ఈవారం మొదట్లో ప్రముఖ తెలుగు సినిమా దర్శకులు శ్రీ. వీ.ఎన్.ఆదిత్యగారిని కలవడం జరిగింది.
నా గురించి చెపుతూ "నేను కూడా రాస్తూ ఉంటానండీ. కాలాస్త్రి బ్లాగులో ఒకప్పుడు సినిమాలు గురించి రాసేవాడిని" అని చెప్పాను.
"ఇపుడెందుకు మానేసారు" అని ప్రశ్నించారు.
"ప్రతి సినిమాని తిడుతూ రాసేవాడిని. బాగోదేమో" అన్నాను.
"పరవాలేదు, తిట్టండి" అన్నారు.
నాకూ కొత్త ఉత్సాహం వచ్చింది.
మా ఆవిడ కూడా ఈమధ్య కాలంలో ఒక రోజు పాద పూజ చేసేటపుడు "ఏమండీ! మీరెంతసేపూ మీ జనం కోసం రాస్తున్నారండీ? మీ కోసం రాయండి" అని నా పంచె తీసుకుని కళ్ళనీళ్ళు అద్దుకుంటూ తీయగా అడిగింది.
నేను కూడా ప్రేమగా "నీకు తెలుసు కదా, నాకు మధుమేహమనీ! అప్పిచ్చు వారు కూడా మిఠాయిలు ఎక్కువగా తినబాకండీ అని అన్నారు. నువ్విలా తియ్యగా మాట్లాడుతుంటే నా చెక్కెర శాతం పెరుగుతూ ఉంది. నీ కోసం, మన ప్రేమ కోసం తప్పకుండా మళ్ళీ రాస్తాను!" అని గట్టిగా తొడ కొట్టాను. చురుక్కుమని నా ఈసారి నా కళ్ళళ్ళో నీళ్ళు తిరిగాయి. అంతకు ముందే నా పంచె లాక్కుని కన్నీళ్ళు తుడుచుకోవడంతో పంచె నా తొడ మీద లేదు!
********************************************************************************
చిత్రం: కంచె
నటీమణులు: వరుణ్ తేజ్, ప్రగ్య జైస్వాల్, గొల్లపూడి మారుతీ రావు, అవసరాల శ్రీనివాస్, షావుకారు జానకి, సింగీతం శ్రీనివాస రావు.
సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్
మాటలు : సాయి మాధవ్ బుర్ర
సంగీతం: చిరంతన్ భట్
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయి బాబా
కథ, కథనం, దర్శకత్వం: జాగర్లమూడి రాధాకృష్ణ
క్రిష్ తన గత చిత్రం కృష్ణం వందే జగద్గురు నన్ను కొంత నిరుత్సాహపరిచింది. ఈసారి అందుకే మొదటి ఆటకి ధైర్యం చెయ్యలేదు. భారతదేశం నుండి కత్తి మహేష్ గారు సినిమా బాగుంది, చూడండి అని చెప్పాక ఇక ఆగలేదు.
రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో భారతదేశం నుండి వెళ్ళిన సైనికులలో హరిబాబు ఒకడు. యుద్ధ సమయంలో జర్మనులు తమ వారిని బందీలుగా పట్టుకోవడంతో వారిని తప్పించాలని చేసే ప్రయత్నమే ఈ సినిమా. ఈ కథకి సమాంతరంగా తన ఊరిలో సూరిబాబు ప్రేమ కథ కూడా నడుస్తుంది. ఈ రెండు కథలు ఒకదానికొకటి పెనవేసుకుని ప్రేక్షకుడి ప్రయాణం హాయిగా సాగేలా చూస్తుంది. ఏ సమస్యనైనా భూతద్దంలో పెట్టి చూస్తే చిన్నది కూడా చాలా పెద్దదిగా అనిపిస్తుంది. అదే సమస్యని కొంచెం పెద్ద మనసు చేసుకుని అలోచిస్తే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అదే విషయాన్ని దర్శకుడు మనకి చక్కగా చూపిస్తాడు.
హరిబాబు వెనుకబడిన వర్గానికి చెందిన వాడు. తాత ఊరిలో కులం పని చేసుంటూ ఉంటాడు. సూరిబాబు తనతోపాటూ చదువుకుంటున్న సీతతో ప్రమలో పడతాడు. సీత అగ్ర కులానికి చెందింది. వీరి ప్రేమ కథని అణచివేయడానికి జరిగిన ప్రయత్నం ఫలిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే! మేట్రిక్స్ సినిమా మొదటి సగం చూసినపుడు మనకి చాలా ప్రశ్నలు వస్తాయి. రెండో సినిమాలో ఆ ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చేస్తారు. అలాగే ఊరిలో మొదలయిన ప్రశ్నలకి ప్రపంచ యుద్ధంలో సమాధానాలు దొరుకుతాయి.
శ్రీనివాస్ అవసరాల చిత్రానికి హాస్యాన్ని అందించడంలో తన వంతు కృషి చేసాడు. అతని ప్రశ్నలు మనకి కథ చెప్పేలా చేస్తాయి. హిట్లర్ నిరంకుశ పాలన, రాజ్యాధికారం మీద శ్రీనివాస్, హరిబాబుల సంభాషణ బాగుంటుంది. శ్రీనివాస్ మాటల్లో శ్రీశ్రీ కవిత్వాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో శ్రీశ్రీ కవిత్వం ఎలాగా అని నాకు అనుమానం వచ్చింది. శ్రీశ్రీ గారి కవిత్వం ఆరోజుల్లోనే అందరికీ అందుబాటులో ఉందని హమోరా సినిమా రివ్యూలో కత్తి మహేష్ కుమర్, కాజా సురేష్, హరి చరణ్ ప్రసాద్ గారు స్పష్టం చేసారు.
సినిమాకి చిరంతన్ భట్ సంగీతం బాగా కుదిరింది. పల్లెటూరి వాతావరణానికి తగినట్టు సంగీతం అందించాడు, అలాగే యుద్ధ వాతావరణంలో కూడా! పాటలు కూడా బాగున్నాయి. క్రిష్ సినిమాలలో మాటలు బాగుంటాయి, తూటాల్లాగా ప్రేక్షకులకి గాయాలు చేస్తూ ఉంటాయి. బుర్ర సాయి మాధవ్ ఈ చిత్రానికి మాట సాయం చేసారు.
షావుకారు జానకి ఒక సమయంలో మగవారిని ఉద్దేశిస్తూ "వీళ్ళు మన గర్భాలను వాడుకుంటారు" అని పదునుగా అంటుంది. నా పక్కనున్న యువతరం "ఈమెని ఎక్కడో చూసాను" అని కామెంటి నాకు పిచ్చెక్కించారు. సినిమా మొదట్లో కూడా సింగీతం శ్రీనివాసరావు సీతతో సరసాలు ఆడుతున్నపుడు ఆయన్ని ఎవరో ముసలాయన అనుకున్నారు. కొత్తతరం కోసం పెద్దవాళ్ళు తెరపై వచ్చినపుడు వారి పేర్లు కూడా వేస్తే యువతరం వారిని గుర్తించచ్చు.
పుట్టినరోజు చేసుకునేటపుడు "మనది దీపాలు ఆర్పే సంప్రదాయం కాదు" అని సూరిబాబు చెప్తే నాకు జొన్నవిత్తుల గారు గుర్తుకు వచ్చారు. ఆ విషయాన్ని గురువుగారు తను తీసిన సినిమాలో చెప్పారు, మేము అది కాలాస్త్రిలో కూడా రాసాము.
జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పల్లెటూరిని చాలా అందంగా చూపించాడు. యుద్ధం కూడా చాలా సహజంగా చూపించారు.
కుల, మతాల పేరుతో మనుషుల్ని వేరుగా చూస్తున్న మనందరికీ ఈ సినిమా ఒక కనువిప్పు కావాలి. మన చుట్టూ వేసుకున్న కంచెని తెంపి చేయి, చేయి కలుపుదాము.
4 comments:
Wah WAh :)
Gotta watch the movie tonight.
Chala baaga raasaaru sri Gaaru. Kanche cinema laagaane Mee panche seen adhirindhi.
kalastri trademark humourous spark is missing
Neelo intha vishleshakudu dagunnada. Very nice
Post a Comment