు అది!! నువ్వు ఇది!!! అని రెచ్చగొట్టి కొత్త ఆశలు రేపాను.
అప్పటివరకు "అడవి దొంగ" లో చిరంజీవిలా ఉన్న చోదకుడికి అప్పుడు శారద పాడిన పాట వినిపించా. రాం చరణ్ తేజలా ఉన్న చోదకుడు హృతిక్ రోషన్ లాగా తయారయ్యాడు.
7 comments:
ఫుల్లుగా నవ్వించింది బాబూ టపా. నవ్వించేందుకు ఏమాత్రం స్టంటు లేకుండా భలే సాఫీగా నడిచింది
ha ha ha me HP story harry potter kana bagunadie.
@గీతాచార్య, థాంక్స్!
@రవితేజ, థాంక్స్!
శ్రీ - కేక!!!
HP వాడేమన్నా డబ్బులు పే చేస్తాడేమో చూడు, దీన్ని వాళ్ళ ప్రకటనల్లో వాడుకోవచ్చు.
థాంక్స్ కొత్తపాళీ గారు.
"ఇక గూగులక్కని (మీకు అమ్మ, నాకు అక్క. నేను ఇంకా యూత్ కదా...)"
యాండీ? జోకు మిస్సయ్యానా? మాకు అమ్మయ్యేది మీకు అక్కైతే యూతు మేము కదండీ? :).
బాగా నవ్వించారు - కొంత జ్ఞానం కూడా ప్రసాదించారు. నెనర్లు.
పాయింటే.
మీరు ఫీల్డింగ్ బాగా చేస్తారనుకుంటాను, మంచి కాచ్ పట్టారు.
Post a Comment