Wednesday, July 6, 2011

The Man from Nowhere (2010) - దక్షిణ కొరియా మసాలాఈ సినిమా చూసాక వచ్చిన మొదటి అలోచన ఏమిటంటే మన బాలీవుడ్ కి కానీ, టాలీవుడ్ కి కానీ కావలసిన మసాలా ఈ సినిమాలో ఉంది. ఇది ఇంకొక సంవత్సరంలో మనం హిందీలో కానీ, తెలుగులో కానీ చూసెయ్యచ్చు అని. ఏమో ఎవరికి తెలుసు, ఇది ఇప్పటికే మన వాళ్ళ పరిశీలనలో ఉందేమో?

సినిమా సంగతికొస్తే ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ అన్నమాట. ఒక డ్రగ్ డీలులో హెరాయిన్ అసలు దొంగల చేతిలో నుండి మన హీరోయిన్ (హో సియో కిం) చేతిలో పడుతుంది. డీలు సరిగ్గా పూర్తి చేసుకురమ్మని డాన్ పంపితే హెరాయిన్ ఎత్తుకొచ్చిన హో సియో కిం ని చిత్ర హింసలు పెట్టి చంపేస్తారు. హో సియో కి ఒక కూతురు ఉంటుంది, ఆ అమ్మాయిని ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఈ గొడవలో సే రాన్ ఎదురింటి వాడిని కూడా కెలుకుతారు. ఎదురింటివాడిని (బిన్ వాన్) కెలికినప్పుడు తెలియదు ఆ విలన్ ముఠాకి వాళ్ళు చేసిన తప్పు (యండమూరి స్టెయిల్). మిగిలిన సినిమా బిన్ వాన్ ఎలా విలన్ల పంబ రేపుతాడో చూడడమే!

ఎవడో అనామకుడుగా ఉండే బిన్ వాన్ కి ఇచ్చే బిల్డప్ విపరీతంగా ఉంటుంది. వాడిని పెద్ద తోపులాగా దెబ్బలు తిన్న వాళ్ళు చెప్తుంటే చూసే వాళ్ళకి ఆత్రుత అంతా,ఇంతా కాదు. బిన్ వాన్ బాక్ గ్రౌండ్ తెలుసుకోవడానికి పోలీసులు వాడిన కొత్త ట్రిక్ భలే ఉంది. బిన్ వాన్ డైలాగులు సబ్ టైటిల్స్ తోనే చాలా పవర్ ఫుల్లుగా ఉన్నాయి. చిన్న పిల్లగా నటించిన అమ్మాయి (సే రాన్ కిం) అయితే మనల్ని సెంటిమెంటుతో కబడీ ఆడుకుంటుంది. 

నాకు నచ్చిన కొన్ని సీన్స్

1) బిన్ ఇంటికి మొదటిసారి వచ్చి అక్కడ ఒక గూండాని వేరే వాడు చంపుతాడు. వాడు వాళ్ళ బాస్ తో మాట్లాడేటపుడు "నేను తుపాకీతో కాల్చేటపుడు అక్కడ నిల్చున్న వాడు కళ్ళు కూడా మూయలేదు" అని ఆశ్చర్య పోతాడు.


2) చిన్న పిల్ల సే రాన్ కిం, బిన్ వాన్ కి దగ్గరవడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా బాగా ఉంటాయ్. ఒక సమయంలో బిన్ ని వాళ్ళ నాన్న అని వేరే వాళ్ళకి పరిచయం చేస్తుంది. కానీ బిన్, సే రాన్ కి దగ్గర కావడానికి ఇష్టపడడు.

3) బిన్, విలన్ ముఠాతో ఫోన్లో సంభాషణ బాగుంటుంది. విలన్ కి "రేపటికి నువ్వు ఉండవ్" అని సవాల్ విసిరినపుడు మనకి సమర సింహా రెడ్డి సినిమా గుర్తుకువస్తుంది.   

4) బిన్ ఒక్కడే విలన్ డెన్ కి వెళ్ళి అందరినీ మట్టుబెట్టే సీనులో హీరోయిజం బాగా ఎలివేట్ చేసాడు. అక్కడ ఇంకో విలన్ తో చురకత్తి ఫైటింగ్ బాగుంటుంది. 

5) బిన్ ఫ్లాష్ బాక్ కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది. చివరలో క్లైమాక్సులో కూడా సెంటిమెంటు బాగా ఉంది.ఈ కథ మహేష్ బాబుకి సరిగ్గా సరిపోతుంది. త్రివిక్రం ని పెట్టుకుని రెండు సినిమాలకి కావలసిన ఫిలిం ఇచ్చి మూడు సంవత్సారాలు సమయం ఇస్తే "ఇంకొకడు" సినిమా టైటిల్ తో మన ముందుకు రావచ్చు. రిలీజ్ అయిన రెండు వారాలకి ఫ్లాప్ టాక్ తట్టుకోవడానికి జరిపే సక్సెస్ మీటులో "ఈ సినిమా కథని మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా వ్రాయడం జరిగింది" అని చెప్పుకోవచ్చు!

2 comments:

Afsar said...

బాగుంది, శ్రీ
మన వాళ్ళు ఇండియాలో ముఖ్యంగా ఉత్తరాదిన ఈ కొరియా యాక్షన్ సినిమాలు తెగ చూస్తున్నారట. ఏమిటి కథ?

శ్రీ said...

థాంక్స్ అఫ్సర్ గారు.

కొరియన్, హాంకాంగ్ సినిమాలల్లో మనకి కావలసిన మసాలా బాగుంటుంది.

ఆమధ్య విడుదల అయిన లవ్ ఆజ్ కల్ సినిమా కొరియన్ సినిమా అని విన్నా.

అలాగే మన తెలుగు సినిమా అతడుకి స్పూర్తి ఒక హాంకాంగ్ సినిమా.