Saturday, September 10, 2011

Vodka Lemon (2003) - శీఘ్రమేవ కిక్కు ప్రాప్తిరస్తు!



సంవత్సరం క్రితం ఈ సినిమాని ఆనార్బర్ సమ్మర్ ఫెస్టివలులో ప్రదర్శించారు. నాకు ఆ విషయం ఒక రోజు లేటుగా తెలిసింది. సినిమా వాల్ పోస్టరు కొత్తగా, ప్రత్యేకంగా ఉంటుంది. దీన్ని చూసి ఈ సినిమాపై నా ఉత్సాహం ఇంకొంచెం పెరిగింది. ఈమధ్యలో ఈ సినిమా చూడడం కూడా జరిగింది. 

సోవియట్ యూనియన్ ముక్కలవడానికి ఒక సంవత్సరం ముందే అర్మేనియాకి స్వాతంత్ర్యం లభించింది.  తరువాత జరిగిన యుద్ధాలలో దేశం ఆర్ధికంగా చితికిపోయింది. చితికిన ఆర్ధిక పరిస్థితుల్లో అక్కడి ప్రజల జీవితాలను మనకు చూపించడానికి దర్శకుడు హైనర్ సలీం చేసిన ప్రయత్నం ఈ సినిమా.

హమోకి అరవై ఏళ్ళు ఉంటాయేమో, భార్య చనిపోయి ఉంటుంది. ఒక కొడుకు పారిస్ లో పని చేస్తూ ఉంటాడు, ఇంకొక కొడుకు పని చెయ్యకుండా ఇంట్లోనే ఉంటాడు. పని చెయ్యని కొడుక్కి పెళ్ళీడుకొచ్చిన ఒక కూతురు కూడా ఉంటుంది. ఇద్దరినీ మన ముసలాయనే పోషిస్తూ ఉంటాడు. పారిస్ లో ఉన్న కొడుకు ఎపుడయినా డబ్బులు పంపిస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు. చనిపోయిన తన భార్య సమాధి దగ్గరకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఇల్లు గడవడానికి డబ్బులు అవసరమయ్యి ఇంట్లొ ఉన్న ఒక్కొక్క సామాను అమ్ముకుంటూ ఉంటాడు.


ఇదే పరిస్థితుల్లో ఉన్న నీనా అనే ఒక నడివయసు మహిళ  హమోకు తారసపడుతుంది. నీనా ప్రతి రోజు చనిపోయిన తన భర్త సమాధికి వస్తూ అక్కడా కాసేపు గడిపి తిరిగి బస్సులో ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఈమెకి బస్సులో వెళ్ళడానికి డబ్బులు ఉండవు, అరువు పెట్టి ప్రయణిస్తూ ఉంటుంది. ఈమెకి కూడా పెళ్ళీడుకొచ్చిన ఒక కూతురు, చిన్న పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. నీనా వోడ్కా లెమన్ అనే పేరు గల రోడ్ సైడు బారులో పని చేస్తూ ఉంటుంది.  


మిగిలిన సినిమా అంతా హమో, నీనాల జీవితాలు తిరిగే మలుపుల మీద కొంచెం నిదానంగా నడుస్తుంది. ఈ సినిమా అంతా పేరుకు తగ్గట్టే మత్తుగా సాగుతుంది, గమ్మత్తయిన మత్తు, బాగుంటుంది. పీప్లి లైవ్ సినిమా లాగే ఈ సినిమాలో కూడా కామెడీ ఉంటుంది. ఆ కామెడీ వెనక టన్నుల కొద్దీ బరువయిన విషాదం ఉంటుంది.  


తెల్లటి కాగితం మీద ఏ రంగులు చిలికించినా చిత్రం రమణీయంగా ఉంటుంది. చూటూ కొండల మీద మంచు, ఎక్కడా చూసినా తెల్లగా,గుట్టలు,గుట్టలుగా మంచు. సినిమా అంతా ఈ మంచులోనే! చూసే వాళ్ళకి మాత్రం వెచ్చగా ఉంటుంది. ప్రతి ఫ్రేమూ ఎంతో అందంగా, ముద్దుగా ఉంటుంది. ఈ సినిమాలో చెపుకోవలసింది ఇంకొకటి ఏమిటంటే సంగీతం! బస్సు నడిపే డ్రైవరు సీడీలో పాటలు పెట్టకుండా ఇతనే పాడి వినిపిస్తూ ఉంటాడు. ఆ పాట కూడా "పరదేశ్..." అన్నట్టు మనకి వినిపిస్తుంది. చాలా మంచి పాట, మంచి మరక లాగా మనల్ని అంత తొందరగా వదలదు. ఈ సినిమాలో ఒక తమాషా ఏమిటంటే, ఇంచుమించు ప్రతి సన్నివేశంలో ఒక వ్యక్తి గుర్రం మీద స్క్రీనుకి అడ్డంగా తిరుగుతూ ఉంటాడు. మొదట్లో గమనించం కానీ, పోను పోను ప్రతి సీనులో ఇతను కనిపిస్తుండడం తమాషాగా ఉంటుంది. 

హమో, నీనా చాలా బాగా నటించారు. నీనా చూడడానికి కొంచెం మిషెల్ ఫైఫెర్ లాగా అనిపిస్తుంది, అమే ఏమో అని పేరు ఒకసారి మళ్ళీ చూసాను. తప్పకుండా చూడాల్సిన సినిమా.

2 comments:

Rajendra Devarapalli said...

మంచి మరక లాగా మనల్ని అంత తొందరగా వదలదు...super :)

శ్రీ said...

నెనర్లు రాజేంద్ర గారు.