Sunday, August 28, 2011

Bliss (2007) -పరువు హత్యలు



టర్కీ దేశంలో ఒక పల్లెటూరిలో కథ మొదలవుతుంది. కథానాయిక మెరియం ని ఎవరో బలాత్కారం చేసి ఉంటారు. ఆ ఊరి సంప్రదాయం ప్రకారం బలాత్కారం చేయబడిన అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి. ఇలాంటి మూఢనమ్మకాలతో జరిపే హత్యలను పరువు హత్యలు అంటారు. వాటి గురించి వీకీలో ఇక్కడ చూడండి. మెరియం కి పాపం, బతకాలని కోరిక! ఆత్మహత్య చేసుకోవడానికి ఇష్టపడదు. ఇక ఊర్లో పెద్ద మనుషులు మెరియం ని ఎక్కడికయినా తీసుకువెళ్ళి చంపేసి రమ్మని సెమాల్ కి చెప్తారు. సెమాల్, మెరియం కి వరస అవుతాడు.  ఇద్దరూ కలిసి రైలెక్కి ఇస్తాంబుల్ చేరుకుంటారు. మెరియం ని చంపడమే సెమాల్ లక్ష్యం. గ్రామ కట్టుబాటు, అమాయకమయిన మెరియం మధ్య సెమాల్ సంఘర్షణకు లోనవడం ఈ సినిమా కథ.

జుల్ఫు లెవనేలి రాసిన కథ ఆధారంగా ఈ సినిమా తీయబడింది. మూఢాచారాల మధ్య మెరియం జీవితం నలిగిపోవడాన్ని ఈ సినిమా ఎత్తి చూపుతుంది.  తను ఏ పాపం చెయ్యకపోయినా గ్రామాన్ని గౌరవిస్తూ చనిపోవటానికి మెరియం సిద్ధపడుతుంది. కానీ ధైర్యం చాలక, జీవితం మీద ఆశతో బతకాలనుకుంటుంది పిచ్చి పిల్ల. కథ మధ్యలో ఇర్ఫాన్ పాత్ర ప్రవేశిస్తుంది. ఇతను ఒక యూనివర్శిటీలో ప్రొఫెసరుగా పని చేసి రిటైరు అయ్యి బోట్ మీద తిరుగుతూ ఉంటాడు. చాందస భావాలతో మూర్ఖంగా ఆలోచిస్తున్న సెమాల్ ని సక్రమ మార్గంలో నడిపించడం ఈ పాత్ర పని.

అందమయిన ప్రకృతి మనకి కనువిందు చేస్తూ సినిమా చాలా వరకు బోట్ మీద సాగుతూ ఉంటుంది. అమాయకురాలి పాత్రలో మెరియం గా ఓజ్గు నమాల్ నటించింది. సెమాల్ గా మురుత్ హాన్, ఇర్ఫాన్ గా తలత్ బులుత్ బాగా నటించారు. సెమాల్ గా మురుత్ హాన్, ఇర్ఫాన్ గా తలత్ బులుత్ బాగా నటించారు. సినిమా ఎక్కడా బోరు కొట్టకుండా మనకి ఆసక్తి కలిగిస్తూ సాగిపోతుంది. చివరలో క్లైమాక్సు ముందు మెలిక జుగుప్సను, గగుర్పాటుని కలిగిస్తుంది. అమాయక జీవితాలతో ఆడుకోవడానికే ముసుగు నీడలో ఈ కట్టుబాట్లు రుద్దుతారు. మనిషి ఈ కట్టుబాట్లని తెంచుకుని ఎప్పటికప్పుడు తనకు తాను చైతన్యవంతుడిగా మార్చుకోవలసిన అవసరం మనకి ఈ సినిమాలో కనిపిస్తుంది.

పరువు హత్యలు మన దేశంలో కూడా బాగా ఎక్కువట. వీకీలో పంజాబ్,ఢిల్లీ,ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతాలలో ఎక్కువ అని చెప్తున్నాయి. మన వైపు కూడా ఉంటాయి కానీ లెక్కల్లో అవి ఇంకా చేరినట్టు లేవు. స్టోనింగ్ ఆఫ్ సూరయా అనే సినిమాలో కూడా ఇలాగే ఒకామెకు అక్రమ సంబంధం అంటగట్టి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. చాలా దారుణమయిన సినిమా ఇది, దీని గురించి సమీక్షలో రాద్దామనుకున్నా కానీ, రాయలేకపోయాను.

No comments: