Monday, July 11, 2011

The Pope's Toilet (2007)


కొన్ని సినిమాలు చూస్తూ ఉంటే కాసేపటికి తెలిసిపోతుంది ఈ సినిమాని మనం పూర్తిగా చూడగలమో లేదో అని! మరి కొన్ని సినిమాలు చూస్తున్నపుడు ఇక సేటులోంచి కదల బుద్ధి అవదు. అటువంటి సినిమా ఈ పోప్ టాయిలెట్.


దక్షిణ అమెరికాలోని ఉరుగ్వే దేశంలో మెలో అనే ఒక చిన్న ఊరు. మెలో వూరు బ్రెజిల్ దేశం సరిహద్దులో ఉంటుంది. చిన్న పల్లెటూరు, వూరిలో చాలా మంది బ్రెజిల్ నుండి వస్తువులు స్మగుల్ చేస్తూ బతుకుతూ ఉంటారు. అరవై కిలోమీటర్లు సైకిలు మీద సరకులు మోస్తూ అపుడపుడూ సరిహద్దు దగ్గర కస్టం అధికార్లకి దొరికిపోతూ ఉంటారు. అడ్డదారుల్లో సరిహద్దు దాటి వస్తువులు అమ్ముకుని బతుకుతూ ఉంటారు.     

ఇలాంటి వారిలో బేటో ఒకడు. నడి వయసులో ఉన్న బేటోకి సైకిలు తొక్కి, తొక్కి మొకాళ్ళు నొప్పి పుడుతూ ఉంటాయి. బతకడానికి వేరే మార్గాలు అలోచిస్తూ ఉంటాడు. కొన్ని రోజుల్లో పోప్ మెలో కి వస్తున్నాడని తెలిసి ఆ వూరిలో వారంతా చాలా హడావిడిగా ఉంటారు. పోప్ వూరికి వస్తే అతనితో పాటు బ్రెజిల్ నుండి చాలా మంది చూడడానికి వస్తారు. వాళ్ళంతా తమ వూరికి వస్తే ఏదో ఒకటి అమ్మి డబ్బులు సంపాదిద్దామని అందరి అలోచన. కొందరు హాట్ డాగ్స్ అమ్ముదామని, మరి కొందరు పీసు మిఠాయి అమ్ముదామని పధకాలు వేసుకుంటారు. కొందరు బాంకులో ఇల్లు తాకట్టు పెట్టి వ్యాపారానికి డబ్బులు తెచ్చుకుంటారు.   

మేలోకి వచ్చిన వారందరికీ టాయిలెట్ అవసరం ఉంటుంది కాబట్టి మన ఇంటి ముందు టాయిలెట్ కట్టుతానని బేటో అలోచిస్తాడు. తన దగ్గర డబ్బులు ఉండవు, ఇంట్లో కూడా దాచుకున్న డబ్బులు సరిపోవు. వూరిలో అప్పు అడిగితే ఇచ్చేవాడుండడు. ఈ సమయంలో కస్టం ఆఫీసరు అయిన మెలియోతో చాటుగా ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. మెలియోకి కావలసినవి తెస్తూ, తనకి కావలసినవి తెచ్చుకుంటూ కొంచెం, కొంచెం డబ్బులు పోగు చేసి టాయిలెట్ కట్టడం మొదలుపెడతాడు. 

మెలోకి పోప్ రానే వస్తాడు. వూర్లో అందరూ వ్యాపారాలు చేసుకుని డబ్బులు చేసుకున్నారా? బేటో ఇంట్లో టాయిలెట్ కట్టాడా? అతను అనుకున్నట్టు డబ్బులు వచ్చాయా? కూతురుని చదివించుకోగలిగాడా? ఇవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!

చిన్న వూరిలో వాళ్ళ పేదరికం, బతుకు పోరాటం, కస్టం అధికారుల అవినీతి, ఆశ, నిరాశ, కోరికలు చాలా బాగా చూపించాడు సినిమాలో. కొంచెం డబ్బులు కోసం యాభయ్, అరవై కిలోమీటర్లు సైకిలు తొక్కడం చూస్తుంటే చాలా బాధేస్తుంది. పిల్లలకి కనీస సదుపాయాలైన చదువుని కూడా అందించలేక సతమతమవుతూ ఉంటాడు బేటో. టాయిలెట్ వాడుకోవడానికి వచ్చినవాళ్ళతో ఎలా మాట్లాడాలి అని బేటో, అతని పెళ్ళాం కార్మెన్, కూతురు రిహార్సల్ చేసుకోవడం సరదాగా ఉంటుంది. కస్టం అధికారితో పని చెయ్యకపోయేసరికి బేటో దగ్గర నుండి సైకిలు తీసేసుకుంటాడు. భుజం మీద టాయిలెట్ సామను పెట్టుకుని ఇంటికి పరిగెత్తే సీన్ చాలా బాగుంటుంది. పోప్ మీటింగ్ అయిపోయేలోపల టాయిలెట్ అమర్చాలని బేటో పడే తపన మనల్ని కదిలిస్తుంది. ఆ సమయంలో సీన్స్ అన్నిట్లో ఉత్కంఠ బాగా నడుస్తుంది.     

వివిధ ఫిలిం ఫెస్టివల్సులో ఈ సినిమాకి 11 అవార్డులదాకా వచ్చాయి. బేటొగా నటించిన సీజర్ ట్రాంకోసో, కార్మెన్ గా నటించిన వర్జీనియా మెండెజ్ కి గ్రమడో ఫిలిం ఫెస్టివలులో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు వచ్చాయి.  రొటీన్ హాలీవుడ్ సినిమాలకి భిన్నంగా ఈ సినిమా మనకి కొంచెం వూరటనిస్తుంది. వీలు చేసుకుని ఈ సినిమాని తప్పక చూడండి.

2 comments:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

నా చిన్నప్పుడు బహుశా బియ్యం మీద నియంత్రణ(లు)ఎక్కువగా ఉన్న రోజులేమో,జిల్లానలుమూలల నుంచి సైకిళ్ళమీద బియ్యం బస్తాలు జిల్లాకేంద్రమైన గుంటూరుకు తీసుకెళ్లేవాళ్ళు చాలామంది ప్రతిరోజూ.అదీ ఒకరకమైన దొంగరవాణేనే.మధ్యలో ఎవరికి చిక్కినా బియ్యంమూట మీద కొన్ని సార్లు సైకిలు మీద ఆశలు వదులుకోవాల్సిందే.ఇంతచేస్తే వాళ్లకు రోజుకు కొన్ని రూపాయలు మిగిలేవి,అవన్నీ గుర్తుకొచ్చాయి ఈ టపా చదివితే.
నాకు తెలుసు మీరు నెట్ ఫ్లిక్స్ లో చూడమంటారని అందుకే అడగటం లేదు ఎక్కడ చూడాలని :)

శ్రీ said...

మంచి సినిమా, అవును నెట్ ఫ్లిక్సులోనే చూసాను.

ఉరుగ్వేలో బాటరీలు, పెయింట్ ఇంపోర్ట్ చేసుకోకూడదట, అందుకే వీళ్ళు ఎక్కువగా అవే సైకిళ్ళమీద పెట్టుకుని అక్రమంగా తరలిస్తారు. మన గుంటూరు వ్యాపారం చిట్కా ఉరుగ్వేకి పాకిందనమాట.

నెట్ ఫ్లిక్స్ మీద ఒక టపా రాసాను, ఎడిటింగ్ చేసి రేపు విడుదల చేస్తాను.