Wednesday, January 24, 2018

దర్గామిట్ట కతలు



డెట్రాయిట్టులో ఉన్నపుడు ఈ కథల గురించి విన్నాను. దర్గామిట్ట అంటే మా నెల్లూరులో ఉండేది కదా, నాకు బాగా పరిచయమైన స్థలం కూడా! ఈ కథలు చదవాలనుకున్నా కానీ వీలు కుదరలేదు.

ఈమధ్యలో మొహమ్మద్ ఖదీర్ బాబు రాసిన ఖాదర్ లేడు కథలు చదివాను. అవి చదివాక దర్గామిట్ట కథలు చదవాలన్న కోరిక మరింత బలపడింది. కాళాస్త్రిలో కూడా "ఈ కథలు మేము చదివేశాం, చాలా బాగా ఉంటాయి శీను" అన్నారు అక్కయ్యలు. మొన్న సెలవల్లో నేను, త్రిలోక్ తిరుపతిలో దిగి టౌనుహాలు దగ్గర కుష్బూ ఇడ్లీ, పాయా తిన్నాక ఎదురుగా పుస్తకాల షాపు కనిపించింది. అందులో దర్గామిట్ట కతలు, పోలేరమ్మ బండ కతలు కలిపి ఒక పుస్తకంగా వేసారు. అలా మనకి ఈ పుస్తకం దొరికింది.

డాలసు వచ్చేముందు అత్తగారు ఇచ్చిన సక్కినాలు బాగులో సర్దుకుని దర్గామిట్ట కతలు మాత్రం కారీ బాగేజులో వేసుకున్నా. మాదాపూర్ పెట్రోల్ బంక్ పక్కన ఉడిపీలో సాంబార్ ఇడ్లీ తిని లెమన్ టీ తాగి ఇంటికి వెళ్ళాక కతలు చదవడం మొదలుపెట్టా. డాలసులో దిగాక చలికి ఎటూ బయటకు పోక మూడు రోజుల్లో దర్గామిట్ట కతలు చదివేసా. ప్రతి కథ చదివాక "భలే ఉన్నాయే" అనుకుంటూ ఒకేసారి పది, ఇరవై కథలు చదివించేలా చేసాయి.

ఖదీర్ బాబు పుట్టినప్పటి నుంచీ ఏడో తరగతి చదివే వరకు జరిగిన తన జీవితానుభవాలని ఈ కథలలో పాఠకులకి బాగా ఆసక్తి కలిగేలా చెప్పారు. సినబ్బ కతలలో నామిని గారు మా చిత్తూరు యాసలో చెప్తే ఈ దర్గామిట్ట కథలలో ఖదీర్ బాబు గారు మా నెల్లూరు యాసలో చెప్పారు. నేను చిన్నపుడు పెరిగిన రాపూరులో డెబ్బై శాతం పైగా ముస్లింవాళ్ళుండేవారు. నా స్నేహితులు కూడా చాలా మంది ముస్లింలే. ప్రతి పండక్కి వాళ్ళింటికి నేను వెళ్ళడం, వాళ్ళు మా ఇంటికి రావడం జరుగుతూ ఉండేది. మా నాన్న ఆఫీసులో పని చేసే అమీర్ జాన్ ప్రతి పండక్కి మా ఇంటికి ఒక కారేజ్ పంపేవాడు.

ఈ కథలు చదువుతూ ఉంటే నేను మళ్ళీ రాపూరులో అస్లాం, జమీలుతో తిరుగుతున్నట్లు అనిపించింది. ఖదీర్ బాబు నాయనమ్మ గురించి చదివినపుడల్లా జమీల్ ఇంటికి వెళ్ళినపుడు మంచంలో పడుకుని ఉండే అవ్వే గుర్తుకు వస్తుంది. పండగలప్పుడు అస్లాం వాళ్ళమ్మ ఉదయాన్నే లేచి రాత్రి వరకూ వంటలు చేస్తూ ఉండేది.

"కసాబ్ గల్లీలో సేమ్యాల ముగ్గు" కథ చదివితే అస్లాం అమ్మే గుర్తుకు వచ్చింది. మొన్న ఇంటికి వెళ్ళినపుడు కూడా పలావు, చేపలు, రొయ్యలు చేపించాడు. ఖదీర్ గారి నాన్న కూడా ఇలాగే ఇంట్లో హడావిడి పెట్టి పండక్కి అన్నీ చేపించుకుని అందరికీ పంచేస్తాడట. అస్లాం కూడా ఇంతే!

ఈ కథలు చదివాకే దర్గామిట్టకి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలిసింది. నేను నెల్లూరులో ఉన్నపుడు రొట్టెల పండగ వస్తే ఊరంతా సందడిగా ఉండేది. చదువుల రొట్టె, పెళ్ళి రొట్టె, ఉద్యోగం రొట్టె లాంటి మొక్కులు ఈ పండగలో తీర్చుకునేవారు. ఈ పండగ గురించి నాకు తెలియని మరి కొన్ని వివరాలు ఇందులో ఉన్నాయి.

మా స్కూలు పక్కనే పీర్ల చావిడి ఉండేది. పీర్ల పండగ వచ్చిందంటే అప్పట్లో తెలియని భయం ఉండేది. పూనకం వచ్చిన భక్తులు పీర్లు పెట్టుకుని ఊరిలో పరిగెత్తేవారు. వాళ్ళ వెనక పిల్లలు ఉరికేవాళ్ళు. ఆ పీర్ల కథ కూడా చాలా బాగుంది ఇందులో.

రంజాన్ నెలలో ఉపవాసం ఉండడానికి వీళ్ళేదంటూ అత్త, మొగుడితో గొడవ పడి ఎదిగే పిల్లలకి అన్నం పెట్టి కాపాడుకోవానే తపన "పాపాలన్నీ మాయమ్మకే" కథలో మనకి కనిపించి కంట తడి కూడా పండగ బోనసుగా అందిస్తుంది.

కాలేజీలో చదువుకునేటపుడు ప్రతి సోమవారం ఉదయాన్నే శ్రీహరికోట నుండి కావలి డిపో బస్సులో గూడూరు వరకు వెళ్ళేవాడిని. అంతకు మించి కావలి గురించి తెలియదు. ఈ కథలు చదివాక దర్గా మిట్ట, కసాబ్ గల్లీ, పోలేరమ్మ బండ మనకి బాగా పరిచయమవుతాయి.

ఆదివారం మా ఇంట్లో తలకాయ కూర చేసుకోవాలంటే నేనే మార్కెట్ వెళ్ళి పొట్టేలు మెడ కోసిన దగ్గర నుండి తల, కాళ్ళు మార్కెట్ పక్కనే సాయిబు పక్కన కూర్చుని కాల్పించుకుని వచ్చేవాడిని. తలకాయ కూర కథ చదువుతూ ఉంటే మా సూళ్ళూరుపేట మటన్ మార్కెట్టే గుర్తుకు వచ్చింది.

నెల్లూరు కాపు వీధిలో మా పెదనాన్న కొడుకులిద్దరూ బంగారు పని చేస్తూ ఉంటారు. చిన్న బజారులో కొన్ని వేల బంగారు అంగడులుంటాయి, ప్రతి చిన్న అంగడిలో ఒక యజమాని, అతని కింద ఒకరు లేక ఇద్దరు కుర్రవాళ్ళు పనికి ఉంటారు. ఈ బంగారు పనిలో ఉండే కుర్రవాళ్ళ గురించి రాసిన కథ చదువుతూ ఉంటే నాకు కాపు వీధిలో నేను చూసిన ఆ అంగడులే గుర్తుకు వచ్చాయి. దసరా పండగ అపుడు ఈ అంగళ్ళలో సందడి చూడాలి, భలే ఉంటుంది.

ఇలా తెలిసినవి, తెలియనివి చాలా మనకి ఈ కథల్లో బాగా అర్థం అయ్యేలా చెప్పారు ఖదీర్ బాబు గారు. చిన్నపుడు అడగాలని తెలియని ఎన్నో ప్రశ్నలకు ఇందులో జవాబులు దొరికాయి. ప్రతి ఒక్కరూ చదవి తీరాల్సిన కతలు ఈ దర్గామిట్ట కతలు.

చాలా నెలల తర్వాత మళ్ళీ బ్లాగులో రాస్తున్నాను.

"మీరు బాగా రాస్తూ ఉంటారు. ఈమధ్య రాయడం మానేసారు, రాస్తూ ఉండండి" అని ప్రోత్సహించిన కోడూరి విజయ్ కుమార్ గారికి ఈ టపా అంకితం.  నా ప్రతి టపా చదివి నన్ను ప్రోత్సహిస్తున్న రవి మామయ్యకి, పెద్దక్కయ్యకి కూడా వందనాలు!


4 comments:

శ్రీ said...

Thank you Sam

అన్యగామి said...

తెలుగు నెటివిటీని మరో స్థాయికి తీసుకు వెళ్లిన వాళ్ళు నామిని, ఖదీర్ బాబు. ఆయన చెప్పిన ప్రదేశాలు, మనుషులతో కొంచెమైనా అనుబంధం ఉంటె అన్ని కథలు మనస్సుకి హత్తుకొంటాయి. మీ సమీక్ష బావుంది. కథలంటే ఇష్టం ఉండే అందరు చదవవలసినవి.

శ్రీ said...

Thank you

Unknown said...

chakkati sameeksha sreenivas gaaru