Thursday, July 12, 2012

బొంబాయి రవ్వ - ఆటా - 2012 సావనీరులో నా సెటైర్


మీరు గత వారం జరిగిన ఆటా సభల్లో పాల్గొన్నారా? అయితే సావనీరులో నా వ్యంగ్యం చూసే ఉంటారు. చూడని వారికోసం ఇక్కడ....
 
సమయం: ఒక సంవత్సరం ముందు
స్థలం: దాదర్


టాలీవుడ్ లోకి తన రాక భలే తమాషాగా జరిగింది. ఇపుడు తలుచుకుంటే అంతా ఒక కల లాగుంది. తన ఫ్రెండ్ చమన్నా తెలుగు సినిమాలల్లో గొప్ప హీరోయిన్ గా వెలిగిపోతున్నరోజులు. దానికి ఎపుడో నేను గుర్తొచ్చి పెద్ద ఉత్తరం రాసింది. ఇంట్లో చెప్పకుండా రాత్రికి, రాత్రి ట్రైన్ ఎక్కినప్పటి నుంచీ పాయల్ ఇప్పటికి కనీసం ఇరవై సార్లన్నా ఆ ఉత్తరం చదివింది. మెల్ల కన్ను, చీమిడి ముక్కు, చింపిరి జుట్టుతో చమన్నా ఎలా ఉండేది, ఇపుడు ఎలా అయిపోయింది? తలుచుకుంటూనే ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంది. ఆశ్చర్యంతో పాటూ కొంచెం ఈర్ష్య కూడా కలిసి అసహనానికి గురవుతూ ఉంది. చిన్నపుడు స్కూలులో అందరి కంటే తనే అందగత్తెగా ఉండేది. అబ్బాయిలందరూ తన వెంట పడుతూ తన కోసం ఎంతలా తపించిపోయే వాళ్ళో తనకు తెలుసు! ఏనాడూ దాని వెంట ఒక్కడు కూడా పడలేదు, అసలు అది తన కాలి గోటికి కూడా సమానం కాదని తన అభిప్రాయం. నిద్ర పట్టకపోయినా బలవంతంగా కళ్ళు మూసుకుని కాసేపు పడుకోవడానికి ప్రయత్నిస్తోంది. హైదరాబాదులో దిగగానే తన ఫోటో ఆల్బం ని తెలుగు నిర్మాతలకి చూపించి తొందరలోనే తనూ పెద్ద హీరోయిన్ అయిపోవాలి. చిన్నపుడు హైస్కూలులోనే కాదు, ఇక్కడ టాలీవుడ్ లో కూడా తన ఆధిపత్యమే గెలవాలి. 

సమయం: ప్రస్తుతం
స్థలం: హైదరాబాద్


పాయల్ ఇప్పుడు టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ అయిపోయింది. చేతి నిండా సినిమాలు! ఇపుడు రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలలో పాయలే! తెలుగే కాదు, పాయల్ ఇప్పుడు తమిళ్ కూడా చేస్తుంది. చమన్నా సినిమాలు ఇపుడు తగ్గిపోయాయి.ఈ దిగులుతో అది ఇంకా లావయ్యింది, తెలుగు సినిమాలు తగ్గిపోయి తమిళ్, మళయాళం సినిమాలలో అది బిజీ అయిపోయింది. ఇంకొన్ని రోజులుంటే దాన్నిఅక్కడ నుండి కూడా తరిమేస్తారు! తర్వాత మూటా, ముల్లె సర్దుకుని టీ.వీ సీరియల్లో పని చెయ్యాల్సిందే!


సమయం: ఒక నెల ముందు
స్థలం: కులూ మనాలి

పోయిన నెల భలే తమాషా జరిగింది. కులూ మనాలిలో షూటింగ్, తనతో పాటూ తన బాయ్ ఫ్రెండు రానూ పోద్ ని కూడా తీసుకెళ్ళింది. రానూ పొడుగా, అందంగా ఉంటాడు కదా! తనని రాసుకుంటూ, పూసుకుంటూ ఆ వారం రోజులూ షూటింగ్ లో నానా హడావిడి చేసాడు. అందరికీ రానూ పోద్ నచ్చేసాడు. ప్రొడ్యూసర్ అయితే రానూని తను తీయపోతున్న నెక్స్ట్ సినిమాలో రానూని హీరోగా పెడదామనుకున్నాడు. కానీ తెలుగు సినిమాలో హీరోలకి కొదవ లేదు, అందుకే రానూ ఎంత ముద్దుగా ఉన్నాఅతన్ని విలన్ రోల్ కి తీసుకున్నారు. ఏదో ఒకటిలే, తనకి బాలీవుడ్ లో ఇలాంటి అవకాశాలు ఎలాగూ రావు, కనీసం ఇక్కడన్న ఎదో ఒక అవకాశం వచ్చింది.
సమయం: ప్రస్తుతం
స్థలం: మూలా పేట, నెల్లూరు

మూలాపేటలో రాజాగారి వీధి చివరలో శెట్టి అంగడి ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అంగడికి వచ్చిన ప్రతి ఒక్కరినీ పలకరించడం శెట్టికి అలవాటు. అదే వీధిలో రెడ్డెమ్మకి చెందిన ఇళ్ళలో అద్దెకు ఉంటున్న శీను సరకుల కోసం అంగడికి వచ్చాడు.

"ఏం బాబూ! అమ్మ రాలేదా?" అంటూ పలకరించాడు శెట్టి.

"ఎదురుగా కనపడడం లేదు కదా, మళ్ళీ ఈ ప్రశ్నలెందుకూ?" అని అనకుండా నవ్వి ఊరుకున్నాడు శీను.

"బొంబాయి రవ్వ ఒక కిలో కావాలి" చెప్పాడు శీను.

శెట్టి కిలో రవ్వ తూకం వేసి పొట్లం కట్టడానికి పాత సినీపత్రిక నుండి ఒక దళసరి కాగితం తీసుకుని తెల్లగా మెరుస్తున్న రవ్వని అందులో జాగ్రత్తగా పోసాడు. పొట్లంలో ఉన్న బొంబాయి రవ్వని గమనించకుండా పొట్లం కాగితం మీద తెల్లగా మెరుస్తూ ఆందాలు ఒలకబోస్తున్న పాయల్ ని చూస్తూ గుటక మింగాడు శీను .

3 comments:

the tree said...

poorthi ga artham kaledandi, kani bhagundi.
congrats.

శ్రీ said...

థాంక్స్.
మళ్ళీ ఒకసారి చదివి చూడండి, మీకు తట్టచ్చు.

Narayanaswamy S. said...

the tree గారూ, తెలుగు సినిమా ప్రేక్షకులకి "బొంబాయి"రవ్వ ఉప్మాయే గతి అని కవిహృదయం.