Friday, May 25, 2012

అత్తగారి కథలు


సోనియమ్మ: ఏమిటో సింగు గారు. దేశం చాలా క్లిష్ఠ పరిస్తితుల్లో ఉంది.

సింగు గారు: అవును మాజీ. బాబు గారు కూడా తట్టుకోలేక విలవిలలాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్నికలలో గెలవకపోతే బాబు గారు మళ్ళీ చంద్రగిరి గుట్టకెళ్ళిపోతారని అందరూ అనుకుంటున్నారు.


సోనియమ్మ: హయ్యో రామ! నేననేది తెలుగుదేశం గురించి కాదు బాబయ్యా. మన భారతదేశం గురించి.

సింగు గారు: అవునా మాజీ. (సిగ్గుపడుతూ, అయిదు నిముషాల్లో తలపాగా తీసి బుర్ర గోక్కుని మళ్ళీ ఏడు నిముషాల్లో తలపాగా చుట్టేసుకున్నారు).

సోనియమ్మ: ఇంట్లో పెద్ద దిక్కు ఉంటే ఏదో కొంచెం ఉచిత సలహా పడేసేవాళ్ళు. పెద్ద దిక్కు లేని సంసారం అయిపాయ. ఇటలీకి ఫోన్ చేద్దామంటే వాళ్ళకి మన రాజకీయాలు అర్థం కావు.


సింగు గారు: అలాగా మాజీ. 

(అంతకు ముందే తల గోక్కుని ఉండడం వల్ల, ఈసారి సింగు గారికి ఒక అవిడియా వచ్చింది).

సింగు గారు: మాజీ. మీ అత్తగారు పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు చాలా చురుకుగా ఉండేవాళ్ళు. ఆమెగారు ఇటువంటి సమస్యలని ఎన్నిటినో చిటికెలో పరిష్కరించేవారు. మిమ్మల్ని చూసినప్పుడంతా నాకు మీ అత్తగారే గుర్తు వస్తారు. మీ అత్తగారే మళ్ళీ మీలా పుట్టారేమోననిపిస్తుంది. 

(నిద్ర పట్టని ఒక రాత్రి అరుంధతి సినిమా చూసినప్పటి నుండీ సింగు గారికి ఈ అనుమానం మరింత బలపడింది. చటుక్కున ఒక అలోచన వచ్చి...జేజమ్మా....అంటూ పెద్ద రాగం తీసి బొడ్లో దోపుకున్న కత్తి తీసి సోనియమ్మ మీద విసిరాడు.)

సోనియమ్మ అరుంధతి సినిమా చూడకపోయినా చిన్నపుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది కాబట్టి చాలా వేగంగా స్పందించి కత్తి చివరని నేర్పుగా పట్టుకుంది.

ఇది చూసి ఆవేశం తట్టుకోలేక సింగుగారు "నేను చెప్పలా...మేరు ఆ జేజమ్మే...మా ఇందిరా గాంధే మళ్ళీ మీలా పుట్టింది." అని లొడ, లొడా మాట్లాడేస్తున్నాడు.

సోనియమ్మ: ఓసి నీ సినిమా గోల తగలెయ్యా...జేజమ్మ లేదూ, మీ అమ్మమ్మ లేదు. నా అదృష్టం బాగుంది కత్తి పట్టుకున్నా, లేకపోతే ఈపాటికి రాహుల్ కి పట్టాభిషేకం జరిగి ఉండేది.


సింగు గారు: (మనసులో...) "నీ అదృష్టం కాదు మాజీ, హమారా అదృష్టం. అది పోతే ఇది, ఇది పోతే అది..ఏదీ పోకపోతే నీ యమ్మ మొగుడు అంటూ అధికారం కోసం ఎగబడితే ....") డైలాగు పూర్తయేలోపల సింగు గారికి బీపీ పెరిగి అప్రయత్నంగా చెయ్యెత్తి సోనియమ్మ చెంప మీద ఫెటేల్ మని వాయించాడు. 

సోనియమ్మ: "ఓరి ముదనష్టపోడా...నీకిదేం పొయ్యే కాలం రా" అనకుండా కోక ఎగ్గట్టి, ఇటలీ భాషలో సింగు గారిని అమ్మనా బూతులు తిట్టింది. 

చత్రపతి సినిమా డైలాగు ఆవేశం నుండి తేరుకుని సింగు గారు "మాజీ...ముఝే వదిలెయ్ మాజీ...అబ్బ...వదిలెయ్ మాజీ" అని కన్నీళ్ళు తుడుచుకున్నాడు. 

సోనియమ్మ: "ఇంకోసారి ఇలాంటి తెలుగు సినిమాలు చూసావంటే నిన్ను ఉప్పు పాతర వేసేస్తాను" అంటూ సోనియమ్మ ముక్కు చీదింది. 

"నీకింకో విషయం తెలుసా? అత్తగారు చనిపోయేటప్పటికీ నేను ఇంకా బతికే ఉండ్లా...ఆమె ఆత్మ బతికున్న నాలో వచ్చిందంటావా? నెల ఎక్కువ వెధవా?" అంటూ తిట్టింది. 

సింగు గారు: "ఏమో మాజీ, ఆ సినిమాలో అయితే కత్తి పట్టుకోగానే పాట మొదలయింది. నాకింకా అనుమానంగానే ఉంది" అంటూ కుర్చీలొంచి లేచి సోనియమ్మ వెనకున్న ఇందిరా గాంధి చిత్రపటం దగ్గర పరిశీలనగా చూస్తూ నిలబడ్డాడు.

మళ్ళీ ఏమి చెయ్యబోతున్నాడో తెలుసుకుందామని సోనియమ్మ లేచి సింగు గారి పక్కన నిలబడి అత్తగారి చిత్రపటం కేసి తీక్షణంగా చూస్తూ నిలబడింది.

సింగు గారు, తలపాగా తీసి బుర్రని మూడు సార్లు గోకాడు.హఠాత్తుగా ఇందిరా గాంధి చిత్రపఠం లో మార్పు వచ్చింది. గోడకి తగిలించిన ఆమె  చిత్రపఠం మాట్లాడుతుంది.

ఇందిరా గాంధి: "నాకు తెలుసు మీరు ఏదో ఒక దిక్కుమాలిన రోజు ఇలా వస్తారని. నేను రాజకీయాల్లో ఉన్నపుడు ఎత్తులకి, పై ఎత్తులు బాగా వేస్తానని పేరు. ఎంతోమందిని తొక్కి, నా పార్టీని నిలబెట్టా. అడ్డం వచ్చిన వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసా. తోక కత్తిరించి పారేసా".

అత్తగారు కనిపించేసరికి కోడలు గడగడ వణకడం మొదలుపెట్టింది. సింగు గారు మాత్రం "నే చెప్పలే...చెప్పలే...చెప్పలే..." అంటూ మర్యాద రామన్న సినిమాలో సునీల్ లాగా డాన్స్ చెయ్యడం మొదలు పెట్టాడు.

ఇందిరా గాంధి: "ఛళ్...చప్పుడు చెయ్కుండా వినుండ్రి. మధ్యలో మాట్లాడితే నరం తీస్తా బిడ్డా.." అని ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చింది. ఇందిరమ్మ మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది. 

"ప్రతి రోజు నాకు డైరీ రాసే అలవాటు, ఏరోజు ఎవడిని తొక్కానో డైరీలో రాసుకుంటూ ఉండేవాడిని. మీకయితే చక్కగా బ్లాగులున్నాయి, మీకు తోచినవి రాసుకోవచ్చు, మా కాలంలో ఇట్టాంటివి ఎపుడూ చూడలేదమ్మా"... అని కోడలి బుగ్గలు కసిగా పిండింది. 

అరిస్తే మళ్ళీ ఎక్కడ కరుస్తుందోనని సోనియమ్మ గుడ్ల నీరు నింపుకుని అత్తగారి మాటలు వింటూ నిలబడింది. 

ఇందిరా గాంధి: "ఇపుడు మీ ఇద్దరి పరిస్థితి చూస్తూ ఉంటే మీకు ఆ పుస్తకం ఎంతో అవసరం అనిపిస్తుంది". 

సింగు గారు ఉండబట్టలేక "అది ఏమి కితాబ్? మాజీ" అన్నాడు.

ఇందిరా గాంధి: "నీయమ్మ, మధ్యలో మట్లాడతావురా...." అంటూ సింగు జుట్టంతా పీకి పందిరి చేసింది. 

"నేను చెబుతాను కదా, నేను చెబుతాను అన్నాక నేను చెబుతాను, నేను చెబుతున్నాను కదా" అంటూ చెప్పడం కొనసాగించింది.

"నా డైరీలో కొన్ని కీలకమయినవి సేకరించి వాటిని నేను చనిపోయేలోపల ఒక పుస్తకంగా అచ్చు వేద్దామనుకున్నాను. ఈ లోపల ఒక సచ్చినోడు నన్ను కాల్చిండు. ఆ డైరీని మీరిద్దరూ వెతికి నాకొక పుస్తకం అచ్చు వేసారంటే మీ రుణం వచ్చే జనంలో కూడా తీర్చుకోలేను" అంటూ కంట నీరు పెట్టింది.

సోనియమ్మ: తప్పకుండా అత్తయ్యా.. మీ పుస్తకాన్ని "అత్తగారి కథలు" పేరుతో అచ్చు వేసి రోజూ పారాయణం చేస్తాను.

విషయం పూర్తిగా వీళ్ళిద్దరికీ అర్ధమయిపోయిందని ఆమెకి అర్ధమయిపోగానే ఇందిరమ్మ మాటలు ఆపి చిత్రపఠంలోకి మాయం అయిపోయింది.

******************************************************

ఒక వారం రోజుల్లో "అత్తగారి కథలు" పేరుతో సోనియమ్మ ఒక పుస్తకాన్ని వేయించి మొత్తం చదివేసింది. చెన్నా రెడ్డి, జనార్ధన రెడ్డి చాప్టర్లు చదవగానే ఒక అవగాహనకొచ్చి హైదరాబాదుకి ఫోన్ చేసింది.  3 comments:

శశి కళ said...

చాలా బాగున్నాయి అత్తగారి కబుర్లు...
జేజమ్మా...జేజమ్మా...హ..హ..))

PRasad Manepalli said...

Chala bagundi...Keep working on it

Narayanaswamy S. said...

good one