Thursday, June 21, 2012

రౌడీ రాథోడ్ - బాలీటాలీ మసాలావారంలో రెండు మూడు రోజులు పప్పు కూడు తింటే మూడో రోజో, నాలుగో రోజో కొంచెం మసాలాలు దట్టించిన ఆహారం తినాలని కోరుకోవడం ఒక బలహీనతే! ఇంకా ఆ బలహీనతలని ఎదుర్కోలేక, పోరాటంలో అలిసి పోయి వద్దు, వద్దంటున్నా మనసు ఆగక, కోరిక చావక ఈ మధ్యాహ్నం రోడీ రాథోడ్ చూసేసాను. ఇంతకు ముందు విక్రమార్కుడు చూసారు కదా, మళ్ళీ ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదు కదండీ అంటున్నా అలవాటు ప్రకారం వినిపించుకోకుండా మండుటెండలో సినిమాకి చెక్కేసా.

ఇంతకు ముందు పోకిరి సినిమా రీమేక్ చేస్తే నేను వెళ్ళలా. ఈ సినిమా కాకుండా నేను ఎదురుచూసిన సినిమా షాంఘై, ఫెర్రారీ కి సవారీ చూసి మార్కెట్లో ఆ సినిమాలకంటే ఈ మసాలా సినిమానే వీరవిహారం చేస్తూ ఉందని గ్రహించి దీనిలో ఏముందో చూద్దామని నన్ను పీకుతూ ఉండడం కూడా ఒక కారణమై ఉండచ్చు.

రాజమౌళి తీసిన సినిమాలలో విక్రమార్కుడు సినిమా కొంచెం వీకు అని నా అభిప్రాయం. మొదట కొంచెం కామెడీగా ఉన్నా,  సెకండ్ హాఫులో కొంచెం స్లో అవడం, అజయ్ కి బరువును మించిన పాత్ర ఇవ్వడం సినిమాని హిట్ కాకుండా ఆపింది.  అలాగని మరీ ఫ్లాపు కాదుకానీ, ఏదో ఆవరేజ్ గా ఆడింది లెండి.

మన సినిమాకి కొంచెం బాలీవుడ్ మసాలా దట్టించి ప్రభుదేవా హిట్ చేసేసాడు. అటు కామెడీ,  ఇటు యాక్షన్ పాత్రలో అక్షయ్ కుమార్ తనదైన శైలిలో చాలా బాగా నటించాడు. ఇక అనూష్క రూటులోనే సోనాక్షి కూడా నటించింది. ఈమెకి గ్లామరు కొంచెం తక్కువే, అందుకే అమ్మడు కొంచెం సైడ్ ట్రాకులో నడుస్తుంది.

ఈ సినిమాలో విలన్ గా మన నాజర్ చేసాడు. అసలు విలన్ కంటే పరవాలేదనిపించింది. అజయ్ పాత్రలో మన కాట్రాజు పరవాలేదనిపించాడు.  బాలీయులు కూడా వీళ్ళిద్దరినీ బాగనే ఆదరించినట్ట్లు ఈ సినిమా కలెక్షన్లు చూస్తే అనిపిస్తుంది. బాలీయులు పాటలు అందంగా తియ్యడంలో సిద్ధ హస్తులు. హీరో, హీరోయిన్లని క్లోజప్పులో   చూపించడంలో వీరికి వీరే సాటి. మన చోట .కే.నాయుడు కెమెరాలో ఈ అందాలు బాగనే కనిపిస్తాయి. ఇక పీ.సీ.శ్రీరాం గురించి అయితే చెప్పనే అక్కరలేదు.

తెలుగు సినిమాలో వీకు పాయింట్లు తీసేసి కొంచెం పదునైన స్క్రీన్ ప్లే తో సినిమాని విజయపధంలో లాగించేసారు.  సంతోష్ తుండియల్ సినిమాటోగ్రఫీ హాయిగా ఉంది. మన కీరవాణి బాణీలతో సంగీతం కూడా బాగనే చేకూరింది. ఎన్ని సార్లు చూసినా బోరు కొట్టని కథని అందించిన విజయేంద్ర వర్మ అసలైన హీరో. నా వీరతాడు ఇతనికే! 

No comments: