ఈరోజు మధ్యాహ్నం మా మూవీస్ లో స్టాలిన్ సినిమా చూసాక ఈ సినిమాకి స్పూర్తిని ఇచ్చిన సినిమాని చూద్దామని కోరిక కలిగింది. సినిమా కోసం వెతికితే అందుబాటులోకి వచ్చింది. ఇక ఆలస్యమెందుకని చూసి పెట్టేసా.
ఈ సినిమాలో మంచి తారాగణమే ఉన్నారు. కెవిన్ స్పేసీ, హెలెన్ హంట్ ఇంకా హేలీ జోయల్ ఆస్మెంట్ ఇందులో నటించారు. కెవిన్ స్పేసీ ఒక గొప్ప నటుడు, ఇతనికి The Usual Suspects (1996), American Beauty (2000) సినిమాలలో ఆస్కార్ అవార్డులు వచ్చాయి. హెలెన్ హంట్ కూడా అద్భుతమయిన నటి. జాక్ నికొల్సన్ తో పాటు నటించిన As Good as it gets (1998) సినిమాలో ఈమెకి కూడా ఒక ఆస్కార్ లభించింది. నైట్ శ్మామలన్ తీసిన The Sixth Sense (2000) సినిమాలో హేలీ చాలా అద్భుతంగా నటించాడు. ఆస్కార్ కి నామినేట్ అయ్యాడు కానీ రాలేదు పాపం. ముద్దుగా ఉండే ఈ కుర్రవాడు చాలా బాగా నటిస్తాడు. ఈ సినిమాలో ప్రముఖ రాక్ స్టార్ అయిన బాన్ జోవీ ఒక ప్రత్యేక పాత్రలో నటించాడు.
తారాగణం గొడవ పక్కన పెట్టి కథలోకి వస్తే ట్రెవర్ (హేలీ) ఏడవ తరగతి చదువుకునే స్కూలుకి సిమొనెట్ (కెవిన్) టీచరుగా వస్తాడు. ట్రెవర్ అమ్మ ఎర్లీన్ (హెలెన్) రెండు ఉద్యోగాలు చేస్తూ పిల్లవాడిని పెంచుతూ ఉంటుంది. ట్రెవర్ తండ్రి (బాన్ జోవీ) ఎపుడొ చిన్నపుడే ఇద్దరిని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. ఎర్లీన్ తాగుడికి బానిసై ఎలాగోలా కాలం గడుపుతూ ఉంటుంది.
సిమోనెట్ స్కూలులో అందరికీ ఒక పరీక్ష పెడతాడు. అది ఏమిటంటే "సమాజాన్ని బాగు పరచాలంటే మీరేం చేస్తారు?" ఈ విషయం మీద అలోచించి చర్చించమంటాడు. ట్రెవర్ కి ఒక ఆలోచన వస్తుంది. తను ఒక ముగ్గురుకి సాయం చేస్తే, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురుకి సాయం చేస్తే ఇలా అందరూ ఒకరికొకరు సాయపడి సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని టీచరుతో, తోటి విధ్యార్ధులతో చర్చిస్తాడు. టీచరుతో సహా పిల్లలందరూ ట్రెవర్ అలోచనని ఖండిస్తారు. కానీ ట్రెవర్ కి తన అలోచన మీద మంచి నమ్మకం ఉంటుంది. అనుకున్నట్టే కొందరికి సాయం చేస్తూ వారిని ఇంకొక ముగ్గురుక్ సాయం చెయ్యమని అడుగుతూ ఉంటాడు.
ఈ లోపల ఒక రిపోర్టర్ కారు ఆక్సిడెంటులో బాగా దెబ్బ తింటుంది. దారిన పోతున్న ఒక మనిషి ఇతనికి తన కొత్త కారు ఇచ్చి వెళ్ళిపోతాడు. రిపోర్టరుకి అర్ధం కాక అసలు విషయం తెలుసుకోవడానికి తీగ లాగుతూ డొంకంతా కదిలిస్తాడు. చివరికి ట్రెవర్ ని కలిసి ఆ పిల్లవాడి అలోచన అందరితో పంచుకోవడంతో కథ కొలిక్కి వస్తుంది.
ట్రెవర్ గా నటించిన హేలీ తల్లిని, టీచరుని కలపాలని చేసే ప్రయత్నంలో చాలా బాగా నటించాడు. ఈ ప్రేమ కథ కొంచెం నిదానంగా సాగి కథలో కొంచెం బోరు కొడుతుంది. ఇక క్లైమాక్సుకొచ్చేసరికి కథ మళ్ళీ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమానే మురుగుదాస్ కాపీ కొట్టి బాగా మసాలా పూసి స్టాలిన్ గా మన మీదకి వదిలాడు. ఈ మురుగిపోయిన దాసే తీసిన ఇంకొక సినిమా గజినీ కూడా మెమెంటోకి కాపీ.
4 comments:
Pay it forward is one of my favorite movies. స్టాలిన్దాసునకు అద్భుతమైన పేరిడితిరి మీరు :)
Thanks గీతాచార్య
ఇంత స్టోరీ ఉందా స్టాలిన్ వెనుక? ఇంతకీ నేనా సినిమా చూడలేదు లెండి :))
తప్పకుండా చూడండి. ఈ సినిమా చాలా బాగుంటుంది.
Post a Comment