Monday, December 21, 2015

కొలరాడో యాత్ర విశేషాలు -1ముగ్గురు జంటలు, ఇద్దరు ఒంటరి పక్షులు మరి ఇద్దరు చిన్నారులు కలిసి మోటర్ సైకిల్ పై ఈ వేసవిలో చేసిన 2200 మైళ్ళ కొలరాడో యాత్ర విశేషాలు మనం ఇక్కడ చూద్దాము.


2013లో యమహా మోటార్ సైకిల్ కొన్నపుడు డాలసులో ఒక మోటార్ సైకిల్ గ్రూప్ ఉండడం గమనించాను. డెట్రాయిట్ లో ఆఫీసులోని స్నేహితులతో వెళ్ళడమే కానీ మనకంటూ ఒక గ్రూప్ ఉండేది కాదు. నెలలో రెండు, మూడు వారాలు డాలసు చుట్టుపక్కల విహారానికి వెళ్తూ ఉంటారు ఈ గ్రూపులో. ప్రతి సంవత్సరం వేసవిలో ఒకటి, చలి కాలం మొదలయ్యేముందు ఇంకొకటి దూర ప్రయాణాలు జరుగుతాయి. గత సంవత్సరం మెక్సికో దేశానికి సరిహద్దులో ఉన్నటువంటి బిగ్ బెండ్ నేషనల్ పార్క్ వెళ్ళాము. ఈసారి వేసవిలో కొలరాడో యాత్రకి వెళ్ళడం జరిగింది! ప్రతి విహారం లాగే ఈ దూర యాత్రలకు మీటప్ అనే ఆప్ వాడుతూ ఉంటాము. దూరప్రయాణాలకు కొన్ని నెలలముందే నెలకొక సాయంత్రం అందరం కాఫీ తాగుతూ యాత్రలో ఎక్కడకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏమేమి తీసుకు వెళ్ళాలి లాంటి విషయాలను గురించి చర్చించుకుంటూ ఉంటాము. మాకు కావలసిన సమాచారాన్ని అంతర్జాలంలో వెతుక్కుని, లేదా స్నేహితుల ద్వారా సేకరిస్తాము.


క్రితం సారి బిగ్ బెండ్ వెళ్ళినపుడు ఎక్కువమంది కాబిన్సులో ఉన్నాం. కొంతమంది మాత్రం టెంట్ వేసుకుని ప్రకృతికి ఇంకొంచెం దగ్గర అయ్యారు. కొలరాడో ఎంతో అందమైన ప్రాంతం, అందుకే ఈసారి అందరం టెంట్ వేసుకోవాలని అనుకున్నాం. దానికి కావలసినవి ఒక లిస్ట్ రాసుకుని అన్ని షాపులూ తిరిగి కొనుక్కున్నాము. మెటారు సైకిలుపై వెళ్ళేటపుడు ఎక్కువ సామాను తీసుకువెళ్ళలేము, వీలు అయినంతవరకు చిన్నవి తీసుకు వెళ్ళాలి. కొలరాడో వెళ్ళే ముందు నెల ముందు డాలసుకి దగ్గరలో ఉన్న పాసం కింగ్ డం అన్న ప్రదేశానికి వెళ్ళి టెంట్ వేసుకుని అందులో ఉన్న సాధకబాధలు అనుభవించాము.   ఈ కాంపింగులో ఫారుక్ ఒక చిన్న కుర్చి తెచ్చాడు. ఇది చిన్న సంచిలో తగిలించుకుని వెళ్ళచ్చు. కొలరాడోకి ఇలాంటి కుర్చీలు కొనుక్కోమని మాకు కూడా సలహా ఇచ్చాడు.


ప్రయాణానికి నెల ముందు కొలరాడో యాత్రపై బాగా ఆసక్తి ఉన్న జంట పని వత్తిడి వలన ఆగిపోవడం జరిగింది. వారి కోసం యాత్రని కొన్ని రోజులు వాయిదా వేసాము. చివరికి ఆ సమయం కూడ కుదరకపోయేసరికి మిగిలిన 4,5 మంది వెళ్దామనుకున్నాం. వారం ముందు ఆ ఇద్దరు (వినయ్, రూపి) మొదట అనుకున్న సమయానికే రాగలమని ఆనందంగా చెప్పారు. కేకేకి ఇంకో చిక్కు వచ్చింది, జూన్ 30వ తేది అతని పుట్టినరోజే కాకుండా వాళ్ళ అబ్బాయిది కూడా అదే రోజు! కుటుంబాన్ని వదిలి రాలేను, వీలైతే వాళ్ళని కూడా తీసుకు వస్తాను అని అలోచించి అతని ట్రక్కులో కుటుంబం అందరం రాగలమని చెప్పాడు. మా అందరి ఉత్సాహం చూసి గత సంవత్సరం బిగ్ బెండ్ వచ్చిన దేవేందర్, కృష్ణ జంట మాతో కలిసారు. అప్పటికే అందరం కలిసి ప్రతి రోజు ఎంత దూరం వెళ్ళాలి, ఏ ప్రదేశం చూడాలి అన్న విషయాల మీద ఒక అవగాహన తెచ్చుకున్నాము. అందరి మోటార్ సైకిల్స్ కూడా చెక్ చేసుకుని శనివారం ఉదయం జూన్ 27వ రోజు వెళ్దామని తయారయ్యాము.


శుక్రవారం అర్థరాత్రి వరకు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక 8వ వార్షికోత్సవంలో ప్రదర్శించబడే నృత్య రూపకంలో మా పాత్రల గురించి మాట్లాడుకుంటూ అలాగే కొంత అభినయం కూడా చేసుకుంటూ గడిపాము. ఆరోజు రాత్రి వాల్మార్టులో కొనవలసిన స్లీపింగ్ పాడ్ కొనలేకపోయాను. అంతకు ముందు వారం కొన్న స్లీపింగ్ పాడ్ రెండు ఇంచెలు వెడల్పు ఉండి సౌకర్యంగానే ఉండేది కానీ అది పాక్ చేస్తే కొంచెం ఎక్కువ స్థలం ఆక్రమించేది. కొన్ని స్లీపింగ్ పాడ్లు విప్పగానే దానికదే గాలి పీల్చుకుని పెద్దవవుతాయి. ఇవి మోటార్ సైకిలుపై వెళ్ళే వాళ్ళకి బాగా అనుకూలం. అది కొనకుండా నేను చేసిన తప్పు నాకు ప్రయాణంలో బాగా తెలిసి వచ్చింది.

కొలరాడో కొండ ప్రాంతం, ఉదయం ఎండ ఉన్నా మధ్యాహ్నానికి వాన పడడానికి చాలా అవకాశాలున్నాయని ఫారుక్, వినయ్ చెప్పారు. తప్పకుండా వానలో నడపడానికి కావలసిన జాకెట్, పాంట్ కొనుక్కోమన్నారు. నా పాంట్, బూట్లు వాటర్ ప్రూఫ్ కాబట్టి నేను జాకెట్ కొనుక్కుంటే సరిపోతుంది. ఒక జాకెట్ కొనుక్కున్నా కానీ నచ్చక అది పాక్ చేసుకోలేదు. దానికి ఇంకో కారణం కూడా ఉంది, కొన్ని వారాల ముందు ఒకానొక శనివారం బైకుపై వెళ్ళేటపుడు కొండపోతగా వాన కురిసింది. నా జాకెట్, పాంట్ పెద్దగా తడవలేదు. ఈ సాకుతో కొనుక్కున్న వాన జాకెట్ పాక్ చేసుకోలేదు. ఇది నేను చేసిన రెండో తప్పు.

ఇంటికి వచ్చి అంతకు ముందే సర్దుకున్న వారానికి సరిపడే బట్టలు, స్నానపానాదుల కోసం కావలసిన సామగ్రి, బైకు టూల్ కిట్, కాంపింగులో అవసరమయ్యే పనిముట్లు ఇతరత్రా బైకు రెండు వైపులా ఉండే సాడెల్ బాగ్సులో సర్ది వాటిని బైకుకి తగిలించా. సాడెల్ బాగ్సు నుండి సామాను తీసుకోవడం చాలా సులభం. ఇక మిగిలినవి స్లీపింగ్ బాగ్, టెంట్, కుర్చి, స్లీపింగ్ పాడ్. టెంట్, కుర్చి ఒక బాగులో పట్టిచ్చి దానిని బైకు లగేజ్ రాకుకి వాల్మార్ట్ నుండి తెచ్చిన స్ట్రాప్స్ తో కట్టాను. సామాను వానకి తడవకుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్ కోసం లాస్ట్ మినట్ షాపింగ్ చేసి ఒక పల్చటి రైన్ కోట్ కొన్నా. దానిలో స్లీపింగ్ బాగ్, స్లీపింగ్ పాడ్ చుట్టి అంతకు ముందు కట్టిన సామాను ముందు కట్టేసా.

బైకులో అందుబాటులో ఉండడానికి ఎండకి పూసుకునే క్రీం, టైరులో గాలి చూసునే గేజ్, ఇంకెకవరికైనా సామాను తగిలించుకోడానికి కొన్ని తాళ్ళు, కెమెరా, సెల్ ఫోను, వాటిని చార్జ్ చేసుకోవడానికి కావలసిన కేబిల్స్, చలిగా ఉంటే వేసుకోవడానికి ఒక మాస్క్, ఇలా అందుబాటులో ఉండే సామగ్రి అంతా టాంకు సంచిలో ఉంచాను. ఇది బైకు టాంకు భాగంలో అందులో ఉండే అయస్కాంతం ద్వారా తగిలించుకోవచ్చు. బైకు నడుపుతున్నపుడు, లేకపోతే ఆగినపుడు తొందరగా తీసుకోవలసినవన్నీ ఇందులో ఉంచుకోవచు. ఈ బాగు పై భాగంలో ఉన్న అరలో మనం వెళ్ళే మాప్ ఉంచుకుని చూసుకుంటూ ఉండచ్చు.

మోటార్ సైకిలు ప్రయాణానికి ఎలా సామను సర్దుకోవాలి అన్న అంశం మీద యూట్యూబులో చాలా వీడియోలు ఉన్నాయి. గంత నెల అంతా ఇటువంటివి చూస్తూ కొంత అవగాహన పెంచుకున్నా. ఉదయాన్నే ఆరుకంతా లేవాలి. శనివారం ఉదయం మొదలవబోయే మా సాహస యాత్ర గురించి కలవరం, ఉత్సాహం సమపాళ్ళలో పడుతూ నిద్ర మాత్రం పోలేదు.
(ప్రయాణంలో మొదటి రోజు కోసం రేపటివరకు వేచి చూడండి.)

4 comments:

Ramarao said...

మంచి ఉత్కంఠ లో ఆపేసారే..

శ్రీ బసాబత్తిన said...

ప్రయాణం అన్నపుడు ఎక్కడో ఒకచోట ఆపాలి కదండీ!

Anil Atluri said...

కదా! చి న.

శ్రీ బసాబత్తిన said...

ధన్యవాదాలు అనిల్ గారు.