Tuesday, February 2, 2010

డెట్రాయిట్ లో సంక్రాంతి సంబరాలు






డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 30న నోవై హైస్కూలులో సంక్రాంతి సంబరాలు జరిగాయి. డెట్రాయిట్ నలుమూలలనుండి వెయ్యి మందికి పైగా ఈ వేడుకలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ. కోడూరి చలపతి సంక్రాంతి సంబరాలని ప్రారంభిస్తూ తెలుగు వారందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలని తెలిపారు. గత దీపావళి పండుగ సంబరాలలో కొత్త కార్యనిర్వాహక వర్గాన్ని ప్రారంభించినప్పటి నుండి ఇప్పటికి 100 మంది సభ్యులని చేర్చుకున్నామన్నారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రంగువల్లి ముగ్గుల పోటీలలో పాల్గొన్నవారికి, విజేతలకు అభినందనలు తెలియజేసారు. ఈ పోటీలకు ధన సహాయాన్నందించిన గ్లోబల్ టెకీస్ సంస్థ అధినేత అనీల్ నాగోజికి కృతజ్ఞతలు తెలియజేసారు.





కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ పిజ్జా మరియు విందు భోజనాలు సాగాయి. విఘ్నేశ్వరుడి పూజతో కార్యక్రమాలు మొదలయ్యాయి. చిన్న పిల్లల శాస్త్రీయ, పాశ్చాత్య నృత్యాలతో అందరినీ అలరించారు. సంక్రాంతి కోసం ప్రత్యేకంగా చేసిన నృత్య రూపకం అందరినీ ఆకట్టుకుంది. అలాగే "ఏరువాకా సాగారో" అంటూ చిన్నారులు చేసిన నృత్యానికి చప్పట్లు మారు మోగాయి. చిట్టి, పొట్టి పిల్లలు చేసిన "బొమ్మల పెళ్ళి" అందరినీ పండుగ వాతావరణానికి తీసుకువెళ్ళింది. డెట్రాయిట్ కి చెందిన ప్రదీప్ పెన్నేపల్లి కొన్ని పేరడీ పాటలు పాడి అందరినీ నవ్వించారు.



సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన రివర్స్ గేర్ గురుస్వామి గారు తన పేరడీ పాటలతో అందరినీ కడుపుబ్బా నవ్వించారు. పాటలని మామూలుగా పాడడం ఒక ఎత్తు.ఆ పాటలని రివర్స్ లో పాడడం ఇంకొక ఎత్తు. తన ప్రత్యేక శైలిలో అందరినీ అలరించారు. "నెల్లూరు నెరజానా" పాటను వివిధ రకాలుగా పాడవచ్చని, అలా పాడి ప్రేక్షకులని మైమరిపించారు. డీటీఏ ప్రెసిడెంట్ శ్రీ.చలపతి కోడూరి గారు రివర్స్ గేర్ గురుస్వామిని తగు రీతిలో సత్కరించారు. అలాగే రంగోలీ పోటీలలో గెలుపొందిన వారికి కూడా బహుమతులు అందజేసారు. ఈ సంబరాలకు విచ్చేసిన పురప్రజలందరికీ డీటీఏ ప్రెసిడెంట్ చలపతి కోడూరి, జనరల్ సెక్రెటరీ శైలేంద్ర సనం, కల్చరల్ సెక్రెటరీ శిరీష ఉప్పలపాటి, ఫుడ్ కమిటీ విష్ణు కోటమరెడ్డి, రాజ్ కామేటి, పార్వతి దొడ్డిపట్ల, కోశాధికారి రమేష్ గోగినేని, జాయింట్ కోశాధికారి నాగేంద్ర అయితా, పబ్లికేషన్స్ సెక్రెటరీ సునీల్ పంట్ర, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శిరీష రావిపాటి కృతజ్ఞతలు తెలిపారు. అందరూ కలిసి జాతీయ గీతం ఆలపించి సంక్రాంతి సంబరాలను ముగించారు.

2 comments:

పరిమళం said...

ఏదేశమేగినా ఎందుకాలిడినా ....మన పెద్ద పండుగ అదేగా మరి !బావున్నాయండీ మీ సంకురాత్రి సంబరాలు .

శ్రీ said...

థాంక్స్ అండి. ఇటువంటి సంబరాలు జరిగితేనే మనము మన సంప్రదాయానికి దగ్గరగా ఉంటాము. పిల్లలకి కూడా ఈ సంబరాలు మంచి అనుభవం.

ఇదే వార్త మీరు ఈనాడులో చూడచ్చు.