Friday, January 30, 2009

అమెరికాలో తెలుగు సినిమా థియేటర్లు ఎందుకు చెత్తగా ఉంటాయి?

నవతరంగంలో వచ్చిన "తెలుగు ఎనారై గాళ్ళు వేష్ట్ రా మామా!" అన్న టపాలో అమెరికా తెలుగు సినిమాలు ప్రదర్శిస్తున్న సినిమా హాళ్ళు చెత్తగా ఉంటాయని దీనికి కారణం ఏమిటో అని పలువురు బ్లాగర్లు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఈ విషయంపై నాకు తెలిసిన సమాచారాన్ని అందరితో పంచుకోవాలని ఇక్కడ ప్రయత్నిస్తున్నాను.అమెరికాలో నేను మొదట సినిమాలు సాల్ట్ లేక్ సిటీలో తరువాత మెంఫిస్ లో చూసాను. సినిమాకి వెళ్ళాలంటే పైన టపాలో వెంకట్ ఉప్పులూరి గారు చెప్పినట్టు కనీసం ఒక గంట ప్రయాణం తప్పకుండా ఉంటుంది. సినిమా హాలు ఎక్కడో ఊరికి చివర ఉండేవి. చచ్చీ చెడీ వెళ్తే థియేటర్లు చాలా చెత్తగా ఉండేవి. "సూళ్ళూరుపేటలో కనకదుర్గ థియేటర్లోనే డీటీయెస్ ఉండేవి,ఇక్కడ డాల్బీ కుడా కరువే కదా బాబీ!" అని మా స్నేహితుడి భుజంపై తల పెట్టి ఆపకుండా ఏడ్చేవాడిని.
తరువాత గాలికి కొట్టుకుంటూ డెట్రాయిట్ కొచ్చి పడ్డా. డెట్రాయిట్లో తెలుగు సినిమా ఎగ్సిబిటర్, డిస్ట్రిబ్యూటర్ల పరిచయాల వల్ల మెల్లగా తెర వెనుక విషయాలు అర్ధమవడం మొదలుపెట్టాయి.
  1. మొదటి కారణం సినిమా హాలు ఎంత చెత్తగా ఉంటే హాలు రెంటు అంత తక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ లాభం ఎగ్సిబిటర్, డిస్ట్రిబ్యూటర్ల జేబులో వేసుకోవచ్చు.

  2. చిరంజీవి, పవన్ కళ్యాన్, రజనీ కాంత్ లాంటి పెద్ద హీరోల సినిమాలకి మన వీరాభిమానులు హాలులో చేసే గలభా, పోసే చెత్తకి హాలు యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేయడం. మా ఊర్లో ఠాగోర్, శంకర్ దాదా MBBS సినిమాలు మంచి థియేటర్లో వేసినా ఫాన్స్ వికృత చర్యల వల్ల మంచి సినిమా హాలు రెంట్ కి ఇవ్వడం మానేసారు.

  3. మన తెలుగు సినిమా బాక్సులు రావడంలో అపుడపుడూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కొన్ని సార్లు రిలీజ్ సమయానికి బాక్సు రాకపోతే ఎగ్జిబిటర్ రెంటు నష్టపోతాడు. అదే సినిమాహాలు కొంచెం ఉడాల్ (చెత్త) గా ఉంటే హాలుకీ వేరే సినిమాలు చేతిలో ఉండకపోవడం వల్ల కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది.

  4. కొన్ని ఊర్లలో హిందీ సినిమాలు మంచి థియేటర్లో ఉండచ్చు. హిందీ సినిమాలు అమెరికాలో తెలుగు సినిమాల కన్నా కొంచెం ముందు నుండే ప్రదర్శిస్తూ వచ్చారు. తెలుగు,తమిళ్ భాషల సినిమాలకి కుడా ఇక్కడ వ్యాపారం ఉందని గ్రహించిన వాళ్ళు తమ థియేటర్లలో తెలుగు కుడా వెయ్యడం మొదలుపెట్టారు. కొన్ని చోట్ల తెలుగు సినిమాలకి వేరే థియేటర్లు వెతుక్కోవలసి వచ్చింది. అందువల్ల హింది ఒకచోట, తెలుగు ఒకచోట ప్రదర్శించే థియేటర్లు మొదలయ్యాయి.

  5. మా ఊర్లో కొన్ని రోజులు రెండు థియేటర్లు నడిచాయ్. ఆ కాంపిటీషన్లో థియేటర్లో డీటీయెస్,డాల్బీ లాంటి సౌకర్యాలు సమకూరాయి.

  6. అమెరికాలో సినిమాలన్నిటికీ తాత్కాలిక ఎగ్జిబిటర్లు ఉండడంవల్ల అందరూ ఈ సినిమా అయిపొతే చాలులే అనుకోవడం కుడా ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు.

మన ఊరిలో ప్రజలకు సినిమా ద్వారా మంచి వినోదం కలిగించే భాద్యత సినిమా ఎగ్జిబిటర్ దే. సినిమా ప్రదర్శింపబడుతున్న హాలు అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. హాలులో కనీస అవసరాలు తీర్చేవిలా ఉండాలి. టాయిలెట్ సౌకర్యాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. సినిమాకి వచ్చే ప్రేక్షకుల అభిప్రాయాలని తెలుసుకుంటూ చేయగలిగిన మార్పుని తీసుకురావాలి. ప్రేక్షకులు కుడా చెత్త థియేటర్ ఉన్న హాలుని ఎక్కువ రోజులు ఎంకరేజ్ చెయ్యకుండా ఉంటే ఎగ్జిబిటర్ తప్పకుండా ఇంకొక మంచి హాలుని వెతకడానికి అవకాశం ఉంది. అడగందే అమ్మయినా అన్నం పెట్టదు, అలాగే మీరు చూస్తున్న సినిమా హాలు మీకు నచ్చలేదంటే అది మీరు మీ ఎగ్జిబిటర్ కి చెప్పాలి. మీ నుండి చైతన్యం రాలేదనుకోండి, ఎగ్జిబిటర్ తన జేబు నింపుకుంటూ ఉంటాడు.ఒక సంవత్సరం కాలంగా అమెరికాలో రిలయన్స్ కంపెనీకి చెందిన ఆడ్ లాబ్స్ ఫీనిక్స్ థియేటర్స్ తో వ్యాపారం మొదలుపెట్టింది. మన దేశంలో కూడా చాలా సినిమా హాళ్ళని వీరి గుప్పిటిలోకి తీసుకుంటున్నట్టే అమెరికాలో కుడా చాలా థియేటర్లలో వీరు వ్యాపారాన్ని సాగిస్తున్నారు. దీని వల్ల కొన్ని సెంటర్లలో థియేటర్లు కొంచెం మెరుగయ్యాయి, భవిష్యత్తులో ఇంకా బాగా ఉండవచ్చని ఒక తెలుగు ప్రేక్షకుడిగా ఆశిస్తున్నాను.


No comments: