Tuesday, January 27, 2009

కాలాస్త్రి కబుర్లు

నేను: అనా! ఎలా ఉన్నావ్? 

కోటన్న: బాగనే ఉండా!నువ్వెట్టుండా?  

నేను: నాదేముంది నా.అట్టా నడుస్తుంది. యాడిన్నా ఉద్యోగాలు ఇన్ని తీసాము, అన్ని తీసాము అని చెప్తా ఉండారు. 

కోటన్న: నిజమే! మా కాడ కుడా అట్టే ఉంది. మన వాసు ఉండ్లా, వాడిని పోయిన శుక్రవారం ఇట్టే ఆఫీసుకి వెళ్తే ఒక గంటకి వాళ్ళ బాసు వచ్చి "అబ్బాయ్!ఇంక నువ్వు సోమవారం నుంచి రాబళ్ళా" అని చెప్పాడంట.

నేను: అబ్బా..మా కాడే అంటే మీకాడ కుడా ఇట్టే ఉందే! మొన్న సోమవారం ఒక్క రోజే 71400 మంది ఉద్యోగాలు పోయాయంట విన్నావా?

కోటన్న: అవును దాన్ని బ్లడీ మండే అని అన్నారంట కదా. ఒబామా పవర్ లోకి వచ్చాడు కదా, చూద్దాం ఏమన్నా రోజులు బాగుంటాయేమో? ఇంకేంది విశేషాలు?

నేను: మొన్న శుక్రవారం అరుంధతి చూసా నా.హారర్ సినిమా అనుకుంటే కామెడీగా ఉంది సినిమా.

కోటన్న: అదేదట్టంటావ్!సినిమా భలే ఉందన్నారే!

నేను: ఇంకా బాగా తీసి ఉండచ్చు. సినిమా అంతా అరుపులు,కేకలు. హారర్ సినిమా అంటే కేకలు మనం పెట్టాలి కానీ సినిమాలోనే పెట్టేస్తున్నారు కేకలు, అరుపులు.తల పగిలి పొయ్యిళ్ళా. కాకపొతే బోరేమి కొట్టలేదు.

కోటన్న: అది చాళ్ళే!మా ఊరికి వచ్చాక నేను చూస్తా మీ వదిన్ని తీసుకుని.

నేను: అట్నే! పిలకాయల్ని తీసుకోపోబాక,సినిమాలో యాడ చూసినా ఒకటే రక్తం. మొన్న వారం సిరంజీవి సిత్తూరులో తిరిగాడంట కదా!

కోటన్న: అవును,సిత్తూరులో అన్న, తెలంగాణలో తమ్ముడు తిరుగుతున్నారు. తమ్ముడి చూసి అన్న కుడా కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు ఈమధ్య.

నేను: హి...హి..హీ

కోటన్న: యేందిరా? చెప్పి నవ్వు. నీపాటికి నువ్వు నవ్వుతున్నావే.

నేను: ఏమిలా. రోజా పవన్ కళ్యాన్ మాటలకి రివర్సుగా భలే చెప్పింది. మొన్నొక సభలో పవన్ కి షాక్ కొట్టిండ్లా. పక్క రోజు అందరితో "నాకు షాక్ కొట్టిన ఏమీ కాలేదు" అని చొక్కా యిప్పాడంట. దానికి రోజ కౌంటర్ ఏమిటంటే "మానసిక స్థితి సరిగ్గా ఉన్నవాడికి కరెంట్ షాక్ మంచిది కాదు. సరిగ్గా లేని వాడికి అది చాలా ఆరోగ్యకరం" అని...

కోటన్న: ఆ పిల్ల అట్టే అంటా ఉంటాదిలే.ఆ మాటలు పట్టించుకోబాక. ఈసారి కుడా బాబుకి పవర్ దొరకలేదంటే మనతో బాటే పీలేరులో తిరగతాడు.

నేను: ఇంకేమి బాబు నా.వస్తే మళ్ళీ వై యెస్.వూర్లో యాడ చూసినా వై యెస్ కి మంచి ఫాన్స్ ఉండారు నా. ఏమన్నా మిరకిల్ జరిగితే కానీ చిరు రావడం చాలా కష్టం.

కోటన్న: యేమోలే...కాంగ్రెస్ లో ఎపుడూ ఎలెక్షన్ల దగ్గిరకి వచ్చేసరికి గొడవలు మొదలవుతూ ఉంటాయ్. డీ యెస్ కీ వై యెస్ కీ సరిగ్గా పడడంలేదు, లోపల్లోపల కొట్టుకుంటా ఉండారు. ఇంతవరకూ కాంగ్రెస్ లో వాళ్ళు రెండో సారి సీ యెం పదవి దొరకలేదు. వై యెస్ మళ్ళీ సీ యెం అయితే అది నిజంగా రికార్డే!

నేను: సరేనా, ఇంక పండుకుంటా. రేపు ఉదయాన్నే పోబళ్ళా ఆఫీసుకి. మళ్ళీ యెపుడయినా తీరిగా మాట్లాడుకుందాం.11 comments:

dhrruva said...

Piler lo endhuku tiragatha undaav bhaaa ???

;) i am from PILER :))

చైతన్య said...

ఏందబ్బా అన్ని ఇసయాలు ఒకే తూరి చెప్పేసినారు:)

@ dhrruva రోజా ది భాకరపేట కదబ్బా

రవి said...

అదేమబ్బా, అంత తొందరగా అయిపోయినాయి కబుర్లు?

సుజాత said...

మీ కబుర్లు భలే ఉన్నాయి వారాంతపు రౌండప్ లాగా! వారానికొక రోజు తప్పక రాయాలండీ !

శ్రీ said...

@ధ్రువ : ఎపుడూ కాలాస్త్రేనా అని పీలేర్ వచ్చినం బా? మీదీ పీలేరేనా...అయితే ఒకతూరి కలుస్తాం బా.

శ్రీ said...

@చైతన్య, అన్నీ ఒకే తూరి చెప్పాలని తాపత్రయం బా. రోజాది తిరప్తి అనుకున్నానే....భాకరాపేటా?

@రవి, నిదరొచ్చిందనా....ఈసారి కొంచెం పెందలాడే రాయడం మొదలుబెడతా...

@సుజాత,తప్పకుండా రాస్తానండీ.

రాధిక said...

హ హా...రోజా మాటలు బాగున్నాయి.ఇన్ని డైలాగులు ఎలా వస్తాయో వీళ్ళకి.సినిమాలకన్నా రాజకీయాలు బాగున్నట్టున్నాయి ఈ మధ్య. అరుంధతి సినిమా ని రాంగోపాల్ వర్మ తీసుంటే ఈ పాటికి జనాలు గగ్గోలు పెట్టేవాళ్ళు.రక్ష సినిమా తీసునందుకు వెధవ గోల చేసిన వాళ్ళందరూ అరుంధతి కి ఎందుకు కాము గా వున్నారో తెలియదు.పైగా సినిమా ని ఆకాశానికి ఎత్తుతున్నాఉ.ఎందుకంటారూ?

ఏకాంతపు దిలీప్ said...

రోజా చంపేసిందనా! నువ్వు కూడా అనా! :-) నామినోడు గుర్తొచ్చాడనా! ఇట్టానే నీ బ్లాగులో కాలాస్త్రి యాసాండం పోవాలనా! అప్పుడే మాకు కేళీ ఇలాసం అనా... :-)

శ్రీ said...

@రాధిక, రోజా ప్రతి రోజూ ఎదో ఒక స్టేట్ మెంట్ భలే ఇస్తుంది. అసెంబ్లీ ఎలెక్షన్లు అయ్యేంతవరకు మనకు డైలాగులకి కొదవుండదు.

రాం గోపాల్ అంటే మీడీయాకి మొదటనుంచీ మంటే! అతని ఆత్మవిశ్వాసం మీడియాకి పొగరుగా అనిపించి ఉండచ్చు.అరుంధతిని ఎందుకు అంతలా పొగుడుతున్నారో నాకూ అంతుబట్టడంలేదు. ఈ సినిమాని శ్యాం ప్రసాద్ రెడ్డి ఎవరికీ అమ్మలేదు దేశంలో. రివ్యూలు వచ్చాక కొన్ని గంటల్లోనే అమెరికాలో ఎక్కువ రేటు పెట్టి కొన్నారు.డబ్బులన్నీ వెనక్కి రావాలంటే ఈమాత్రం హంగామా చేయాలి లాగుంది ఈరోజుల్లో.

సినిమా రిలీజ్ అయినతర్వాత జెమినీ,మా టీవీల్లో హీరో,హీరోయిన్ కనిపించారంటే సినిమాలో విషయం లేదన్నట్టే!

@దిలీప్, మీకు నామిని గారు గుర్తుకురావడం నిజంగా సంతోషం. నాకూ నామిని సినబ్బ కతలు చాలా ఇష్టం, చిన్నపుడు ఉదయం పేపర్లో ఆదివారం వచ్చేవి. ఓపికగా చదివేవాడిని. మీరందరూ చదవాలే కానీ విరగ రాసేస్తా.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

నా ముద్దుల దియా ఫొటో లేటెష్టుది పెట్టాలని యావత్తాంధ్రప్రదేశ్ తరపున డిమాండ్ చేస్తున్నా...

శ్రీ said...

తప్పకుండా రాజేంద్ర గారు.