రెండు సంవత్సరాల ముందు కొలీగ్స్ తో ఉప్పరసోదిలో నిమగ్నమయినపుడు టాపిక్ బైకర్స్ మీద మళ్ళింది. ఒకతను "ఈ పిలకాయలు, రోడ్ మీద చాలా విచ్చలవిడిగా వెళ్తూ ఉంటారు. హెల్మెట్ వేసుకుంటారు కానీ, సేఫ్టీ జాకెట్ వేసుకోరు. సిమెంట్ రోడ్ మీద జారి పడితే ఇంతే సంగతులు" అని వాపోయాడు. మిగతా అందరం తలాడిచ్చాం.
కొన్ని రోజుల తర్వాత నేను మోటార్ సైకిల్ లైసెన్స్ తీసుకోవడానికి మిషిగన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కోర్సు తీసుకున్నాను. మన దేశంలో మనం రెండు చక్రాల వాహనాలు నడపడంలో దిట్ట. నాకు నేను తురుం ఖాన్ అని ఫీలింగ్, కానీ ఇక్కడ మోటార్ సైకిల్ సేఫ్టీ కోర్సు బాగుంటుందంటే చాలా కష్టపడి సీట్ దక్కించుకుని పూర్తి చేసాను.
ప్రతి వారాంతం జరిగే ఈ కోర్సులో యాభై మందికి పైగా పాల్గొంటారు. ఈ యాభై మందిని అయిదు జట్లుగా విడగొట్టి మోటార్ సైకిల్ రోడ్ మీద నడపడానికి తగిన శిక్షణ ఇస్తారు. నాలుగు చక్రాల కారు నడపడం కంటే రెండు చక్రాల బైకు నడపడం కష్టం. ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. బైకు నడిపేటపుడు మనం అరిటాకు లాంటి వాళ్ళం. మనం కారుని గుద్దినా, కారు మనల్ని గుద్దినా అరిటాకే చినిగిపోతుంది. మా శిక్షణ ముగించే సమయానికి మా జట్టు నుండి అయిదు మందికి మాత్రమే లైసెన్స్ లభించింది. మిగిలిన వాళ్ళని మళ్ళీ శిక్షణకి రమ్మని పంపేసారు. నడిపేటపుడు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా మనల్ని ఫెయిల్ చెయ్యడానికి ప్రయత్నిస్తారు.
లైసెన్స్ వచ్చాక బైకర్స్ తో కలిసి కొన్ని ట్రిప్స్ వేసాను. కనీసం ముగ్గురం లేక ఇంకా ఎక్కువ మంది కలిసి ఒక పది లేక ఇరవై మైళ్ళు కలిసి ప్రయాణించేవాళ్ళం. ఇలా కలిసి వెళ్ళేటపుడు బాగా అనుభవం కలిగిన బైకరు ముందు వెళ్తూ ఉంటాడు, అలాగే ఇంకో అనుభవజ్ణుడయిన బైకరు గుంపుకి వెనక వస్తూ ఉంటాడు. మధ్యలో ఉండే బైకర్లు రోడ్ మీద ఒకరి వెనక ఒకరు కాకుండా ఒకరు రోడ్డుకి ఎడమ వైపు ఉంటే ఇంకొకరు కుడి వైపు ఉంటారు. ఇదంతా ఒక్క లైనులోనే, ఎందుకంటే ఒకరి వెనక ఒకరు వస్తూ ఉంటే ఎపుడయినా ముందు అతను హఠాత్తుగా అపాడనుకోండి, అపుడు వెనక అతను ఇతన్ని గుద్దడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా ఒకరు ఎడమ, ఇంకొకరు కుడి వైపు ఉంటే అటువంటి పరిస్థితుల్లో సడెన్ బ్రేకు వేసినా ఇద్దరూ పక్క, పక్క కొస్తారు, అంతే కానీ గుద్దుకోరు. ఈ గుంపులో మంచి క్రమశిక్షణ, ఓపిక కనిపిస్తుంది. సిగ్నల్ క్రాస్ చేసేటపుడు కూడా ఒకరికొకరు బాగా సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న హైదరాబాదులో అజారుద్దీన్ కొడుకు రింగు రోడ్డులో హై స్పీడులో బైకు మీద వెళ్తూ అదుపుతప్పి కిందపడిపోయి ఇపుడు ఆసుపత్రిలో చావు, బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు. అయాజుద్దీన్ వయసు పంతొమ్మిదేళ్ళు, ఇతని వెనకాల కూర్చున్న కజిన్ ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు, అతని వయస్సు పదహారేళ్ళు. కోట శ్రీనివాసరావు కొడుకు ఇలాగే స్పోర్ట్స్ బైకు మీద హెల్మెట్ లేకుండా వెళ్తూ అనుకోకుండా ఎదురుగా వచ్చిన ఆటోను తప్పిస్తూ కింద పడి అక్కడికక్కడే చనిపోయాడు. బాబూ మోహన్ కొడుకు కూడా ఇలాగే మోటార్ సైకిల్ ఆక్సిడెంటులో ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
ఈరోజు ఉదయం టోరీలో భవానీ గారు ఒక ప్రశ్న అడిగారు. మీ పిల్లలకి మీరు ఖరీదయిన బైక్స్ కొనిస్తారా? అని. పిల్లలకి కొనివ్వచ్చు కానీ, వాళ్ళకి జాగ్రత్తగా నడపమని చెప్పాల్సిన భాద్యత మన మీద ఉంది. పిల్లలు అదుపుతప్పి డ్రైవ్ చేస్తుంటే కట్టడి చెయ్యాలి. నేను టోరీకి కాల్ చేసినపుడు ఇక్కడ రాసిందే చెప్పాను. ట్రాఫిక్ పోలీసులు కూడా హైవేల మీద బైకు రేసింగులు చేస్తున్న కోతి మూకల ఆగడాలు అరికట్టాలి.
4 comments:
పిల్లలకి బైకు కొనటం అనేది మన మౌలిక వసతుల పై ఆధార పడాలి . ఆసలు మన రహదారులు కూడా కనీసం 100 కిలొమీటర్లు వేగానికీ అనువు కాదు . అలాంటప్పుడు అసలు స్పోర్ట్స్ బైకు అవసరమా చెప్పండి ?
సరదా కోసం ప్రాణాలు పనం గా పెట్టటం అవసరమా ?
అనవసరమేనండి. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టే!
హ్మ్! బాగా వ్రాసారండీ. నిజమే...ఇలాంటి శిక్షణ మన దేశంలో కూడా ఇచ్చి కొంచెం రూల్స్ కఠినంగా పాటిస్తే బాగుంటుందేమో! :) చూద్దాం...ఎప్పటికైనా మారుతాయేమో పరిస్థితులు!
థాంక్స్ ఇందు గారు.
Post a Comment