140 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించి, చాలా వివాదాలకు తావు తీసిన "దశావతారం" సినిమా నిన్ననే ప్రజల మధ్యకు వచ్చింది. సినిమా 12 వ శతాబ్దం లో చోళ రాజు ఆధ్వర్యంలో శైవులు వైష్ణవులను పీడిస్తున్న రోజులతో మొదలవుతుంది. ఈ సినిమా కథ గురించి కంటే అవతారాల గురించి మాట్లాడితే బాగుంటుంది అని నా అభిప్రాయం!
మొదటి అవతారం: రంగరాజ నంబి వైష్ణవ భక్తుడి రూపంలో కథ మొదలవుతుంది. శైవులు విష్నువు విగ్రహాన్ని పెకలిస్తున్నపుడు వాళ్ళకి అడ్డుపడి, చోళుడి చేత సముద్రంలో తోసివేసే పాత్రలో కమల్ చాలా బాగా నటించాడు. అవేశాన్ని, బాధని బాగా పలికించి కథని మంచి ఊపుతో మొదలుపెడతాడు నంబి.
రెండవ అవతారం : గోవింద్ రాజు సినిమాలో నాయకుడు మన గోవిందే! బయో కెమిస్ట్రీ శాస్త్రవేత్తగా తన సహజ శైలిలో కనిపిస్తాడు. మిగతా అన్ని పాత్రలు కథలో ఇతనికి తారసపడుతూ ఉంటాయి. ఈ కథనం అంతా సింగీతం శ్రీనివాస రావు సినిమాలాగ అనిపించకమానదు. అతనే తీసిఉంటే ఇంకా బాగా తీసి ఉండేవాడని నా ప్రగాఢ నమ్మకం!
మూడవ అవతారం: క్రిస్ ఫ్లెచర్ ఒక దేశంలో పుట్టి ఇంకొక దేశం వాడిగా నటించడం నిజంగా పెద్ద ప్రయోగమే అని చెప్పుకోవాలి. ఫ్లెచర్ గా అమెరికన్ మేనెరిజం ని అద్భుతంగా ప్రదర్శించాడు కమల్. ఒక్క మేకప్ తప్పితే ఫ్లెచర్ పాత్ర చాలా బాగా ఉంటుంది, నిజంగా అమెరికన్ యేమో అన్న భ్రమ మనకు కలగక మానదు.
నాల్గవ అవతారం: బలరాం నాడర్ బలరాం నాడర్ వంతు సినిమాలో హాస్యం పండించడం. తమిళవ్యక్తిగా కొంచెం తెలుగు-తమిళ్ మిళితమయిన మదరాసు, చిత్తూరు యాసలో మనకి బాగనే చక్కిలిగిలి కలిగిస్తాడు. భారతదేశంలో హిందీ తరువాత ఎక్కువగా మాట్లాడే తెలుగు బాషని తెలుగు వాడు ఎందుకు గుర్తించడు? అని బాగనే ప్రశ్నించాడు కమల్ ఈ పాత్రలో! బలరాం,గోవిందూ దొంగ,పోలీసు ఆట సందడిగా ఉంటుంది.
అయిదవ అవతారం: క్రిష్ణవేణి భామనే సత్యభామనే లో ఇంతకు ముందే ఆడవేషం అలవాటయింది కాబట్టి ఈసారి "మామ్మ" వేషం చాలా సులభంగా వేసాడు.క్రిష్ణవేణి పాత్ర కుడా మనలని బాగా నవ్విస్తుంది.ముసలామె లాగా కమల్ చాలా అద్భుతంగా నటించాడు.అసలామెని చూస్తుంటే కమల్ గుర్తుకు రాడు, అంత బ్రమ్హాండంగా ఉంది గురువుగారి నటన.
ఆరవ అవతరం: జార్జి బుష్ మళ్ళీ ఇంకొక అమెరికన్ గా,అదీ జార్జె బుష్ గా ఇంకొక అవతారం.బుష్ ని కమల్ బాగా స్టడీ చేసినట్టున్నాడు,అతని నడక,నవ్వే విధానం చాలా బాగా పండింది.ఈ పాత్ర కుడా కమలేనా అని మనకి మొదట అనుమానం వస్తుంది.వైట్ హౌజ్ సెట్,ఓవల్ ఆఫీసు సెట్ పరవాలేదు.
ఏడవ అవతారం: అవతార్ సింగ్ పాప్ సింగర్ గా మద్యలో అవతార్ సింగ్ గెటప్ సహజంగానే ఉంది.ప్రాణం కన్నా పాటే ముఖ్యం అని ఇతని పాత్ర కథలో కొంచెం సానుభూతి పవనాలు చిలకరిస్తాడు. ఇతని పక్కన జయప్రద చిన్న పాత్రలో నటించింది.జయప్రద ఇంకా అందంగా ఉండడం ఒక విశేషమే!ఇతని పాత్ర మనకి దిలర్ మెహందీని గుర్తుకు తీసుకు వస్తుంది.
ఎనిమిదవ అవతారం:జపనీస్ యోధుడు ఒక్క అమెరికన్ గానేనా? జపనీస్ గా కుడా చేసేద్దామనుకున్నడేమో కమల్?యూకా అన్నగా చెల్లెలిని చంపిన వాడి మీద పగ సాధిద్దామని ఇండియా వచ్చి పగ సాధించుకోవడం ఇతని పాత్ర.కొంచెం మేకప్ తేడాగా ఉంటుంది తప్పితే జపనీస్ గా విరగ తీసాడు కమల్.చివరలో క్రిస్ ఫ్లెచర్ ని తుక్కురేగ కొట్టేటపుడు క్రిస్ అంటాడు "హీరోషిమా గుర్తుందా?" అని.బదులుగా "పెరల్ హార్బర్ గుర్తుందా" అనడం బాగా చప్పట్లని మోగించింది.
తొమ్మిదవ అవతారం: విన్సెంట్ పుణ్యకోటి ఒక దళిత నాయకుడిగా ఇసుక స్మగ్లింగు ని అడ్డుకునే పాత్ర కథలో కొంచెం విప్లవ భావాలని తీసుకువస్తుంది.మా వాళ్ళలో ఇపుడు చదువుకునే వాళ్ళు బాగా ఉన్నారు అని తోటి ఉద్యమ కారుడి చేత మట్టి మీద కవిత్వం చెప్పించడం బాగా ఉద్వేగంగా అనిపించింది. డబ్బుకి లొంగకుండా చివరి వరకు నీతి కోసం పోరాడే ఒక ఆదర్శ నాయకుడిగా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పాత్ర.ఈ పాత్ర కుడా కమల్ అని నమ్మడానికి చాలా సమయం పడుతుంది. పుణ్యకోటితో మామ్మ సన్నివేశాలు చాలా ఉద్వేగంగా ఉనింది.చాందస వాదులు ఎప్పటికి బాగుపడతారో?అని జాలి వేస్తుంది.
దశావతారం: కరీముల్లా ఇతన్ని చూస్తే నాకు ఫ్రాంకెన్ స్టైన్ గుర్తుకు వచ్చాడు.ఇతన్ని పొడుగ్గా పెట్టడం,డైలాగులు ఏదోగా మాట్లాడడం నాకు పెద్దగా నచ్చలేదు.పరవాలేదు అన్నట్టుంది ఈ పాత్ర.కాకపొతే పొడవుగా చూపించడానికి చేసిన ప్రయత్నం అయితే ఫలించింది.
33 comments:
సినిమా గురించి చాలా విశ్లేషణలు ఎలాగూ వస్తాయి కాబట్టి కథలో ఇంటరెస్టింగ్ పార్ట్ ని బాగా విశ్లేషించారు! కాని కమల్ 'హింది తర్వాత ఎక్కువమంది మాట్లాడే భాష ' గా తమిళ వెర్షన్లో తమిళాన్ని వర్నించాడేమో చూడండి. ఎందుకంటే కమల్ ని గొప్ప నటుడిగా మనం గుర్తించి అభిమానిస్తమే కాని, ఆయనకు కూడా తెలుగుమీద చిన్న చూపు ఎక్కువే! దశావతారం ఆడియో రిలీజ్ కి దక్షిణాది అంటేనే పడని హిందీ సినిమా వాళ్ళని, ఇంకా సంబంధం లేని అనేకుల్ని పిలిచాడు కాని, తెలుగు సినిమా నుంచి ఒక్కళ్ళని కూడా పిలవలేదు. తన సినిమాలు మాత్రం తెలుగులో విడుదల కావాలి, కోట్లు తెచ్చిపెట్టాలి.
@కాలాస్త్ర్రి, బాగా రాశారు. సూటిగా సుత్తి లేకుండా.
@సుజాత గారూ,కమల్ కు తెలుగు అంటే చిన్న చూపు అంటే అంగీకరించలేను. ప్రస్తుతం ఉన్న తెలుగు పరిశ్రమవాళ్ళ మీద ఉంటే ఉండొచ్చుగాక.
ఆకలిరాజ్యం సమయంలో ‘శ్రీశ్రీ’ ని తెలుసుకొని ఇప్పటికీ అభిమానించే కమల్ కు అంతటి చిన్న బుద్ది అని అనుకోజాలను. ఇక తను విశ్వనాధ్ గార్ని,బాలు గార్ని అవకాశం ఉన్నప్పుడల్లా పొగడని తమిళచానల్ లేవని గమనించగలరు.
www.parnashaala.blogspot.com
మహేష్ గారు,
విశ్వనాథ్, బాలు కమల్ కెరీర్ కి చేసిన మేలు ఏపాటిదో కమల్ కి తెలీదా? అందుకే పొగడ్తలు!ఇకపోతే కళ ఎక్కడున్నా అభిమానించడం కళాకారుల లక్షణం కాబట్టి శ్రీ శ్రీ కవిత్వం మీద ఇష్టం పెంచుకునుండొచ్చు! నాకూ సుబ్రహమణ్య భారతి 'ఓడి విలయాడు పాపా ' ఇష్టం! తిరుప్పావై ఇష్టం,భారతీ రాజా ఇష్టం...తమిళ మనుషులnarrow mindedness అంటే అసహ్యం! మరి కమల్ అమితాబ్ బచ్చన్ ని, ఏ మాత్రం సంబంధం లేని జాకీ చాన్ ని ఆడియో రిలీజ్ కి పిలిచాడు, చిరంజీవిని, కనీసం గురువుగా భావించే విశ్వనాథ్ ని, తెగ పొగిడేసే బాలుని కూడా పిలవలేదు.
note:నాకు కమల్ హాసన్ సినిమాలంటే చాలా ఇష్టం!
గత కొద్ది కాలంగా కమల్ హాసన్ సినిమాలు అన్ని ప్లాప్ కదా!! దశావతారం అని తీస్తున్నారు ఏమిటో అనుకున్నా. మొత్తానికి సినిమా చూడక్కరలేదు అనిపించేట్టుగా వ్రాసారు. బాగుంది
@సుజాత గారూ,మీరు ఈ ఆడియో ఫంక్షన్ చూసుంటే వాళ్ళని పిలవడంలో ఎవరిచెయ్యి ఎంతో మీకు తెలుస్తుంది. కమల్ హసన్, అబితాబ్ ని ఐడీయలైజ్ చేస్తాడు కాబట్టి తనను పిలవడం కమల్ చేసిన పనైతే. ఈ చిత్ర నిర్మాత దాదాపు 30 సంవత్సరాలుగా జాకీచాన్ సినిమాలు భారతదేశంలో రిలీజ్ చేసాడు కాబట్టి, ఇప్పుడు మరో చిత్రం విడుదలకు సిద్దంగా ఉండి అతన్ని పిలవడం జరిగింది (మల్లికా షరావత్ హస్తం కూడా ఉందట).
గురువు విశ్వనాధ్ ని పిలిస్తే వారితో పాటూ చాలామంది (including బాలచందర్) ని పిలవాల్సి వస్తుంది. సోదరుడు(కమల్ అలాగే అంటాడు) బాలు ని పిలిచినా ఇక్కడ ఏ సముచిత స్థానగ్రహణకు పిలుస్తాడు?
ఐనా రజనీ నే పిలవని ఈ ఫంక్షన్ కు చిరంజీవిని ఎందుకు పిలవాలని మీరు అనుకున్నారో నాకైతే అస్సలర్థం కాలేదు.
ఇక తమిళుళ narrow mindedness (అని మనం అనుకొడానికి) కి కొన్ని చారిత్రాత్మక,రాజకీయ,సామాజిక కారణాలున్నాయి. వాటి గురించి ఒక టపా రాద్దాం త్వరలో.
నాకూ కొన్ని విషయాల్లో తమిళుల పట్ల అసంతృప్తి ఉన్నా వాళ్ళని Narrow-minded అంటే మాత్రం ఒప్పుకోను. వాళ్ళని చూసి మనం నేర్చుకు తీఱాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాళ్ళు నా ఆదర్శం. ఈరోజు వాళ్ళు ఇండియాలో ఒక భాగం కావచ్చును గాని వాళ్ళలో ఒక శక్తిమంతమైన Future Nation దాగి ఉందని నా నమ్మకం.
సరే ! ఎవరి అభిప్రాయాలు వారివి.
చిరంజీవిని పిలవాలని నేననుకోలేదు. తెలుగు వాళ్ళని పిలవలేదని మాత్రమే ఫీలయ్యాను(అనవసరంగా) !
సుజాత గారికి,కత్తి మహేష్ గారికి,తాడేపల్లి గారికి ధన్యవాదాలు.
సుజాత గారూ,కమల్ కి తెలుగు వారిపై అబిమానం ఉందా లేదా అనేది మనకు అవసరమంటారా అతని సినిమా చూసేటపుడు? ఆడియో ఫంక్షన్ కి రావడానికి చిరంజీవికి తీరిక లేదేమో?విశ్వనాథ్ కి మన రాష్ట్రంలో పేరు ఉంది కానీ, అతని పేరు దేశ ప్రజలకి తెలియకపోవడం ఒక కారణం అయి ఉండవచ్చేమో?
ఇక తమిళులని నారో మైండెడ్ అని అన్నారు, నిజమే వాళ్ళు వారి హక్కుల కోసం బాగా పోరడతారు,దీనినే మీరు పొరపడ్డారా?తాడేపల్లి గారన్నట్టు మనం వాళ్ళ నుండి నేర్చుకునేది చాలా ఉంది.
కమల్ జపనీస్, చైనీస్, ఇటాలియన్ పాత్రలన్నీ వేసేశాడని, ఆయా భాషలవాళ్ళు గూడా వ్యాఖ్యలు రాయడానికి వచ్చేశారల్లే ఉంది.
వై మహేంద్రన్ ది ఆ ఏడుగురు అని ఒక తమిళ నాటకం చూశానొకసారి. హాస్యానికి హాస్యం, వేషం మార్పుల్తో, స్టేజిమీద ఒకే నటుడు 5 పాత్రలు (7 పాత్రలు కథలో ఉంటాయి గానీ రంగం మీద అతను 5 పాత్రల్లో కనిపిస్తాడూ) పోషించడం నిజంగా అద్భుతం.
సినిమాలో ఇటువంటి ఫీట్ సాధించడం పెద్ద కష్టమని అనుకోను. తన లుక్స్ కి పూర్తిగా భిన్నంగా ఉండే పాత్రలు కమల్ చాలా వేశాడు, కళ్యాణ రామన్ తో మొదలు పెట్టి. వేషాలు, మేనరిజంస్, మాత తీరు - వీటిల్లో చాలా శ్రద్ధ పెడతాడు, ఒప్పుకుంటాను. కానీ అదే నటన కాదు. నటుడిగా కమల్ రేంజి మెలోడ్రమాకీ డ్రామాకీ మధ్యలో ఉంటుంది నా ఉద్దేశంలో.
శ్రీ - పాత్రల విశ్లేషణతో రైవ్యూ వెరైటీగా ఉంది.
బైదవే, మీరు వల్లంపాటి పుస్తకం మీద రివ్యూ బాకీ ఉన్నారు! మరవఒద్దు.
థాంక్స్ కొత్తపాళీ గారు.వల్లంపాటి పుస్తకం రాయడం మద్యలో ఉన్నాను,తొందరలోనే పూర్తి చేస్తాను.రాయలసీమ మీద ఇంక బ్లాగుల్లో రాయాల్సినది చాలా ఉంది.
తాడెపల్లి గారు చెప్పిన అసంతృప్తి లాంటిదే నాకూ తమిళుల మీద ఉన్న భావం! కాకపోతే ,బెంగుళూర్లోను, ఇక్కడా(మేమిప్పుడు హైదరాబాదులో నే) నాకెదురైన కొంతమంది తమిళుల మనస్తత్వాన్ని బట్టి narrow minded ness అనే మాట వాడాను. సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో ఒక్క తమిళుల్ని చూసి మాత్రమే నేర్చుకోవాలి. అది నేను ఒప్పుకుంటాను.
ఇక పోతే కమల్ కి తెలుగు వాళ్ళంతే గౌరవం ఉండక్కర్లేదు, ఆయన సినిమా మనం చూడాలంటే! ఇది కూడా రైటే! తెలుగు వాళ్ళనెవర్నీ పిలవలేదని ఫీలై కాజువల్ గా రాశాను గానీ అసలు విషయం పక్కన పెట్టి దీని మీద చర్చ జరుగుతుందనుకోలేదు.
చలనచిత్ర తారలు - దశావతారాలు సరే! మనకి ఒక రంగస్థల కళాకారుడూన్నాడు - చంద్రశేఖర్ అని మీకు తెలుసా! నిముషంలో అంటే అరవై సెకండ్లలో మొత్తం మనిషి మారిపొయ్యేవాడు. ఆహార్యంలోగాని, వాక్క్కులో గాని, అనుకరణలో గాని. రిక్షావాడు, బేస్తవాడు వేషాలు కాదు. ప్రపంచంలోని ప్రముఖులని అనుకరించేవాడు ఆయన. కాని ఆ కళాకారుడి రావలిసినంత గుర్తింపు రాలేదు.
హమ్మయ్యా..సుజాత గారు శాంతించారు.
చంద్రశేఖర్ గురించి నేనెప్పుడూ వినలేదు నెటిజెన్ గారు.60 సెకన్లలో ఇంకొక లాగా మారిపోవడం అనేది నిజంగా అద్భుతం లాగుంది.వీలైఅయితే అతని గురించి బ్లాగులో రాయండి.
ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ గా ఆయన సుప్రసిద్ధుడు.ప్రముఖగాయని యస్.జానకి భర్త చంద్రశేఖర్ గారి కుమారుడే.
@శ్రీ,
ఇందులో కోపగించుకోవడానికి, శాంతించడానికి ఏముందండి? నా కసలు కోపం తొందరగా రాదు! వస్తే తొందరగా పోదు.
@రాజేంద్ర,
అవునండి, నేనూ చదివాను ఫన్ చంద్రశేఖర్ గారి గురించి! జానకి గారు కాజువల్ గా ఇంటిదగ్గర పాడుతుంటె చంద్ర శేఖర్ గారే ' మా ఇంట్లో ఒక మంచి గాయని ఉంది, మీరు పాడించుకుంటారా? ' అని AVM గారికి ఉత్తరం రాశారట! జానకి గారు లాంటి గాయని ని మనకు అందించింది ఆయనే నన్నమాట! అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి ముందు.
సుజాత గారికి,రాజేంద్ర గారికి,
మంచి విషయాలు చెప్పారు,ఇద్దరికీ ధన్యవాదాలు.
అవును. గాయని ఎస్. జానకి గారు డా. చంద్రశేఖర్ గారి కోడలే. చాలా మందికి తెలియని సత్యం ఒకటుంది. జానకి వాళ్ళు ఐదారుగురు అక్క చెల్లెళ్ళు. అందరూ అద్భుతంగా పాడతారు. అందరూ సాంప్రదాయంగా పెళ్ళిళ్ళు చేసుకుని గృహిణులుగా సెటిలైపోయారు. జానకి మాత్రం చంద్రశేఖర్ గారి కోడలవడం వల్ల ఆయన శ్రద్ధ తీసుకుని ఆమె కెరీర్ ని ప్రోత్సహించారు.
నేను ఇందాకే వీకీపీడియా లో జానకి గారి గురించి చదివానండీ కొత్తపాళీ గారు.చంద్రశేఖర్ గారి ద్వారనే జానకి గారు వెలుగు లోకి వచ్చారన్నారు గాని,ఆయన గురించి ఎక్కడా సమాచారం లభించలేదు.
చాలా పాత 'విజయచిత్ర' సంచిక ఒకదాంట్లో (బహుశా 1975 - 80 మధ్యలో అయుండొచ్చు) ఫన్ డాక్టర్ గారి గురించి వివరమైన వ్యాసం చదివినట్లు గుర్తు. ఫొటోలతో సహా రాశారు ఆయన గురించి.
కాలాస్త్రి గారు, విశ్లెషణ బావుంది. ఇక్కడ చర్చ లూ బావున్నాయి. నేను సుజాత గారితో ఏకీభవిస్తున్నాను. తమిళుల narrow mindedness ఇక్కడ బెంగళూరు లో ఉద్యోగం చేసుకునే చాలామందికి తెలిసున్న సంగతే. కమల్ ఇప్పుడే కాదు మన తెలుగు సినిమా రజతోత్సవం సందర్భంగా కూడా ఇక్కడ రాలేదు.
ఇక తాడేపల్లి లలితా సుబ్రహ్మణ్యం గారి వాదన. వారిని చూసి మనం నేర్చుకోవలసినవి ఉన్నాయి. మనల్ను చూసి వాళ్ళూ చాలా చాలా నేర్చుకోవాలి. తమిళులు ఏ పని చేసినా అట్టహాసంతో చేయడం అలవాటు. ఇది మన తెలుగు వాళ్ళకు లేదు. ఈ విషయం తో ఏకీభవించడం కష్టం. ఇక సంస్కృతి ని కాపాడుకోవడం అన్న సంగతి...ఇదీ కాస్త హైప్ అని నా భావన.
ఫన్ డాక్టర్ గురించి తిరుమల రామచంద్ర గారు (అప్పట్లో ఆంధ్ర ప్రభ జర్నలిస్ట్) అవయం గా ముఖాముఖి జరిపి ఓ వ్యాసం రాసారు "ఎందరో మహానుభావులు " అన్న తమ పుస్తకంలో.
కత్తి మహేష్ కుమార్ గారూ, తమిళుల గురించి మీరు ఓ టపా బాకీ పడ్డారు మా అందరికీ..
@మహేష్ గారు
>> ఆకలిరాజ్యం సమయంలో ‘శ్రీశ్రీ’ ని తెలుసుకొని ఇప్పటికీ అభిమానించే కమల్ కు
శ్రీశ్రీ గురించి తెలుసుకొన్నది కమల్ కాదు, దర్శకుడు బాలచందర్. ఆయన అనుకొన్నదానికన్నా ఎన్నో రెట్లు బాగున్నాయని అన్నాడు.
అబ్రకబబ్ర గారికి,చిన్నపుడు "విజయచిత్ర" చూసినట్టు గుర్తు.అంతర్జాలంలో ఫన్ డాక్టరు గురించి వెదుకుతా,నాకు చాలా కుతూహలంగా ఉంది తెలుసుకోవాలని.
రవి గారికి,ధన్యవాదాలు.
కమల్ కి తెలుగు ప్రజల మీద అభిమానం,ఫన్ డాక్టరు చంద్రశేఖర్,తమిళుల గురించి మన బ్లాగర్లు బ్లాగులు రాస్తే బాగుంటుంది.
నవీన్ గార్ల గారికి,ధన్యవాదాలు.
కమల్ తెలుగు ప్రజల్నెలా గౌరవిస్తాడనేదానిమీద బ్లాగెందుకండీ? :-)
ఏమీ లేదు అబ్రకదబ్ర గారు,కామెంట్లలో చాలా మంది కమల్ కి తెలుగు ప్రజల మీద అభిమానం లేదు అని అన్నారు.సరే,దాని మీద ఒక బ్లాగు రాస్తే ఒక పనయిపోతుంది అని నా అభిప్రాయం!
బ్లాగు రాస్తే కమల్ గురించి కాదు, తమిళ ప్రజలకు తెలుగు వాళ్ల మీద ఆ మాటకొస్తే మిగతా భాషల వారి మీదున్న చిన్న చూపు గురించి రాయండి!
అటువంటి విషయాల మీద రాసి లేనిపోని విరోధాలు కల్పించటమెందుకండీ? వాళ్లని 'సాంబారు గాళ్లు', 'అరవోళ్లు' అని మనమూ చులకనగానే చూస్తాము కదా.
@రవి, ఇప్పుడే నా బ్లాగులొ తమిళ జనాల గురించి ఒక టపా పెట్టాను క్రింది లంకె మీదుగా వెళ్ళి చూడండి.
http://parnashaala.blogspot.com/2008/06/blog-post_17.html
అద్భుతం మహేష్ గారు! సుజాత గారూ,అబ్రకదబ్ర గారూ పదండి మనం మహేష్ గారు ఏమి రాసారో చూద్దాం!
చాలా మంచి డిస్కషను ఇక్కడ జరిగిపోయిందే
బొల్లోజు బాబా
ఏది ఏమైనా కమల్ మరోశారి ఓ అద్భుతం సృశ్టించాడు.
నటనలో "లోకనాయకుడు" అని నిరూపించుకున్నాడు
నిజమే బొల్లోజు బాబా గారు.
బూదరాజు అశ్విన్ గారికి,కమల్ నటనకి తిరుగులేదు అని మరోసారి నిరూపించాడు.
Post a Comment