Monday, May 11, 2009

కిక్ - ఎక్కిందిగురువారం రావలసిన బాక్సు శుక్రవారం మధ్యాహ్నంకి వచ్చింది. రాత్రి 10 గంటలకి సినిమాకి వెళ్ళడానికి స్కెచ్ వేసాను. జీవి రివ్యూ కొంచెం బాగా రాసి ఉండేసరికి సినిమా హాలు అభిమానుల కోలాహలంతో నిండిపోయింది. సురేందర్ రెడ్డి ఇప్పటివరకు యాక్షన్ సినిమాలని మాత్రమే తీసాడు. అతనొక్కడే సినిమా అంచనాలకు మించి ఆడింది. అశోక్, అతిథి సినిమాలు రెండూ అంతంత మాత్రంగా ఆడాయి. వీ.వీ.వినాయక్ లాగే ఇతను కూడా యాక్షన్ వదిలిపెట్టి కామెడీ లోకి దూరాడు. వీ.వీ.వినాయక్ కృష్ణ సినిమా లాగ తీయకపోయినా కొంతవరకు సరదాగానే తీసాడనిపించింది నాకు.
ఇక కథలోకి వస్తే కళ్యాణ్(రవితేజ)కి ఏది చేసినా దాంట్లో కిక్కు కావాలకునే రకం.కొన్ని పరిస్థితుల్లో నైనా(ఇలియానా) కళ్యాణ్ కి పరిచయమవుతుంది. ఇద్దరికీ ప్రేమ ముదిరే సమయానికి నైనాకి కళ్యాణ్ పైత్యం పడక విడిపోతారు. నైనాకి ఇంట్లో వాళ్ళు కృష్ణతో పెళ్ళి చేద్దామనుకుంటారు. కృష్న ఒక పోలీస్ ఆఫీసర్, ఒక పెద్ద దొంగను పట్టుకోవడంలో కిందా,మీదా పడుతుంటాడు. దొంగ ఎవరో కాదు, మన కళ్యాణే! నైనా పెద్దలు చెప్పినట్టు కృష్ణని పెళ్ళి చేసుకుంటుందా? కళ్యాణ్ కి దగ్గర అవుతుందా? కృష్ణ కళ్యాణ్ ని పట్టుకుంటాడా? అసలు కళ్యాణ్ దొంగగా ఎలా మారుతాడు? ప్రశ్నల మధ్య సినిమా తిరుగుతుంది.
రవితేజ అంటేనే సినిమాలో వెకిలి చేష్టలు చాలా ఉంటాయి. సినిమా కూడా అంతే, వెకిలిగా రవితేజ విరగ తీసాడు. ఈసారి ఉత్తమ వెకిలి హీరోగా నంది అవార్డు రావడం మాత్రం ఖాయం.సినిమా చూసాక మా స్నేహితుడికి ఫోన్ చేసి "బాబాయ్!ఈరోజు సినిమా చూసా" అని చెప్పా.

మా ఫ్రెండు "ఏ సినిమా అబ్బాయ్?" అన్నాడు.

"కిక్కు బాబాయ్" అన్నాను."అదేమి సినిమారా!" అన్నాడు బాబాయ్.

"రవితేజాది బాబాయ్" అన్నాను.

"వాడా...వాడూ, వాడి పిచ్చి చేష్టలు! నాకు వాడసలు నచ్చనే నచ్చడు" అన్నాడు బాబాయ్.

"అవునా..నాకయితే వాడిని చూసి నువ్వే గుర్తుకు వచ్చావ్ బాబాయ్" అన్నాను.
అటుపక్క బాబాయ్ ఫోను పెట్టేసాడు.ఇలియానా ఈ సినిమాలో కొంచెం లావుగా కనపడింది. ఈసారి అమెకి మంచి పాత్రే లభించింది. సురేందర్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే "ఇలియానా నటనలో పరిణతి చెందింది". కాకపోతే ఈ పాత్రకి "నీ యబ్బ","నా కొడకా" అనడం ఊత పదాలు. ఇదే మాట మా ఫ్రెండుతో అంటే "ఈ మధ్య వరకు సినిమాల్లో హీరోని ఒరేయ్ అని పిలవడం కామన్ గా ఉంది. ఇపుడు నీ యబ్బ కామన్ అవుతున్నట్టుంది" అన్నాడు. ఇక రెండవ హీరో శ్యాం అరవదేశం నుండి దిగుమతి లాగుంది. ఇలియానా కన్న 4 ఇంచెలు పొడుగు అంతే, పెద్ద హీల్స్ వేసుకుని నటించాడు. ఇక బ్రహ్మానందం హల్వా రాజ్ గా బాగనే నవ్వించాడు.అలీ డా.బాలిగా బాగున్నాడు.

ఈ సినిమాకి మణిశర్మ శిష్యుడు సంగీతం అందించాడు. పాటలు మొదటలో అంత ఎక్కలేదు కానీ,వింటూ ఉంటే సరదాగా ఉన్నాయి. సినిమా చూస్తూ ఉంటే చాలా పాత సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈ మధ్యలో కొత్తగా విడుదల అయ్యే సినిమాలు ఎక్కువ లేవు కాబట్టి ఈ సినిమాకి వసూళ్ళు బాగనే వస్తాయనుకుంటున్నాను.


3 comments:

రవి said...

నేను ఇక్కడ మా బెంగళూరులో ఫ్యామిలీ తో కలిసి, వెయ్యి రూపాయలు బోడించుకుని చూసానీ సినిమా. కిక్కు కాదు, హ్యాంగోవర్ వచ్చింది. మొదటి సగం పర్లేదనిపించినా, రెండవ సగం ప్రాణం తీశాడు.

రవితేజకు వెకిలి రత్న అవార్డ్ ఇవ్వచ్చు. అది అటుంచితే, వాడి ముఖం కాస్త ముదిరింది. ఇలియానా పక్కన వాణ్ణి కొన్ని పాటల్లో చూసి, గుండె జారిపోతుంది.

మురళి said...

కూతురి వయసు పిల్లలతో డాన్సులు చేసే దౌర్భాగ్యం నుంచి మన హీరోలు ఎప్పుడు బయటపడతారో? నాకైతే రిలీజైన మర్నాడే "చూడొద్ద" ని హెచ్చరిస్తూ ఓ మిత్రుడు ఫోన్ చేసి రక్షించాడు..

శ్రీ said...

@ రవి,సెకండ్ హాఫ్ కొంచెం వీకే! ఫిర్స్ట్ హాఫ్ మాత్రం చాలా తమాషాగా ఉంది. మీరన్నట్టు ముఖం ముదురుతుంది. పాటలు మొదటి సారి బాగాలేదు కానీ, రెండో సారి చూసినప్పుడూ కాచీగా ఉన్నాయి.

@ మురళి, ముసలి హీరోలు ఇంటికి పోవాలంటే కొత్త యంగ్ హీరోలు వాళ్ళని డామినేట్ చెయ్యాలి లేదా కొడుకు సినిమాల్లో నటించడం మొదలుపెడితే ఇతను రిటైర్ అవ్వచ్చు.