Tuesday, November 11, 2008

తెలుగు భాషాభిమానం - ఒక పాము ప్రేరణ

అవును, మీరు చదివింది నిజమే! నన్ను తెలుగు భాషకు దగ్గరగా చేయడానికి కారణం ఒక పాము . తమాషాగా ఉంది కదా, ఇది తెలుసుకోవాలంటే మనందరం కొన్ని సంవత్సరాలు వెనక్కి పోవాలి. మరి ఆలస్యమెందుకూ, కొంచెం తల ఎత్తి కుడివైపుకి తిరిగి చూస్తూ ఉండండి. మీకు రింగులు, రింగులు తిరుగుతూ కనిపిస్తున్నాయా?
అవి మేము నెల్లూరు నుండి పొదలకూరుకి బదిలీ అయిన రోజులు. అప్పటి వరకు నెల్లూరు శారదా కాన్వెంటులో ఎల్కేజీ ముగించి యూకేజీ చదువుతూ ఉండేవాడిని. పొదలకూరు వచ్చాక ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతిలో చేరాను. బడిని శ్రీకృష్ణదేవరాయలు కట్టించాడని ఎవరన్నా చెప్తే చాలా సులభంగా నమ్మేయచ్చు, అంత పురాతనంగా ఉండేది మా బడి. మా తరగతి గది వెనక భాగంలో 5 మంది దాకా పట్టేటంత రంధ్రం ఉండేది. దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి, టీకాలు వెయ్యడానికి అధికారులు స్కూలికి వస్తున్నారని సమాచారం అందగానే అందరూ గొయ్యి ముందు నిలబడి "జంపు జిలానీ" అనేవారు.ఇలా సరదాగా, అంతకంటే సందడిగా సాగుతున్న నా జీవితంలో ఒక పెద్ద కుదుపుతో కూడిన చిన్న మలుపు ఎదురయ్యింది. మలుపు బ్లింకర్ వేసి పవర్ స్టీరింగ్ తో గిరగిరా తిప్పి దాటేంత సులువు కాదు. ఇంతకీ అసలు ఈ మలుపు ఏమిటంటే మా వూర్లో కొత్తగా ఒక మిషనరీ స్కూలు తెరిచారు. అందరిలాగే మా తల్లిదండ్రులు కుడా నన్ను స్కూల్లో వేసేసారు, ఇక మనవాడు మళ్ళీ ఇంగ్లీష్ దంచేయచ్చు అని. అప్పటివరకు పెరటి నుండి పది అడుగులు వేస్తే వచ్చే స్కూలు వదిలి 3 కిలోమీటర్లు రిక్షాలో వెళ్ళాల్సివచ్చింది. ఉదయాన్నే రిక్షాలో గంటసేపు ప్రయాణిస్తే స్కూలికి "ప్రార్థన" సమయానికి చేరేవాడిని. అందరితో కలిసి ఒక అరగంట ప్రార్ధన తరువాత తరగతి కార్యక్రమాలు మొదలయ్యేవి. ఉదయం తరగతులు పూర్తవగానే మధ్యాహ్న భోజన విరామం ఉండేది. పిల్లలందరూ పక్కపక్కన కూర్చుని ఇంటి నుండి తెచ్చుకున్న భోజనం తింటూ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అందరూ భోజనాలు పూర్తి చేసాక దగ్గరే ఉన్న చర్చిలో కునుకు తీపించేవాళ్ళు. సమయంలో ఎవరూ నిద్రపోరు, అందరూ పక్కన పడుకున్న వాళ్ళతో కబుర్లు చెపుతూ ఉండేవాళ్ళు. మాకందరికీ కాపలాగా ఒకతను ఉండి అందరూ కనీసం ఒక గంట పడుకునేలా చూసేవాడు. అందరూ నిద్రలేచాక మధ్యాహ్న తరగతులు మొదలయ్యేవి. సాయంత్రమవుతూ ఉండగా స్కూలు పూర్తయి ఇంటికి తిరుగుముఖం పట్టేవాళ్ళం. ఇవీ కొత్త స్కూలు సంగతులు.


మీరనుకుంటున్నది నిజమే! మళ్ళీ ఇంకొక మలుపు ఎదురయ్యింది. ఈసారి మలుపు మనల్ని అసలు విషయానికి తీసుకువెళ్తుంది! ప్రతి రోజు లాగే రోజు సూర్యుడు తూర్పునే ఉదయించాడు. రోజే నా కాన్వెంటు జీవితానికి మంగళం పాడుతానని తెలియక కూనిరాగాలు తీస్తూ స్నానపానాదులు ముగించి రిక్షా ఎక్కాను. స్కూలికి చేరుకుని ఉదయం తరగతులు ముగించి, మధ్యాహ్న భోజనం భుజించి చర్చిలో పడక వేసాను. పడక అంటే పిల్లలందరికీ వరుసగా వేసిన చాపల మీద దుప్పటి పరిచి అందరినీ పక్కపక్కన పడుకోబెట్టేవాళ్ళు. ఎప్పటిలాగే రోజు కుడా నా పక్కన పడుకున్న పిలకాయ్, నేనూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉండే వాళ్ళమీద మాకు కాపలాగా ఉండే అతను బెత్తం విసురుతూ ఉంటాడు. కళ్ళు మూసుకుని మా కబుర్లలో మేముండగా నా మీదకి విసిరాడు బెత్తం, అది పసిగట్టి బెత్తం పట్టుకోవడానికి నా కుడి చేతిని పైకి లేపాను. బెత్తం నా చేతిలోకి వచ్చింది, ఆశ్చర్యం! బెత్తం కర్ర పుల్ల లాగా లేదు, మెత్తగా ఉంది! లోపల తోటి పిల్లల కలకలం వినిపించింది, అందరూ "పాము..పాము" అని అరుస్తున్నారు. కళ్ళు తెరిచి చూస్తే చేతిలో చిన్న పాము పిల్ల! ఒక అడుగు పొడుగు ఉంటుందేమో, ! పడక నుండి ఒక్క ఉదుటున లేచి బయటకి పరుగు తీసాను. చర్చి పైన ఉన్న రేకుల సందు మీదుగా ఉన్న కానగ చెట్టు మీద నుండి పడింది. నేనేమో జడేజా లాగా బెత్తాన్ని పట్టుకున్నాననుకొని పాముని పట్టుకున్నా. సంఘటనతో బెంబేలెత్తిన మా వాళ్ళు నన్ను స్కూలు మానిపించేసారు. ఇలా కాన్వెంటు చదువుకి గండి పడింది.

అలా ముగిసిన నా చదువు నన్ను మా ఇంట్లో నాలుగ్గోడల మధ్య బందీగా చేసింది. మా ఇంట్లో ఆడుకోవడానికి చాలా అవకాశాలుండేవి, ఎలాగంటే ఇంటి ముందు చాలా ఖాళీ స్థలం ఉండేది. అక్కడ నేను సైకిలు తొక్కుతూ ఉండేవాడిని. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళింట్లో నెమళ్ళు ఉండేవి, అవి మా ఇంటి ముందు స్థలంలో బాగా తిరుగుతూ ఉండేవి. ఇంటి వెనక రెండు వేప చెట్లు కుడా ఉండేవి. మీరు ఎపుడన్నా పొదలకూరు వైపు వచ్చి ఉంటే మా ఇంటిని తప్పక చూసి ఉండేవాళ్ళు. బస్టాండ్ ని ఆనుకునే ఉండేది మా ఇల్లు. మా ఇంటి ముందు గదిలో మా నాన్న ఆఫీసు ఉండేది. ఇంటికి వచ్చేపోయే అఫీసు వాళ్ళతో ఎపుడూ సందడిగా ఉండేది. ఇంటికి ఎవరొచ్చినా మా నాన్న కాఫీ, టీ ఆర్డర్ వేసేవాడు, మా అమ్మ కాదనకుండా సరఫరా చేసేది. పూజగదిలో దేవుడి దగ్గర సాంబ్రాణి కడ్డీలు, మా నాన్న ఆఫీసులో సిగరెట్లు దేదీప్యమానంగా వెలుగుతూ ఉండేవి. ఒక రోజు ఉదయాన్నే మా ఇంటికి ఒక ముసలాయన వచ్చాడు. వయస్సు ఒక 60 సంవత్సరాల పైనే ఉంటుంది, జుట్టు తెల్లగా నిగనిగలాడుతూ ఉంది. ముఖం పైన చెరగని చికాకు, తొర్రి పళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని పళ్ళు ఊడి ఉండచ్చు. మా నాన్న కోసం వచ్చారేమో అనుకుని "కూర్చోండి! వస్తారు" కుర్చీ చూపించా. అతను నవ్వి కుర్చీలో కూర్చున్నాడు. ఆ నవ్వుకి అర్ధం నాకు కాసేపయ్యాక తెలిసింది. ఇంతలో మా నాన్న వచ్చి ఆయనకు నన్ను పరిచయం చేస్తూ "ఈరోజు నుండీ సీతారామయ్య గారే నీ టీచరు" అని చెప్పారు.

ఆ రోజు నుండీ సీతారామయ్య గారు ప్రతి రోజూ ఉదయాన్నే మా ఇంటికి వచ్చేవారు. నాకు తెలుగు నుండి లెక్కలు వరకు అన్నీ చెపుతూ ఉండేవారు. తెలుగు పద్యాలు చక్కగా పాడుతూ నాకు నేర్పించేవారు. నాకు రోజూ తొడపాశం క్రమం తప్పకుండా పెడుతూ ఉండేవారు. రోజు మార్చి రోజు నాతో మల్ల యుద్ధం చేసేవారు. కుర్చీలో తను కూర్చుని నా వీపు వంచి పిడి గుద్దులు గుద్దేవారు. ఎంత చేసినా మా సీతారామయ్య గారంటే నాకు బాగా ఇష్టంగా ఉండేది నాకు. సరదాగా కబుర్లు చెపుతూ చదువు చెప్పేవారు. అలా మొదలయిన నా ఇంటి పట్టున స్కూలు జీవితం నేను హైస్కూలు చేరేంతవరకు సాగింది. కాన్వెంట్ లో ఆ రోజు పాము కాని నా మీద పడకుంటే నేను కుడా అందరిలాగే తెలుగు భాషకి దూరమై ఉండేవాడిని. తెలుగు భాషని ప్రాచీన భాషగా గుర్తించిన సందర్భంగా దాని కృషికి కారణమయిన అందరికీ నా నమస్కారములు. కొత్తతరం కుడా తెలుగు భాషకి దూరం కాకుండా మన మాతృభాషలోని మాధుర్యాన్ని గ్రోలితే నా ఈ టపా ధన్యమే!

7 comments:

Niru said...
This comment has been removed by the author.
Niru said...

baavundandi mee paamu anubhavam..

శ్రీ said...

థాంక్స్ నీరూ!

Niranjan Pulipati said...

Good One :)

శ్రీ said...

థాంక్స్ నిరంజన్.

kumar mahankali said...

chala rojula taruvata mee blog chooddam anipinchindandi. kaasepu navvukovachu ani.
mottaniki baga navvincharu.

thanks

kumar

శ్రీ said...

చాలా సంతోషం కుమార్!మీరు తెలుగు ఎలా సులభంగా రాసుకోవచ్చో మీకు ఒక సారి డెమో ఇస్తాను.