Tuesday, May 26, 2009

2009 మంత్రుల జాబితా

*** ఈ టపా లోని పాత్రలు, సన్నివేశాలు పూర్తిగా కల్పితం. కేవలం నవ్వుకోవడానికి మాత్రమే రాసినదిగా పాఠకులు భావించవలసిందిగా సూచన ***ఉదయం ఆరుకంతా మెలకువ వచ్చింది భాంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.నో. పోజశేఖర్ రెడ్డికి. ఉన్న కొద్ది జుట్టుకి తలస్నానం చేసి నవ్ రతన్ నూనె పూసుకుంటూ "కూల్ కూల్" అని ముసి ముసి నవ్వులు నవ్వాడు. భాంధ్ర నుండి తెచ్చిన తెల్ల పంచె చుట్టుకుని భాంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జి సూరప్ప కుయిళీ కి ఫోన్ చేసి "ఇదుగో సూరప్పా! లేసినా?" అన్నాడు. అపుడే లేసిన సూరప్ప కుయిళీ ఫోను చెవి దగ్గర పెట్టుకుని "ఇపుడే స్నానం అయిందప్పా.. ఇంకొక 10 నిముషాల్లో ఓడోడి బస్తాను" అని కొంచెం కన్నడ, తెలుగు కలిసిన భాషలో చెప్పాడు.
సూట్ కేసు తీసి "కొత్త మంత్రుల జాబితా" అన్న ఫైలును చూస్తూ ప్రతి 5 నిముషాలకి మీసం దువ్వుకుంటూ కూర్చున్నాడు పోజశేఖర్ రెడ్డి. 20 నిముషాల తర్వాత బయట నుండి కారు హారన్ వినిపించడంతో కిటికీ లో నుండి బయటకు చూసాడు పోజశేఖర్ రెడ్డి. కారులో వెనక సీట్లో కూర్చుని చేతులూపుతూ "బన్ని రెడ్డీ" అంటూ కనిపించాడు సూరప్ప కుయిళీ. ఫైలుని జాగ్రత్తగా సూట్ కేసులో పెట్టుకుని పంచె ఎగ్గట్టుకుని కారు వైపు నడిచాడు పోజశేఖర్ రెడ్డి. కారు రివ్వున జనపథ్ వైపు సాగింది.
రెండు గంటల తరువాత కారు జనపథ్ లో రోడ్ నంబర్ 10 లోకి తిరిగింది. గేటుకి కాపలాగా ఉన్న గూర్ఖా సిగరెట్టు పక్కకి విసిరి గేటు తీసి, ప్రతి రెండు, మూడు రోజులకి ఇక్కడకి వస్తున్న రెడ్డిగారికి సలాం చేసాడు. సూరప్ప కుయిళీ కట్టుకున్న స్విస్ గడియారం 10 గంటలు కొట్టడానికి ఇంకా 24 నిముషాల దూరంలో ఉంది. "మాజీ హిప్పుడు పింక్ పాలెస్ మే ఉన్నాడు హై!" పళ్ళికిలించి చెప్పాడు గూర్ఖా. గేటు దాటి ఒక 34 మైళ్ళు నల్లని తారు రోడ్డు మీద ప్రయాణించిన తర్వాత ఒక అందమయిన బంగళా ముందు ఆగింది కారు. "ఇది అమ్మగారికి తుంబా ఇష్టమయిన బంగళా" కులుకుతూ చెప్పాడు సూరప్ప కుయిళీ. ఇద్దరూ కారులో నుండి దిగి నడుచుకుంటూ విజిటర్స్ గది చేరుకుని టోకన్ తీసుకున్నారు. అమ్మగారిని చూడడానికి చాలా సమయం ఉండడంతో ఇద్దరూ కంప్యూటర్ గదిలో వారం రోజుల ముందు విడుదల అయిన తెలుగు సినిమాని ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకుని చూస్తూ ఉన్నారు. మూడు తెలుగు, రెండు కన్నడ సినిమాలు చూసిన తర్వాత టోకన్ నంబర్ పిలవడంతో ఇద్దరూ పంచెలు ఎగ్గట్టుకుని లేసారు. అప్పటికి తల ఎండి పోయి ఉండడంతో పోజశేఖర్ రెడ్డి తనతో తెచ్చుకున్న నవరతన్ నూనెని తలకి పూసుకుని, కొంచెం సూరప్ప కి కుడా ఇచ్చాడు. బట్టతల వెనక నూనె పూసుకుంటూ సూరప్ప కుయిళీ సిగ్గు పడుతూ "కూల్..కూల్" అన్నాడు.
అమ్మగారి గదిలోకి ఇద్దరూ ప్రవేశిస్తూ ఉండగా ఎదురుగా తెల్ల చొక్క, పంచె ధరించి కండువాలో ముఖం దాచుకుంటూ ముక్కు చీదుకుంటూ ఒక మనిషి రావడం గమనించారు. చొక్కా కి తగిలించుకున్న విజిటర్ బాడ్జి "తుమార స్వామి, బెంగళూరు" అని స్పష్ఠంగా చూపిస్తుంది. ఆశ్చర్యంతో పోజశేఖర్ రెడ్డి సూరప్ప కుయిళీ ముక్కు మీద వేలు వేసాడు. తను కూడా వెయ్యాలేమోనని సూరప్ప కాలి ముని వేళ్ళమీద లేచి పోజశేఖర రెడ్డి ముక్కు మీద వేలు వెయ్యడానికి నానా ప్రయత్నాలు చేసాడు. పోజశేఖర్ రెడ్డి తన కంటే బాగా పొడుగు కాబట్టి ఎదురుగా వస్తున్న తుమార స్వామి ముక్కు మీద వేలు వేసి విజయ గర్వంతో రెడ్డి వైపు చూసాడు. ఎదురుగా సూరప్పని చూసి తుమార స్వామి "దొడ్డప్పా..." అని గట్టిగా కౌగలించుకుని తనివితీరా ఏడ్చాడు. తననిక్కడ చూసినట్టు బెంగళూరులో ఎవరికీ చెప్పద్దని తుమార స్వామి ఇద్దరి దగ్గరా ఒట్టేసుకుని బయటకి నడిచాడు. పింక్ టేబిల్ కి ఇవతలి వైపు ఉన్న పింక్ కుర్చీల మీద ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. అవతలి వైపు, అటువైపు తిరిగి అలోచిస్తూ ఉన్న అమ్మగారు ఇటువైపు ఎపుడు తిరుగుతారా? అని రెండున్నర గంటల పైగా వేచి చూసారు.
కుడి తొడ మీద "ఛెళ్" మన్న బెత్తం దెబ్బకి ఇద్దరూ ఉళిక్కి పడి లేచారు. ఎదురుగా పింక్ ఇటాలియన్ ట్రెడిషినల్ డ్రెస్సులో కుడి చేతిలో పింక్ బెత్తంతో అమ్మగారు దర్శనమిచ్చారు. ఇద్దరూ లేచి అమ్మగారికి సలాం చేసి వచ్చిన విషయం గురించి చెప్పారు. పోజశేఖర్ రెడ్డి తనతో తీసుకు వచ్చిన సూట్ కేసు నుండి కడపలో రాసుకున్న "2009 మంత్రుల జాబితా" ని అమ్మగారికి కుడి చేత్తో అందించాడు. అమ్మ తెలుగులో రాసిన జాబితాని ఇటాలియన్,కన్నడ మార్చి భాషలోకి మార్చి తెలుగు కాపీని రెడ్డికి, కన్నడ కాపీని కుయిళీకి ఇచ్చి ఇటాలియన్లో ఉన్న జాబితాని చదవడం మొదలుపెట్టింది. ప్రతి శాఖ తమ్ముడికో, బావకో, చెల్లికో కట్టబెట్టడం చూసి "బాగా రాసావ్" అన్నట్టు మెచ్చుకోలుగా చూసింది అమ్మ. "పంచాయత్ రాజ్ మీ ఆవిడకి ఇవ్వచ్చు గదా? ఎందుకు ఇవ్వలేదు?" అని నిలదీసింది అమ్మ. పోజశేఖర్ రెడ్డి సిగ్గుపడుతూ ఆమె ఎన్నికల్లో నిలబడలేదు అన్న విషయాన్ని అమ్మకి గుర్తు చేసాడు. ప్రతి సారి ఎదో ఒక పదవి ఇస్తున్న బెత్తె రెడ్డికి ఈసారి ఏమీ ఇవ్వక పోవడం చూసి అమ్మ రెడ్డికి తొడపాశం పెట్టింది. రెడ్డికి కుడి పక్క కూర్చున్న సూరప్ప కుయిళీ ఎడం చేత్తో రెడ్డి ముక్కు మూసాడు అరవడానికి అవకాశం లేకుండా. కమిలిపోయిన తొడమీద రుద్దుకుంటూ "ముందు చూపుగా తొక్కాను" అని గొంతులో కాసిన్ని నీళ్ళు పోసుకుని నమిలాడు. కే.పీ.శివాకర్ రెడ్డికి కూడా ఏ పదవి లేకపోయేసరికి మళ్ళీ రెడ్డికి తొడపాశం పెట్టింది అమ్మ. ఈసారి ముందే ఊహించిన రెడ్డి తన ఆర్తనాదాన్ని మింగేసి కుయిళీ ముక్కు మూసాడు. రెడ్డి గొంతులో నీళ్ళు పోసి "శివాకర్ ని కూడా తొక్కావా?" అని అమ్మ ప్రశ్నించింది? తల ఊపుతూ సమధానం ఇచ్చే లోపలే కుయిళీ రెడ్డికి కసితీరా తొడపాశం పెట్టాడు. అలా తొడపాశాల ఘట్టం కొన్ని గంటల పాటూ ఏకధాటిగా జరిగాయి. ప్రతి గంటకి ఒక సేవకుడు అమ్మకి 5 పింకు బెత్తాలు, రెండు గ్లాసులు హార్లిక్సు ఫ్లాస్కులో పోసుకుని తెచ్చేవాడు.
ఢిల్లీ నుండి హైదరాబాదు దిగడంతోటే రెడ్డిని ఎప్పటిలాగే చిపోలో హాస్పిటల్లో ప్రత్యేక తొడల వార్డులో జాయిన్ చేసాడు సూరప్ప కుయిళీ. తొడయాలజీ స్పెషలిష్టు డా.యమ పాశం రెడ్డికి ప్రధమ చికిత్స చేసి పడుకో బెట్టాడు.

"హేమీ బాధపడకు బ్రదర్! హె..హే...ఇది చాలా తొందరగా తగ్గిపోతుంది హి..హీ" అన్నాడు పక్క బెడ్డులో పడుకున్న పేషెంట్.

రెడ్డి తల పక్కకి తిప్పి చూస్తే పక్క బెడ్డులో తెలుగు చలన చిత్ర నటుడు భువ రత్న దూలకృష్ణ రెండు తొడల చుట్టూ 12 ఇంచెల మందంతో బాండేజ్ కట్టుకుని పడుకుని ఉన్నాడు. సూరప్ప కుయిళీ ఫ్లాష్ బాక్ స్క్రీన్ లో దూలకృష్ణ తొడలు చరుచుకోవటం చూసి బ్రహ్మానంద భాష్పాలు కురిపించాడు.

8 comments:

Rama Prasad said...

తెలుగు మాండలీకాలను మరిచిపోకుండా వాడుక బాషలో మీరు చేస్తున్న తెలుగు పద విన్యాసము చదివేటప్పుడు ముచ్చట గొలుపుతుంది. మీ కధనాలు ప్రస్తుత రాజకీయ, చిత్ర వార్తలకు సంబంధించినవి అయినా అదే విషయాన్ని క్రొత్తగా చదివినట్లు అనిపిస్తుంది. మీ సాహితీ ప్రస్థానము ఇలాగే కొనసాగాలని నూతన ప్రక్రియలతో విరజిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.

శ్రీ said...

మీ అభిమానానికి చాలా సంతోషం రామ ప్రసాద్ గారు

రవి said...

కొంచెం ప్రయాస పడి రాశారా అని ఓ చిన్న అనుమానం. అయినా బాగుంది. "దొడ్డప్పా... అని ఏడ్చాడు"సూపరు.

మురళి said...

నాకైతే ముగింపు తెగ నచ్చేసింది.. జనపథ్ పేరు మార్చలేదు మీరు...

కొత్త పాళీ said...

బాగా రాశారు. పాత్రల పేర్లు మార్చాల్సిన అవసరం నాకు కనబళ్ళేదు. దాణివల్ల కొత్తగా పుట్టిన హాస్యం ఏం లేదు. పైగా రాజకీయ వ్యంగ్య రచనలో నిజవ్యక్తుల పేర్లతో రాయడం అనాదిగా వస్తూనే ఉన్నది.

శ్రీ said...

@ రవి, రెండు మూడు రోజులు కూర్చుని రాసానండి. నాకు తెలిసిన కన్నడ పదాలని కూర్చాను. దొడ్డప్పా...అని రాసినపుడు నాకు బాగా నవ్వు వచ్చింది.

@ మురళి, తొడల గురించి రాసేటపుడు బాలకృష్ణ గుర్తుకు వచ్చాడు. జనపథ్, ఢిల్లీ, హైదరాబాదు, అమ్మ ఎందుకనో మార్చలేదు.

@ కొత్తపాళీ, మీకు నచ్చినందుకు సంతోషం. పేర్లు మార్చకపోతే సమ్మెలు, రాస్తారోకోలు జరుగుతాయని భయపడ్డాను. ఈ కొత్త విషయం ఇక మీదట గుర్తుంచుకుంటాను

మంచిబాలుడు -మేడిన్ ఇన్ వైజాగ్. said...

ఈ వ్యంగ్య రచన చదువుతున్నప్పుడు నాకు పదవ తరగతి లో చదువుకున్న బారిస్టర్ పార్వతీశం పాఠ్య భాగం గుర్తుకువచ్చింది. అందులో లాగానే మంచి పద ప్రయోగాలు చేసారు

శ్రీ said...

@ మంచి బాలుడు, ఈ టపా చదువుతుంటే మీకు బారిస్టర్ పార్వతీశం గుర్తుకు వచ్చిందంటే నేను ధన్యుడిని.