Monday, January 25, 2010

సంక్రాంతి ముగ్గుల పోటీలు



ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా సంక్రాంతి ముగ్గుల పోటీలు డెట్రాయిట్ లో ఘనంగా జరిగాయి. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంటు చలపతి కోడూరి గారి ఇంటి బేస్ మెంటులో ముగ్గుల పోటీలు జరిగాయి. ముగ్గుల పోటీలలో నలభై మందికి పైగా పాల్గొన్నారు. అందరూ ఉత్సాహంగా రెండు, మూడు గంటల సేపు ఎంతో ఓపిగ్గా పోటీలు పడి మరీ ముగ్గులు వేసారు. అందమయిన రంగులు అద్దుతూ సంక్రాంతి కుండలు, చెరుకు గడలు, రథం, హరి దాసు, గంగిరెద్దులని తమ ముగ్గుల్లో చూపిస్తూ సంక్రాంతి సంప్రదాయాన్ని అందరికీ గుర్తు చేసారు. ముగ్గుల మధ్య కొండపల్లి బొమ్మలు పెట్టి మరింత అందంగా చూపించడానికి అందరూ ప్రయత్నించారు. అలాగే ప్రమిదలతో ముగ్గుని అలంకరించి సంక్రాంతి పండుగతో దీపావళిని కూడా కలిపారు. మన రాష్ట్రం ముగ్గే కాకుండా బెంగాళీ, ఉత్తర్ ప్రదేశ్ సంప్రదాయాన్ని కూడా మిళితం చేసి మన ఉమ్మడి సంప్రదాయాన్ని ఎలుగెత్తి చాటారు. ఆడవాళ్ళు ముగ్గులు వేస్తూ ఉంటే పిల్లలు ఇంటి నిండా ఆడుకుంటూ ఉండగా మగవాళ్ళు కుర్చుని కబుర్లు చెప్పుకుంటూ పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఒకటిని మించి ఇంకొకటిగా వేసిన ముగ్గులలో మంచి ముగ్గులని నిర్ణయించటానికి న్యాయ నిర్ణేతలకి రెండు గంటలపైనే పట్టింది. రోజంతా డోనట్స్, బేగెల్స్ మరియూ పిజ్జాలతో విందు భోజనం సాగింది. మొదటి మూడు ఉత్తమ ముగ్గులతో పాటూ ఇంకొక ముగ్గుకి కన్సొలేషన్ బహుమతిని ప్రకటించారు. బహుమతులని వచ్చే శనివారం జరుగనున్న సంక్రాంతి పండుగ వేడుకలో ఇవ్వడం జరుగుతుంది.


చుక్కలు పెట్టడం దగ్గర నుండి రంగులు అద్ది ముగ్గు పూర్తి అయ్యేవరకు తీసిన వీడియోలు మీ కోసం ఇక్కడ ఉంచుతున్నాను.








3 comments:

mmkodihalli said...

మా పాపలు పెట్టిన ముగ్గులు ఇక్కడ చూడండి.
http://turupumukka.blogspot.com/2010/01/blog-post_10.html

swapna@kalalaprapancham said...

ముగ్గులు బాగున్నాయి కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ "ముత్యమంత ముగ్గు" అని సాంగ్ పెట్టి ఉంటె బాగుండేది.
ముగ్గులు వేసేటపుడు అ సాంగ్ పెడితే ఇంకా సూపర్ గ ఉండేది.

శ్రీ said...

@ మురళీమోహన్,
మీ పాపలు వేసిన ముగ్గులు చూసాను, చాలా బాగున్నాయి
@ స్వప్న,
మంచి ఐడియా.
ఈ టపాకి రెండో భాగం ఉంది,దాంట్లో ఆ పాట పెడుతాను.