Monday, July 21, 2008

నా స్కూలు మొదలయ్యింది ఇలా....


బ్లాగర్లనందరినీ గమనిస్తూ ఉన్నాను,కాలేజీ కబుర్లని,స్కూలు కబుర్లని బ్లాగి పారేస్తున్నారు.నేను మాత్రం నా కబుర్లని ఎంతసేపని దాచుకోమంటారు?ఇక కాచుకోండి నా వంతు స్కూలు కబుర్ల తోటి!
మన బ్లాగు టైటిల్ కాలాస్త్రే కాని మనం అక్కడ ఎపుడూ చదివి పెట్టింది లేదు.మా నాన్న "ఇల్లేరమ్మ కథలు" లో లాగా ఇంజినీరు.ప్రతి 3,4 సంవత్సరాలకు వేరే ఊరు మారుతూ ఉండేవాళ్ళం.నాకు "స్కూలు" వయస్సు వచ్చేసరికి మేము నెల్లూరు బాలాజినగర్ లో ఉండేవాళ్ళం.మేము ఒక బ్రామ్హణుల ఇంటిలో(సీతక్క వాళ్ళు) ఒక పోర్షన్ లో అద్దెకి ఉండేవాళ్ళం.మా ఇంటికి ఎడమ పక్క నిప్పో ఫాక్టరీ లో పనిచేసే ఒకాయన ఉండేవాడు.ఎదురుగా ఉషా ఫాన్ కంపెనీ వాళ్ళ ఇల్లు ఉండేది.నేను ఆడుకోవడానికి పక్క ఇంటికి,ఎదురు ఇంటికి వెళుతూ ఉండేవాడిని.సీతక్క వాళ్ళ ఇంటిలో "వర్మ" అని ఒక అబ్బాయి ఉండేవాడు.ఈ అబ్బాయితో నేను ఒక సంవత్సరం ఆడుకున్నాననుకుంటా,తరువాత వర్మ ఎటు వెళ్ళాడో నాకు ఇప్పటికీ తెలియదు.నాకు ముగ్గురు అక్కలు,ఒక చెల్లెలు!అక్కలంతా స్వామిదాసు స్కూల్లో చదివేవాళ్ళు.చెల్లెలికి ఇంకా స్కూలు వయసు రాలేదు కాబట్టి ఇంట్లోనే ఆడుకుంటూ ఉండేది!మా ఇంటి చుట్టుపక్కల మా ఈడువాళ్ళే ఉండేసరికి అందరికి ఆడుకొవడానికి అనువుగా ఉండేది.

మా ఇంటి నుండి ఒక రెండు సందులు తిరిగితే శారదా కాన్వెంట్ వస్తుంది.మొదటి రోజు స్కూలికి మా పెద్దక్క నన్ను స్కూలికి తీసుకువెళ్ళింది.ఆ రోజు నా మొదటి రోజు కాబట్టి మా క్లాసులో అందరికీ బొరుగులు,బెల్లం పంచి పెట్టా!నాకు ఆగస్టు 15 బాగా జ్ఞాపకం!ఆ రోజు ఉదయాన్నే స్కూలికి వెళ్ళేముందు తెలిసింది శారదా కాన్వెంట్ కంటే స్వామిదాసు స్కూల్ లో 2 చాక్లెట్లు ఎక్కువ ఇస్తారట!ఇంత తెలిసాక మా స్కూలికి ఎందుకెళ్తాను?స్వామిదాస్ స్కూలికి వెళ్ళి బాగా చాక్లెట్లు తిని ఇంటికి వచ్చా. మేము మా ఇంటిలో ఆదివారం చికెన్,మటన్ తినేటపుడు "అమా!మనం కుడా పక్కింటోళ్ళలాగా చికెన్,మటన్ తినకుండా డబ్బులు దాచిపెట్టి ఇల్లు కట్టుకుందాం!" అని అనేవాడినని మా అమ్మ చెప్పింది ఒకసారి.అపుడు నా ఉద్దేశం ఏమిటంటే "సీతక్క వాళ్ళు చికెన్,మటన్ తినరు కాబట్టి వాళ్ళకి బాగా డబ్బులు ఉండేవి,అందుకే ఇల్లు కట్టుకోగలిగారు" అని! మా నాన్న వాళ్ళ ఆఫీసు చాలా దూరంలో ఉండేది,మా నాన్న ఇంటికి వచ్చేసరికి మేము పడుకొని ఉండేవాళ్ళం!మేము స్కూలికి వెళ్ళేటప్పటికి మా నాన్న లేసేవాడు కాదు.ఇలా మా నాన్నని కలవాలంటే ఆదివారం వరకు వేచిఉండాల్సి వచ్చేది!

అప్పట్లో మా ఇంట్లో అందరం కృష్న సినిమాలు బాగా చూసేవాళ్ళం!అలాగని రామారావు,నాగేశ్వర్ రావు సినిమాలు వదిలిపెట్టేవాళ్ళం కాదు.నాకు గుర్తున్న కృష్న సినిమాలు "అన్నదమ్ముల సవాల్","చెప్పింది చేస్తా","ఏజంట్ గోపి". ఇలా ఒక సంవత్సరం గడిచిందో,లేదో మా నాన్నకి పొదలకూరికి ట్రాన్స్ ఫర్ వచ్చింది.నెల్లూరులో డ్రాఫ్ట్సు మన్ లాగా పనిచేస్తున్న మా నాన్నకి సూపర్వైజర్ లాగా ప్రమోషన్ వచ్చింది.ఇక పెట్టె,బేడా సర్దుకుని పొదలకూరుకి వెళ్ళాం!పొదలకూరు నెల్లూరు నుండి 25 కిలోమీటర్లు ఉంటుంది.నా బాల్యం చాలా వరకు పొదలకూరులోనే గడిచింది,ఇంకొక టపా లో ఆ విశేషాలు రాస్తా!

4 comments:

Rajendra Devarapalli said...

దియాకి మీ నవ్వులే వచ్చినట్లున్నాయ్!మా అందరితరపునా ఒక వందముద్దులు పెట్టేసుకోండి :)

శ్రీ said...

తప్పకుండా రాజేంద్ర గారు!

కొత్త పాళీ said...

1. దియా ముద్దుగా ఉంది. ఒకసారి మీటింగుకి తీసుకురండి. మన సమితిలో యంగెస్టు మెంబరుగా చేర్పించేద్దాం :)
2. బ్రాహ్మల ఇంట్లో వర్మ అనే అబ్బాయి ఎలా ఉన్నాడు?
3. బ్రాహమల ఇంట్లో మాంసాహారులకి అద్దెకిచ్చారంటే, అభినందించాల్సిన విషయమే.

శ్రీ said...

థాంక్స్ కొత్తపాళీ గారు!
1)అలాగే తీసుకువస్తాను.
2)నాకూ తెలియదు.మా అమ్మని ఒకసారి అడుగుతాను.
3)వాళ్ళ ఇంటిలో సీతక్క చాలా బాగ పాడుతూ ఉండేదని మా అమ్మ అనేది!వాళ్ళ ఇంటిలోనే నేను "వీణ" చూసాను.