Wednesday, July 23, 2014

పెళ్ళి సందడి!

సింధు పుట్టే సమయానికి నేను ఎం సెట్ లాంగ్ టెర్మ్ కోచింగ్ లో ఉన్నాను. నాతో పాటూ తిలక్, చంద్ర (పిన్నమ్మ పిల్లలు) కూడా చదువుకునేవాళ్ళు. మేము ముగ్గురం మూలాపేటలో మునెమ్మ అత్తమ్మ ఇంటికి పక్కన ఉన్న ఒక గుడిసెలో పడుకుని చదువుకునే వాళ్ళం. పడుకుని ఎందుకు అన్నానంటే, ఎక్కువగా ఇక్కడ నిద్రపోడానికే వెళ్ళేవాళ్ళం. ఆ ఇంటి నుండి మా ఇంటికి రావాలంటే ఒక సందులో పది ఇల్లులు దాటితే మా ఇల్లు. అక్కడ స్నానాలు, భోజనాలు చేసుకుని గుడిసెకి వచ్చి చల్లగా పడుకునే వాళ్ళం. 

మా గుడిసెలో ఒకసారి జెర్రి కనిపిస్తే దాన్ని పట్టుకుని దాని వెన్నెముక లాంటిది మాత్రమే తీసి దాన్ని చంపేసాడు. నాకు భలే వింతగా అనిపించింది. అపుడపుడూ తిలక్, చంద్రతో నాకు గొడవలు కూడా జరుగుతూ ఉండేవి. నులక మంచాల మీద నుండి కిందకి దొర్లుకుంటూ మరీ కొట్టుకునే వాళ్ళం. తరువాత అందరం కలిసి సినిమాకి వెళ్ళి కబుర్లు చెప్పుకునేవాళ్ళం కూడా. ఒకసారి మొలతాడు కొనుక్కోవడం కోసం ఇంట్లో డబ్బులు తీసుకుని లీలామహల్ లో సినిమా చూసాను.చంద్ర మెడిసిన్ లో సీటు కోసం చదువుకునే వాడు. 

ఆ సమయంలో పెద్దక్క గర్భిణి, డెలివెరీ సమయం కూడా వచ్చేసరికి స్టోన్ హౌస్ పేటలో సుగుణ నర్సింగ్ హోంలో అనుకుంటా చేరింది. ప్రతి రోజు సాయంత్రం నేను, చంద్ర మూలాపేట నుండి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి అక్కని చూసి ఇంటికి వచ్చే వాళ్ళం.

సింధు ఉదయం పుట్టిందనుకుంటా, ఇంట్లో వాళ్ళందరూ స్టోన్ హౌస్ పేట వెళ్ళారు. సాయంత్రం నేను, చంద్ర మూలాపేట నుండి బయలుదేరాం. అపుడు ఇంట్లో రవణన్నలూనా ఉంది, ఎందుకో గుర్తు లేదు. నాకు లూనా కొత్త, "చల్ మేరా లూనా" అంటూ ఎలాగో అలాగ స్టార్ట్ చేసి బయలుదేరాం. ట్రంక్ రోడ్ మీద లూనాలో పోతుంటే మేమిద్దరం  గాల్లో తేలినట్టే ఫీల్ అయ్యాం. కొత్తహాలు దాటి న్యూ టాకీస్ దగ్గర లూనా ఆగిపోయింది.ఎందుకు ఆగిందో తెలియదు, ఏమి చెయ్యాలో తెలియదు. కనకమహల్ ముందు వాల్ పోస్టరు చూసుకుంటూ దిక్కులు చూస్తున్న సమయంలో గోవర్ధన మామయ్య అటు వైపు వెళ్తూ మమ్మల్ని చూసారు. మా అవస్థ చూసి ఆగిపోయిన లూనా కాసేపు పరిశీలించి దీనిలో ఇంధనం లేదని మాకు శ్వేత పత్రం అందించారు. మా దగ్గర ధనం కూడా లేదు. లూనా పక్కన పెట్టి ఇద్దరం నటరాజ సర్వీసులో స్టోన్ హౌస్ పేట చేరుకున్నాం.  

హాస్పిటల్ లో అక్క, బావ, అమ్మ, నాన్న, అమ్మమ్మ, అక్కలు, మామయ్య ఉన్నారు. కొన్ని గంటల ముందే పుట్టిన సింధుని వింతగా, జాగ్రత్తగా, భయం భయంగా చూసిన గుర్తు. నన్ను సింధుని ఎత్తుకోమన్నారు కానీ నాకు భయం వేసి ఎత్తుకోలేదు. సింధు చిన్నప్పటి నుంచి పెద్ద అల్లరి చేసేది కాదు, మా బంధువులందరూ "అంతా మేనమామ పోలిక" అనేవాళ్ళు!

 సింధుకి ఆగస్టు మధ్యలో పెళ్ళి! మా తరం పెళ్ళిళ్ళు అయిపోయి తర్వాత తరం పెళ్ళిళ్ళు మొదలవుతున్నాయి. నిన్నటి వరకు నా సెలవు దొరుకుతుందో, లేదొ తెలియదు. ఈరోజు ఉదయం మా సూపరువైజరు మాట్లాడుతూ "నా మేనళ్ళుళ్ళు, మేనకోడళ్ళ పెళ్ళిళ్ళు ఏదీ నేను మిస్ అవలేదు" అని నాకు సెలవు ఇచ్చేసింది. నిన్న మధ్యాహ్నం టిక్కెట్టు కూడా బుక్ చేసుకున్నా. ఇంకో రెండు వారాల్లో పెళ్ళి సందడి మొదలయినట్టే!

No comments: