Friday, April 9, 2010

హాకర్ ముచ్చట్లు

రాత్రి సమయం రెండు దాటి ఉండచ్చు. నిద్ర మధ్యలో ఉన్నపుడు "పింగ్" అన్న శబ్దంతో కళ్ళు తెరిచి బ్లాక్ బెర్రీ ని తాకి చూసా. మాములుగా అయితే ఆ సమయంలో ఈమెయిలు చెక్ చేయాల్సిన అవసరం ఉండదు, కాకపొతే కుతూహలం కొద్దీ చూసాను. మెయిలు మా కజిన్ నుండి వచ్చింది. సబ్జెక్ట్ లైనులో "ప్లీజ్ హెల్ప్" అని ఉంది. ఇదేమిటి, ఇలా మెయిలు వచ్చింది అని తెరిచి చూసా.
మెయిలు సారాంశం ఏమిటంటే "నేను ఆఫీసు పని మీద స్కాట్లాండ్ వచ్చాను. ఇక్కడ నా డబ్బులు,పాస్ పోర్ట్,సెల్ ఫోను అన్నీ పోయాయి.ఇక్కడ ఎంబసీలో రిపోర్ట్ చేసాను, వాళ్ళు అంతగా సహకరించడం లేదు. నాకు ఉన్నఫళంగా ఒక 1500 పౌండ్లు పంపు. నేను ఇంటికి వెళ్ళగానే నీకు పంపుతా" అని. మెయిలు చదివిన తర్వాత నాకు కలవరం మొదలయింది. ఏమిటి, ఇలాగా చిక్కుకు పోయాడే అని? కొంచెం కోపం కూడా వచ్చింది, ఎక్కడకయిన కొత్త ప్రదేశానికి వెళ్ళినపుడు జాగ్రత్తగా ఉండాలి కదా? అని. కొంచెం అలోచించి చూస్తే మా వాడు మామూలుగా చాలా జాగ్రత్తగా ఉంటాడు. సరేలే,ఎదో గ్రహాలు బాగలేక ఇలా జరిగిందేమో అని సర్దుకున్నా. సరే ఇక డబ్బులు పంపే విషయం అలోచించదం మొదలుపెట్టా.
ఇంకోసారి మెయిలు చూస్తే మెయిలు నాకే కాక ఇంకా కొందరికి పంపాడని తెలిసింది. సరే, వాళ్ళ ఇంటికి కూడా మెయిలు కొట్టి ఉండచ్చు. ఇపుడు సమయం చూస్తే అర్ధరాత్రి అయింది, ఫోను చెయ్యాలా? వద్దా? అని మళ్ళీ అలోచించా. మా కజిన్ ఉన్న ఊరుకి దగ్గరలోనే మా అన్న కూడా ఉంటాడు. అతనికి కూడా మెయిలు కొట్టి ఉంటాడు కదా? అని గుర్తుకు వచ్చి ఎగిరి గంతేసా. ఎందుకంటే మా అన్నని కాంటాక్ట్ చెయ్యడం చాలా ఈజీ. గోడ మీద బల్లి లాగా మా అన్న కూడా ఎపుడూ ఆన్ లైనులో ఉంటాడు. అనుకున్నట్టే మా అన్న యహూలో ఉన్నాడు. అతనికి ఒక మెసేజ్ కొట్టి, కంఫర్మేషన్ కోసం ఎదురు చూస్తూ పడుకున్నా.
ఉదయం నిద్ర లేచి ఆఫీసుకి వచ్చాక అపుడు గుర్తుకు వచ్చింది. మన వాడు ఏమి చేస్తున్నాడో అని, మళ్ళీ యాహూకి ఈ మెయిలు కొట్టగానే 10 నిముషాల్లో రిప్లయ్ వచ్చింది. ఈసారి సారాంశం ఏమిటంటే "రిప్లయ్ ఇచ్చినందుకు చాలా సంతోషం! నాకింకా ఆందోళనగానే ఉంది. చేతిలో $5 కంటే ఎక్కువ లేవు.తొందరగా వెస్టర్న్ యూనియన్ కి వెళ్ళి ఎంతో కొంత డబ్బులు పంపు" అని. ఇది చదవగానే నాలో అనుమానాలు మొదలయ్యాయి. నిజంగా మా వాడు ఇబ్బందుల్లో ఉంటే ఇంకా డబ్బులు పంపనందుకు మెయిలులో బండ బూతులు తిట్టి ఉండేవాడు. ఎక్కడో, ఎదో అయింది అని నేను తెలివిగా మా వాడికి నాకు ఫోన్ చెయ్ అని రాసా. ఈసారి కూడా తొందరగానే రిప్లయ్ వచ్చింది. "హోటల్ లో ఫోను పని చెయ్యడం లేదు. నా దగ్గర డబ్బులు కూడా లేవు, ఫోను చెయ్యడానికి" అని. దీనితో నా అనుమానం బలపడింది. హోటలులో ఫోన్ పని చెయ్యకపోవడం అనేది చాలా అరుదు. ఒక వేళ నిజంగానే పని చెయ్యకపోయినా ఎమెర్జెన్సీలో చెయ్యడానికి "కలెక్ట్" కాల్ చెయ్యచ్చు కదా. లేకపోతే పక్కన ఎవరిదో ఫోన్ వాడుతాను అంటే ఇవ్వకుండా ఉంటారా?

సాయంత్రానికి మా కజిన్ "నా మెయిల్ హాక్ అయింది" అని నా ఫేస్ బుక్ లో రాసాడు. అప్పటికి నాకు సినిమా అర్ధమయింది. ఎవడో లింగడు మా వాడి మెయిల్ హాక్ చేసి అందరినీ డబ్బులు పంపమని అడిగాడనమాట. మెయిల్లో మా వాడు ఏం చేస్తాడు, స్నేహితుల వివరాలు దొరికి ఉంటాయి కదా. అలా అందరినీ కదిపాడు, లక్కీగా ఎవరూ పెద్దగా రెస్పాండ్ అవలేదు.
ఇంతకీ హాకర్ కి పాస్ వర్డ్ ఎలా దొరికిందో? అందుకే మన పాస్ వర్డ్ కొంచెం క్లిష్టమయిందిగా పెట్టుకోవాలి. వొట్టి లెటర్లే కాకుండా అందులో అంకెలు కూడా పెట్టుకుని అవరికీ అంతు చిక్కని మాంత్రికుడి ప్రాణంలా ఉండాలి. మన పుట్టిన రోజులు, కుటుంబంలో వాళ్ళ పేర్లు కాకుండా కొంచెం తెలివిగా, కొత్తగా అలోచించండి. మీ పాస్ వర్డు ఎక్కడా కూడా రాసుకోవద్దు. ఒక వేళ రాసిన అది ఎవరి కంటా పడకుండా ఉండేటట్టు చూడండి.ఈ సన్నివేశంలో నేను కొంచెం తెలివిగా ప్రవర్తించడానికి ఒక కారణం ఉంది. రెండు వారాల క్రితం టీవీలో గ్రాండ్ మా స్కాం గురించి వార్తల్లో చూపించారు. ఈ స్కాం ఏమిటంటే కొంత మంది జైలు నుండి అమ్మమ్మ, నానమ్మలకు కాల్ చేస్తారు ఫోన్ నంబర్లు ఎక్కడో పట్టుకుని. ముసలి వాళ్ళకి తాను వాళ్ళ మనవడిని అనేలా మాట్లాడుతూ తను ఇబ్బందుల్లో ఉన్నానని, నాకు డబ్బులు పంపమని అడుగుతారు. ఇంట్లో అమ్మ, నాన్నకి చెపితే తిడుతారు అందుకని వాళ్ళకి కాల్ చెయ్యద్దని బతిమాలుతారు. అమ్మమ్మ.డాట్ కాంలు కరిగిపోయి డబ్బులు పంపేస్తారు. ఇలా ఎందరో అమ్మమ్మలు మోసపోయారట! ఇటువంటి మోసాల్లో మోసగాడు తన వివరాలు ఇవ్వడు. "నీ నంబర్ చెప్పు, నేను ఫోన్ చెస్తా" అంటే మనకి నంబర్ ఇవ్వరు. ఫామిలీలో మిగతా వాళ్ళకి కూడా ఫోన్ చేసి కనుక్కుంటే అసలు విషయం తెలుస్తుంది. అసలు మనవడికే కాల్ చేస్తే విషయం ఇట్టే తేలిపోతుంది. నాకు వచ్చిన మెయిలు లో కూడా "నాకు ఫోన్ చెయ్ మన్నా". ఒకవేళ నిజంగా మనవాడే అయితే తెలుస్తుంది కదా?ఇటువంటి సైబర్ నేరాల బారి పడకుండా జాగ్రత్తగా ఉండమని బ్లాగర్లందరికీ నా విజ్ఞప్తి. మీకు తెలిసిన వారితో ఈ విషయం చర్చించి జాగ్రత్తగా ఉండమని సలహా ఇవ్వండి.

8 comments:

Rama Prasad said...

Message Oriented Blog !! keep It Up. Thanks for informing and awakening us.

శ్రీ said...

You welcome

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Thanks for the informative post.
I'll call the person who as hacked your cousin's mail id as "Cracker" or "Script Kiddie". Jai ho "Ankit Fadia" :)

చిన్నమయ్య said...

టపా చాలా జాగ్రత్తల్ని నేర్పించింది.విషయం స్వానుభవం (ఉత్తమ పురుష) కాబట్టి మరింత బాగుంది. మీ కజినుకి మీరే ఓ ఫోను చేసివుండచ్చేమోగదా? ఆ హేకరెవడో తెలిసున్నవాడై వుంటాడని అనుమానం. ఆ నీచ్,కమీనే గాడి బేండు బజాయించి వుంటే, టపాకి 'శుభం' కార్డు లా వుండేది.

హరే కృష్ణ . said...

thank you
nice information

శ్రీ said...

@ వీరుభొట్ల వెంకట గణేష్, థాంక్స్.

@ చిన్నమయ్య, మా కజిన్ ఫోన్ నంబర్ సమయానికి దొరకలేదు.ఈ హాకింగ్ విషయం మా కొలీగ్ కి చెపితే అతనికి ఇంచుమించు ఇలాగే జరిగిందట.

@ హరే కృష్ణ, థాంక్స్.

డా.ఇస్మాయిల్ said...

"గోడ మీద బల్లి లాగా మా అన్న కూడా ఎపుడూ ఆన్ లైనులో ఉంటాడు." :-) ఇలాంటి లైన్లు రాస్తే మీరే రాయాలి శ్రీ...అదుర్స్!

శ్రీ said...

థాంక్స్ ఇస్మాయిల్ గారు