Wednesday, August 17, 2011

Delicatessen (1991) - French Comedy Movie



రెండు సంవత్సరాల ముందు ఈ సినిమా చూసాను. ఈ మధ్య మళ్ళీ ఒకసారి చూడాలని కోరిక పుడితే తీర్చుకున్నాను. ఈ సినిమాకి ఒక అంటురోగం ఉంది, చూడడం మొదలుపెడితే ఇక ఆపలేము.  ఒక పాత్ర ఇల్లు చూస్తే 'ఎమిలీ' సినిమా గుర్తుకు వచ్చింది. ఈ సినిమాకి, ఎమిలీకి ఏదొ సంబంధం ఉంది అనిపించింది. నా అనుమానం నిజమే, ఈ సినిమాని 1991 లో జీన్ పెర్రీ జూనెట్ ఇంకొక దర్శకుడు కారో తో కలిసి తీసాడు. 2001 లో జూనెట్ ఎమిలీ తీసాడట! ఈ సినిమాలో కథానయకుడిగా నటించిన డామ్నిక్ ఎమిలీలో ఒక పాత్ర పోషించడం కూడా నా దృష్టిని దాటలేదు.  

ఫ్రాన్స్ లో పెద్ద వినాశనం (కల్పితం) తరువాత ఒక అపార్టుమెంటులో నివసించే పాత్రల మధ్య సినిమా కథ నడుస్తుంది. ఆ సమయంలో డబ్బుల బదులు గింజలు వాడుతూ ఉంటారు, ఎవరి దగ్గర ఎక్కువ గింజలు ఉంటే వాళ్ళే ధనవంతులు అన్నమాట. అపార్టుమెంటు ఓనరుకి మాంసం అంగడి ఉంటుంది. అక్కడే చిన్న, చితకా పనులు చేస్తూ ఉండడానికి డామ్నిక్ అక్కడకి చేరుకుంటాడు. అంగడి ఓనరుకి ఒక కూతురు (మేరీ) ఉంటుంది, మేరీ మన డామ్నిక్ తో ప్రేమలో పడుతుంది. అంతకుముందు అక్కడ పని చేసిన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మరణిస్తాడు. మేరీకి ఆ రహస్యం తెలుసు, డామ్నిక్ కి ఈ విషయం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.
    
అక్కడ నివసించే కుటుంబాలు విచిత్రంగ ఉంటాయి. ఒక కుటుంబానికి ఇద్దరు పిల్లలు. ఇంటాయన ఏదో చిన్న పనులు చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఇంటికి రెంట్ కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇతనికి ఇద్దరు అల్లరి పిల్లలు, ఆ ఇద్దరు పుట్టుక  ఎలా జరిగిందో దర్శకుడు భలే సరదాగా చూపిస్తాడు. ఈ ఇంట్లో ముసలామె ఎపుడూ టీవీ చూస్తూ స్వెటరు అల్లుకుంటూ ఉంటుంది.  




ఇంకో కుటుంబంలో ఒక నడివయసు జంట ఉంటారు. ఇంటావిడకి గోడల నుండి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అవి ఆమెని భయపెడుతూ పిచ్చెక్కించేలా ఉంటాయి. వీటిని తట్టుకోలేక ఆమె ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నాలన్నీ సరదాగా ఉండి, ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇద్దరు మగవాళ్ళు కూడా ఒక ఇంట్లో నివసిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ చిన్న కుటీర పరిశ్రమ లాగా రోజంతా ఒకేపని చేసుకుంటూ ఉంటారు. ఇంకొక ఇంట్లో ఒక ముసలాయన ఉంటాడు. ఆయన ఇంట్లో కిందంతా నీళ్ళు! నత్తలు, కప్పలు ఇల్లంతా తిరుగుతూ ఉంటాయి. ముసలాయన అందిన నత్తలనే తినేస్తూ ఉంటాడు. ఇలాంటి విచిత్రమయిన పాత్రల మధ్య ఆసక్తిగా కథ నడుస్తుంది.


ఎమిలీ లాగే ఈ సినిమా కూడా చాలా అందంగా ఉంటుంది, ప్రతి ఫ్రేము ఎంతో కళాత్మకంగా, శ్రద్ధగా అలంకరించి తీసినట్టు ఉంటుంది. పాత్రల హావభావాలు కూడా విచిత్రంగా ఉండి, నవ్వు పుట్టిస్తాయి. మేరీ నాన్న ప్రేమ సన్నివేశం మంచి సరదాగా ఉంటుంది. మేరీ ఇంటికి డామ్నిక్ టీకి వెళ్ళే సన్నివేశం కూడా తమాషాగా ఉంటుంది. అల్లరి పిల్లలు చేసే చిలిపి పనులు బాగుంటాయి. డామ్నిక్ మంచం మరమ్మత్తు చేసే సన్నివేశం కూడా భలే ఉంటుంది. క్లైమాక్సులో అన్ని పాత్రలూ చేరి హడావిడిగా, గందరగోళంగా ఉండి మనకి శివనాగేశ్వరరావు సినిమా మనీ గుర్తుకు వస్తుంది. 


దర్శకుడు ఈ సినిమాకి ముందు అమెరికాకి విహారానికి వెళ్ళినపుడు ఒక హోటలులో ఉన్నాడట. ఆ హోటలులో అతని అనుభవం, అక్కడ తిండి ఇతన్ని ఈ సినిమా తీయడానికి ప్రేరేపించాయట. ఈ సినిమాలో కొన్ని శృంగార సన్నివేశాలు ఉంటాయి కాబట్టి పిల్లలు లేనపుడు ఈ సినిమా చూడండి.



2 comments:

sapna said...

thappakunda chudali ee movie..

శ్రీ said...

తప్పక చూడండి.