Tuesday, September 20, 2011

పాకుడు ఆగింది, ఈ వారమే దూకుడు



అతడు, పోకిరి సినిమాల తరువాత మహేష్ బాబు మార్కెట్ పెరిగింది. తరువాత వచ్చిన సినిమాలు సరిగ్గా ఆడకపోయినా బాబు ఇమేజ్ ఇంకా నిలబడి ఉంది. గత సంవత్సరం విడుదల అయిన ఖలేజా కూడా ప్రజల అంచనాలను, నాడిని అందుకోలేకపోయింది. ఇపుడు ఉన్న కొద్ది పాటి తెలుగు సినిమా దర్శకులలో వరుస హిట్లు తీస్తున్న శ్రీను వైట్ల, మహేష్ బాబు సినిమా ఈ వారం విడుదల అవుతోంది.

శ్రీను వైట్ల సినిమాలలో కామెడీ బాగా ఉంటుంది. ఆనందం సినిమా హిట్ అయినప్పటి నుండి ఇతని సినిమాలన్నీ కామెడీ రసంలో మునిగి తేలుతుంటాయి. దాదాపు అన్ని సినిమాలలో తాగేసి అందరూ కలిసి ఒకడిని చితకబాదే సీన్ ఉంచుకుంటూ వస్తున్నాడు. అలాగే ఢీ సినిమా హిట్ అయినప్పటి నుండి అదే సెటప్ రెడీ, కింగ్ సినిమాలలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు విడుదల అయిన కొత్త ట్రైలరులో కూడా ఇదే సెటప్ కనిపించింది. వెంకీ సినిమా నుండి భరత్ కి ఒక ముఖ్య పాత్ర ఇచ్చి తన స్కూలులో చేర్చుకున్నాడు. ఢీ, రెడీ, కింగ్, నమో వెంకటేశ సినిమాలలో ఈ వూబకాయుడు మంచి కామెడీనే పండించాడు. డూకుడులో కూడా ఇతని పాత్ర బాగనే కనిపిస్తుంది. ఇక మనందరికీ తెలిసిన బ్రహ్మానందం కూడా వెంకీ సినిమా నుండి వైట్ల స్కూలులోనే ఉన్నాడు. ఢీ సినిమాని హిట్ చేయడంలో ఇతనిది ఒక మహాపాత్ర. పిట్ట లాగుండే రాం సినిమా రెడీని కూడా బ్రమ్మీనే చాలావరకు లాక్కొచ్చాడు. దుబాయ్ సీను, నమో వెంకటేశ, కింగ్ సినిమాలలో ఇంచుమించు రెండో హీరో మన బ్రమ్మం. అతడు, పోకిరి సినిమాలలో మహేష్, బ్రమ్మీ కామెడీ బాగనే పండింది. ఈ సినిమాలో మహేష్ కామెడీ బ్రమ్మీని డామినేట్ చేసిందని ప్రమోస్ లో వాగుతున్నారు. ఎంతవరకు నిజమో చూస్తే కానీ తెలియదు.

అతడు సినిమాకి పని చేసిన గుహన్ ఈ సినిమాకి కూడా సినిమాటోగ్రాఫరుగా పని చేస్తున్నాడు. సినిమాకి మంచి దర్శకుడు, కెమెరామేన్ ఎలా అవసరమో మంచి సినిమాటోగ్రాఫర్ కూడా అంతే అవసరం. 
వెంకీ సినిమా నుండి సినీ రచయిత గోపీ మోహన్ శ్రీను వైట్లతో కలిసి పని చేస్తున్నాడు. ఈ సినిమాకీ అతనే కాబట్టి దూకుడు సెటప్ కూడా పాత సినిమాలలో లాగే ఉంది. వైట్లకి కావలసిన ట్విస్ట్లు గోపీ అందిస్తాడని ఆశిద్దాం. మన సినిమా కథలలో కొత్తదనం ఏమి ఉండదు అని మనకు తెలిసిందే. కాకపోతే రెండున్నర గంట హాలులో కూర్చోపెట్టి సినిమా చూపించే సత్తా ఈ సినిమాకి ఉందో, లేదో? 

ఆడియో విడుదల అయి ఒక నెల అయినట్టుంది, పాటలు జనాలలో బాగనే నానుతున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్, ఇతని పాటలు చాలా వరకు మణిశర్మ పాటలు లాగే ఉంటాయి. శర్మ స్కూలులోనే తమన్ పని చేసాడు కదా, ఇంకా ఆ సిలబస్ మర్చిపోయినట్టు లేడు. ఒక పాటలో కిక్ వాసనలు తగిలాయి నాకు, కాకపోతే పాటల్లో మాస్ మసాలా బాగా వేసాడు. ఇక వీడియో చూడడమే తరువాయి.  

మహేష్ బాబు సినిమాలలో హీరోయిన్ పాత్ర చాలా ముఖ్యం. బాబు గ్లామరుకి తగిన నాయిక దొరకడం కష్టం, ఈసారి ఆ అదృష్టం సాం కి దక్కింది. సాం కి ఈ పాత్ర ఇవ్వడం నాకు ఇష్టం లేదు, సరే సినిమానే కదా అని సర్దుకుపోతున్నా. అనుకోకుండా వీళ్ళిద్దరి మధ్య రసాయన శాస్త్రం బాగనే కుదిరింది చిత్రపటాల వరకు. ఈ పటాలు కదిలితే ఎలా ఉంటాయో?  ఫ్లాప్ అయిన సినిమాలలో కూడా బాబు తన పాత్రని బాగనే తోముకున్నాడు. కథలో పట్టు లేకపోతే బాబు మాత్రం ఏం చేస్తాడు? ఈ సినిమాలో బాబు తెలంగాణ యాసతో మాట్లాడాడని టీవీ9 తెగ చెప్తుంది. మాకు తెలంగాణ ఇచ్చుడు లేదు కానీ మా టిక్కెట్లు మాత్రం మీకు గావాలే! ఎట్లాగూ యాస ఉంది కాబట్టి కేసీఆర్ సినిమా ఆపడు, మంచి వ్యాపార చిట్కా! 

అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం సినిమాలో కామెడీ కేక అట. పోకిరి సినిమాలాగే ఈ సినిమాలో కూడా చివరలో ఒక ట్విస్ట్ ఉందట. అది జనాలకి ఎక్కితే సినిమా హిట్! ఈసారి దూకుడు మా వూరికి దగ్గరలోనే ఆడుతుంది.  ఈరోజే సెన్సార్ కూడా పూర్తయిందట, ఇక గురువారం మనకి ప్రీమియర్ ఉందని మా వూరి ఎగ్జిబిటర్ చెప్పాడు. మహేష్ ఫాన్స్ అందరం ప్రీమియర్ కి వచ్చి సినిమాని జయసుధం చెయ్యాలని ప్రార్ధన.  


6 comments:

Rajendra Devarapalli said...

జయసుధం చెయ్యాలి జయసుధం చెయ్యాలి జయసుధం చెయ్యాలి

శ్రీ said...

--)

ఆ.సౌమ్య said...

దేని కోసం అయినా కాకపోయినా శ్రీనూ వైట్ల మీద అభిమానంతో సినిమా చూడాలని నిర్ణయించేసుకున్నాను. బ్రమ్మీ కామెడీ, మహేష్ మెరుపులు...సోకులకేమీ తక్కువలేదు. చూడాలి ఎలా ఉంటుందో! ఒక్కటే నచ్చలేదు - తమన్ ని పెట్టుకోవడం.

శ్రీ said...

శ్రీను వైట్ల ఇప్పటివరకూ అన్నీ బాగనే తీసాడు, ఈసారి కూడా బాగనే ఉండచ్చు.

కొత్త పాళీ said...

కేక!

శ్రీ said...

థాంక్స్ కొత్తపాళీగారు.