Sunday, October 26, 2008

బరువు లేని బాక్సు

తెల్లవారుజామున 5:56 అయిందని నాకు కుడా అప్పటికి తెలియదు, దానికి 2,3 నిముషాల ముందు అబ్బాయి ఫోన్ చేసాడు. ఇంత ఉదయాన్నే ఫోను రావడం సాఫ్ట్ వేరులో పని చేసే నాకు కొత్త కాదు, ఎదో ప్రొడక్షన్ జాబు అబెండయిందేమో అనుకుని ఫోను తాకా (ఇపుడు టచ్ ఫోనులు కదా! ఫోను ఎత్తడం అనేది అవుట్ డేటెడ్!) "అబ్బాయ్! మన సినిమా హిట్ టాకు వచ్చింది! ఇపుడే బాక్సులు కుడా వచ్చాయి, నేను ఇంకొక గంటలో మీ ఊరికి బాక్సు వేసి నీకు మయిలు పెడతా!" అని గడగడా మాట్లాడి ఫోను తాకాడు! మీరనుకుంటున్నది నిజమే! ఇతను కూడా తాకే ఫోను వాడుతాడు. "హమ్మయ్య! మన సినిమా హిట్ అయింది, ఇక హాయిగా పడుకోవచ్చు" అనుకుని కళ్ళు మూసుకునేముందు గడియారం వంక చూస్తే 5:58 చూపిస్తుంది.

అఫీసుకెళ్ళగానే మీటింగులు, గ్రీటింగుల హడావిడి తగ్గేసరికి లంచ్ సమయమయ్యింది. అబ్బాయి మెయిలు పంపుతాడని అన్నట్టు గుర్తుకువచ్చి జీ-మెయిలు చెక్ చేసా. బాక్సు కాంటినెంటల్ లో వేసాడు, మధ్యాహ్నం 3:30 కి డెట్రాయిట్ వస్తుంది. అంటే ఫ్లైటు 3:30 కి లాండ్ అయ్యి కార్గో ఆఫీసుకి బాక్సు వచ్చేసరికి 4:30 పట్టచ్చు! ఇంటికెళ్ళేటపుడు బాక్స్ పికప్ చేసుకుని దారిలో థియేటర్ లో పడేయచ్చు! పకడ్బందీగా ప్లాను గీసేసామన్న ఫీలింగ్ వచ్చింది, ఇక మిగతా న్యూసు ఏమిటీ అని చూస్తే "వాలుతున్న స్టాకులూ, కూలుతున్న 401కే లూ! తప్ప కొత్తగా ఏమీ కనపడలేదు.

ఇంతలో లంచ్ కి అందరం రెడీ అని మెసేజ్ రావడంతో నా లంచ్ బాక్సు తీసుకుని కాఫెటేరియా కి బయలుదేరాను. 5 నిముషాల తర్వాత అందరూ బాక్సులు తెరిచి తింటూ కబుర్ల మీద పడ్దారు. ఒబామా, మెకైన్ మీద కాసేపు చర్చ జరిగి పాలెన్ కి చేరేసరికి వేడిగా ఉన్న చర్చ కాస్తా నవ్వుల జల్లుతో తడిసింది. కొంతమంది ఒబామా గెలిస్తే బాగుంటుందనీ, మిగిలిన వారు మెకైన్ గెలిస్తే బాగుంటుందని వాదించుకున్నారు. ఇవన్నీ ముగిసాక టాపిక్ రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్ళాయి. ప్రజారాజ్యం రాస్ట్రం మీద ఉన్న కాంగ్రెస్ ఆధిపత్యాన్ని జయించి ప్రజల వోట్లు ఎంతవరకు గెలుచుకోగలవని అనుమానం వ్యక్తం చేసారు. ఇంతలో అందరి భోజనాలయిపోయేసరికి ఎవరి క్యూబికి వారు తిరుగుమఖం పట్టాం.

బాక్సు ఎక్కడ ఉందో అని ట్రాకింగ్ చేద్దామని చూస్తే ఇంకొక అరగంటలో బయలుదేరుతుంది అని ఉంది. ఇక మళ్ళీ ఆఫీసు పని లో తల దూర్చి టక టక లాడిస్తూ కూర్చున్నా! అలా కిందా, మీదా పడి పని పూర్తి చేసి సాయంత్రం 5 కి కార్గో అఫీసుకి బయలుదేరా. అందరూ ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి ట్రాఫిక్ కొంచెం ఎక్కువే ఉంది. కార్గో అఫీసుకి చేరడానికి 20 నిముషాలు పట్టింది. అఫీసు లోపలకి వెళ్ళి కౌంటర్లో ఉన్న వ్యక్తిని అడిగా "నేనొక పాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా" అని. యూనిఫార్మ్ వేసుకున్న అతని చొక్క మీద "జార్జి" అని అందంగా కుట్టుంది. జార్జి కాసేపు కంప్యూటర్ మీద టకటక లాడించి "ఇంకొక 20 నిముషాలు పడుతుంది" అని చెప్పాడు. ఇక చేసేదేమి లేక కారులోకి వచ్చి కూచున్నా.



నా పక్కనే ఇంకొక కారు పార్కు చేసి ఉంది. నల్ల చెవర్లెట్ ట్రక్కు, డ్రైవింగ్ సీట్లో కూర్చొని నాలాగే ఎదురు చూస్తున్నట్లున్నాడు. ఒక 70 ఏళ్ళు ఉంటాయేమో ఆయనకి, తల నెరిసి తెల్లగా ఉంది. ఒక పది నిముషాలకి ముసలాయనకి కార్గో ఆఫీసు నుండి కబురు వచ్చింది. ఇతని పాకేజ్ వచ్చిందంటే నాది కుడా వచ్చిఉండచ్చు. ఎందుకంటే కార్గో ఫ్లైటు లాండ్ అవగానే దానిలో వచ్చిన డబ్బాలనన్నిటినీ పెద్ద ట్రక్కులో కార్గో అఫీసుకి తీసుకువస్తారు.



ఇక ఆలస్యం దేనికని నేను కారు లో నుండి దిగి అఫీసులోకి వెళ్ళాను. లోపల ముసలాయన పాకేజి కి సంబంధించిన పేపర్ వర్కు చేస్తున్నాడు. జార్జి నన్ను చూసి "నీ డబ్బా కుడా వచ్చింది, ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు" అని కొన్ని కాగితాలు ఇచ్చాడు. ముసలాయనకి ఏదో "పెట్" వచ్చినట్టుంది పాకేజిలో. చుట్టూ మెష్ ఉన్న ఒక డబ్బాలో మెత్తటి పరుపు మీద కూర్చుని ఉంది ఒక గోధుమ రంగులో ఉన్న ఒక కుక్క. ఇంతవరకు ముసలాయన ఎదురుచూపులు "కుక్క కోసమా?" అనుకుని ఆయన వైపు తిరిగి "భలే ముద్దుగా ఉంది మీ కుక్క" అన్నా ఇంకేమనాలో తెలీక. ఆయన కుడా నిజమేనన్నట్టు "ఆన్ లైనులో ఫొటో చూస్తే చిన్న కుక్క లాగుంది, ఇక్కడేమో చాలా పెద్దగా ఉంది" అన్నాడు. "ఆహా, ఆన్ లైనులో కుక్కలు కుడా కొనచ్చు! అద్భుతం!" అని నాలో నేనే గొణుక్కుని "ఏమి పేరు పెట్టారు" అని అడిగా. దీని పేరు "హనీ" అన్నాడు కొంచెం ఎమోషనల్ గా! "హనీ నా?, ఇదేమిటి హనీ అంటున్నాడు" అని అలోచిస్తున్న నన్ను చూసి "ఒక 3 నెలల క్రితం మా ఆవిడ చనిపోయింది. నాకూ ఒక తోడు లాగా ఉంటుంది అని దీన్ని కొనుక్కున్నా. మా ఆవిడ గుర్తుగా దీనిని "హనీ" అని !పిలుస్తాను" అని చెప్పి "మళ్ళీ కలుద్దాం" అని బయటకి నడిచాడు.



నా డబ్బా కారులో పెట్టి, కారు లోకి ఎక్కితే పక్కన "హనీ" ని జాగ్రత్తగా కారులో పెట్టుకుంటూ కనిపించాడు ముసలాయన. అతనికి చేయి ఊపి "బాయ్" చెప్పి థియేటర్ వైపు కారుని మళ్ళించాను. డిక్కీలో డెబ్బయ్ పౌండ్ల మూవీ బాక్స్ పెద్దగా బరువనిపించలేదు ఎందుకంటే కారు మోస్తుంది కాబట్టి! బరువెక్కిన నా గుండెని నేనే మొస్తూ రోడ్డు మీద దృష్టి సారించాను.

2 comments:

శ్రీసత్య... said...

బాగుంది..........nice posting.

మీ శ్రీసత్య

శ్రీ said...

మీకు నచ్చినందుకు చాలా థాంక్స్ శ్రీ సత్య గారు.