Friday, October 10, 2008

కొత్త బంగారు లోకం - పెద్ద పీట వేయచ్చు!


తెలుగు ప్రేక్షకులకి విజయదశమి సందర్భంగా దిల్ రాజు అందించిన కానుక "కొత్త బంగారు లోకం" సినిమా.

టీనేజ్ వయసులో ఉన్న ప్రతి యువతీ,యువకుల స్వప్నం ఈ కొత్త బంగారు లోకం. దర్శకుడిగా తొలి సారి పరిచయమయిన శ్రీకాంత్ అడ్డాల సినిమాని చాలా చక్కగా తీసాడు.హాస్యపరమయిన సంభాషణలు,బరువయిన తల్లిదండ్రుల భావాలు ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేసి బరువయిన గుండెతో ఇంటికి పంపడంలో దర్శకుడు విజయం సాధించాడు. ఇటువంటి ప్రేమ కధా చిత్రాలకి కెమెరా పనితనం చాలా అవసరం, ఈ పనిని చోటా కే నాయుడికి ఇవ్వడం నిజంగా అభినందనీయం! చోటా ప్రతి సన్నివేశాన్ని చాలా అందంగా తీసాడు.


హపీడేస్ తరువాత వరుణ్ సందేశ్ కి వచ్చిన రెండవ అవకాశాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నాడు. టీనేజ్ కుర్ర్రాడిగా చాలా చలాకీగా నటించాడు. గోదావరి యాస కొంచెం కష్టపడి నేర్చుకున్నాడేమో అనిపించింది. ఇంటరు కుర్రాడిగా సరిపోయాడు, డాన్సులు బాగా ఎనర్జీతో చేసాడు. ఇక స్వప్నగా నటించిన శ్వేత బసు ప్రసాద్ దిల్ రాజుకి జెనీలియా లోటు తీర్చింది. ఇంతకు ముందు మక్కడీ, ఇక్బాల్ సినిమాలో ప్రతిభకి గానూ జాతీయ అవార్డ్ పొందిన శ్వేత వరుణ్ సందేశ్ సరసన పోటీ పడి నటించింది. చిత్రంలో శ్వేత "ఎక..డా", "ఏపూ...డూ" అని గారాలు పడిపోతూ మాట్లాడే మాటలు ప్రేక్షకులని బాగా నవ్వించాయి.



వరుణ్ తల్లిదండ్రులుగా జయసుధ, ప్రకాష్ రాజ్ సరిపోయారు. టీనేజ్ కుర్రాడికి తండ్రిగా ప్రకాష్ రాజ్ తన సహజ శైలిలో నటించాడు. శ్వేత తండ్రిగా ఆహుతి ప్రసాద్ కొత్తగా, వైవిధ్యంగా కనిపించాడు. ఆహుతి ప్రసాద్ చందమామ సినిమా నుండి కొంచెం కొత్తగ నటించడం అలవాటు చేసుకున్నట్టున్నాడు. బ్రమ్హానందం కామెడీ సరే సరి! సినిమాలో ఫిజిక్స్ లెక్చరర్ పాత్ర పోషించిన "రమేష్ రావు" నటన చెప్పుకోదగింది. ఇంతకు ముందు గమ్యం సినిమాలో మాజీ నక్సలైటుగా అందరి మెప్పు పొందిన రమష్ రావు ఈసారి లెక్చరర్ గా బాగా నటించాడు, తెలుగు ప్రేక్షకులకి ఒక కొత్త, మంచి ఆర్టిస్ట్ దొరికినట్టే! ఇతను కీర్తిశేషులు రావు గోపాలరావు కుమారుడు కావడం విశేషం!


ఇక పాటల విషయానికి వస్తే "నిజంగా నేనేనా?" పాట వినదానికీ, చూడడానికి చాలా బాగుంది. "నేననీ, నీవనీ.." పాత చిత్రీకరణ కుడా చాలా అందంగా తీసారు.


ఈ దసరా సందర్భంగా విడుదలైన సినిమాలల్లో "కొత్త బంగారు లోకం" కి పెద్ద పీట వేయచ్చు! కుటుంబ నేపధ్యంగా తెలుగు సినిమా నిర్మించి, వ్యాపారపరంగా విజయం సాధిస్తున్న "దిల్ రాజు" నిజంగా అభినందనీయుడు.

No comments: