Saturday, September 29, 2012

రెబెల్ - అదేదో తక్కువ, ఇంకోటేందో ఎక్కువ!చాలా రోజుల తర్వాత సినిమా చూసే యోగం కలిగింది. యూత్ తో పాటూ ప్రీమియర్ కి వెళ్ళాను. ప్రభాసుకి కూడా ఇంతమంది యూత్ ఫాన్స్ ఉన్నారని నాకు ఈ సినిమా ద్వారానే తెలిసింది. డాన్ సినిమా తర్వాత రాఘవ దర్శకత్వం మీద నాకు మోజు పోయింది. కాకపోతే తెలుగు సినిమా మీద ఉన్న దిక్కుమాలిన అభిమానముతో వెళ్ళకుండా ఆగలేకపోయాను. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా హిట్ అయ్యాక ఈ సినిమా మీద అంచనాలు బాగానే పెరిగాయి. ఆడియో ఫంక్షనులో పాటలు పెద్దగా పండలేదు. పాటలు బాగాలేని తెలుగు సినిమా, అతిగా ఆశపడే మగవాడు హిట్టవరని తెలుగు, తమిళ సినిమాలు బాతై కూసాయి.

స్టీఫెన్ రాబర్ట్స్  ని పట్టుకునేందుకు ప్రభాస్ సిటీకి వస్తాడు. సిటీలో అందరూ వారి పేరు వినడమే కానీ ఎవరూ వాళ్ళని చూసి కూడా ఉండరు. స్టీఫెన్ రాబర్ట్స్ అంటే ఒకరా, ఇద్దరా అని కూడా ఎవరికీ తెలియదు. తమన్నా నాన్న ఒక పెద్ద డాన్, ఆమెని లైనులో పెడితే అసలు విలన్ దొరుకుతాడని ప్రభాస్ ప్లాన్ వేస్తాడు. బాంకాక్ వెళ్ళి తమన్నాతో పులిహారా మొదలు పెడతాడు. తమన్నా  ఉప్పు మిరపకాయ అయిపోయి ప్రభాస్ పులిహారాలో కలిసిపోతుంది. స్టీఫెన్ బాబాయ్ కోసం ప్రభాస్ ఎందుకు వెతుకుతాడు? బాంకాకులో పులిహారా ఎందుకు కలుపుతాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే రెబెల్ చూడాల్సిందే!

ఎప్పటిలాగే రాఘవ సినిమా అంతా చాలా స్టైలిషుగా తీసాడు.  ప్రబాస్ గెటప్పు, తమన్నా సెటప్పు చాలా హడావిడి చేసాడు. ప్రభాస్ గెటప్పుకి యూత్ పిచ్చెక్కి పోయారు. తమన్నాని కూడా బాగా గ్లామరసుగా చూపెట్టారు. ప్రభాసుకి బట్టలు కొనడానికే ఒక సంవత్సరం పట్టినట్టుంది. చిన్నపుడు పండగకి బట్టలు కొనాలంటే మా పెదనాన్న కొడుకు (అన్న) ని తీసుకుని చిన్న బజారంతా తిరిగి పిచ్చి చొక్కాలు కొనుక్కునేవాడిని. తర్వాత రోజుల్లో మా ఫ్రెండుని తీసుకుని పాండీ బజారులో కొనుక్కున్నా. రాఘవ గురించి ముందే తెలిసి ఉంటే  తమ్ముడుని తీసుకుని మంచి బట్టలు కొనుక్కుని ఉండచ్చు కదా అనిపించింది.

ఫస్ట్ హాఫ్ వరకు సినిమాలో కథ పెద్దగా లేదు.  

ఈమధ్య సినిమాలన్నీ బాంకాకులో ఎందుకు తీస్తున్నారు భయ్యా? అని ప్రశాంత్ అడిగాడు.

ఏమీ లేదు! అక్కడ సినిమా తీస్తే యూనిట్ అందరికీ థాయ్ మసాజ్ ఫ్రీ ఇస్తున్నారేమో? అని నేను చెప్పలేదు. 


ఇంటర్వెలులో బయటకి వచ్చి విశ్లేషిస్తూ నేను నేను చెప్పిన రెండు మాటలు మీ కోసం ఇక్కడ....

"సెకండ్ హాఫులో ఫ్లాష్ బాక్ ఉండాలి.  బాకు ఎంత బాగుంటే సినిమాకి అంత  అసెట్. బాకు బెండు అయిందో సినిమా సూళ్ళూరుపేటలో కూడా ఫ్లాపు అవుతుంది". 


ఫ్లాష్ బాకులో సెంటిమెంటు పండలేదు.  ఇదే సినిమాని బాగా దెబ్బ తీసింది. ప్రేక్షకులు కూడా ఈ సెంటిని చూసి హాహాకారాలు పెట్టారు.  క్లైమాక్సులో నరకడానికి కావలసిన ఎమోషన్ బిల్డ్ చెయ్యడములో ఫ్లాష్ బాకు బాగా బెండయింది. గుడ్డిలో మెల్లగా పాటలు బాగా ఉండి ఉంటే ఎలాగో అలా కాసేపు సర్దుకు పోయి ఉండే వాళ్ళం. సినిమాలో చెప్పుకోవలసింది ఏమన్నా ఉంది అంటే అది "బాగా స్టయిల్ గా తీసాడు"

అతడు సినిమాలో క్లైమాక్సులో కోట దగ్గరకి ప్రకా ష్ రాజ్ మాట్లాడి వెళ్ళబోతూ ఒక మాట అంటాడు.

"ఎక్సుని చంపితే మీరు సీ.ఎం అవుతారనుకున్నారు. కానీ మర్డర్ చేస్తే జైలుకి వెళ్తారన్న చిన్న కామన్ సెన్స్ మిస్ అయ్యారు"  అనేసి బయటకి నడుస్తాడు.


సినిమాలో విషయం లేనప్పుడు ఎంత రిచ్చుగా తీసినా మిగిలేది విశాఖపట్టణమే! సినిమాలో బట్టలు మాత్రం చాలా బాగా ఉన్నాయి. ఇవి మీ ఊరిలో సలీసుగా అమ్ముతుంటే నాకు రెండు తీసి పెట్టండి, పెద్ద పండగకి వేసుకుంటా. 10 comments:

Raviteja said...

రివ్యూ బాగుంది :) సినిమాలో విషయం లేనప్పుడు ఎంత రిచ్చుగా తీసినా మిగిలేది విశాఖపట్టణమే! హహహ! సూపర్

Anonymous said...

సినిమా ఎలా వున్నా సమీక్ష మాత్రం చదివి బాగా నవ్వానండి..బాగా రాసారు. చాల కాలం తర్వాత "సలీసు" అన్న మాటని గుర్తు చేసారు... :-)

వేణూశ్రీకాంత్ said...

హహహ బాగుంది శ్రీ :-)) మన తెలుగు సినిమా వాళ్ళు నేలవిడిచి సాము చేయడం ఎప్పటికి మానేస్తారో. అన్నట్లు కృష్ణంరాజు గారి గురించి అసలు మాటాడలేదేంటి :))

శ్రీ said...

థాంక్స్ రవితేజా...

శ్రీ said...

థాంక్స్ అండి.
నేను కూడా సలీసు అన్న మాట విని చాలా రోజులయింది, ఇలా టపాలో ముచ్చట తీర్చుకున్నాను.

శ్రీ said...

థాంక్స్ వేణూ శ్రీకాంత్.
కృష్ణం రాజు అవతారం బాగుంది, ఆయన గురించి ఒక ముక్క రాసి ఉండాల్సింది.

శశి కళ said...

హ...హ...శ్రీ సినిమా సూళూరు పేటలో ప్లాప్ అవుద్డా?
ఏమి పాపం కాళహస్తి లో కాదా?
బట్టలకు ఏమి కొదువ...తీసిపెదతాము ))

శ్రీ said...

కాళహస్తిలో బాగలేకపోయినా చూసేస్తారండీ! --)
థాంక్స్ అండీ!

హరే కృష్ణ said...


బాంకాక్ వెళ్ళి తమన్నాతో పులిహారా మొదలు పెడతాడు
తమన్నా ఉప్పు మిరపకాయ అయిపోయి ప్రభాస్ పులిహారాలో కలిసిపోతుంది
సినిమాలో విషయం లేనప్పుడు ఎంత రిచ్చుగా తీసినా మిగిలేది విశాఖపట్టణమే!
ROFL

శ్రీ said...

థాంక్స్ హరే కృష్ణ!