నెత్తి మీద ఎండ ఉన్నన్నాళ్ళూ మా ఊరిలో క్రికెట్ ఆడుతూ ఉంటారు. చలి కాలం మొదలవగానే ఇండోర్ లీగులు కూడా మొదలవుతాయి. నాకు తెలిసి ఎంత లేదన్నా ఒక పది, పదిహేను క్రికెట్ లీగులు డెట్రాయిటులో ఆడుతూ ఉంటారు. నేను ఇంతకు ముందు పని చేసిన ఆఫీసులో కూడా గత పది సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నారు. మా ఆఫీసు లీగులో ప్రతి సంవత్సరం కనీసం పది టీములు ఉంటాయి. ఈ లీగు ఉన్నన్ని రోజులూ అందరికీ మంచి సరదాగా ఉంటుంది. లీగుని సమర్ధవంతంగా నిర్వహించడానికి కమిటీలు ఉంటాయి. అడడానికి స్థలాలు చూసి పెట్టే వాళ్ళు, టీముల మధ్యలో గొడవలు పరిష్కరించే వాళ్ళూ, ఆట రూల్స్ రాసేవాళ్ళు, అంపైర్లు ఇలా ఒక పెద్ద వ్యవస్థే ఉంటుంది.
నేను క్రికెట్ ఆడడం కంటే చూడడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు ఆట పెద్దగా రాదు కాబట్టి. నిన్న శనివారం మా ఊరిలో రెండు రోజుల కోసం ఒక చిన్న లీగ్ మొదలయింది. మా ఇంటి పక్కనే ఆడుతున్నారు కాబట్టి కాసేపు చూసి వద్దామని బయలుదేరాను. ఆడుతున్న పార్కుకి వెళ్ళి కారు పార్కు చేసి గ్రౌండ్ వైపు నడుస్తూ ఉంటే నా అలోచనలు వెనక్కు వెళ్ళడం మొదలుపెట్టాయి.
నేను ఆటలు ఆడడం మొదలుపెట్టింది రాపూరు హైస్కూలులో చేరినప్పటి నుండే, అప్పటి వరకు చంటి సినిమాలో మీనా లాగా నా చదువంతా ఇంటి దగ్గరే సాగింది. అలా అని మాది రాచరికం కాదు, దీనికి సంబంధించిన రీలుని ఇదివరకే ఇక్కడ తిప్పాను. రాపూరు హైస్కూలులో క్లాసులు అయిపోగానే రోజూ కనీసం ఒక రెండు గంటలు బాడ్మింటన్ ఆడేవాళ్ళం. తొమ్మిదో తరగతిలో ఒకసారి కప్ కూడా గెలిచాము. ఆ రోజుల్లోనే మా ఊరిలో క్రికెట్ కూడా ఆడడం మొదలుపెట్టారు. ఈ ఆట ఎలా ఉంటుందని కొన్ని రోజులు అట చూడ్డానికి వెళ్ళాను. నేనూ, నా స్నేహితుడు చిలకా (అతని ఇంటి పేరు) కలిసి ఆట చూస్తూ ఉంటే నన్ను కూడా ఆడడానికి పిలిచారు. నేను అదే మొదటసారి బాట్ పట్టుకోవడం! నాకు వేసిన మొదటి బాల్ నా బాటుకి తగలకుండా ముక్కుకి తగిలి కొన్ని రోజులు నన్ను క్రికెట్ కి దూరం చేసాయి.
క్రికెట్ నేర్చుకుందామని ప్రయత్నిస్తుండగా బాలజ్యోతిలో ఈ ఆట గురించి రాయడం మొదలుపెట్టారు. బాటింగ్, బౌలింగ్ గురించి బాగా చదివి నా బాడీ లంగ్వేజ్ ప్రకారం లెగ్ స్పిన్ నాకు సరిపోతుందని దాన్ని బాగా ప్రాక్టీస్ చేసాను. నాతో పాటూ కోటి కూడా నేర్చుకోవడం మొదలుపెట్టాడు. మేమిద్దరం రోజూ కాసేపు చెక్క బాటుతో ఆడుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళం. తరువాత నేను పై చదువులకోసం లండన్, కాదు కాదు నెల్లూరు వెళ్ళడం జరిగింది. మాతో పాటూ చిలకా కుటుంబం కూడా నెల్లూరు వచ్చేసింది.
నెల్లూరులో వీ.ఆర్ కాలేజీ ఎదురుగా ఉండే ఎగ్జిబిషన్ గ్రౌండులో నేను, చిలకా కలిసి క్రికెట్ ఆడేవాళ్ళం. ఆట కంటే మధ్యలో తాగే నిమ్మకాయ సోడా మీద బాగా ఆసక్తి చూపేవాడిని. నెల్లూరులో కృష్ణ, కావేరి, కళ్యాణీ, లీలామహల్, నర్తకి, అర్చన లాంటి అద్భుతమయిన సినిమా హాళ్ళు ఉండేవి. వీటన్నిటిలో పడిపోయి ఆట మీద ధ్యాస తగ్గిపోయింది. ఇన్ని సినిమాలని కవర్ చెయ్యడం చాలా కష్టమయ్యేది. ఇంట్లో పాత పేపర్లు అమ్మడం, మొలతాడు కొనుక్కోకుండా ఆ డబ్బులతో సినిమాకి వెళ్ళడం చేస్తూ ఉండేవాడిని. అందుకే నాకు ఇంటరు మొదటి సంవత్సరం నుండీ ఇప్పటివరకు మొలతాడు వేసుకోలేదు. అసలు ఈమధ్య మొలతాడు ఎవరన్నా కట్టుకుంటున్నారా?
విద్యానగరులో ఇంజినీరింగ్ చేరినపుడు ఏదో అమావాస్యకొకసారి ఆడి ఉంటానేమో! మళ్ళీ సూళ్ళూరుపేటలో వెంకటేశ్వర స్వామి గుడి పక్కన నారాయణ మెస్ శీను, గుడ్డి రమేష్, సురేష్, కర్రి శీను, నెల్లూరు పెద్దారెడ్డితో కలిసి అపుడపుడూ ఆడేవాడిని. సూళ్ళూరుపేట, తడ టీముల మధ్య బాగా పోటీ ఉండేది. నాకూ, పెద్దారెడ్డికి క్రికెట్ రాకపొయ్యేసరికి మేము పెద్దరికం పోగొట్టుకోకుండా ఉండడం కోసం మేనేజిమెంటులో ఉండేవాళ్ళం. మళ్ళీ జీవితములో ఉరుకులు, పరుగులు మొదలయ్యి ఆటలకి దూరం అయిపోయాను.
డెట్రాయిట్ వచ్చాక కూడా చాలా సంవత్సరాలు క్రికెట్ కి దూరంగా ఉండేవాడిని. మనకి వచ్చిన బాడ్మింటన్ ఆటతో టెన్నిస్ ఆడుకుంటూ కాలం గడిపాను. మా ఆఫీసులో క్రికెట్ హంగామా చూసి నాకూ ఆడాలనిపించింది, అనుకున్నట్టే నన్ను ఎవరూ ఏ టీములోకీ తీసుకోలేదు. ఇక చేసేదేముందని నాలాంటి వాళ్ళని పోగేసి నేనే ఒక టీం పెట్టేసా. నా టీం అయినా టీం బాగు కోసం నేను బాట్ పట్టేవాడిని కాదు (నాకు బాట్ ఇచ్చే వాళ్ళు కాదు లెండి, అది వేరే విషయం). కాకపోతే టీముకి, లీగుకి సహకరిస్తూ సరదాగా గడిపేసేవాడిని.
ఎంత సేపూ చదువు, చదువు అని పుస్తకాలు పట్టుకోకుండా ఉంటే నేను కూడా టెండూల్కర్ అంత ప్లేయర్ అయిపోయి ఉండేవాడినేమో అనిపిస్తుంటుంది అపుడపుడూ.
No comments:
Post a Comment