Saturday, July 9, 2011

El Bola (2000)




పిల్లలని పెంచడానికి పెద్దవాళ్ళకి ఒక అవగాహన ఉండాలి. వాళ్ళకి ఏది అవసరమో, ఏది ఒద్దో మనం నిర్ణయించకుండా వాళ్ళని అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ముందుగా మనకి అంత ఓపిక ఉండాలి. ఈ మధ్య బిడ్డల పెంపకం అన్న చలం పుస్తకం చదివాను, దాని గురించి ఈసారి ఎపుడయినా బ్లాగుతాను. ఇపుడు మీకు పరిచయం చేయబోతున్న సినిమా కూడా ఇంచుమించు అటువంటిదే!

ఈ సినిమా పన్నెండేళ్ళ పబ్లో కుటుంబ జీవితం నేపధ్యంలో నడుస్తుంది. పబ్లో నాన్న ఇంట్లో చాలా స్ట్రిక్టుగా ఉంటాడు. పబ్లోని అనుక్షణం కట్టడి చేస్తూ ఉంటాడు. చెప్పిన మాట వినకపోయాడో ఆరోజు వాడి దుంప తెగినట్టే. పబ్లో స్కూలుకి అల్ఫ్రెడో కొత్తగా చేరుతాడు. మామూలు పిల్లల కంటే విభిన్నంగా ఉండే అల్ఫ్రెడో అంటే పబ్లోకి వింతగా ఉంటుంది. అతనితో స్నేహం చేయడం మొదలు పెడతాడు.

ఆడుకోవడానికి ఒక రోజు అల్ఫ్రెడో ఇంటికి వెళ్తాడు పబ్లో. అక్కడ వాతావరణం వాళ్ళ ఇంటికి భిన్నంగా ఉండడం గమనిస్తాడు. సాయంత్రమంతా బయట తిరిగి వచ్చిన పబ్లోని తండ్రి మందలిస్తాడు. ఈసారి ఎపుడూ అల్ఫ్రెడోతో బయటకి వెళ్ళద్దని గట్టిగా చెప్తాడు. అల్ఫ్రెడో కుటుంబం ఒకసారి పిక్నిక్ కి వెళ్తుంటే పబ్లో ని పిలవడానికి వచ్చిన అల్ఫ్రెడోని తిప్పి పంపేస్తాడు పబ్లో నాన్న. అల్ఫ్రెడో నాన్న పబ్లో ఇంటికి వచ్చి పబ్లో పెద్దవాళ్ళకి చెప్పి పబ్లోని పిక్నిక్ కి తీసుకు వెళ్తాడు. పిక్నిక్ చివరలో వర్షం వస్తే అందరూ తడిచి ఇంటికి వస్తారు. బట్టలు మార్చుకుంటున్న పబ్లో వీపు చూస్తే వాతలు కనిపిస్తాయి అల్ఫ్రెడోకి.

ఇది జరిగిన ఒక వారం వరకు పబ్లో స్కూలుకి రాడు. అల్ఫ్రెడో తండ్రికి పబ్లో వాతల గురించి చెప్తాడు. ఒక రోజు పబ్లోని తండ్రి పిచ్చ కొట్టుడు కొట్టాక ఇంటి నుండి పారిపోయి అల్ఫ్రెడో ఇంటికి వచ్చేస్తాడు. పబ్లో తిరిగి ఇంటికి పోవడానికి ఇష్టపడడు. అల్ఫ్రెడో తండ్రి పబ్లోకి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాడు. పబ్లో ఇంటికి తిరిగి వెళ్ళాడా? పబ్లో తండ్రి మారాడా? వీటి గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడండి. ఈ సినిమాకి ఒక ఇరవై అవార్డుల దాకా వచ్చాయి. ఆ వివరాలు ఇక్కడ చూడచ్చు.

పబ్లో, ఆల్ఫ్రెడోలు చాలా బాగా నటించారు. కథ కూడా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. పిల్లలని కొడితే ఆ సున్నిత హృదయాలు ఎలా బాధపడుతాయో మనకి తెలియజేస్తుంది ఈ సినిమా. మన కుటుంబాల్లో ఇలా పిల్లలతో కబడీ ఆడుకోవడం చాలా సహజం. ఇప్పటి తరంలో ఇది కొంచెం తగ్గి ఉండవచ్చు. క్రమశిక్షణ ఒక మోతాదులో ఉంటే పరవాలేదు, అది దాటితే ప్రమాదం. 

No comments: