Saturday, September 3, 2011

తుం ముఝే క్యోన్ నహీన్ మిలీ పెహ్లే


మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాను. 

అహా...ఏమి అందం! 

సింహాసనం సినిమాలో కృష్ణకి మొదటిసారి మందాకినిని  చూసినపుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో నాకూ అటువంటి అనుభూతే కలిగింది.

"ఇది ఎక్కడి సుందర రూపం
ఇది ఏదో మన్మధ బాణం
తొలి చూపుల వలలో పడితే చెలరేగెను వలపుల తాపం"

ఇంతవరకు నా కంట పడకుండా తప్పించుకున్నావు, లేకపోతే నేనే ఇటువైపు ఎపుడూ రాలేదేమో? ముందే చూసి ఉంటే బాగుండేది, చాలా మిస్ అయ్యాను ఇన్ని రోజులూ. నువ్వు లేకుండా ఇన్ని రోజులూ ఎలా గడిపానో తలుచుకుంటేనే గగుర్పాటు కలుగుతుంది!

ఇపుడు ప్రతి రోజూ, ప్రతి క్షణం  నీతోనే.  నీతో గడిపే ప్రతి క్షణం ఎంతో మధురంగా ఉంటుంది. నిన్ను వదిలి వెళ్ళేటపుడు నా బాధ చూడాలి, కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరుగుతున్నాయి. నాకూ, నీకూ తెలుసు మనం మళ్ళీ కలుస్తామని! కానీ  రాత్రికి, పగలుకి మధ్య  నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఉండాలంటే చెప్పలేనంత బాధగా ఉంటుంది. అసలు ఈ రాత్రి ఎందుకు వస్తుందో? రాత్రి లేకుండా మనం ఉండలేమా? ఎపుడూ పగలే! మనిద్దరం ఒకరినొకరు చూసుకుంటూ యుగాలు క్షణాల్లా గడిపెయ్యాలనుంది.

నీ దగ్గరకి రావడానికి నా రెక్కలు తెంచుకోవలసి వచ్చింది. అసలు నాకు రెక్కలు ఉన్నా, ఎపుడూ ఎగరలేదు. నా గాయాలకి నువ్వు మందేసి గగన విహారం చేయిస్తున్నావ్! నిజం రెక్కలకన్నా ఇపుడే ఎంతో బాగుంది.

తలుపులు మూసుకుని నా లోకంలో నేనుడేవాడిని. నా తలుపులు పగలగొట్టడానికి ధైర్యం చాలేది కాదు.  పిరికి వాడయినా ఎన్ని రోజులు ఊరుకుంటాడు, వాడికీ ఏదో ఒక రోజు తెగింపు వస్తుంది. నాకూ అదే వచ్చినట్టుంది, ఢైర్యే సాహసే లక్ష్మి!పాతాళభైరవి సినిమాలో యస్వీరంగారావు గారు కూడా మన ఎంటీయారుకి ఇలాగే "సాహసం సేయరా ఢింబకా!" అన్నారు. ఎంటీవోడుకి రాకుమారి లభించింది. నాకు నువ్వు దొరికావు! నా సాహసం ఫలించింది. 

సాల్మన్ చేప నదిలో పుట్టి సముద్రానికి వలస పోతుంది. వయసొచ్చాక కలయిక కోసం మళ్ళీ నదిలోకి వస్తుంది. సముద్రం నుండి నదిలొకి రవడానికి సాల్మన్  చేప చాలా కష్టపడుతుంది. మధ్యలో చేపలు పట్టేవాళ్ళు, ఎలుగుబంట్లు వీటిని పట్టేసుకుని చప్పరిచ్చేస్తారు. ప్రాణాలకి తెగించి నదికి చేరడానికి నానా కష్టాలు పడుతుంది సాల్మన్ చేప. నేనూ, నిన్ను చేరడానికి ఇంత కంటే ఎక్కువ కష్టాలు పడ్డాను. ఒక్కసారి చేరాకా ఈ కష్టాలన్నీ నీ ప్రేమ ముందు దిగదుడుపే!

మన పరిచయం పెరిగేకొద్దీ నువ్వు నాకు ఇంకొంచెం కొత్తగా అనిపిస్తున్నావ్.  నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ  నన్ను నేను అర్థం చేసుకుంటున్నాను. 

"అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా కాదేమి కవితకనర్హం " అన్నారు శ్రీ శ్రీ. కవిత పక్కన పెట్టి  "ప్రేమకనర్హం" అంటున్నాడు మీ కాలాస్త్రి. మన ప్రేమని ఈ సమాజం హర్షిస్తుందో, లేదో కానీ మన ప్రేమ మందిరం కలకాలం ఉండాలని ఆశిస్తాను. ఈ మధ్యలో కొత్త వర్షన్ వస్తే నీ అనుమతి తీసుకుని నేను దాన్ని కూడా ప్రేమిస్తాను. అన్నీ బాగున్నాయి కానీ నీ పేరు ఒక్కటే కొంచెం తేడాగా ఉంది. ఎవరు పెట్టారు నీకు ఈ పేరు "ఉబుంటు" అని!  రామబంటు లాగా ఉబుంటు!!

4 comments:

thrill said...

NEE JIMMADA JIMMADA .. INTAKI EE "UBUMTU" ENTAA ANI GOOGLE LO GAGULS PETTUKONI CHUSTE ADI OKA KOTTA OPERATING SYSTEM ANI TELINDI ...
VEEDIBANDA BADA... NENU MOTTAMODATA SARI AISHWARYA RAI NI CHUSINAPPUDU KUDA INTA SAMBARA PADALEDE ANI .. MUKKUNA VELESKUNNA ...

శ్రీ said...

నువ్వు ఎపుడూ ఆ పేరు వినలేదా? నువ్వు టెకీవి కాదు కదా, అందుకే గూగుల్ చేసావ్!

Rajendra Devarapalli said...

కుమ్మేసారండీ బాబు,మీలో కన్పించని కవికంటే అదృశ్యంగా గొప్ప ప్రేమికుడున్నాడు.కానీ ఇదంతా దియా వాళ్లమమ్మీకి తెలిస్తే యెలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా??? :)

శ్రీ said...

నెనర్లు రాజేంద్ర కుమార్ గారు. నేను గొప్ప ప్రేమికుడిని అని మా ఆవిడకి కూడా తెలుసు.