Friday, June 26, 2009

మైఖేల్ జాక్సన్ - కాలాస్త్రి నివాళి


మధ్యాహ్నం 3,4 గంటల మధ్య యాహూ మెయిలు చెక్ చేసిన తర్వాత లాగవుట్ అయ్యి హెడ్ లైన్స్ చూస్తే మైఖేల్ జాక్సన్ ని హాస్పిటల్ తీసుకు వెళ్ళారు అని చదివా. ఎదో చిన్న విషయమే అనుకుని పనిలో పడ్డా. ఇంటికి వెళ్ళాక 6.30 కి సాయంత్రం న్యూస్ లో మేఖేల్ జాక్సన్ డెత్ అని డిసైడ్ చేసారు. ఇక అన్ని చానెళ్ళు జాక్సన్ వివరాలతో నిండి పోయాయి.నేను అప్పుడు 8వ తరగతో, 9వ తరగతో చదువుతున్నాను పెద్దగా గుర్తు లేదు. ఎండాకాలం సెలవల్లో మా పెద్దమ్మ వాళ్ళింట్లో గడుపుదామని తిరుపతి వెళ్ళాం. అక్కడ మా కజిన్ తో కలిసి అతని స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. కొన్ని గంటలు ఆడుకున్న తరువాత మమ్మల్ని అతని రూముకి తీసుకు వెళ్ళాడు. టేప్ రికార్డర్ లో ఇంగ్లీషులో ఎవో పాటలు వస్తున్నాయి. పాటలు వింటుంటే లేచి డాన్స్ చెయ్యాలి అన్న ఊపు వస్తుంది. మా కజిన్ చెపితే తెలిసింది, ఇవి మైఖేల్ జాక్సన్ పాటలు అని. తరువాత సెలవలు అయిపోయి రాపూరుకి తిరిగి వెళ్ళిపొయాను.ఇంటరు చదివేటపుడు మా స్నేహితుడి అన్న బ్రేక్ డాన్సు చూస్తూ చప్పట్లు కొట్టేవాడిని. మూన్ వాక్ మీద మాకు కొన్ని టిప్స్ ఇచ్చేవాడు. తరువాత తెలిసింది మూన్ వాక్ ని మనకి పరిచయం చేసింది జాక్సన్ అని. అప్పట్లో నాకు ఎం.టీవీ పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఇంజినీరింగ్ కి వచ్చాక మా రూం మేట్ మద్రాసు నుండి వస్తూ అపుడే మార్కెట్ లోకి రిలీజ్ అయిన డేంజరస్ ఆడియో కాసెట్ తెచ్చాడు. ఇక రోజూ ఆ పాటలే మా రూం లో మారుమోగేవి. అతని కలెక్షన్లో బాడ్, థ్రిల్లర్ కూడా ఉండేవి. ఆ దెబ్బతో మైఖేల్ జాక్సన్ పాటల ద్వారా నాకు బాగా పరిచయమయ్యాడు. అపుడపుడు టీ.వీ లో వీడియోలు చూసి "నా సామి రంగా..తుక్కు లేపుతున్నాడు" అనుకునేవాడిని.
ఈరోజు అతని గురించి వీకీపీడియాలో చదివాను. పాప్ సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తిగా మైఖేల్ జాక్సన్ కొన్ని దశాబ్దాలు ఏకచక్రాధిపత్యంగా ఏలాడు. అతను చేసిన బ్రేక్ డాన్సులు కానీ, మూన్ వాకులు కానీ ప్రపంచమంతటా యువతని ఉర్రూతలూగించాయి. నల్లవాళ్ళకి అంతగా ఉనికి లేని తెల్ల ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు జాకీ. సంగీత ప్రపంచంలో రికార్డులని బ్రేక్ చేసి కొరియోగ్రఫీలో సిలబస్ బాగా పెంచాడు. గతుకుల బాటలో నడిచిన బాల్యం నిన్నటి వరకూ అతని వ్యక్తిత్వాన్ని తూట్లు పొడిచినట్టు నాకనిపించింది. ఒక సమయంలో కోటీశ్వరుడిగా వెలిగిన జాక్సన్ చివరికి అద్దె ఇంట్లో గడుపుతూ పూర్తిగా అప్పుల పాలయ్యాడు. ఇంకొన్ని నెలల్లో మొదలుపెట్టబోయిన వరల్డ్ టూర్ పూర్తి చేసి ఉంటే అప్పులు ఒక కొలిక్కి వచ్చి ఉండేవేమో ఎవరికి తెలుసు? వ్యక్తిగతంగా ఎలా ఉన్నా మనందరినీ తన పాటలతో, నాట్యాలతో అలరించి ఇక విశ్రాంతి పొందుతున్న అతని ఆత్మకి శాంతి కలగాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను.


1 comment:

పరిమళం said...

పాప్ సామ్రాట్టుకు నివాళులు !